Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబరు 9, 10 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య సదస్సు... ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, అలాగే ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసేందుకుగాను నియంతలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఉద్దేశించబడింది. ప్రజాస్వామ్య పటిష్టత, నిరంకుశవాదాన్ని ప్రతిఘ టించడం, అవినీతిపై పోరు, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం వంటి మూడు అంశాలపై ప్రధానంగా ఈ సదస్సు ఆధారపడి ఉందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ఆన్లైన్లో జరిగే ఈ సదస్సుకు మొత్తంగా వంద మంది ప్రభుత్వాధినేతలను ఆహ్వానించారు. వారిలో 89 మంది స్పందించారు. అయితే ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం, నియంతృత్వ ధోరణులను ప్రతిఘటించడం సదస్సు ప్రధాన లక్ష్యంగా లేదని సదస్సుకు హాజరైన వారు స్పష్టం చేశారు. చైనా, రష్యాలను ఎదుర్కొనడానికి అమెరికా వ్యూహాన్ని మరింతగా విస్తరించాలన్నదే అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామిక ప్రపంచంపై తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవా లన్నది అమెరికా లక్ష్యంగా ఉందన్నారు.
సదస్సు ప్రారంభిస్తూ బైడెన్, నిరంకుశత్వాన్ని పారదోలాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటార్టె వంటి నేతల సరసన సదస్సులో కూర్చున్నారు. వీరందరు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా విజయం సాధించి, తర్వాత తమ తమ దేశాల్లో నియంతృత్వ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినవారే. ఆదివాసీల హక్కులను ఉల్లంఘిస్తూ విధానాలు రూపొందించిన బోల్సనారో, అమెజాన్ వర్షాధార అడవుల వినాశనానికి, కరోనా వైరస్ ముప్పును గుర్తించడానికి తిరస్కరించడం ద్వారా వేలాదిమంది ప్రజలు కోవిడ్ బారిన పడి మృత్యువాత పడేందుకు అనుమతించిన నేతగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మాదక ద్రవ్యాలపై పోరు పేరుతో వేలాదిమందిని చట్ట విరుద్ధమైన రీతిలో హత్యలు చేయించడంలో డ్యుటార్టె పేరు మోశారు. జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలను జైల్లో పెట్టడం ద్వారా విస్తృత రీతిలో అణచివేత చర్యలకు పాల్పడ్డారు.
అమెరికా ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఎంపిక చేసిన ఆహ్వానితులందరూ అక్కడకు వచ్చారు. 'ఒకే చైనా' అన్న తమ విధానాన్ని ఉల్లంఘించి తైవాన్‌కు సదస్సుకు రావాల్సిందిగా బైడెన్ ఆహ్వానం పంపారు. అలాగే వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడుగా పేర్కొంటున్న జువాన్ గెయిడో కూడా వచ్చారు. వెనెజులాలో అధ్యక్షుడు మదురో నేతృత్వంలోని చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని కూలదోయాలన్న అమెరికా ప్రయత్నాలకు గెయిడో వంత పాడుతున్నారు.
దక్షిణాసియాకు చెందిన దేశాల్లో అమెరికా ఆహ్వానం అందుకున్న దేశాలను పరిశీలించినట్లైతే, అమెరికా నీచపుటెత్తుగడలు స్పష్టమవుతాయి. పాకిస్థాన్‌ను ఆహ్వానించారు (కానీ హాజరు కావడానికి తిరస్కరించింది). అయితే, బంగ్లాదేశ్ ను కానీ శ్రీలంకను కానీ ఆహ్వానించలేదు. భారత్, నేపాల్, మాల్దీవులను ఆహ్వానించారు. ప్రజాస్వామ్య దేశంగా పాకిస్థాన్ కన్నా బంగ్లాదేశ్ ఎందులో తీసిపోయింది? 'ఆఫ్ఘనిస్తాన్‌ను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరమే పాకిస్థాన్‌కు ఆహ్వానం పంపేలా చేసిందా?' అంటే అంతేనని చెప్పుకోవాల్సి వస్తోంది.
సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి మన నాగరికతలోనే అంతర్లీనంగా ఉందని చెప్పారు. తనను తాను పొగుడుకుంటూ ఆద్యంతం సాగిన మోడీ ప్రసంగంలో భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న ముప్పులు లేదా ప్రమాదాలు వేటినీ ప్రస్తావించనే లేదు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే ఎన్జీఓ ఫ్రీడమ్ హౌస్ గతేడాది (2020) ఒక నివేదికను ఇచ్చింది. అంతర్జాతీయ స్వేచ్ఛ తిరోగమన బాట పట్టి వరుసగా 15ఏండ్లు అయిందని వ్యాఖ్యా నించింది. ఈ వ్యాఖ్యలను బైడెన్ తన తొలి పలుకుల్లో ఉదహరించారు. అదే సంస్థ ఈ ఏడాది (2021) ఇచ్చిన నివేదికలో భారత్ స్థాయి ని ''పూర్తి స్వేచ్ఛ నుండి పాక్షిక స్వేచ్ఛకు'' తగ్గించింది.
ప్రజాస్వామ్య క్షీణత గురించి మరో సంస్థ 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్' ఇచ్చిన నివేదికను కూడా బైడెన్ ఉదహరించారు. భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ప్రజాస్వామ్య క్షీణత గుర్తించే రీతిలో కొనసాగుతోందని ఈ సంస్థ తన నివేదిక 'ది గ్లోబల్ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ 2021'లో పేర్కొంది. సహజంగానే, భారత ప్రజాస్వామ్య పరిస్థితులపై వచ్చే ప్రతికూల నివేదికలన్నింటినీ అమెరికా తీవ్రంగా తీసుకోవడం లేదు. ఎందుకంటే, పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి సాగే పోరులో భారత్‌ను చాలా విలువైన, కీలకమైన భాగస్వామిగా పరిగణిస్తోంది. నరేంద్ర మోడీ కన్నా షేక్ హసీనా ఏ రకంగా మరింత నియంతగా వ్యవహరిస్తున్నారన్నది అమెరికా విదేశాంగశాఖ చేసే తర్కం మాత్రమే వివరించగలదు. వరుసగా వచ్చిన అమెరికా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ప్రహసనాన్ని కొనసాగిస్తున్నాయి. 1980లో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ హయాంలో నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఈడీ)ని ఏర్పాటు చేశారు. స్వేచ్ఛా మార్కెట్లు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నది ఎన్ఈడీ లక్ష్యంగా ఉంది. అమెరికాకు వ్యతిరేకం గా ప్రభుత్వాలున్న దేశాల్లో ప్రతిపక్ష గ్రూపులకు నిధులు అందచేయడానికి అమెరికా ప్రభుత్వానికి ఈ ఎన్ఈడీ ఒక సాధనంగా మారిపోయింది.
ఆ తర్వాత క్లింటన్ ప్రభుత్వం 'కమ్యూనిటీ ఆఫ్ డెమోక్రసీస్' (సీఓడీ)గా పిలిచే ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో 1999-2000ల్లో ఉన్న వాజ్‌పేయి ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ఆ సీఓడీలో చేరింది. 2000 జూన్‌లో వార్సాలో సీఓడీ అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. జార్జి బుష్ అధికారంలోకి వచ్చిన తర్వాత, భారత్ 'గ్లోబల్ డెమోక్రసీ ఇనీషియేటివ్'లో చేరింది. 2005లో ప్రధాని మన్మోహన్ సింగ్, అధ్యక్షుడు బుష్ కలిసి ఇనీషియేటివ్‌ను ఏర్పాటు చేస్తూ సంయుక్త ప్రకటన జారీ చేశారు.
ఇలా అమెరికా ప్రజాస్వామ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల - గ్వాటెమాలా, బ్రెజిల్, చిలీ, గ్రెనడా, ఇరాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో 1950 నుండి ప్రజా ప్రభుత్వాలను కూలదోయడమో లేదా అస్థిరపరచడమో చేస్తూ వచ్చింది. లేదా ఆయా దేశాలపై సైనిక దాడులు జరపడమన్నది మరో పద్ధతిగా ఉంటూ వచ్చింది. ముందుగా ఆ దేశాలను ఆక్రమించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పడం, ఈ కోవలోకి వచ్చే తాజా ఉదాహరణలు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్.
తాజాగా ప్రజాస్వామ్య సదస్సు ముగింపులో బైడెన్ మాట్లాడుతూ, అమెరికా విదేశాంగ శాఖ, యు.ఎస్ ఎయిడ్ నిర్వహించే ఫండ్ ఫర్ డెమోక్రటిక్ రెన్యువల్ అండ్ ఎ పార్టనర్షిప్ ఫర్ డెమోక్రసీ ప్రోగ్రామ్‌కు 42.2 కోట్ల డాలర్ల నిధులను అందచేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ నిధులను అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం ఏ రీతిన ఉపయోగిస్తారో అర్థం చేసుకోవడానికి పెద్దగా ప్రయాస పడనక్కరలేదు.
ప్రపంచ ప్రజాస్వామ్యం కోసం పోరాడే యోధుడిగా అవతారం ఎత్తడానికి బదులుగా అమెరికాలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏం జరుగుతోందనే దానిపై అధ్యక్షుడు బైడెన్ దృష్టి పెడితే బాగుంటుంది. తన ముగింపు ఉపన్యాసంలో బైడెన్ పవిత్రమైన ఓటు హక్కు గురించి, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించు కోవడమన్నది ప్రజాస్వామ్య స్వేచ్ఛకు ఏ రకంగా ప్రతీకగా ఉంటుందో వివరిస్తూ అనర్గళంగా మాట్లాడారు. కానీ, స్వేచ్ఛగా ఓటు హక్కును ఉపయోగించుకోవడమే అమెరికాలో కత్తిరించ బడుతోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 19 రాష్ట్రాలు, రిపబ్లికన్ల ఆధిపత్యం కలిగిన ప్రభుత్వ చట్టసభల్లో ఓటర్ల ఆంక్షల చట్టాలను ఆమోదించాయి. నల్ల జాతీయులు, సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ఇతర వర్గాల ఓటింగ్ హక్కులను ఇవి అడ్డుకుంటున్నాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణ, అవినీతిపై పోరాటం, మానవ హక్కుల పరిరక్షణ ఈ మూడు రంగాల్లో సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఏడాది తర్వాత మళ్ళీ సమీక్షా సదస్సు ఏర్పాటు చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. తమ తమ దేశాల్లో సాధించిన పురోగతిపై ఆయా నేతలు నివేదిక ఇవ్వాలని బైడెన్ భావిస్తున్నారు. ఈ విషయంలో పని తీరుకు సంబంధించి నివేదిక రూపొందించి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళనలు అక్కర్లేదు. ఎందుకంటే అమెరికాతో భాగస్వామ్యం పూర్తి స్థాయిలో జయప్రదమయ్యేలా ఎలా చూసుకోవాలో మోడీ ప్రభుత్వానికి బాగా తెలుసు.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం