Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతియేటా అదే పాట.. ప్రపంచ అసమానతల నివేదికలు బయటపడటం, ఇవన్నీ తమకేమి పట్టనట్టుగా మన దేశ రాజకీయ వ్యవస్థ, దానికి అండగా కార్య నిర్వహాక (ఎగ్జిక్యూటివ్) వ్యవస్థలు వ్యవహరించడం సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ నివేదికలపై ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం గానీ, లేదా కేంద్ర ప్రభుత్వం గానీ లేదా సంబంధిత శాఖల అధికారులు గానీ దృష్టి పెట్టి అసమానతల నివారణకు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ''దేశంలో ప్రజలందరికీ ఉపాధి ఉన్నది, ఉపాధికి తగినంత ప్రతిఫలము ఉన్నది, వ్యవసాయ రంగం విస్తరించింది, పరిశ్రమలు విరాజిల్లుతున్నవి'' అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వల్లించే ఈ నేతలకు ఈ నిజం ఎందుకు బోధపడట్లేదు? ఈ దేశంలో పేదరికం ఉంది, ఉపాధి సరిగ్గా లేదు, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.. అనే మాటలు ఎక్కడైనా రాస్తే కుహనా జాతీయవాదులు ఒంటికాలిపై లేచి, ''ఆదాయాలు లేనిదే మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయా? ఆదాయాలు లేనిదే ప్రజలు ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారా?'' అంటూ తిరగబడతారు. కానీ, నిజానికి తిరగబడాల్సింది వాస్తవాలను బయట పెట్టిన వాళ్ళపై కాదు. ఇలాంటి నివేదికలలో దేశానికి చోటు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయాలి. తిండి గింజల కోసం అప్పుల పాలవుతున్న ప్రజలు అనేక చోట్ల తారస పడతారు. గ్రామాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఉపాధి లేకపోతే జీవనాన్ని నెల రోజులకు మించి కొనసాగించలేని జనాభా దేశంలో 75శాతం ఉన్నది. ఇది కరోనా సందర్భంగా బహిర్గతమైంది కూడా. అందుకేగా కేంద్రం ఆరు నెలల పాటు కొంత మేర ఉచిత రేషన్ పంపిణీ చేసింది. కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన ఈ జనాభా ఎనభై కోట్లు.
మొన్ననే విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం భారతదేశంలో ఒక్క శాతం ప్రజల దగ్గరికి 22 శాతం ఆదాయం చేరుతున్నది. 10 శాతం ప్రజల దగ్గరికి 57 శాతం ఆదాయం చేరగా కింద ఉండే(బాటమ్) 50శాతం ప్రజల దగ్గరికి 13 శాతం ఆదాయం మాత్రమే వస్తుంది. ఈ దేశంలో అవసరానికి తగిన విద్య, అర్హతకు తగిన ఉపాధి, ఉత్పత్తికి తగిన ప్రతిఫలం రానందునే ఈ అసమానతలు ఉన్నాయి. స్థూల జాతీయోత్పత్తిలో పద్నాలుగు శాతమే ఉన్న వ్యవసాయ రంగంలో అరవైశాతం మంది ఉపాధి పొందుతున్నారంటే ప్రత్యామ్నాయ ఉపాధుల కొరత ఎంత ఉందో చూడండి. ఈ అసమానతని ముందు కేంద్రం గుర్తించాలి, ఆ తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటో బహిర్గత పరచి దిద్దు బాటుకు పూనుకోవాలి. ఇంతకు మించి ఇంకేమి చెప్పగలం. అదే సంపద విషయంలో చూస్తే ఒక శాతం ప్రజలు 33శాతం సంపదను కంట్రోల్ చేస్తుంటే 10శాతం ప్రజానీకం 72శాతం సంపదను కంట్రోల్ చేస్తుంది. కింద ఉండే(బాటం) 50శాతం ప్రజలకు కేవలం 66,280 రూపాయలతో దాదాపు సంపద లేనట్లే. మహిళల ఉపాధి ఆదాయం ఆసియా ఖండంలో 21శాతం ఉంటే భారత్లో 18శాతం మాత్రమే ఉన్నది. అనగా ఉపాధి కార్యక్రమాల్లో మహిళల స్థానం పడిపోతున్నది. స్వాతంత్రానంతరం ప్రభుత్వ సంపద తగ్గిపోతూ ప్రయివేటు సంపద పెరుగుతూ వస్తున్నది. 1980లో ప్రయివేటు సంపద 290శాతం ఉంటే 2020లో 560శాతానికి చేరుకున్నది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం మన దేశంలో 28శాతం ప్రజలు పేదలు. నిటిఆయోగ్ ప్రకారం కూడా దేశంలో నాలుగో వంతు ప్రజలు పేదలు. స్థూల జాతీయోత్పత్తి పెరుగుతున్నదీ, సంపద సృష్టించబడుతుందీ, ప్రపంచ దేశాలలో మన దేశ స్థానం పెరుగుతున్నది కానీ అసమానతలు ఎందుకు తగ్గడం లేదన్నదే ప్రశ్న. మరి కొన్ని గణాంకాలు పరిశీలిస్తే.. ప్రపంచ జనాభాలో భారతదేశానిది 17.5శాతం. ప్రపంచ నిరక్షరాస్యత 14శాతం ఉంటే భారతదేశంలో అది 32శాతం ఉన్నది. ప్రపంచం పేదరికంలో 37శాతం భారత్లోనే ఉన్నది. దీనిని బట్టి జనాభా నిష్పత్తికి కూడా అనుగుణంగా అభివృద్ధి సూచికలు లేవన్నమాట. మన దేశం ఇంత ఘోరమైన వెనకబాటు గణాంకాలను ఇచ్చినప్పటికీ ప్రపంచ సగటు ఆశాజనకంగానే ఉన్నదీ అంటే మిగతా దేశాలు ఏ మేరకు ముందంజలో ఉన్నాయో అర్థం చేసుకోండి. స్థూల జాతీయోత్పత్తిలో ఆరవ స్థానంలో ఉన్న మనదేశం, మానవాభివృద్ధి (హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్) సూచీలో 131/189 స్థానంలో నిలవడం గమనార్హం. మానవాభివృద్ది సూచీకి లెక్కలోకి తీసుకునే అంశాలు - విద్య, వైద్యం, జీవన ప్రమాణ స్థాయి. ఈ మూడింటినీ నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టే ఈ ఫలితాలు. అసమానతలను తగ్గించడ మంటే వివాహ వయస్సులను సమానం చేయడం కాదు. ఈ చర్య ఎలా ఉన్నదంటే ''రైళ్ళలో థర్డ్ క్లాస్ ప్రయాణం దుర్భరంగా ఉన్నది, మాకూ సెకండ్ క్లాస్ సౌకర్యాలు కల్పించండీ'' అంటూ మహాత్మా గాంధీ ధర్నాలు నిర్వహిస్తే... మరుసటిరోజు నుండి అన్ని థర్డ్ క్లాస్ భోగీలపై సెకండ్ క్లాస్ అని రాసి పెట్టిన అప్పటి పాలకుల్లా ఉంది.
భారత దేశంలో అమలవుతున్న పన్నుల విధానం అత్యంత లోపభూయిష్టమైనది. మొత్తం పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు 30శాతం ఉంటే పరోక్ష పన్నులు 70శాతం. పరోక్ష పన్నులన్నీ వినిమయ వస్తువులపై విధించబడతాయి. వినిమయ వస్తువులలో అత్యధిక శాతం నిత్యావసరాలవి. వీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించేది కూడా క్రింది స్థాయి ఆదాయం కలిగిన ప్రజలే. అనగా పరోక్ష పన్నుల శాతం పెరిగినప్పుడు క్రింది స్థాయి ఆదాయాలు కలిగినవారు ఎక్కువ పన్నులు చెల్లించవలసి వస్తుంది. అదే ప్రత్యక్ష పన్నులన్నీ అధిక ఆదాయం కలిగిన సెక్షన్ నుండి వస్తాయి. అందుచేత ప్రత్యక్ష పన్నులు ఎక్కువగా విధించడం వలన అధిక ఆదాయం కలిగిన వారికి మాత్రమే కష్టం అవుతుంది. కానీ అసమానత పెరగదు. ఈ విషయాలు అర్థం చేసుకోకుండా మా పన్నుల నుండి పేదలకు ఉచితాలు పంచి పెడతారా.. అంటూ మధ్య తరగతి వేతన జీవులు ఉలిక్కి పడుతుంటారు. వాస్తవానికి పరిశ్రమించే వారికి సరైన ప్రతిఫలమిస్తే ఈ ఉచితాల అవసరం లేదు. గతంలో కొన్నాళ్ళు పాటించబడిన సంపద పన్నును మళ్ళీ ప్రవేశ పెట్టడం, వారసత్వ పన్ను లాంటివి ప్రతిపాదించడం వలన గవర్నమెంటుకు రాబడి తగ్గకుండా ఉంటుంది, క్రింది స్థాయి ప్రజల ఆదాయాలూ మెరుగవుతాయి.
దేశంలో ఆర్థిక అసమానతలతో పాటు సామాజిక రాక్షసత్వాలూ బయటపడుతుండటం కడు విచారకరం. జార్ఖండ్ రాష్ట్రంలో దళిత యువతి వంటను (మధ్యాన్న భోజన వసతిలో భాగంగా) స్కూలు పిల్లలు తిరస్కరిస్తున్నారనే నెపంతో సదరు మహిళను విధుల్లోంచి తొలగించారు. ఇలాంటివి ఏ రకమైన అభివృద్దికి సంకేతాలు? వనరుల వినియోగాన్నీ, ఉపాధిని పరిమితం చేసి, పుట్టిన మనుషుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ విభజన గీతలు గీసిన కుల వ్యవస్థే ఈ అసమానతలన్నింటికీ కారణమని, దానిని దునుమాడాలని మహానుభావులెప్పుడో చెప్పారు. మళ్ళీ ఈ ఏడేండ్లలో అది జఢలు విప్పి నాట్యం చేసే స్థాయికి పెరుగుతున్నది. దీనికెవరు కారణం? చట్ట సభలే కులాంతర, మతాంతర వివాహాలను అడ్డుకునేలా, చట్టాలు చేస్తున్నాయంటే.. సంకుచిత అభద్రతా భావం ఎంతలా వెంటాడి వేధిస్తుందో గదా!? దీని పర్యావసనాలను చూసే వరకైనా ఈ చర్యలకు బాధ్యులైన వారు జీవించగలరా? మతాచారాలు వ్యక్తిగతాలు. కానీ నేడు అవే శక్తిగా మారి, ప్రజలు పాలకులను మరో ప్రశ్న వేయకుండా మద్దతు తెలిపే శస్త్రాలుగా మార్చబడ్డాయి. వేల కొలది గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేవు, వేల కొలది గ్రామాలకు విద్యుత్ సౌకర్యాలూ లేవు, వేలాది గ్రామాలు మామూలు వైద్యం కోసం పదుల కిలోమీటర్లు, మెరుగైన వైధ్యం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఉన్నది. లక్షల మంది చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఏటా కుంటు పడుతున్నారనీ, స్త్రీ శిశు మరణాలూ అలాగే ఉన్నాయనీ, మహిళపై అత్యాచారాలూ ఎక్కువేననీ జాతీయ గణాంకాలన్నీ చెబుతున్నాయి. అలాంటప్పుడు వీటిపై సమగ్ర విధానాన్ని ప్రభుత్వ పెద్దలు ప్రకటించకుండా, గంగా ప్రక్షాళనా, గౌరీ ప్రక్షాళనా అంటూ ప్రజా ధనాన్ని వృధా చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా..?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016