Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుల రక్కసి సష్టించిన అసమానతల వ్యవస్థపై మనదేశంలో తిరుగుబాట్లెన్నో జరిగాయి. స్వతంత్ర భారత తొలి దళిత ప్రతిఘటనగా నిలిచిన ''కీలవేణ్మని పోరాటం'' అందులో ఒక మహౌజ్వల ఘట్టంగా భాసిల్లుతున్నది. ''త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి.. ఇరవై రెండేళ్ళ క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు.. నా జన్మస్థలం కీలవేణ్మణి..'' అంటూ ఆ తమిళ పల్లె అందించిన ధిక్కారస్వరాన్ని అక్షరీకరించాడు కవి కలేకూరి ప్రసాద్. మనువాద శక్తులు నేడు మరింతగా బలం సంతరించుకుని.. దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసి మనువ్యవస్థను పునప్రతిష్టాపన చేయాలని ప్రయత్నిస్తున్న వేళ.. కీలవేణ్మని పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోవడం.. ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించడం నేడు మరింత అవసరం.
1960 దశకంలో తమిళనాడులోని కావేరీ డెల్టాలో భాగమైన పూర్వపు తంజావూరు జిల్లా సస్యశ్యామలంగా విలసిల్లేది. గొప్ప దేవాలయాలతో పాటు.. శ్రమజీవులను పీడించుకుతినే భూస్వాములకు సైతం పేరుగాంచింది ఆ ప్రాంతం. 1961 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యధిక శాతం భూమిలేని నిరుపేదలు తంజావూరు జిల్లాలో ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డవారిలో.. ప్రతి పది మందిలో, తొమ్మిది మంది సొంత భూమిలేక ఇతరుల పొలాల్లో కూలి పనులు చేసి పొట్ట నింపుకునే వారే. దేవుడి పేరుమీద ఉన్న భూములు సైతం అగ్రవర్ణాల కబ్జాల్లో ఉండి.. ఆదాయం వారికే దక్కేది. వామపక్ష ప్రగతిశీల శక్తుల పోరాటాల కారణంగా జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది. ఎర్రజెండా అండతో సాగిన ఉద్యమాల కారణంగా.. తంజావూరు వెట్టి కార్మికుల విముక్తి చట్టం - 1952, తమిళనాడు కౌలుదారుల రక్షణ చట్టం - 1955 లాంటి ప్రగతిశీల చట్టాలు రూపొంది.. భూస్వాముల దోపిడీకి కొద్దిగా అడ్డుకట్ట వేశాయి. భూమి గల ఆసాములందరూ అగ్రవర్ణాల వారు కాగా.. రైతుకూలీలలో తొంభైశాతం నిమ్న వర్గాల వారే. భూస్వాముల పొలాల్లో పిల్లాజెల్లాతో కుటుంబాలకు కుటుంబాలే వెట్టిచాకిరీ చేస్తూ బతుకులు గడపాల్సి వచ్చేది. కుల వ్యవస్థ తాలూకు వివక్ష రూపాలన్నీ కీలవేణ్మని పరిసర ప్రాంతాల్లో అమలులో ఉండేవి. అస్పృశ్యత, వెట్టిచాకిరి, బావులలో నీటి వాడకంపై నిషేధం, కట్టుబాట్లను ధిక్కరిస్తే కొరడా శిక్షలు, దళిత స్త్రీలపై లైంగిక అత్యాచారాలు యధేచ్ఛగా సాగేవి. ఆలయాలకు.. విద్యాలయాలకూ దూరంగా దళిత బిడ్డలను నెట్టివేసిన మనువు పాలన నిరాటంకంగా సాగేది. మగవాళ్లు ఒంటి పై భాగంలో వస్త్రం వేసుకోవడం, వీధుల్లో చెప్పులేసుకుని నడవడం, దళిత స్త్రీలు వక్షస్థలాన్ని దాచుకోవడం అక్కడ నిషిద్ధం. చేసిన కూలీకి తగిన జీతం సైతం అడగ లేని బానిస బతుకులు అక్కడ కొనసాగేవి.
ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతు కూలీలు సంఘటితమై సిపిఎం పార్టీ నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తంజావూరు జిల్లాలోని కీలవేణ్మణి పరిసర ప్రాంతాల్లో సంఘం కార్యక్రమాలు ఉదతంగా సాగాయి. సీపీఐ(ఎం) పార్టీ స్థానిక నాయకులు మణిఅమ్మై, శ్రీనివాసరావు, ఇతరులూ రైతు కూలీలందరినీ చైతన్యపరిచి సంఘం జెండా కింద ఐక్యం చేసారు. రైతు కూలీల గుడిసెల మీద వెలసిన ఎర్రజెండాలు భూస్వాములకు కంటగింపుగా పరిణమించాయి. ధనికస్వాములు ఏహ్యభావంతోనూ, పేదప్రజలు ఆరాధనా భావంతోనూ తమిళభాషలో సీపీఐ(ఎం) పార్టీని ''పెరయన్ కచ్చి(దళితుల పార్టీ)''గా పిలిచేవారు.
1968 సంవత్సరంలో వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలనే ఉద్యమం ఊపందుకున్నది. రాజగోపాలన్ నాయుడు అనే భూకామందు నాయకత్వంలో భూస్వాములందరూ ఏకమై కూలీల ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం మొదలుపెట్టారు. వ్యవసాయ కార్మిక సంఘానికి పోటీగా వ్యవసాయదారుల సంఘాన్ని స్థాపించి.. పోరాడుతున్న రైతు కూలీలపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంతవరకు భూస్వాముల పొలాలలో పనులు సాగవని తేల్చి చెప్పిన రైతు కూలీలు సమ్మెకు దిగారు. దాంతో రెచ్చిపోయిన భూస్వాములు వేరే ప్రాంతాల నుండి కూలీలను తీసుకువచ్చి వాళ్ళ చేత పనులు చేయించడం మొదలు పెట్టారు. సీపీఐ(ఎం) పార్టీ నాయకులు ఇతర ప్రాంతాల కూలీలకు నచ్చచెప్పడంతో.. వారు సైతం పోరాటానికి అండగా నిలిచి భూస్వాముల పొలం పనులను బహిష్కరించారు.
ఇది సహించలేని భూస్వాములు, తమ గూండాలను ఉసిగొల్పి డిసెంబర్ 25, 1968న గణపతి, ముత్తుస్వామి అనే కార్మిక సంఘం కార్యకర్తలను కిడ్నాపు చేసి చిత్రహింసలకు గురిచేసారు. రైతు కూలీలందరూ కర్రలు, బరిసెలు పట్టుకుని ఊరేగింపుగా బయల్దేరి.. భూస్వాముల ఇండ్లపై దాడి చేసి తమవారిని విడిపించుకున్నారు. రైతు కూలీల ప్రతిఘటన భూస్వాముల ఉక్రోషాన్ని రెచ్చగొట్టింది. ఇక సహించకూడదని భావించిన భూస్వాములు.. చుట్టుపక్కల గ్రామాలలో తమకు మద్దతు ఇచ్చే వాళ్లందర్నీ సమీకరించుకుని పోలీసుల అండతో అదేరోజు రాత్రి దళితవాడ పై దండెత్తారు. భూస్వాముల పక్షం వహించిన పోలీసులు అకారణంగా రైతుకూలీపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కొందరు మరణించారు. మిగతా వారందరూ పోలీసుల దాడి నుండి తప్పించుకునే క్రమంలో రైతుకూలీ రామయ్యకు చెందిన గుడిసెలో తలదాచుకున్నారు. గోపాలకష్ణన్ నాయుడు, ఇతర భూస్వాములూ గుడిసె దగ్గరకు చేరుకుని గుడిసెపై పెట్రోల్ పోసి నిప్పంటించమని గుండాలను ఆదేశించారు. పసి పిల్లలు మహిళలు తలదాచుకున్న ఆ గుడిసెపై నిర్దాక్షిణ్యంగా పెట్రోలు చల్లి మంట అంటించారు. క్షణాల్లో రామయ్య గుడిసె అగ్నిగుండంగా మారింది. లోపల తలదాచుకున్న వారు ఆర్తనాదాలు చేస్తూ అగ్నికి ఆహుతయ్యారు. పసి పిల్లల్నైనా రక్షించుకుందామనే ఆశతో తగలబడుతున్న తల్లులు తమ పిల్లల్ని బయటకి గిరవాటు వేస్తే.. బయటనున్న భూస్వాములు వాళ్లని మళ్లీ గుడిసె మంటల్లోకి విసిరేసారు. తెల్లారి తీరిగ్గా వచ్చిన పోలీసులు అధికారులు కాలి బూడిదైన గుడిసె పరిసరాలను పరిశీలిస్తే.. 44 మంది దళిత బిడ్డల కాలిన కళేబరాలు దర్శనమిచ్చాయి. అందులో 23 మంది పిల్లలు, 16 మంది మహిళలు, ఐదుగురు పురుషులూ ఉన్నారు.
కీలవేణ్మని మారణకాండ వార్త దేశమంతా దావానలంలా వ్యాపించింది. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తన మంత్రివర్గంలోని పిడబ్ల్యుడి శాఖ మంత్రి కరుణానిధిని తక్షణం కీలవేణ్మని వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించాడు. కేరళలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఉన్న సీపీఐ(ఎం) పార్టీ జాతీయ నాయకులు జ్యోతిబసు, రణదివే, రామ్మూర్తిలు హుటాహుటిన కీలవేణ్మని చేరుకున్నారు. తంజావూరు జిల్లాలోని రైతు కూలీ సంఘాల కార్యకర్తలందరూ పెద్ద సంఖ్యలో కీలవేణ్మనిలో బహిరంగసభ నిర్వహించి ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. పార్టీ నాయకులు వారిని శాంతింపజేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుందామని నచ్చజెప్పారు. దురదృష్టవశాత్తూ న్యాయ వ్యవస్థ సైతం దళితులకు న్యాయం అందించడంలో విఫలమైంది. నాగపట్టిణం జిల్లా కోర్టు గోపాలకృష్ణన్ నాయుడుతో సహా పది మందిని దోషులుగా నిర్ధారిస్తూ 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తే.. మద్రాస్ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవనే నెపంతో వారిపై శిక్షను రద్దు చేసింది. బాధితులు చెప్పిన దాని ప్రకారం గోపాల కృష్ణన్ నాయుడు ఇతరులూ తగలబడిన రామయ్య గుడిసె దగ్గరకు వచ్చారనే కథనం నమ్మశక్యంగా లేదని గౌరవ న్యాయమూర్తి తేల్చేసాడు. డబ్బున్న ఆసాములు తమ ఇండ్లలోనే ఉండి తమ మనుషులకు ఆదేశాలు ఇస్తారు తప్ప స్వయంగా మారణకాండలో పాల్గొన్నారు అంటే నమ్మలేం.. అనే కారణాలను సదరు న్యాయమూర్తి పేర్కొన్నాడు. అన్నాదురై నాయకత్వంలోని డిఎంకె ప్రభుత్వం సైతం.. పలుకుబడి గల వర్గాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం చేయలేక బాధితులకు న్యాయం అందించడంలో మౌన ప్రేక్షక పాత్ర వహించింది.
భూస్వామ్య శక్తులు అగ్నికి ఆహుతి చేసిన ఆ రామయ్య గుడిసె స్థానంలో ఉద్యమకారులు ఒక స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. 44 మంది అమరవీరుల పేర్లు ఒక ఎర్రటి గ్రానైట్ రాయిపై చెక్కబడినాయి. ఆనాటి బెంగాల్ ఉప ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసు సదరు స్మృతి చిహ్నానికి శంకుస్థాపన చేశారు. మాయంది భారతి అనే స్వాతంత్య్ర సమర యోధుడు కీలవేణ్మని మారణకాండ జరిగిన మరుసటి రోజు అక్కడికి చేరుకుని మృతవీరుల అవశేషాలను ఒక గాజుగిన్నెలో సేకరించాడు. సదరు గిన్నెను స్మృతి చిహ్నంలో నిక్షిప్తం చేశారు. నేడు ఆ స్మృతి చిహ్నం తమిళనాట ప్రగతిశీల శక్తుల తీర్థాస్థలిగా నిలిచింది.
కీలవేణ్మని బాధితులకు న్యాయం దక్కాలంటూ జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో మహిళా ఉద్యమ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. మారణకాండ జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)తమిళనాడు రాష్ట్ర మొదటి మహాసభ ఆ చిన్న ఊర్లోనే జరుపుకున్నారు. ఐద్వా జాతీయ నాయకురాలు కామ్రేడ్ మైథిలి శివరామన్ పత్రికల్లో విసతంగా వ్యాసాలు రాసి.. బాధితులకు బాసటగా రాష్ట్ర ప్రజలను సమీకరించారు. కీలవేణ్మని వీరగాథ పై ఆమె రాసిన వ్యాసాల పరంపర.. ''హంటెడ్ బై ఫైర్'' పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ వీరోచిత పోరాటంపై ప్రముఖ తమిళ రచయిత్రి ఇందిరా పార్థసారథి రాసిన ''కురుదిప్పునల్'' నవలకు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 1983 లో ఆ నవల ఆధారంగా ''కన్న్ శివంతల్ మన్న్ శివక్కం'' అనే తమిళ చిత్రం వచ్చింది. 2019లో వచ్చిన ధనుష్ నటించిన అసురన్ (తెలుగులో నారప్ప)సినిమా సైతం కీలవేణ్మని మారణకాండను ఇతివృత్తంగా తీసుకుని వచ్చిందే.
కీలవేణ్మని దళిత బిడ్డల పోరాటం వృధాపోలేదు. ఆ పోరాట స్ఫూర్తిని అందుకుని రైతుకూలీలు, శ్రమజీవులందరూ మరింత సంఘటితమై తంజావూరు జిల్లా అంతటా ఉధతంగా పోరాటాలు సాగించారు. పోరాటాలకు తలొగ్గిన భూస్వాములు కూలీ రేట్లు పెంచాల్సి వచ్చింది. దళిత చైతన్యం వెల్లివిరిసిన కారణంగా కుల వివక్ష కూడా క్రమక్రమంగా తోకముడిచింది. పోరాటఫలంగా భూమిని దక్కించుకున్న రైతుకూలీలు చిన్నపాటి రైతులుగా ఎదిగారు. అమరవీరుల త్యాగాలతో ఎరుపెక్కిన ఎర్రజెండా మరింత సమున్నతంగా ఎగిరి.. వారి జీవితాల్లో గౌరవప్రదమైన మార్పులు తీసుకురాగలిగింది. అయితే మనువాద భూతం మాత్రం ఇంకా సజీవంగానే ఉన్నదన్నది సత్యం. కీలవేణ్మనులను.. ఖైర్లాంజీలను.. కారంచేడులను అనేకానేకం సష్టించిన మనువాదం నేడు మరింత బలపడి.. దేశమంతటా స్వైరవిహారం చేస్తున్న వేళ.. కమ్యూనిస్టులు పోరాట వారసత్వాన్ని తమ అసమాన త్యాగాలతో నిలబెట్టిన ఆ తమిళగడ్డ దళిత పులుల యుద్ధ పటిమ నేటి కాలపు సామాజిక న్యాయ పోరాటాలకు స్ఫూర్తిదాయకమై నిలిచి ఉన్నది. భూస్వామ్య క్రౌర్యానికి మసిబుగ్గయిన ఆ రామయ్య గుడిసె రగిలించిన నిప్పురవ్వ... కులదోపిడిని, వర్గదోపిడినీ ఏకకాలంలో నిర్మూలించ డానికి సాగుతున్న ఉద్యమాలకు దివిటీయై వెలుగొందుతున్నది.
(డిసెంబర్ 25 - కీలవేణ్మని మతవీరుల సంస్మరణ దినం సందర్భంగా..)
- ఆర్. రాజేశమ్
సెల్: 9440443183