Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక శాసనసభ ఆమోదించిన మత మార్పిడి నిరోధక బిల్లు మతపరమైన మైనారిటీల హక్కులపై, మత స్వేచ్ఛపై ప్రత్యక్షంగా దాడి జరపడమే. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గతంలో గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలను ఆమోదించారు. పేరులో మత స్వేచ్ఛా చట్టం అని ఉన్నప్పటికీ అందుకు విరుద్ధంగా, రాజ్యాంగంలోని 25వ అధికరణ కింద కల్పించిన ''నచ్చిన మతాన్ని ప్రకటించడం, ఆచరించడం, ప్రచారం చేయడమనే'' పౌరుల ప్రాథమిక హక్కును అణచివేయడానికే ఉపయోగపడుతోంది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించిన ఇటువంటి చట్టాల తరహాలోనే 'కర్నాటక మత స్వేచ్ఛా హక్కు పరిరక్షణ బిల్లు' కూడా ఉంది. గుజరాత్ మత స్వేచ్ఛ చట్టం-2003ని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మత మార్పిడి స్వేచ్ఛను ఈ చట్టం లాక్కుంది. మతాంతర వివాహాలను నిరోధించింది. బలవంతంగా మత మార్పిడి చేస్తే మూడు నుండి ఐదేండ్ల పాటు జైలు శిక్ష విధించాలని కర్నాటక బిల్లు కోరుతోంది. అయితే మైనర్, మహిళ లేదా ఎస్సీ, ఎస్టీలతో ఇటువంటి మత మార్పిడికి పాల్పడితే జైలుశిక్ష మూడు నుండి పదేండ్ల వరకు ఉంటుందని బిల్లు పేర్కొంటోంది.
కర్నాటకలో క్రైస్తవులపై, వారి ప్రార్థనా మందిరాలపై విస్తృతంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ బిల్లును తీసుకు వచ్చారు. 'కర్నాటకలో క్రైస్తవులపై జరిగిన విద్వేష నేరాలు'పై ప్రజల పౌర హక్కుల కమిటీ (పి.యు.సి.ఎల్) ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి నుండి నవంబరు వరకు క్రైస్తవ ఆరాధనా స్థలాలపై, వారి సమావేశాలపై 39 దాడులు జరిగాయి. వివిధ ఆర్.ఎస్.ఎస్ సంస్థలు జరిపిన ఈ దాడులన్నీ మత మార్పిడి ప్రయత్నాల కారణంగానే జరిగాయని పేర్కొంటున్నప్పటికీ అన్ని కేసుల్లోనూ ఆ ఆరోపణలు తప్పని రుజువయ్యాయి. కర్నాటకలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవులు కేవలం 1.87శాతం మంది ఉన్నారంటేనే క్రైస్తవ మతంలోకి మత మార్పిడుల గురించి సంఫ్‌ుపరివార్ చేసే ఇటువంటి ప్రచారం తప్పని తెలిసిపోతోంది. పైగా 2001 జనాభా లెక్కలతో పోల్చుకుంటే ఈ సంఖ్య మరింత తగ్గింది కూడా. ఆనాడు 1.9శాతం మంది ఉండగా, 2011లో 1.87శాతం మందే ఉన్నారు. ఈ బిల్లు గనక చట్టంగా మారితే, క్రైస్తవులకు ఇదొక నిరంతర ముప్పుగా ఉంటుంది. పైగా వారి ఆరాధనా స్థలాలపై నిఘా చర్యలు ఉంటాయి. ఒక్క ఫిర్యాదు ద్వారా ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపయోగించి సాధారణ మత కార్యకలాపాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది, అవసరమైతే శిక్షిస్తుంది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని చట్టాల మాదిరిగానే ఎస్సీ, ఎస్టీలను బలవంతంగా మత మార్పిడికి ప్రలోభపెడితే మరింత కఠినమైన చర్యలు ఉంటాయని బిల్లు పేర్కొంటోంది. మతాన్ని మార్చుకోవడానికి పెద్ద మొత్తంలో ఆకర్షణలు చూపితే పేదలైన దళితులు, ఆదివాసీలు ఆ ఉచ్చులో పడిపోతారని దీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్కు ఉన్న భయం ఇందులో ప్రతిబింబిస్తోంది. అయితే, అణచివేతకు గురవుతున్న ఈ కులాన్ని విడనాడి హుందాగా, సామాజిక హౌదాలో జీవించాలనే ఆకాంక్షతోనే దళితులు, ఆదివాసీలు క్రైస్తవ మతానికి లేదా ఇస్లాం మతానికి మారుతున్నారన్న వాదనను ఆర్ఎస్ఎస్ ఎన్నటికీ ఆమోదించలేదు. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఏర్పడిన నాటి నుండి దాని ప్రధాన ఎజెండాగా ఉంది. వాస్తవానికి, మత మార్పిడి చేసుకున్న వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికే విశ్వ హిందూ పరిషత్ ఏర్పడింది.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఘర్ వాపసి (తిరిగి స్వంత మతానికి రావడం) గురించి ఆర్ఎస్ఎస్ ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూనే వస్తోంది. ఇటీవలే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, దారి తప్పిపోయిన మన సోదరులను వెనక్కి ఇంటికి రప్పించడంగా ఘర్ వాపసిని సమర్ధించుకున్నారు. ఆర్ఎస్ఎస్ తర్కం ప్రకారం, ఘర్ వాపసి మత మార్పిడి కాదు. తన ప్రాచీన మతానికి తిరిగి రావడం. అందుకనే, ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛా చట్టం (2018) ఘర్ వాపసిని చట్టబద్ధం చేసింది. ఏ వ్యక్తి అయినా తన పూర్వపు మతానికి రావడాన్ని ఈ చట్టం కింద మత మార్పిడిగా పరిగణించరాదని ఆ చట్టం పేర్కొంటోంది. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారానికి తోడుగా ఈ మత మార్పిడి నిరోధక ప్రచారం సాగుతోంది. మతాంతర వివాహాలను నిలువరించడానికి, ముస్లిం యువతను రాక్షసులుగా చిత్రీకరించడానికి లవ్ జిహాద్ ప్రచారం ఉద్దేశించబడింది. లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు చట్టాలను ఆమోదించాయి. బలవంతంగా మతాన్ని మార్చడమనేది వివాహాల ద్వారా కూడా జరుగుతుందని నిర్వచిస్తున్నందున మతాంతర వివాహాన్ని కూడా కర్నాటక బిల్లు నేరంగా పరిగణించనుంది. కర్నాటక అసెంబ్లీలో ఈ బిల్లును హడావిడిగా ప్రవేశ పెట్టి, ఆమోదించారు. ఇక దీన్ని శాసన మండలిలో ఆమోదించాల్సి ఉంది. మండలిలో బీజేపీకి మెజారిటీ లేదు. కాంగ్రెస్, జె.డి(ఎస్) ఐక్యంగా ఈ బిల్లును మండలిలో వ్యతిరేకిస్తే, అప్పుడు వీగిపోతుంది. ఈ తిరోగమన బిల్లును నిలువరిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)