Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరమశివుడు కాశీలోని హరిశ్చంద్ర ఘాట్లో కూర్చున్నాడు. ఆయన ఆనందంగా ఉన్నాడో, విచారంగా ఉన్నాడో తెలియదు. ఒక నిర్వికార, నిర్విచారమైన స్థితిలో ఒక సమాధిపై ఆసీనుడై ఉన్నాడు. ఎంతసేపటి నుండి ఉన్నాడో, ఎంతసేపు ఉంటాడో తెలియని స్థితి!
ఎంతోసేపు గడిచింది! పరమశివుడి కాలికి చల్లగా ఏదో తగిలింది! పరమశివుడు తన స్థితి నుండి మేల్కొని చూశాడు. తన పాదాల వద్ద నీరు! క్రమంగా ఆ నీరు పరిపూర్ణమైన ఆకృతి దాల్చింది! ఆ రూపం చూసి పరమశివుడు ఆశ్చర్యపోయాడు! ''గంగాదేవీ! నా పాదాల వద్దకు ఎందుకు వచ్చావు?'' అని ప్రశ్నించాడు.
''అదేమిటి స్వామీ! నేను మీ పాదదాసిని! నాకు అక్కడే సంతోషంగా ఉంటుంది!'' అన్నది గంగ.
''తప్పుదేవీ! స్త్రీ పురుషులు నా దృష్టిలో సమానమే! అందుకే పార్వతికి, నా దేహంలో సగభాగం ఇచ్చాను. నిన్నేమో! తలపైనే పెట్టుకున్నాను'' అన్నాడు పరమశివుడు.
గంగాదేవికి ఆనందమయ్యింది! ఆయన చెప్పింది నిజమే! మిగిలిన దేవుళ్ళు అంతా భార్యలను బానిసలుగానే చూశారు!
''మీరు చెప్పింది నిజమే! కాని మీరు ఇక్కడేమి చేస్తున్నారు? మీకోసం ఈ వారణాశిలో, మీ ఆలయాన్ని, పరిసరాలను నడిచాను. ఎంతో గొప్పగా అభివృద్ధి చేశారు! మీ భక్తుడైన నరేంద్రమోడీ మీకోసం ఎంతో శ్రద్ధపెట్టి ఖర్చుచేసి, ప్రారంభోత్సవము కూడా చేస్తున్నారు. ఈ సమయంలో మీరు గుళ్ళోలేకపోతే ఏం బాగుంటుంది?'' ప్రశ్నించింది గంగాదేవి.
పరమశివుడు ఆశ్చర్యంగా గంగాదేవి వంక చూశాడు. ''దేవీ, ఈ వారణాసిలో నా ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నది నిజమే! కానీ నేను గుళ్ళో ఉండాల్సిన అవసరము ఉందా! అని ఆలోచిస్తున్నాను! అందుకే ఇక్కడికి వచ్చాను. పైగా ఇదే కదా నా అసలైన నివాసము!'' అన్నాడు.
''స్వామి! స్మశానమే మీ నివాసమని, అందుకే దీన్ని రుద్రభూమి అంటారని నాకు తెలుసు! కాని విరూపాక్షాలయము, ఇతర జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాలు కూడా మీ నివాసాలే కదా! పైగా వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేయటంలో ఒక ప్రత్యేకమైన అంశము దాగున్నది తెలుసా?'' ప్రశ్నించింది గంగాదేవి.
''ఏమా ప్రత్యేకమైన అంశము?'' ప్రశ్నించాడు పరమశివుడు.
నదిగా ఉన్న నన్ను, గుళ్ళో దేవుడిగా ఉన్న మిమ్మల్ని కలిపేందుకు ప్రత్యేకమైన నడవా ఏర్పాటు చేశారు తెలుసా?'' అన్నది గంగాదేవి.
ఫక్కున నవ్వాడు పరమశివుడు.
''ఎందుకు స్వామి నవ్వుతారు!'' అడిగింది గంగాదేవి.
''నవ్వక ఏమి చేయమందువు దేవీ!'' నిన్న నన్ను ప్రత్యేకంగా కలువవలసిన అవసరమే మున్నది? నేను ముందే చెప్పినట్లు నీవు సదా నా శిరస్సుపై కొలువై యున్నావుకదా!'' అన్నాడు పరమశివుడు.
కొన్ని వందల ఏండ్లుగా ఈ కాశీలో మిమ్మల్ని, మీ ఆలయాన్ని పట్టించుకున్న వారు లేరు! కాశీకి వెళితే కాటికి వెళ్ళినట్టే నన్న నానుడు ఉండేది! అటువంటి స్థితినుండి ప్రపంచంలోని అతిగొప్ప ఆలయంగా మార్చుతున్న ఈ మహాప్రయత్నాన్ని తక్కువ చేసి చూడరాదు, ఈ మహా ప్రయత్నం చేస్తున్న నరేంద్రమోడీని ఆశీర్వదించండి!'' అన్నది గంగాదేవి.
పరమశివుడు మరోసారి నవ్వాడు.
''దేవీ! స్మశాన నివాసినైన నాకు గుళ్ళూ గోపురాలు పట్ల అనురక్తి లేదు! ఈ కాశీలో నా గుడిని అభివృద్ధి చేస్తున్న మోడీ మనసులోని మర్మాన్ని నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు!'' అన్నాడు పరమశివుడు.
''గుడిని అభివృద్ధి చేయటంలో కూడా మర్మం ఉంటుందా? ఇదేమి విడ్డూరం స్వామీ!'' ఆశ్చర్యంగా అడిగింది గంగాదేవి.
''తప్పకుండా ఉంటుంది దేవీ! ఇలాంటివి కాస్త తర్కించి, తెలుసుకోవాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి. కనుక ఇలాంటి అభివృద్ధి బాగా కనబడుతుంది! ప్రత్యేకించి గుళ్ళూ, గోపురాలపై శ్రద్ధ అధికమవుతుంటుంది!'' అన్నాడు పరమశివుడు.
''ఏది ఏమైనా మీ భక్తుల మనస్సు మీరు అర్థం చేసుకోలేక మాట్లాడుతున్నారని అన్పిస్తోంది! అన్నది గంగాదేవి.
''దేవి! నేను భక్తుల మనస్సు, వారి ఆలోచనలు బాగా అర్థం చేసుకున్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నాను.
ఒక వాస్తవం చెబుతాను విను! గత ఎన్నికల్లో రామమందిరం గురించి, దాన్ని పూర్తి చేయటం గురించి, ఎంతో గొప్పగా ఇదే భక్తులు చెప్పారు! అది విని నిజమే! రాముడిపై వారికి ఎంత గొప్ప భక్తి ఉందనుకుని మురిసిపోయాను! కాని రామమందిరం ఇంకా పూర్తికాలేదు! అంటే దాన్ని కేవలం ఎన్నికలకు, ఓట్లు పడటానికి పనికి వచ్చే అంశంగానే చూస్తున్నారని తెలిసింది! ఇప్పుడు నా గుడివంతు వచ్చింది! అంతే!'' అన్నాడు.
''ఏదేమైనా, మీ భక్తుల నిజాయితీని శంకిస్తున్నారనిపిస్తోంది!'' అన్నది గంగాదేవి.
''నిజాయితీ ఉంటే శంకించటం అనే మాట మాట్లాడవచ్చు. కాని, ఎన్నికలు ఓట్లు ఇవి తప్ప ప్రజల కష్ట, సుఖాల గురించి పట్టని పాలకులకు నిజాయితీ ఏముటుంది?'' కరోనా మొదటివేవ్లో నీ ఒడిలో నీ బిడ్డల మృతశరీరాలు తేలియాడు తుంటే, పాలకుల శ్రద్ధ ఏమైంది? పొట్ట చేతపట్టుకుని ఊరుగాని ఊరిలో బతుకు వెళ్ళదీస్తున్న నిరుపేదల పరిస్థితి పట్టించు కోకుండా లాక్డౌన్ విధించిన వారికి, నా మీద భక్తి ఉంటే, నాకేమి ఆనందం కలుగటం లేదు! పైగా కష్టజీవులను మనుషులుగా చూడనివారి పట్ల నాకు ఏహ్య భావం కలుగుతున్నది!'' అన్నాడు శివుడు.
గంగాదేవి మౌనంగా వింటున్నది.
''ఈ పాలకుల భక్తి నా మీద కాదు! ఎన్నికలు, ఓట్ల మీద! నాపేరు లేదా రాముడిపేరు లేదా నీపేరు చెప్పి ప్రజల్లో మత విద్వేషాలు, సెంటిమెంట్లు రెచ్చగొట్టి, అధికారంలోకి రావటం, ఆ తర్వాత ఓట్లేసిన వారినెత్తిన చేయిపెట్టడం. ఇదే పాలకుల విధానం! అందుకే నా ఆ గుళ్ళో ఉండాలని అన్పించటం లేదు! నన్ను, రాముడుని తమ స్వార్థానికి వాడుకుంటున్న ఈ పాలకుల నిజస్వరూపం ప్రజలు తెలుసుకుని తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది!'' అంటూ ముగించాడు పరమశివుడు.
- ఉషాకిరణ్