Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తగ్గేదేలే...' ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ తనదైన శైలిలో పలికిన ఈ మాస్ కేక... థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలేయిచింది. అదే స్టైల్లో కాకపోయినా అంతకు మించిన తీవ్ర స్వరంతో గులాబీ బాస్ కేసీఆర్... 'కేంద్రంపై ఇక యుద్ధమే...' అంటూ నవంబరులో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో పొలికేక పెట్టారు. ధాన్యం కొనుగోళ్లపై మోడీ సర్కార్‌తో తాడో, పేడో తేల్చుకుంటామంటూ సవాల్ విసిరారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన కేసీఆర్, ఆయన మంత్రుల బృందానికి అక్కడ చుక్కెదురైంది. ప్రధాని మోడీ కార్యాలయం అపాయింట్మెంట్ ఇవ్వనుగాక ఇవ్వనుపొమ్మంటూ తిరస్కరించింది (అసలు కేసీఆర్ అపాయింట్మెంటే అడగలేదనేది మరో వాదన). బీజేపీ ప్రభుత్వం ఇంతగా రాష్ట్రం పట్ల వివక్షను ప్రదర్శిస్తూ, అవమానకరంగా వ్యవహరిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ దళపతి, తగ్గేదేలే... అంటూ కేంద్రంపై ఎందుకు ఫైరవ్వలేదనేది అంతులేని వింత ప్రశ్నగా మారింది. హైదరాబాద్‌లో మనకు ధర్నాచౌక్ మాదిరిగానే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయటానికి జంతర్ మంతర్ ఉంది కదా...? మరి అక్కడ మన సారెందుకు కూర్చోలేదంటూ ఔత్సాహిక నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వారి ధర్మ సందేహాలకు జవాబు దొరక్కముందే మరోసారి కారు సారు... ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈసారి కూడా 'తగ్గేదేలే... బీజేపీని ఎండగట్టండి...' అంటూ వారికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత హస్తినకు వెళ్లొచ్చిన మంత్రులు, ఎంపీలు ఈసారి కూడా ప్రెస్మీట్లు పెట్టి... తంతును ముగించారే తప్ప ఇరగబొడిసిందేమీ లేదు. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో కలిసిన ఓ పాత్రికేయ మిత్రుడు... 'తగ్గేదేలే... అంటూ ప్రతీసారి మోడీకి తలొగ్గటం గులాబీ పార్టీకి అలవాటైంది...' అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి తరణంలో కేసీఆర్ తానిచ్చిన పవర్ఫుల్ పిలుపు మాదిరిగా 'వెనక్కి తగ్గకండా కమలం పార్టీపై మున్ముందైనా ఫైట్‌కు సై అంటే సై అంటారా..? లేదా...' అనేది వేచి చూడాలి. సో...వెయిట్ అండ్ సీ...
-బి.వి.యన్.పద్మరాజు