Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా థర్డ్‌వేవ్ ముప్పు ముంచుకొస్తున్నది. రాష్ట్రంలో ఓమిక్రాన్ వ్యాప్తి కలకలం రేపుతున్నది. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయో గించడంతోపాటు భౌతికదూరం పాటించాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. చెప్పేటోడికి వినేటోడు లోకువ అన్నట్టు ప్రభుత్వం ఆ విషయాన్ని మాత్రం పట్టించు కోవడంలేదు. అన్ని కార్యాలకు ప్రభుత్వమే అనుమతి ఇస్తున్నది. మరోవైపు మాస్కులు పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు జరిమానా అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. రెండురోజులు ఆర్భాటం చేసి దాన్ని అటకెక్కించారు. మందుకు మాత్రం గ్రామ, గ్రామాన మందు దుకాణాలు తెరవడంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనూ గల్లీగల్లీలో మందు కోసం క్యూలు కడుతున్నారు. తాగి ఊగుతున్నారు. దీనిపై పెద్దగా నియంత్రణలేదు. ఎందుకంటే సర్కారోళ్లకు పెద్ద ఆదాయం ఇదే. కాకపోతే ఒక్కటి మాత్రం పోలీసోళ్లు విధిగా చేస్తున్నారు. ఎంత మందైనా తాగండీ...అది బయట కాదు ఇంట్లో అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా చెప్పడంలేదు. మందు దుకాణాలకు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కొన్ని రకాల కార్లను అపుతున్నారు. ఖరీదైన కార్లను మాత్రం దగ్గరుండి పంపిస్తున్నారు. పోలీసులు ఆరుగంటల నుంచే తమ లక్ష్యసాధనలో నిమగమవు తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి బ్రీత్ ఎనలైజర్ నోట్లో పెట్టి ఊదమంటున్నారు. దీంతో చిర్రెత్తుకుని ఒక తాగుబోతు పోలీసులపై చిందులేశాడు. కరోనా అంటారు. ఎవడెవడినోట్లోనో పెట్టి మళ్లి నా నోట్లో ఇది (బ్రీత్ ఎనలైజన్) పెడుతున్నారు. వాని కరోనా నాకు రాదా? దానికి బాధ్యులెవరు? మళ్లీ ఫైన్లు వేస్తున్నారు. ఇంటికి ఫోన్లు చేసి భార్య ముందు ఇజ్జత్ తీస్తున్నారు. కనీసం శానిటైజర్ పెట్టారా? లేదు. మాస్కులైన ఇస్తున్నారా? అదీలేదు. మందుతాగినోళ్లకు మాత్రం బ్రీత్ ఎనలైజర్ పెట్టి కిక్కుదించుతున్నారు. మందుబాబు మత్తులో గుక్కతిప్పుకోకుండా పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఖాకీలు ఖంగుతున్నారు. ఇదేంటిరాబాబు తలకాయనొప్పి అని గున్కుకున్నారు.
- గుడిగ రఘు