Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామని, డిసెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని డిసెంబర్ 17న జరిగిన టీఆర్ఎస్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు. ఇదే వరి కొనుగోలు సమస్యపై ధర్నాచౌక్ ధర్నాలో ముఖ్యమంత్రి కూడా పాల్గొని నిరసన తెలిపారు. ధర్నాచౌక్‌ను రద్దుచేసిన ముఖ్యమంత్రి అదే ధర్నాచౌక్‌ను ఆశ్రయించడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యం.
ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించేది లేదని, ఎన్నికలు నిర్వహిస్తే గెలిచిన సంఘం మళ్ళీ సమస్యలను ముందుకు తెస్తుందని, ఇప్పుడు సంక్షేమ మండళ్ళ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తు న్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ప్రకటన చేశారు. యాధృచ్చికంగానే అయినా రెండు ప్రకటనలు ఒకే రోజున, ఒకే వేదిక నుండి వచ్చాయి. రాష్ట్రంలో పాలక పార్టీగా ఉన్న టీఆర్ఎస్కు ఉన్న ప్రజాస్వామ్య హక్కులు ఆర్టీసీ కార్మికులకు ఉండవు, మేము వుండనివ్వమని ఛైర్మన్ ప్రకటన చేయడం ఏ రకంగా సమర్థించుకుంటారో వారే సమాధానం చెప్పాలి.
2019 సమ్మెను ఆసరా చేసుకొని ఆర్టీసీ కార్మికులలో ఉన్న ఐక్యతా బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కుట్రతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం, అనధికారికంగానే అయినా ఆర్టీసీలో కార్మికోద్యమాన్ని అనుమతించమని, రెండేండ్ల తరువాత కార్మికుల అభిప్రాయాలు తెలుసుకొని మళ్ళీ యూనియన్ల ఎన్నికలు నిర్వహిస్తామని 2019 డిసెంబర్ 1న జరిపిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రే ప్రకటన చేశారు. వారు చెప్పిన గడువు ముగిసినా కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎందుకు ఎత్తివేయడం లేదు?
తమ పార్టీకి అనుబంధంగా ఉన్న సంఘం సింగరేణిలో పనిచేస్తున్నది. అనేక ప్రయివేటు పరిశ్రమల ఎన్నికలలో అధికారపార్టీ అనుబంధ కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి. కానీ, ఏడు దశాబ్ధాల కాలం నుండి ఆర్టీసీలో పనిచేస్తూ, ఆర్టీసీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కార్మిక సంఘాల కార్యకలాపాలను మాత్రం అనుమతిం చకపోవడం ప్రజాస్వామ్యమా? నిరంకుశత్వమా? ప్రజలకు పాలకపార్టీ జవాబు చెప్పాలి.
ఆర్టీసీ ఎన్నికలలో గెలిచిన సంఘం సమస్యలను లేవనెత్తుతుందని, దాంతో అశాంతి పెరుగుతుంది అన్నట్లు ఛైర్మన్ అన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఏమిటో చెప్పడం లేదు. ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యక్రమాలను అనుమతించని ఈ రెండు సంవత్సరాలలో కార్మికుల సమస్యలు పెరిగాయా? తగ్గాయా? కనీసం కార్మికుల బాధలు చెప్పుకునే వేదికగా ఉన్న కార్మిక సంఘాలు లేకపోవడం తీవ్రమైన ఇబ్బందిగా ఉందని కార్మికులు బాహాటంగానే వ్యక్తం చేశారు. నిప్పును వరిగడ్డిలో వేస్తే ఆ వరిగడ్డి లోపల అంతా దగ్ధం అయ్యే వరకు తెలియనట్లు, ఇప్పుడు కార్మికులలో అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది. సంఘ కార్యకలాపాలు అనుమతించక పోయినా సమస్యలు పరిష్కారం చెయ్యాలని అనేక డిపోలలో కార్మికులు ఐక్యంగా చేసిన ఆందోళనల రూపంలో బయటకు వ్యక్తపరిచారు. ఈ వాస్తవాన్ని పాలకులు, యాజమాన్యం గుర్తించాల్సి ఉంటుంది. 2019 సమ్మె సమయంలో ముఖ్యమంత్రి, ఇపుడు ఛైర్మన్ కూడా కార్మిక సంఘాల వల్లనే ఆర్టీసీకి నష్టం వచ్చిందని, వస్తుందని నమ్మబలుకుతున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఈ ఏడేండ్లలో 2015లో 8రోజులు, 2019లో 55రోజులు జరిగినవి ప్రభుత్వ ప్రేరేపిత సమ్మెలు తప్ప మరొకటి కాదు. కార్మికుల సమస్యలు పరిష్కరించ కుండా కార్మికులను అశాంతికి గురిచేసిన పాలకులు, వారి తప్పును కార్మికోద్యమం పైకి నడుతున్నారు.
సంక్షేమ మండళ్ళ ద్వారా ఆర్టీసీలో సమస్యలను పరిష్కరిస్తున్నామని చైర్మన్ అంటున్నారు. అదే నిజమైతే ఇప్పుడు కార్మికుల కుటుంబాలు ఆనందంగా ఉండాలి కదా! మరి ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నాయి? 2018లో రిటైరైన వారికి కూడా నేటివరకు చెల్లింపులు జరగడం లేదు, రేపు మనం రిటైరైతే మన పరిస్థితి ఏమిటి అని ఎందుకు ఆందోళన చెందుతున్నారో జవాబు చెప్పగలరా? సంక్షేమ మండళ్ళకున్న చట్టబద్ధత ఏమిటి? మండళ్ళ సభ్యులను ఏ ప్రాతిపదికన నియమించారు? వారికున్న అర్హతలు ఏమిటి? ఈ రెండు సంవత్సరాలలో డిపో / రీజియన్ / రాష్ట్ర స్థాయిలో ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించారు? ఎన్ని సమస్యలు పరిష్కరించారు? అనే వివరాలను కార్మికులకు, ప్రజలకు రెండేండ్ల అనంతరం కూడా ఎందుకు చెప్పడంలేదు.
కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా ఉన్న భవిష్యనిధి నిధులు 2021 మార్చి వరకు రూ.1,240 కోట్లు పీఎఫ్ ట్రస్ట్‌కు చెల్లించకుండా ఆర్టీసీ వాడుకొన్నది. 2021 డిసెంబర్ నాటికి లెక్కిస్తే రూ.1,600 కోట్ల వరకు ఉంటుంది. కార్మికుల చేత నిర్వహించుకుంటున్న సీసీఎస్ నిధులు రూ.1,200 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం వాడుకోవడమే కాక నెలవారీ రికవరీలను నేటికీ సీసీఎస్‌కు చెల్లించడంలేదు. సీసీఎస్ బోర్డు కాలపరిమితి ముగియక ముందే ఎన్నికలు నిర్వహించి కొత్త బోర్డు ఎంపిక చేయాలని కో-ఆపరేటివ్ చట్టం చెపుతుంటే, ఎన్నికల నిర్వహణను ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు అడ్డుకుంటున్నది? 2019, 2021 పే స్కేల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని సంక్షేమ మండళ్ళు చెప్పాయా? ఐదు డిఎలు ఎందుకు అమలుచేయడం లేదు. 2019 జనవరి డిఎ అమలుచేసినా, 5నెలల ఎరియర్స్ నేటికీ ఎందుకు చెల్లించలేదు? 2014 నుండి 7 లీవ్ ఎన్క్యాష్మెంట్లు ఇవ్వనందున కార్మికుల ఆర్జిత సెలవులు మురిగిపోతున్నాయి. ఆర్పీఎస్ 2013 ఎరియర్స్‌లో 50శాతం డబ్బులకు ఇచ్చిన బాండ్లు కాలపరిమితి ముగిసి సంవత్సరం దాటినా ఆ డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు? రేషనలైౖజేషన్ పేరుతో సర్వీసులను రీ-షెడ్యూల్ చేసి పనిగంటలు పెంచుతున్నారు. పని దినాలను తగ్గిస్తున్నారు. ఓవర్ టైమ్‌ను కుదిస్తున్నారు.
బ్రడ్ విన్నర్ స్కీమ్‌లో 1,100 కుటుంబాలకు పైగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన 600 కార్మికుల కుటుంబాలకు ఇడిఎల్ఐఎస్ క్రింద ఇవ్వవలసిన 7లక్షల రూపాయలు, ఎస్బిటి స్కీమ్ క్రింద ఇవ్వవలసిన రూ.1.5 లక్షలు (మొత్తం రూ.51 కోట్లు మాత్రమే) చెల్లించడంలేదు. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్‌కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించనందున అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేకపోతున్నారు. 2020 ఏప్రిల్ నుండి నేటి వరకు ఆ చెల్లింపులు జరపలేదు.
పైన చెప్పినవన్నీ కార్మికుల సంక్షేమ పథకాలే కదా! సంక్షేమ మండళ్ళ ద్వారా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్న ఛైర్మన్ ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించడంలేదో చెప్పాలి. కార్మికోద్యమం పైన నిందలు వేయడం మానుకొని, సంక్షేమ మండళ్ళ జపం మాని తక్షణమే ఆర్టీసీలో కార్మికోద్యమ కార్య కలాపాలు అనుమతించాలి. ఆర్టీసీ అభివృద్ధికి కార్మిక సంఘాల అభిప్రా యాలు పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించి కార్మికులకు విశ్వాసం కలిగించాలి.
- పుష్పా శ్రీనివాస్