Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 21ఏండ్లకు పెంచే బిల్లును ప్రవేశ పెట్టబోతోంది. పార్లమెంటులో మెజారిటీ ఉంది కనుక ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కానీ ఈ విషయంలో లోతుగా పరిశీలించవలసిన అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం దీనిని హడావిడిగా ముందుకు తోసే ప్రయత్నం చేయకుండా స్టాండింగ్ కమిటీ ముందు పరిశీలనకు పంపాలనే ప్రతిపక్షాల ఆందోళన ఫలితంగా ప్రభుత్వానికి ఆ పని చేయకతప్పలేదు.
18సంవత్సరాల వయస్సులో ఒక మహిళ వయోజనురాలిగా పరిగణింపబడుతుంది. నేర చట్టంతో సహా వయోజనులకు వర్తించే అన్ని చట్టాలూ 18ఏండ్ల వయసున్న మహిళలకు కూడా వర్తిస్తాయి. ఆమె చేసే ఏ పనికైనా ఆమే బాధ్యురాలుగా ఉంటుంది. 18 నుండి 21సంవత్సరాల మధ్య ఉన్న మహిళ నేరస్థురాలైతే ఆమెను ఒక వయోజనులుండే చోటనే పెట్టి జైలు శిక్ష విధించడానికి సరిపడా వయస్సు కలిగివుంటుంది. కానీ ఈ ప్రతిపాదిత బిల్లులో ఆమె పెండ్లి చేసుకునే విషయంలో స్వేచ్ఛ కలిగి ఉండడానికి మాత్రం చిన్న వయస్కురాలుగా పరిగణించబడుతోంది. ఇది మహిళా సాధికారత కాదు. ఇది మహిళలకు పసితనాన్ని ఆపాదించడమే. వయోజన వయస్సుకు విభజన లేదు. ఒక వయోజన యువతికి తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవడాన్ని నిరాకరించడం ఒక తప్పిదమే. వయోజనులైన యువ జంటలు తరచుగా కుల మతాల అడ్డుగోడలను దాటి ఐచ్చిక వివాహాలు చేసుకోవడాన్ని ఇది చట్ట విరుద్ధంగా మార్చుతుంది. ఈ బిల్లు ప్రస్తుతం ఒక వయోజనురాలైన యువతి చట్ట బద్దంగా తన వ్యక్తిగత ఇష్ట ప్రకారం ఎంచుకునే స్వయం ప్రతిపత్తి సూత్రానికి విరుద్ధమే కాక న్యాయపరమైన సూత్రాలకు కూడా విరుద్ధంగా ఉంటుంది.
అంతేకాక భారతదేశంలోని యువతులు వారి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో గతంకంటే మెరుగైన మార్పును సాధించారు. వారిలో చిన్న వయస్సు వివాహాలను ప్రతిఘటించడం, వాటిని ప్రశ్నించడం పెరిగింది. అంతేకాక తల్లిదండ్రుల, సామాజిక వత్తిడులను ప్రతిఘటిస్తున్న కొన్ని ప్రముఖ సంఘటనలు కూడా ఉన్నాయి. యువతులు సామాజిక బంధనాలను వదిలించుకొనే ఈ విధమైన పురోగమన చర్యల వల్లనే గణాంకాల, పథకాల అమలు మంత్రిత్వశాఖ 2019 నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు వివాహ వయస్సు 22.1కి పెరిగింది. కనుక వివాహ వయస్సు పెరుగుదలలో గణనీయమైన పురోగతి పెరుగుతున్న పరిస్థితులలోనూ, అది స్వచ్ఛంద విషయమైనప్పుడు దానిని శిక్షార్హమైన అంశాల క్రిందికి మార్చడమెందుకు? యువతులు తమకిష్టమైన నిర్ణయాలను తీసుకొనే సామర్థ్యాలను పెంచే వాతావరణం కల్పించాలంటే వారికి సరైన విద్యా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల హామీ కల్పించడం కీలకం. అంతేకానీ 18-2 ఏండ్ల వయస్సు మధ్యలో జరిగే అమ్మాయిల వివాహాలను నేరంగా పరిగణించడం సరైనది కాదు. ఇది ఎంత అహేతుకమైనదంటే ఒక వైపు మహిళల సంతాన సాఫల్యత తగ్గుతుండగా కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడానికి క్రూరమైన చట్టాలను ప్రతిపాదించడం లాంటిదే.
కొంతమంది వివాహ వయస్సును పెంచడంలో తప్పేం ఉంది అని అడుగుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి? మనదేశంలో ఇప్పటికీ 18సంవత్సరాల లోపున్న అనేక మందికి వివాహాలు జరుగుతున్న పరిస్థితులలో దీనికి గల కారణాలపై దృష్టి పెట్టడానికి ప్రాముఖ్యత నివ్వాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లెక్కల ప్రకారం చూస్తే గత ఐదేండ్ల కాలంలో బాల్య వివాహాలు 27శాతం నుండి 23శాతం వరకూ తగ్గినప్పటికీ ఈ తగ్గుదల పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం 20 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులలో ప్రతి నలుగురిలో ఒకరు 18సంవత్సరాల లోపే వివాహం చేసుకొని ఉంటున్నారు. దీనికి కారణాలు మనకు తెలిసినవే. కరోనా మహమ్మారి ద్వారా ఆర్థిక సంక్షోభం, సామాజిక దుష్ప్రభావాల మధ్య ఉన్న సంబంధం ప్రస్ఫుటంగా కనిపించింది. ఇందులో పిల్లలు సమిథలయ్యారు. గత ఏడాది మార్చి నుండి మే నెలల మధ్య లాక్డౌన్ కాలంలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పిల్లల హెల్ప్ లైన్ నెంబరుకు బాల్య వివాహాలకు సంబంధించి 5200 పైచిలుకు ఫోన్ కాల్లు వచ్చాయి. ఇందులో ఎక్కువ మంది పేదవర్గాలకు చెందినవారి పిల్లలు, 18ఏండ్ల లోపు పెళ్ళైన వారికి సంబంధించినవే. దారిద్య్రం, పెరుగుతున్న వరకట్న డిమాండ్లు, తమ కుమార్తెలు లైంగిక దాడులకు గురవుతారేమో అనే భయాందోళనలకు పరిష్కారంగా పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. బాల్యవివాహాలకు పితృస్వామ్య భావజాల సంస్కృతి కూడా తోడవడంతో తమ కుమార్తెలను పరాయి ధనంగా చూస్తున్నారు. అంతేకాక తండ్రి ఒక సంరక్షకుడిగా తన కుమార్తెను ఒక భర్తకు అప్పగించడం ద్వారా తన పవిత్ర కర్తవ్యం నెరవేర్చినట్లుగా భావిస్తాడు.
గత ఏడాది లాక్డౌన్ సమయంలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని పిల్లల హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా 5200 బాల్య వివాహాలను ఆపివేయడం జరిగింది. ప్రస్తుత పాలకవర్గాలు సమాజంలో నెలకొన్న వివిధ ఆచారాలతో అనేక మినహాయింపులు పొందుతున్నారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న కేరళ లాంటి రాష్ట్రాలు బాల్య వివాహాలను చాలా విజయవంతంగా అరికట్టగలిగాయి. భారతదేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయస్సును బాలికలకు 15 సంవత్సరాల నుండి 18కి బాలురకు 18 సంవత్సరాల నుండి 21కి 1978లో మార్చారు. ఈ చట్టం దేశంలోని అందరికీ వర్తిస్తుంది. బాల్య వివాహాలను నిరోధించే ఈ చట్టానికి ఏ పర్సనల్ లా అయినా సరే కట్టుబడి వుండవలసిందేనని కోర్టులు పదే పదే చెపుతున్నాయి. అయినా కూడా ఈ 43 సంవత్సరాల కాలంలో 18ఏండ్ల వయస్సు అర్హత కలిగివున్నాకూడా మనం బాల్య వివాహాలను అరికట్టడంలో విఫలమైన పరిస్థితిలో 21ఏండ్లకు వయోపరిమితిని పెంచితే అత్యధిక జనాభా, అందులోనూ ముఖ్యంగా పేదలు శిక్షార్హమవుతారు.
ఈ బిల్లు తేవడం ద్వారా చిన్న వయసులో పెళ్ళయి పిల్లలను కనే స్థితి నుండి యువతుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చుననీ అందుకే వివాహ వయసును 21కి పెంచుతున్నామని ప్రభుత్వ వాదన. ఇది శిశు జననాలను ఆపుతుందనీ వారి ఆరోగ్యాలు కాపాడబడతాయనీ చెప్తోంది. ఇది చాలా కపట వాదన. పౌష్టికాహార లోపం, మాతా శిశు మరణాలు లాంటి ముఖ్యమైన సమస్యలు రాజకీయ విధానాలకు సంబంధించిన విషయాలు. ప్రభుత్వం ఒక వైపు ప్రజారోగ్యానికి సంబంధించిన నిధులను తగ్గించివేస్తూ, ఆరోగ్య రంగాన్ని ప్రయివేటు పరం చేస్తోంది. ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రజలకు ఆహార భద్రత వ్యవస్థను కల్పించడంలేదు. కానీ ఇంకోప్రక్క మహిళల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్తోంది. ప్రజల విద్యా ఆరోగ్యాలకు బడ్జెట్‌ను పెంచే బాధ్యత నుండి తప్పుకుంటున్న ప్రభుత్వం వయోజన యువతుల హక్కులను పునరుత్పత్తి ఆరోగ్యం అనే పేరుతో హరించాలని చూస్తోంది.
మహిళల వివాహ వయసును 21కి పెంచడం ద్వారా వివాహార్హత వయసును యువతీయువకులకు సమానం చేశామని ఆ విధంగా మహిళా సాధికారతను సాధించామనే ప్రభుత్వ వాదనను మనం అంగీకరించాలని ప్రభుత్వం ఆశించింది. ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే 2008లో లా కమిషన్ ప్రతిపాదించినట్లు యువతీయువకులకు ఇద్దరికీ 18 సంవత్సరాల అర్హత వయసును అది ఎందుకు అంగీకరించలేదు? వ్యక్తిగత సంబంధాల విషయంలో మహిళా సాధికారత ఉండాలని ప్రభుత్వం అంతగా కోరుకుంటే అది ఇంతకంటే అనేక ముఖ్యమైన, అర్థవంతమైన అడుగులు వేయవచ్చు. పరువు హత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం చేయవచ్చు. మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించవచ్చు. గృహ హింస చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను మానుకోవచ్చు. ఇలాంటి అనేక ఉదాహరణలున్నాయి.
ప్రపంచంలోని అనేక దేశాలలో ఒక వ్యక్తిని మేజర్‌గా పరిగణించే వయస్సు అయిన 18ఏండ్లకూ, వివాహ వయోపరిమితికి తేడాలు లేవు. యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 1989లో వివాహ వయో పరిమితి 18గా ఉండాలని ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానంపై భారతదేశం కూడా సంతకం చేసింది. ఈ ప్రపంచవ్యాప్త అంగీకారానికి ఇప్పుడు విరుద్ధంగా వెళ్ళడానికి ప్రభుత్వం చెప్పే కారణాలు ఆమోదయోగ్యంగా లేవు. ఇది భవిష్యత్తులో సమాజంపై వ్యతిరేక ప్రభావాలనే చూపిస్తుంది.
అనువాదం: కె.నాగలక్మి
- బృందాకరత్