Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అన్యాయమే చట్టమైనప్పుడు
ఎదిరించి పోరాడటమే బాధ్యత''
బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 16,17 తేదీలలో జరిగిన జాతీయ సమ్మె దిగ్విజయమైంది. సామాన్య ప్రజానీకం, ఖాతాదారులనుండి విశేష స్పందన లభించింది. మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. కారణాలు ఏవైనా ప్రభుత్వం ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణ చట్టాలను శీతాకాల సమావేశాలలో ఆమోదం పొందే విషయంలో వెనకడుగు వేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 'బ్యాంకులు, ఇన్సూరెన్స్, బొగ్గుగనుల ప్రయివేటీ కరణకు వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయ ఉద్యమాలు'' అనే అంశంమీద డాక్టర్ ఎ. మాత్యూ అధ్యక్షతన ఆన్లైన్ మహాసభ డిసెంబర్ 19న జరిగింది. జూలై 4, 2021న ప్రారంభమైన 'అఖిల భారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదిక' ఈ మహాసభ నిర్వహించింది.
ప్రయివేటీకరణకు వ్యతిరేక పోరాటాలలో ముందడుగు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చరిత్రాత్మకమైన సుదీర్ఘ పోరాటం నడిపిన రైతు సంఘాల ఐక్యవేదికకు మహాసభ జేజేలు పలికింది. అదే స్ఫూర్తితో ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమాలను ఐక్యం చేయటం కోసం ఏర్పడిన సంఘటన ఎంతో అసమానమైనది. ఇది భవిష్యత్ పోరాటాలకి మార్గదర్శిగా రూపొందాలి. అదే వేగుచుక్క కావాలి. రైల్వే, ట్రాన్స్పోర్ట్, విమానయానరంగం, కోల్ లాంటి అనేక రంగాలలో ఉద్యమిస్తున్న 65సంఘాల ఐక్యతతో ఏర్పడిందే 'అఖిల భారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదిక.'
ప్రజాధనంతో నిర్మించబడిన ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ ఏరూపంలో ఉన్నా దానిని వ్యతిరేకించటం, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్ని రంగాలను కలిపి ఐక్య ఉద్యమాన్ని నిర్మించటం, ప్రభుత్వ దాడికి గురవుతున్న రంగాల సంస్థల మధ్య ఆలోచనలు, సమాచారం, విషయాలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చించటం ద్వారా మద్దతు కూడగట్టటం, సంఘీభావ ప్రకటన లివ్వటం, కార్యక్రమాలు చేయటం, ప్రతి సభ్యుణ్ణి, వారి కుటుంబాలను, సహాద్యోగులను, మిత్రులను ఐక్యఉద్యమాలకు సమీకరించటం, ఆయా ప్రభుత్వరంగ సంస్థల వినియోగదారులను, ఖాతాదారులను కూడగట్టి ప్రయివేటీకరణ ప్రమాదాల గురించి వివరించి వారిని చైతన్య పరచటం ఈ వేదిక లక్ష్యాలుగా నిర్థారించుకుంది. కార్యక్రమాన్ని అంగీకరించే అన్ని సంఘాలను, సంస్థలను సభ్యులుగా ఐక్యవేదిక ఆహ్వానిస్తున్నది. మన సంఘాలు, మనం సభ్యులుగా చేరి ఒక సమరశీల పోరాటానికి సమాయత్త మవ్వటమే మన కర్తవ్యం.
ఈ మహాసభలో 400కు పైగా వివిధ రంగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంకింగ్ సమ్మె నేపథ్యంలో జరిగిన మహాసభ కనుక బ్యాంకు ఉద్యోగుల ప్రధాన సంఘాల నాయకులు సిహెచ్ వెంకటాచలం, ప్రధాన కార్యదర్శి ఎఐబియిఎ, సిజె నందకుమార్, అధ్యక్షుడు చెఫి, సౌమ్య దత్త, ప్రధాన కార్యదర్శి ఏఐబిఒసీ, అమానుల్లాఖాన్, పూర్వ అధ్యక్షులు, ఎఐఊఇఎ, దీపక్ జగ్దలే, మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్టు సంఘర్ష్ సమితి, అభిమన్యు దిన్కర్, విద్యుత్ కార్మిక సంఘం ప్రసంగించారు. తమ రంగాలలో జరుగుతున్న పోరాటాలను వివరించారు. వారి సమాచారం పాల్గొన్నవారికి ఉత్తే జాన్ని, స్ఫూర్తిని, గెలవాలనే పట్టుదలను నింపాయి.
ఫైనాన్స్ కాపిటల్ ఒత్తిడే ప్రయివేటీకరణకు మూలం
బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇన్సూరెన్స్ రంగనాయకులు ఆర్థికరంగంలో ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంలో ఉన్న పరిస్థితులను, ప్రయివేటీకరణ ప్రమాదాన్ని వివరించారు. భారత ప్రభుత్వం గాట్ ఒప్పందంలో (జనరల్ ఎగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్) సంతకం చేయటం ద్వారా అంతర్జాతీయ ఫైనాన్స్ కాపిటల్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆనాటి నుండి ప్రభుత్వరంగ బ్యాంకులలో వాటాల అమ్మకం, ప్రయివేటు కంపెనీలకు లైసెన్స్లివ్వటం, యాజమాన్య స్వరూపంలో మార్పులు చేయడం చేస్తూ వచ్చింది. అటల్‌బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని మొదటి ఎన్డీఏ ప్రభుత్వం బ్యాంకులను ప్రయివేటీకరించి ప్రభుత్వ వాటాని 33శాతానికి కుదిస్తూ చట్టాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు ఆమోదం పొందేలోపే ఆ ప్రభుత్వం పతనమయింది. కాబట్టి బిల్లు రద్దయింది. ఆదినుండి ఎన్డీఏ ప్రభుత్వ విధానమే ఆర్థిక సంస్థల ప్రయివేటీకరణ. అందుకే ఈ ప్రభుత్వం అత్యంత వేగంగా బ్యాంకులను, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రయివేటీకరించే చట్టాలు చేయటానికి పూనుకుంది. జనరల్ ఇన్సూరెన్స్ రంగ ప్రయివేటీకరణకు చట్టం చేసింది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీనైనా ప్రయివేటీకరించే విస్తృత చట్టం చేసింది. ఎల్ఐసీలో వాటాల విక్రయానకి సిద్ధమైంది. రూ5 కోట్లతో మొదలైన ఎల్ఐసీ ఇప్పుడు రూ.10-15లక్షల కోట్ల స్థాయికి పెరిగింది. ఎల్ఐసీ పాలసీదారులతో జరిగిన అంగీకారం ప్రకారం ప్రీమియం సొమ్మును వసూలు చేసి, కాలపరిమితి ప్రకారం చెల్లించాలి. అటువంటి సంస్థ (ట్రస్ట్)ను ప్రయివేటీకరించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుంది. షేర్ హౌల్డర్ల డివిడెంట్లు పెంచే క్రమంలో దివాలా తీస్తే పాలసీ హౌల్డర్లకు రక్షణ ఏముంటుంది? ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలు సమాజంలో ఉన్న అదనపు పొదుపును డిపాజిట్లు, పాలసీల రూపంలో సేకరించి ఆ సొమ్మును సామాన్య ప్రజల, దేశ అవసరాలకోసం ఉపయోగి స్తున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. బ్యాంకుల ప్రయివేటీకరణ జరిగితే ప్రజల సొమ్ముకి రక్షణ ఎక్కడ ఉంటుంది?
ప్రజానీకానికి దగ్గరైన బ్యాంక్ బచావో యాత్ర
ప్రభుత్వరంగ బ్యాంకుల రక్షణ కోసం ప్రజలను సమీకరించే ప్రయత్నంలో బ్యాంక్ ఆఫీసర్ల సంఘం (ఎఐబిఒసి) కలకత్తా, ముంబాయిల నుండి ఢిల్లీకి ''బ్యాంక్ బచావో - దేశ్ బచావో'' యాత్ర చేపట్టింది. దారి పొడవునా ప్రజా సదస్సులు, సమావేశాలు నిర్వహించి బ్యాంకుల ప్రయివేటీకరణ దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసింది. రెండు రోజుల సమ్మె ఎంతో ప్రభావం చూపిందని, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో ఒటింగ్ సరళిని ప్రభావితం చేసిందని సామ్యదత్త తెలియజేశారు. ఈ ప్రయత్నం ప్రజలతో మమేకమవటంలో కర్తవ్యాన్ని తెలియ జేసింది. ఈ కృషికి మహాసభ అభినందనలు తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ విద్యుత్ ఉద్యోగుల వీరోచిత పోరాటం
శత్రు దేశాలతో యుద్ధం చేసి దేశాన్ని కాపాడటానికి శిక్షణ పొందిన సైన్యాన్ని ప్రజా ఉద్యమాలను, కార్మిక వర్గాన్ని అణచటానికి ఉపయోగిస్తున్నది ఈ ప్రభుత్వం. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని మహాసభకి అభిమన్యు దిన్కర్ వివరించారు. విద్యుత్‌రంగాన్ని ప్రయివేటీకరించి, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాని మొక్కవోని ధైర్యంతో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. సమ్మెను నీరుగార్చటానికి సైన్యాన్ని రంగంలోకి దింపి పవర్‌స్టేషన్లను విద్యుత్ సరఫరాను కొనసాగించాలని ప్రభుత్వం పూనుకొన్నది. దీనిపై నిరసనలు పెల్లుబికాయి. అఖిలభారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్త విద్యుత్ ఉద్యోగుల సంఘీభావానికి సన్నాహాలు మొదలయ్యాయి. చివరికి కార్మిక దీక్ష ముందు ప్రభుత్వం మోకరిల్లింది. ఈ వ్యాసం రాసే సమయానికి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల డిమాండ్లను అంగీకరించి ఒప్పందం చేసుకుంది.
అఖిలభారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదికను విస్తరిద్దాం-దేశాన్ని రక్షించుకుందాం
ఆత్మనిర్భర భారత్, జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ వంటి అనేక పథకాల ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను, ఖనిజాలను, దేశసంపదను కారుచౌకగా తన తాబేదారులైన కార్పొరేట్లకు అప్పగించటానికి చట్టాలు చేయటంతో సహా అన్ని చర్యలు చేపడుతున్నది ప్రభుత్వం. దేశస్వాతంత్య్రానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రమాదం తెచ్చిపెడుతున్నది. దీనికి వ్యతిరేకంగా అన్ని రంగాల ఉద్యోగులు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలన్నింటినీ బలమైన ఐక్య ఉద్యమంగా మార్చే కృషి చేస్తున్న ''అఖిలభారత ప్రయివేటీకరణ వ్యతిరేక వేదిక''ను అన్ని రంగాలకు విస్తరించాలి. మరింత బలోపేతం చేయాలి. ఎఐఎఫ్ఎపి వెబ్సైట్ ఉద్యమ సమాహారంగా ఉంది. వ్యక్తులుగా సమాచారం తెలుసుకోవటం కోసం ఆసైట్లో వార్తలు చదవాలి. మన సంఘాలు ఐక్య వేదికలో భాగం కావాలి. ఐక్యవేదిక పిలుపులను విజయవంతం చేయాలి. ఐక్యవేదిక బలపడటమే ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి కరదీపిక. దేశ ప్రజానీకానికి రక్ష.
- పి. వెంకటరామయ్య
సెల్: 9553533815