Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ బ్యాంక్‌కి మూలధనం పెట్టుబడిగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలనే ఉద్యమంలో భాగంగా కామ్రేడ్ ఆర్ ఉమానాధ్ను కలిశాం. ఇండియన్ బ్యాంకు ఇలాంటి పరిస్థితికి దిగజారడానికి అప్పటి చైర్మన్‌గా ఉన్న పెద్ద మనిషి ఇచ్చిన భారీ రుణాల ఆనుపానులు అన్నీ తెలియచేసే కంప్యూటర్ డిస్క్ మా దగ్గర ఉంది. బ్యాంకును ఏ రకంగా అయినా నిలబెట్టుకోవాలి అన్న తపన, తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాలి, ఇండియన్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా మూలధనం నిధులు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఒక ఉన్నతాధికారి తన కెరీర్‌ను ఫణంగా పెట్టి మరీ ఈ వివరాలు మాకు అందించారు. ఇండియన్ బ్యాంకు నుండి ఏ ఏ పెద్దమనుషులు ఎవరెవరి రాజకీయ నాయకుల సిఫార్సులతో ఎంతెంత పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుని ఎగవేసారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. పార్లమెంటరీ కమిటీ ముందు మీరు ఎన్ని వివరాలు ఉంచగలిగితే అంత మంచిది అని కామ్రేడ్ ఉమానాధ్ మాకు అంతకు ముందే స్పష్టమైన మార్గ నిర్దేశం చేసారు.
ఇండియన్ బ్యాంకు ఉన్నట్లుండి ఇలా హఠాత్తుగ నష్టాల పాలు కావడానికి కారణాలు ఎవరో, ఏమిటో అంతకు ముందు నుండే మేము ఉద్యోగులలో, ప్రజలలో ప్రచారం చేస్తూ వచ్చాం. త్రిసూర్‌లో జరిగిన ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అఖిల భారత మహాసభల సందర్భంగా ''సేవ్ ఇండియన్ బ్యాంక్'' ప్రధాన డిమాండుగా పెద్ద యెత్తున ప్రచారం చెయ్యాలని నిర్ణయించింది. ఈ ఒక్క డిమాండుతో మేం ఒక జాతా కూడా నిర్వహించాం. ఇలా జాతా నిర్వహించి బ్యాంకు పరువు బజారున పెడుతున్నారు అని ఆ రోజున బ్యాంకు యాజమాన్యంతో పాటు సోదర కార్మిక సంఘం అయిన ఏఐబిఇఎ కూడా మా మీద విమర్శలు గుప్పించింది. ఇండియన్ బ్యాంకు ఇంత ముదనష్టంగా తయారు కావడానికి కారణమైన చైర్మన్ ఎంత పలుకుబడి గల పెద్ద మనిషంటే ఉద్యోగ విరమణ వయసు దాటినా ఆరు నెలలు ఆరు నెలల చొప్పున ఆ పదవిని పొడిగించుకోగలిగాడు.
ఆ చైర్మన్ చేసిన అధికార దుర్వినియోగానికి గాను అతను చివరికి జైలు పక్షి అవ్వాల్సి వచ్చింది. కొత్త ఛైర్మన్ బయట పెట్టిన వివరాలతో బ్యాంకు వాస్తవ పరిస్థితి ఏమిటో బయట పడింది. బడా బాబులు తీసుకుని ఎగవేసిన రుణాలకు బ్యాంకు లాభాల నుండే కాక మూలధనం నుండి కూడా సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూల ధనం సమకూరిస్తే తప్ప ఇండియన్ బ్యాంకు బోర్డు మిగిలేలా లేదు. అంటే రాజకీయంగా నిర్ణయం తీసుకుంటే తప్ప ఇండియన్ బ్యాంకు మనుగడ సాగించలేని పరిస్థితికి నెట్టబడింది.
ఇదిలా ఉండగా పులి మీద పుట్రలా నాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి ఈ బ్యాంకు మీద నమ్మకం కోల్పోయాం. మా ప్రభుత్వ నిధులన్నీ వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటించడంతో మునిగే నావకు నిప్పు కూడా అంటుకున్నట్లు అయ్యింది. తమిళనాడులో ప్రజలు ఇండియన్ బ్యాంకు నుండి తమ డిపాజిట్ సొమ్ములు వెనక్కి తీసుకోవడానికి వరదలా పోటెత్తారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ఇండియన్ బ్యాంకుకు మూల ధనం సమకూరుస్తాం కానీ బ్యాంకులో ఉన్న సంఘాలు అన్నీ ఒక ఒప్పంద పత్రం మీద సంతకాలు చేయాలి అని మెలిక పెట్టాడు. బ్యాంకు తిరిగి పట్టాలు ఎక్కే వరకు ఉద్యోగ సంఘాలు అప్పటి వరకు ఉద్యోగులకు అమలులో ఉన్న సదుపాయాలు అన్నీ వదులుకోవాలి అనేదే ఆ ఒప్పంద పత్రం సారాంశం. వాస్తవానికి బ్యాంకు ఇంతటి దురవస్థ పాలుకావడానికి ఉద్యోగుల బాధ్యత ఎంత మాత్రం లేకపోయినా వారిని బాధ్యులుగా చెయ్యడం ఏ రకంగానూ సరికాదు.
ఈ నేపథ్యంలో కార్మిక సంఘంగా ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనేది మా ముందు ఒక ప్రశ్నగా నిలిచింది.
ఇండియన్ బ్యాంకు తమిళనాడు కామ్రేడ్స్ ఉమానాధ్ను కలిశారు. అలాంటి ఉద్యోగ వ్యతిరేక ఒప్పంద పత్రం మీద సంతకం చేయకండి. ఉద్యోగుల నుండి రిఫరెండం కోరండి అని సలహా ఇచ్చారు కామ్రేడ్ ఉమానాధ్.. అందుకు అనుగుణంగా మేం విస్తృత ప్రచారం చేపట్టాం. నిజానికి అది మా శక్తికి మించిన పని. అయినా చేపట్టాం. బ్యాంకులో పనిచేసే అన్ని కార్మిక సంఘాలు ఒప్పంద పత్రం మీద సంతకాలు చేయడానికి పెన్ను మూతలు తీసి మరీ తయారుగా ఉన్నాయి. బెఫి సంఘంగా మేం మాత్రమే సిద్దంగా లేకపోవడంతో యాజమాన్యం ఫెడరేషన్ నాయకుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకు వచ్చింది. బెఫి నాయకులు ప్రతి ఒక్కరినీ జనరల్ మేనేజర్ స్థాయి నుండి జోనల్ మేనేజర్ స్థాయి వరకూ సంప్రదించారు. మీరు ఒక్కళ్ళే అడ్డం పడుతున్నారు. బ్యాంకు మనుగడ సమస్య కదా ఎందుకు మీకీ మొండి పట్టు అని బుజ్జగింపుగా అడగడంతో మొదలు పెట్టి... స్వరం పెంచి బెదిరింపులకు కూడా దిగారు. అయితే మా వాదన విన్నాక ఎక్కువ మంది మారు మాట్లాడలేక పోయారు. అదిగో ఆ క్రమంలోనే మా నిజాయితీ, మా నిర్భితి మీద నమ్మకం ఉంచి ఒక ఉన్నతాధికారి బ్యాంకు పుట్టి ముంచిన బడా రుణాల వివరాలు, ఎవరెవరు ఎంత మొత్తం దిగమింగారు, ఈ రుణాలు ఇమ్మని ఏ రాజకీయ నాయకుడు సిఫార్సు చేసాడు అన్న వివరాలు సమస్తం మాకు అందచేశారు. ఆ వివరాలు అన్నీ మేం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సమర్పించాం.
మా దగ్గర ఉన్న వివరాలు అన్నీ పార్లమెంటరీ కమిటీ సభ్యులకు మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు కూడా అందచేసాం. ఈ పనిలో ఉంటూనే మేం ఢిల్లీలో ఉన్న మా బ్యాంకు జనరల్ మేనేజర్‌ను కూడా కలిసాం. అప్పటికే ఆయన కలవర పడతా ఉన్నాడు. ఇండియన్ బ్యాంకు పని అయిపోయింది, రేపో మాపో ఆ బ్యాంకు మూత పడిపోతుంది అని ప్రచారం చేస్తూ మరో దక్షిణాది బ్యాంకు మన బ్యాంకులో ఉన్న డిపాజిట్లు అన్నీ లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు సమయానుకూలమైన జోక్యం అవసరం.. నిజమైన రాజకీయ జోక్యం అవసరం..లేకుంటే బ్యాంకు నిలదొక్కుకోవడం కష్టం అని ఉన్న సమస్యను మాతో పంచుకున్నారు. దాంతో మేం మళ్ళీ హుటాహుటిన కామ్రేడ్ ఉమానాధ్ దగ్గరకి వెళ్ళాం. ఆయన సీపీఐ(యం) పార్లమెంటరీ నాయకుడు కామ్రేడ్ బాసుదేవ్ ఆచార్యకు ఫోన్ చేసి మన ఇండియన్ బ్యాంక్ కామ్రేడ్స్ మీ దగ్గరకు వస్తున్నారు. వాళ్లకు అవసరమైన సాయం చేయండి అని చెప్పారు. మేం కామ్రేడ్ బాసుదేవ్ ఆచార్యను కలిసాం. మిగతా కథ బాసుదేవ్ ఆచార్య నడిపించారు.
సరిగ్గా అప్పుడే మేం టీవీలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన స్క్రోలింగ్ రావడం చూసాం.. ''ఇండియన్ బ్యాంక్.. దేశంలోని ప్రీమియర్ బ్యాంకులలో ఒకటి. ఆ బ్యాంకును తిరిగి కోలుకునేలా చేయడానికి మా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుంది'' అనేది ఆ స్క్రోలింగ్ సారాంశం. మా బ్యాంకు ఢిల్లీ జనరల్ మేనేజర్ ఫోన్ చేసి ఇప్పుడు ఈ ప్రకటన రాకుండా ఉంటే రేపు సోమవారం నాటికి 200 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎగిరిపోయేవి. నిజంగా మీరు మంచి కృషి చేశారు అని మమ్మల్ని అభినందించారు. నిజానికి ఈ అభినందనలు దక్కాల్సినది కామ్రేడ్స్ ఉమానాధ్, బాసుదేవ్ ఆచార్యలకు అని మేం మనసులో అనుకున్నాం.
నాటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇండియన్ బ్యాంక్ విషయంలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు ఏం కాదు అన్న హామీ అయితే ఇచ్చాడు కానీ అందుకు బదులుగా ఉద్యోగులను మూల్యం చెల్లించమని మెలిక పెట్టాడు. బ్యాంకుకు మూలధనం సమకూర్చాలంటే బ్యాంకులోని అన్ని ఉద్యోగ సంఘాలు ఒప్పంద పత్రం మీద సంతకం చేసి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఒక చిన్న సంఘం వాళ్ళతో సంతకాలు పెట్టించలేని మీ హెచ్ఆర్ డిపార్టుమెంటు దేనికయ్యా అని బ్యాంకు ఛైర్మన్ తలంటేసాడు. దాంతో హెచ్ఆర్ జనరల్ మేనేజర్ అయితే.. ''మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయి.. మాట వినని యూనియన్ వాళ్ళ తోకలు కత్తిరిస్తాని'' అని బెదిరింపులకు దిగాడు.
దానికి తోడు స్వయానా కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరమే ఇండియన్ బ్యాంకుకు మూలధనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ఒక మైనారిటీ ఉద్యోగ సంఘం ఒప్పంద పత్రం మీద సంతకం చేయ నిరాకరించడం మూలంగా మూలధన సాయం అందించలేక పోతున్నాం అని ఏకంగా ఒక పత్రికా ప్రకటన ఇచ్చేశాడు. అంటే పరోక్షంగా బ్యాంకు డిపాజిటర్లను, ప్రజలను మా మీదకు రెచ్చగొట్టాడు.
ముందు ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టు, మూలధనం పట్టుకెళ్లు, బ్యాంకు తిరిగి లాభాలు గడించేవరకు అన్ని మూసుకు పనిచెయ్యి.. కావాలంటే ఇప్పుడు వదులుకున్న సదుపాయాల కొసం ఆనక ఉద్యమాలు చేసుకో.. ఇదీ మా ముందు ఉన్న పరిస్థితి. మేం ఏటికి ఎదురీదుతున్నామా, మా అడుగు జారిపోతుందా అన్న సంశయం మాలో తలెత్తింది. ఉద్యోగులు మా వైఖరి కరెక్టే.. కానీ వేరే దారేం ఉంది.. అంటున్నారు.. ఈ శషభిషలు పడలేం గానీ ఛలో కామ్రేడ్ ఉమానాధ్ అనుకుని ఆయన దగ్గర సలహా కోసం వెళ్ళాం.
''మీరు ప్రత్యామ్నాయ ఒప్పంద పత్రంతో ఉద్యోగులలోకి, జనంలోకి వెళ్లండి.. దోషులను శిక్షించాలి.. ఇది మీ మొదటి డిమాండుగా ఉండాలి'' అని చాలా స్పష్టంగా ఆశావహ దృక్పథంతో సలహా ఇచ్చారు కామ్రేడ్ ఉమానాధ్.
మేం ప్రత్యామ్నాయ ఒప్పంద పత్రం రూపొందించాం. ఉద్యోగులలో విస్తృతంగా పంపిణీ చేశాం. దాంతో ఉద్యోగుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది. బ్యాంకుని దివాళా తీయించిన వాళ్ళని శిక్షించకుండా ఉద్యోగుల మీద పడితే ఏం లాభం అని వారి వారి సంఘాల నాయకులని ప్రశ్నించసాగారు.
ఈ మధ్యలో బ్యాంకు ఛైర్మన్ సెక్రటేరియట్ నుండి మా ఫెడరేషన్ జనరల్ సెక్రెటరీ కామ్రేడ్ తపన్ దాస్‌కి ఫోన్ వెళ్ళింది. ''మీరు సంతకం చెయ్యడానికి ఇంత ఆలస్యంగా చేస్తున్నారు ఏంటి'' అని ఆరా తీశారు. ''మా యూనియన్ సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి. ఇంకో పది రోజుల్లో మీటింగ్ ఉంది. దాన్లో నిర్ణయం అయ్యాక చెప్తాం'' అని తపన్ దాస్ బదులు చెప్పడంతో అవతల నుండి ఇంకా పది రోజులా.. మీ మీటింగ్ ఇంకాస్త ముందుగా రెండు మూడు రోజుల్లో పెట్టుకోండి.. మీ వాళ్ళ అందరినీ విమానాల్లో మీ మీటింగ్ ప్లేస్‌కి పంపే ఏర్పాటు మేం చూసుకుంటాం.. ఖర్చు బ్యాంకు పెట్టుకుంటుంది..'' అని సమాధానం వచ్చింది. అంటే మేనేజ్మెంట్ మీద అంత వత్తిడి ఉందన్నమాట..
మళ్ళీ మాకు కామ్రేడ్ ఉమానాధ్ సలహా కావాల్సి వచ్చింది. ''మీరేం దిగులు పడకండి. చిదంబరం మీ బ్యాంకుకు మూలధనం ఇవ్వకుండా తప్పించుకోలేడు. ఇవ్వకపోతే రాజకీయంగా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే మీరు బ్యాంకుని ముంచేసిన వాళ్ళ మీద దాడి పెంచండి. జనంలోకి పొండి.. మీరు రూపొందించిన ప్రత్యామ్నాయ ఒప్పంద పత్రం మీద గట్టిగా ప్రచారం చెయ్యండి. ఒక్క మాట తేడా వచ్చినా సంతకం చెయ్యం అని గట్టిగా నిలబడండి. ఉద్యోగులలో విశ్వాసం పెంపొందించండి. యాజమాన్యాన్ని, లొంగు బాటు సంఘాలను ఎండగట్టడానికి ఇంతకు మించిన మార్గం లేదు'' అని కర్తవ్య బోధ చేశారు కామ్రేడ్ ఉమానాధ్.
కామ్రేడ్ ఉమానాధ్ చెప్పినట్లు మేం ప్రత్యామ్నాయ ఒప్పందం మీద ప్రచారం తీవ్రతరం చేశాం. మా ప్రచారం బాగానే జనానికి హత్తుకుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ బ్యాంక్ ఛైర్మన్ సెక్రటేరియట్ నుండి కామ్రేడ్ తపన్ దాస్ కు ఫోన్ వచ్చింది. ఈ సారి వాళ్ల ధోరణే పూర్తిగా మారిపోయింది. ఒప్పంద పత్రంలో మిగతా యూనియన్ వాళ్ళు సంతకం చేసిన ఏ క్లాజుల పట్ల మీకు అభ్యంతరం ఉంది, ఏవి తొలగించి మీరు ఏ క్లాజులు చేర్చాలి అనుకుంటున్నారు అని వాకబు చేశారు.
మొదట మేమే ఈ ప్రతిపాదనను నమ్మలేకపోయాం. అన్ని యూనియన్లు ఒప్పుకుని సంతకం చేసిన అగ్రిమెంట్‌ను తిరగ రాయడం.. అదీ కేవలం ఒక మైనార్టీ యూనియన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. ఇదేం చిన్నా చితకా విషయం కాదు. మేం అనుసరించిన వైఖరి సరి అయినది అని నికరంగా రుజువు అవడంతో ఉద్యోగులు, బ్యాంకు ఉన్నతాధికారులు, పత్రికాఫీసుల నుండి ఒకటే ఫోన్లు.. అభినందనల హౌరు.. అయితే మాకు సరైన మార్గ నిర్దేశం చేసిన కామ్రేడ్ ఉమానాధ్ మాత్రమే ఈ అభినందనలకు అర్హులు అని మాకు తెలుసు. అటువంటి మార్గ నిర్దేశం చేసిన కామ్రేడ్ ఉమానాధ్ ఈ రోజు మన మధ్యన భౌతికంగా లేకపోవడం.. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనాల పెను ప్రమాదాల ముంగిట ఉన్న బ్యాంకు ఉద్యోగుల ఉద్యమానికి నిజంగా తీరని లోటే.
(కా|| ఉమానాథ్ శతజయంతి వ్యాసం)
- ఎ కె రమేష్‌బాబు