Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ వ్యవస్థ ఆయితే పీడిత ప్రజల్ని ఎంత క్రూరంగా అవమానించి, హింసించి, అణచివేస్తుందో అంతగా ఆ వ్యవస్థ పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, కసిని పెంచుకోనిదే పీడుతులకు ఎన్నడూ ఎక్కడా న్యాయం జరగలేదన్నది చారిత్రక సత్యం. అలాంటి సామాజిక స్ఫూర్తిని, ప్రేరణని కల్పించిన సమరశీల మార్గదర్శకులు పెరియార్. దక్షిణ భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్య కాలంలో ఒక వైపు బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులను ఎదిరిస్తూ, మరోవైపు ఆధిపత్య కులాల నుండి సంపూర్ణ విముక్తి విమోచన కోసం ప్రజల్లో స్వాభిమాన చైతన్యం కల్పిస్తూ స్వేచ్ఛ కోసం, సామాజిక సమానత్వం కోసం అపూర్వ కృషి సల్పిన వారిలో పెరియార్ ప్రసిద్ధులు.
ఆయన మాటలూ, రాతలూ అక్షరాల్లో ముద్రించగలిగితే కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. గణిత శాస్త్రవేత్త వసంతా కందసామి పెరియార్ ఉద్యమాన్ని లెక్కల్లో అభివర్ణించిన తీరు చూస్తే ఆయన ఉద్యమ ప్రస్థానం అర్థమవుతుంది. ''తన 94 సంవత్సరాల 3 నెలల 7రోజుల జీవితకాలంలో ఆయన ప్రచార కార్యక్రమాల కోసం 8,20,000 మైళ్ళు ప్రయాణించారు. ఇది భూగోళపు చుట్టుకొలత కన్నా 33 రెట్లు ఎక్కువ. భూమికి చందమామకు మధ్య గల దూరానికి 3 రెట్లు. ఆయన మొత్తం 10,700 సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. తన జీవితకాలమంతా ఇచ్చిన ప్రసంగాలు కేసెట్లలో రికార్డు చేసి విడవకుండా వినిపించితే 2 సంవత్సరాల 5 నెలల 11 రోజులు పడుతుంది. తన మొత్తం ఉద్యమ చరిత్రలో వివిధ సందర్భాలలో 10 సంవత్సరాల కాలం జైలు జీవితం అనుభవించాడు.'' పీడిత జనుల కోసం జీవితకాలం ఉద్యమం చేసిన పెరియార్ ధైర్య సాహసాలు కలిగిన మేధావి. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టి విలాసవంతమైన జీవనం గడిపే అవకాశమున్నా అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరు చేసారు. మనిషికి మనిషికి మధ్య హెచ్చు తగ్గులను, అసమానతలను పెంచే కులాన్ని నిర్మూలించాలని సాగిన ఉద్యమాలలో పెరియార్ ముఖ్యులు. మానవుల మధ్య ప్రతి అసమానతకు, ప్రతి అణచివేతకు, ప్రతి అవమానానికి కులం ఏ విధంగా కారణమైందో పెరియార్ పరిశోధనాత్మకంగా వివరించడమే కాకుండా ఆ అణచివేతల నుండి బయట పడడానికి ఆచరణాత్మక ఉద్యమం చేసాడు. మనుధర్మం ప్రభోధించిన వర్ణాశ్రమ ధర్మాలను, దేవున్ని అడ్డుపెట్టుకొని ఆధిపత్య కులాలు ఏర్పరచుకున్న నీచ, నికృష్ట పాలనా వ్యవస్థ కుట్రలను పెరియార్ బయట పెట్టారు.
తాను ప్రారంభించిన స్వాభిమాన ఉద్యమంలో దళితులను, స్త్రీలను పాత్రధారులను చేసి వేలల్లో కుల వ్యతిరేక వివాహాలు జరిపించారు. స్త్రీలు అణచివేతకు గురికావడానికి ప్రధాన కారణమైన మత విశ్వాసాలు, దైవ భావాలు, పురుషాహంకారం పట్ల స్త్రీలను చైతన్యం చేశారు. స్త్రీలు మానసిక బానిసత్వాన్ని వీడిన నాడే సమానత్వాన్ని సాధిస్తారని చెప్పారు. ''ఎక్కడైనా పిల్లి నుండి ఎలుకకు స్వాతంత్య్రం దొరుకుతుందా? ఎక్కడైనా కోడి పిల్లలకు, గొర్రె పిల్లలకు నక్క నుండి స్వతంత్రం దొరుకుతుందా? యజమాని నుండి కార్మికులకు స్వాతంత్య్రము దొరుకుతుందా? ఎక్కడైనా బ్రాహ్మణేతరులకు బ్రాహ్మణుల నుండి సమానత్వం దొరుకుతుందా? విదేశీయుల నుండి ఇండియన్లకు ఎక్కడైనా సుఖ సంపదలు దొరుకుతాయా? ఒకవేళ ఈ అద్భుతాలన్ని వాస్తవంగా జరిగినప్పటికీ స్త్రీలకు పురుషుల నుండి ఎన్నటికీ స్వాతంత్రం దొరకబోదు'' అన్న పెరియార్ పురుషుడు లేకుండా స్త్రీ బతకలేదని అదే సమయంలో స్త్రీ లేకుండా పురుషుడు జీవించగలడనిప్రతి స్త్రీ అనుకుంటోందనీ తరతరాలుగా ఇలాంటి బానిస భావాలు లోతుగా పాతుకుపోయిన మత వ్యవస్థలో పెరిగిన స్త్రీలు తమ సంకెళ్లను తామే తెంచుకోవాలని పెరియార్ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను వ్యతిరేకించి, వితంతు వివాహాలను ప్రోత్సహించిన పెరియార్ హిందూ పురోహిత పెళ్లిళ్ళు స్త్రీలను చిన్నచూపు చూస్తూ, అవమానపరిచే విధంగా ఉన్నాయని, ప్రత్యామ్నాయంగా ''దండల పెళ్లి (స్వాభిమాన పెళ్లి)''లను ప్రారంభించాడు. స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు విద్యా ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేశారు.
స్త్రీ సమానత్వం, చైతన్యం కోసం ఈ.వి. రామసామి చేసిన పోరాటానికి, 1938 నవంబర్ 12న మద్రాసులో 5000 మంది మహిళలు నల్ల చీరలు ధరించి రామసామిని పెద్ద ఊరేగింపులో తీసుకెళ్లి సభ పెట్టి ''పెరియార్ వర్థిల్లాలి'' అని నినాదాలు చేసి ఆరోజు నుండి ఈ.వి.రామసామిని పెరియార్ (మహాత్మ, గొప్పవారు) అని పిలవాలని తీర్మానించారు.
స్వాతంత్య్రాన్ని ''విషాద దినం''గా అభివర్ణించిన పెరియార్ దేశ ప్రజలకు వెండి సంకెళ్లు పోయి బంగారు సంకెళ్ళు పడ్డాయని అన్నారు. మనం రాసుకున్న రాజ్యాంగం పీడిత కులాలకు న్యాయం చేకూర్చదని ''రాజ్యాంగం నశించాలని'' నినదించిన పెరియార్, గతం నుండే కొనసాగుతున్న రిజర్వేషన్లు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చెల్లవని కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమించి, తొలి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లను కాపాడాడు. కుల వ్యవస్థను, అంటరానితనాన్ని ప్రబోధిస్తున్న రామాయణం, మనుస్మృతి గ్రంథాలను తగలబెట్టాలని పెరియార్ ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా ప్రజల చేత రాముని చిత్రపటాలను దగ్ధం చేయించడం, రావణ వధకు ధీటుగా రాముడు, సీత, లక్ష్మణ దిష్టి బొమ్మలను దహనం చేయడం, వినాయక విగ్రహాలు పగల గొట్టడంలో ప్రజలను పెద్ద ఎత్తున కదిలించారు. ''దేవుడు లేడు - దేవుడు లేనే లేడు'' అని తమిళనాడు అంతటా రాయడం, సభల ముందు ఈ నినాదాన్ని చేయడం సాంప్రదాయంగా పెట్టారు. దీన్ని బట్టి అణగారిన వర్గాల విముక్తి కోసం పెరియార్ ఎంత బలమైన ఉద్యమం చేసాడో అర్థమవుతుంది.
పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి వారి విద్య, సైన్స్, సాంస్కృతిక ప్రచార సంస్థ (ఖచీజుూజఉ) భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని పెరియార్‌కు బహుకరించించి. ''నూతన యుగం ప్రవక్త, ఆగేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్య మానికి తండ్రి, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, అర్థరహిత సాంప్రదాయాలకి, ఆధారం లేని ఆచారాలకు బద్ధ శత్రువు'' అని ప్రశంసించింది. పెరియార్ ఆలోచన విధానం మనకు ఆదర్శం కావాలి. మౌనంగా, స్తబ్ధంగా, చొప్పదంటు నినాదాలతో మన జీవితాలు గడిచిపోరాదు.
(డిసెంబర్ 24, పెరియార్ 48వ వర్థంతి సందర్బంగా)
- సాయిని నరేంద్ర
సెల్:9701916091