Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మండ్రా అమ్మండి
అన్నీ... అమ్మేయండి
రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ
గనులు, భూములు, ఫోనులు
నదులు, సముద్రాలు, ఓడరేవులు
అన్నీ అమ్మేయండి
ప్రజల సొమ్మును
బాజాప్తుగా...
బరితెగించి అమ్మడం
ప్రజలను నడిరోడ్డుమీద
బికార్లుగా చేయడం
మీకేగా చెల్లింది
పాపిష్టి సొమ్ముతో
ఓట్లు - సీట్లు కొనడం...
సింహాసనమెక్కడం...
ప్రజల సొమ్ము అయినవాళ్ళకు
అప్పనంగా కట్టబెట్టడం...
ఇంతేగా 'మీ పాలన'
ఇల్లుపీకి పందిరేయడం - గొప్పా!
అప్పుల ఊబిలోకి జనాన్ని నెట్టడం
తప్పుకాదా..!
బందిపోట్లకు మించిన
బందిపోట్లు కారా మీరు?
మా పిచ్చిగానీ...
మాయమాటలతో
పదవి సంపాయించినోనికి
ప్రజల గోస ఏం తెలుసు?
దిన దిన గండం
నూరేళ్ళ జీవితం మాది
అయినా సిగ్గులేక పాలనచేస్తూ
చోద్యం చూస్తారు మీరు
లాఠీలు తూటాలు
జైలు గోడలతో
మా నిరసన జ్వాలలు
ఆరిపోతాయా..?
ఉప్పెనలా ఎగసే
మా ఉద్యమ కెరటాలు
మీ ఉడత ఊపులకు
పారిపోతాయా..?
తరతరాల ఊపిరిశ్రమలే
భారత జీవన సౌందర్యమనే
సత్యం మీకు బోధపడదా..?
ఓ కట్టడం నిర్మాణం అంటే..
తరాల మానవ జాతి
శ్రమ స్వేద రక్తాలు కదరా...
ప్రజలంటే ఓట్లే కాదురా...
ప్రపంచ గతిమార్చే శ్రమ విధాతలు
యుగ యుగాల సంస్కృతీ ప్రధాతలు
చారిత్రక నాగరికతల నిర్మాతలు
నడిమంత్రపు సిరిగాళ్ళ కేం తెలుసు?
అమ్మకాల - కొనుగోళ్ళ
పాచికలాట తప్ప...!
గుడ్డిగా యుద్దాల్లో దూకే
పురాణకాలం నాటి సైనికులం
కాము సుమా మేము...
ప్రజాస్వామ్య ఉద్యమ పరిమళాలు
ఆ సాంతమూ ఆస్వాదిస్తాం మేం!
సాగనియ్యం మీ ఆటలన్
కె. శాంతారావు
సెల్:9959745723