Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ప్రభుత్వ రంగం, ప్రజా సేవలు''పై ఏర్పడిన ప్రజా కమిషన్ ఇటీవల వెలువరించిన నివేదికలో మోడీ ప్రభుత్వం గుండుగుత్తగా ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రయివేటీకరించడం రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోందని సరిగ్గానే ఎత్తిచూపింది. దేశ రాజకీయ వ్యవస్థను ఏ విధంగా నిర్వహించాలో నిర్దేశించే కొన్ని నిబంధనలను, విధివిధానాలను పేర్కొన్నదే రాజ్యాంగం అని అనుకుంటే పొరపాటు. మన రాజ్యాంగం ఒకానొక సామాజిక సిద్ధాంతాన్ని వ్యక్తీకరించింది. దాని ప్రాతిపదికన రాజ్య వ్యవస్థలోని వివిధ అంగాలు ఏ విధంగా వ్యవహరించాలో పేర్కొన్నది. మన దేశం ఉనికిలోకి రావడానికి వెనుక ఉన్న పునాది విశ్వాసాలను రాజ్యాంగం వ్యక్తీకరించింది. ఇది ఒక్క మన దేశం విషయంలో మాత్రమే జరిగినది కాదు. గతంలో వలసలుగా ఉండిన దేశాలన్నింటిలోనూ జరిగింది. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ప్రజలు ప్రదర్శించిన చారిత్రిక ఐక్యత అపూర్వమైనది. ఆ విధమైన ఐక్యత వెనుక ఉన్న సామాజిక తాత్విక దార్శనికత నూతనంగా స్వతంత్రం సాధించుకున్న దేశాల రాజ్యాంగాల రూపకల్పనకు ప్రాతిపదికగా ఉంది.
''రాజ్యాంగపు మౌలిక స్వభావం''పై మన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగపు మౌలిక స్వభావాన్ని నిర్దేశించింది. ఈ ''మౌలిక స్వభావం''లోని అత్యంత మౌలికమైన అంశం రాజ్యాంగానికి ప్రాతిపదికగా ఉన్న సామాజిక తాత్వికతే. ఆ సామాజిక తాత్వికతను మార్చాలంటే మొత్తం రాజ్యాంగాన్నే మార్చి తిరగరాయాల్సిందేతప్ప ఇంకోలా కుదరదు. ఆ విధంగా మార్చాలంటే ఏ విధమైన పద్ధతిని ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందో అది కూడా మన రాజ్యాంగంలోనే పేర్కొన్నారు. కేవలం ఆ పద్ధతులన్నింటినీ పాటించడమే చాలదు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలమధ్య విస్తృతమైన చర్చలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ దేశాన్ని రూపొందించుకున్నది ప్రజలు. ఆ ప్రజలే మన రాజ్యాంగపు ప్రాతిపదికను నిర్ణయించాలి. అంతే కాని ఆ ప్రజల ఐక్యతను, అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బ తియ్యకూడదు. పార్లమెంటులో మెజారిటీ ఉన్నంతమాత్రాన ఆ మెజారిటీని ఉపయోగించుకుని రాజ్యాంగపు స్వభావాన్నే మార్చెయ్యకూడదు. అది చెల్లదు. కాని మోడీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది ఇదే. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరిస్తామని, లేదా మోనటైజ్ చేస్తామని చెప్పడం అంటే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడమే. ఇప్పటికే వ్యూహాత్మకం కాని రంగాల్లో ప్రభుత్వం ఉనికిలో లేదు. ఇప్పుడు ఇక వ్యూహాత్మక రంగాల్లో సైతం నామమాత్రంగానే మిగలబోతున్నది.
అనేక కారణాల రీత్యా మన దేశంలో ప్రభుత్వ రంగం ఉనికిలోకి వచ్చింది. విదేశీ పెట్టుబడి చేతుల్లో ఇరుక్కుపోయిన మన దేశ సహజ వనరులపై ఆ విదేశీ పెత్తనాన్ని నిర్మూలించేందుకు (ఉదా: చమురు రంగం), సాంకేతిక పరిజ్ఞానంలో స్వావలంబన సాధించడానికి, తద్వారా విదేశీ బహుళ జాతి సంస్థలపై ఆధారపడవలసిన పరిస్థితి కొనసాగకుండా చేయడానికి (ఉదా: భారీ విద్యుదుత్పత్తి యంత్రాలు), అత్యవసర సేవలను ప్రజలకు అతి చౌకగా కాని, ఉచితంగా కాని అందించడానికి (ఉదా: వైద్యం, విద్య, విద్యుత్తు వగైరా), కొన్ని రంగాలలో ప్రజా ధనాన్ని వెచ్చించి మన సంపద ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోడానికి (ఆ పని చేయడానికి తగినంత వనరులు ప్రయివేటు రంగం వద్ద లేని కారణంగా) (ఉదా: మౌలిక వసతుల కల్పన రంగం), చిన్న రైతు వ్యవసాయానికి అండగా వ్యవసాయోత్పత్తులను న్యాయమైన ధరలకు సేకరించి తద్వారా వ్యవసాయాన్ని ఆదుకోడానికి (ఉదా: భారతీయ ఆహార సంస్థ) చిన్న ఉత్పత్తుల రంగంలోని పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చడానికి (ఆ చిన్న ఉత్పత్తిదారులు తమంతట తాముగా ఆ పెట్టుబడులను సమకూర్చుకోలేరు) (ఉదా: ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా) - ఇలాంటి అనేక కారణాలు మన దేశంలో ప్రభుత్వరంగం ఏర్పడి విస్తరించడం వెనుక ఉన్నాయి. వలసవాద పెత్తనాన్నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థను బైటకు తేవడానికి జరిగిన ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వరంగం ఆవిర్భవించింది. ఇది మన రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలలో వ్యక్తమైన దృక్పధానికి అనుగుణంగానే జరిగింది. రాజ్యాంగపు స్ఫూర్తిని అనుసరించి మన దేశంలో సంక్షేమరాజ్యాన్ని నెలకొల్పాలన్న ప్రయత్నంలో భాగమే మన ప్రభుత్వ రంగం. ప్రజా కమిషన్ సరిగ్గా ఈ విషయాన్నే చెప్పింది.
ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించడం అంటే ఆ ఆస్తులని కొద్దిపాటిగా ఉండే గుత్తపెట్టుబడి దారులకో, లేకపోతే విదేశీ బహుళజాతి సంస్థలకో అమ్మివేయడమే. అంతంత విలువైన ఆస్తులను కొనగలిగిన స్తోమత వారికి కాక ఇంకెరివద్ద ఉంటుంది? దానర్థం ఏమంటే రాజ్యం తన బాధ్యతను వొదిలించుకోవడమే. ఆ క్రమంలో తిరిగి దేశ ఆర్థిక వ్యవస్థను వలసాధిపత్యం కిందకు తీసుకువచ్చే ప్రక్రియకు తలుపులు తెరవడమే. ''దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేంత ఎత్తులో ప్రభుత్వ రంగం ఉంటుంది'' అని గతంలో నేతలు ప్రకటించారు. ఇప్పుడు ఆ విధంగా శాసించగల ఆ సంస్థలను 75సంవత్సరాల స్వతంత్రం తర్వాత తిరిగి పశ్చిమ సంపన్న దేశాలకు కట్టబెట్టడం అంటే మన రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలకు కట్టుబడకుండా ద్రోహం చేయడమే. అంటే, రాజ్యాంగ రూపకల్పనకు పునాదిగా ఉన్న సామాజిక తాత్వికతకు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్న ఇంకొక సామాజిక తాత్విక దృక్పధాన్ని అమలు చేయడమే. సామ్రాజ్యవాద శక్తులకు లొంగుబాటుతో బాటు సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలన్న లక్ష్యానికి కూడా ద్రోహం చేయడమే.
ఈ ప్రభుత్వ రంగ ఆస్తులను వాటి వాస్తవ విలువ కన్నా చాలా తక్కువ విలువకే అమ్మేస్తున్నారు. అంటే ఇది ఇంకో విధంగా చెప్పాలంటే కొల్లగొట్టి సంపదను చేజిక్కించుకోవడం (ప్రిమిటివ్ అక్యుములేషన్) వంద రూ. విలువ గలిగిన ఆస్తిని ఏభై రూపాయలకే అమ్మితే అప్పుడు దేశంలో సంపదల్లో అసమానతలు ఇంకా పెరిగిపోతాయి. సంపద అసమానతలు పెరిగితే అది ఆదాయాల అసమానతలు పెరగడానికి దారి తీస్తుంది. మన రాజ్యాంగమేమో దేశంలోని ఆర్థిక అసమానతలను తగ్గించడం రాజ్యం లక్ష్యంగా ఉండాలని నిర్దేశించింది. అంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్నది కేవలం రాజ్యాంగంలో చెప్పినదానిని ఆచరించకపోవడం మాత్రమే కాదు, రాజ్యాంగం ఆదేశించినదానిని ధిక్కరించడమే. అది కూడా బరితెగించి, అడ్డగోలుగా చేస్తున్నది.
ఈ విధంగా రాజ్యాంగం నిర్దేశించిన విధానం నుండి వైదొలగేటప్పుడు ఆ రాజ్యాంగానికి వాస్తవంగా అధినేతలైన ప్రజలమధ్య విస్తృతంగా చర్చలు నిర్వహించలేదు సరికదా, అలా వైదొలగడానికి వెనక ఉన్న కారణాలనైనా కనీసం ప్రజలకు వివరించే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వ రంగాన్ని ఎందుకు ప్రయివేటీకరించ వలసి వస్తున్నది అన్న విషయాన్ని ఎప్పుడూ స్పష్టం చేయలేదు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి నామమాత్రపు పాత్ర మాత్రమే ఉండాలన్న అభిప్రాయాన్ని మోడీ బలంగా చెప్పడం తప్ప ఇంకేమీ వివరణ లేదు. వెనకటికి ఒక ఇంగ్లీషు రచనలో ఒక పాత్ర ''నేను ఏదైనా మూడు సార్లు చెప్పానంటే అదే వాస్తవం'' అని అంటుంది. మోడీ కూడా అదే విధంగా చెప్పి ఇక దానిమీద ఎటువంటి చర్చా అవసరమే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. రాజ్యాంగం పట్ల మోడీ ప్రదర్శిస్తున్న ఈ అగౌరవం, తేలిక భావం ఎంతమాత్రమూ క్షమించరానివి.
దిగువ స్థాయి అధికారులను గట్టిగా అడిగితే వారు ఇంత భారీ ప్రయివేటీకరణ కార్యక్రమం వెనుక గల కారణాలను వివరించకపోగా ప్రయివేటీకరణ వలన కలిగే ప్రయోజనాల గురించి చెపుతున్నారు. ప్రభుత్వ బడ్జెట్‌కు అవసరమైన ఆర్థిక వనరులు ఈ ప్రయివేటీకరణ ద్వారా లభిస్తాయని చెప్తున్నారు. ఈ వాదనలు ఏ విధంగా చూసినా హేతుబద్ధంగా లేవు. స్థూల ఆర్థికశాస్త్ర సూత్రాల ప్రకారం ఆర్థిక వనరుల సమీకరణ కోసం ద్రవ్యలోటు పెంచుకోడానికి, ప్రయివేటీకరణ ద్వారా వనరులను సమీకరించడానికి తేడా ఏమీ లేదు. ఎటొచ్చీ ప్రయివేటీకరణ వలన కలిగే ఇతర పర్యవసానాలే దారుణంగా ఉంటాయి.
ఇక్కడ మనం స్టాక్స్‌కి, ద్రవ్యం ప్రవాహానికి ఉన్న తేడాను చూడాలి. ద్రవ్యలోటు అంటే ప్రభుత్వ ఆదాయం కన్నా ప్రభుత్వ వ్యయం ఎంత ఎక్కువగా ఉందో సూచిస్తుంది. ఒక ప్రభుత్వం తన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు అది ఆర్థిక వ్యవస్థలో మొత్తం మీద డిమాండ్‌ను పెంచుతుంది. అప్పుడు ఆ డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచడం జరుగుతుంది. అందువలన అదనంగా ఉపాధి కల్పన జరుగుతుంది. అలా ఉత్పత్తిని ఒకవేళ పెంచడం జరగకపోతే ధరలు శ్రామిక ప్రజల ఆదాయాలతో పోల్చుకున్నప్పుడు సాపేక్షంగా పెరుగుతాయి. ఈ రెండు విధాలలో ఎలా జరిగినా, అంతిమంగా పెట్టుబడిదారుల వద్ద అదనంగా సంపద చేరుతుంది. అలా చేరిన అదనపు సంపదనుండి ప్రభుత్వం రుణం తీసుకోవచ్చు. ప్రభుత్వం చేసిన అదనపు వ్యయంతో సమానంగా ఈ రుణం ఉంటుంది (వాదన కోసం కాసేపు విదేశీ లావాదేవీలను పక్కన పెడదాం). అంటే అంతిమంగా ద్రవ్యలోటు పెంచి వ్యయం చేయడం వలన సంపదలో అసమానతలు పెరుగుతాయి.
ఇప్పుడు ప్రభుత్వ రంగాన్ని అమ్మి ప్రభుత్వం ఖర్చు చేస్తే అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తేడా అల్లా ఏమంటే ద్రవ్యలోటు పెంచినప్పుడు ప్రభుత్వం బ్యాంకులనుండి రుణం తీసుకుంటుంది. అదే బ్యాంకుల నుండి ఇప్పుడు పెట్టుబడిదారుడు ప్రభుత్వ రంగాన్ని కొనడానికి రుణం తీసుకుంటున్నాడు. ఆ సొమ్మును ప్రభుత్వానికి చెల్లిస్తున్నాడు. ప్రభుత్వం అదనపు వ్యయం కోసం రుణాలను తీసుకుంటే అందుకు అవసరమైన సొమ్ము కోసం బ్యాంకులు బాండ్లను విడుదల చేస్తాయి. ఆ బాండ్లను పెట్టుబడిదారులు కొంటారు. అదే అదనపు వ్యయం కోసం ప్రభుత్వ రంగాన్ని అమ్మితే పెట్టుబడిదారుడి దగ్గర బాండ్లకు బదులు ప్రభుత్వ రంగ ఆస్తులు చేరుతాయి. ఒకసారి ప్రయివేటు పెట్టుబడిదారుడి చేతిలో పడితే ఇక ఆ సంస్థ ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రయివేటు లాభం కోసం మాత్రమే నడుస్తుంది.
ద్రవ్యలోటు పెరగడం అంటే ప్రభుత్వానికి ఉన్న అప్పు మరింత పెరిగిపోవడమే కదా? అదే ప్రభుత్వ రంగ ఆస్తుల్ని అమ్మితే ప్రభుత్వానికి ఉన్న అప్పు పెరగదు కదా? అని వాదించేవారున్నారు. అప్పు పెరగకపోతే అదనపు వడ్డీ భారం కూడా ఉండదు అని వారు అంటారు. ఈ వాదన చేసేవారు ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్మడంతోబాటు ఆ యా పరిశ్రమలద్వారా ప్రతీ ఏటా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రభుత్వం కోల్పోతున్నది. ఆ విధంగా ఆదాయాన్ని కోల్పోవడం అన్నా, అదనంగా వడ్డీ చెల్లించడమన్నా నికరంగా ఫలితం ఒకటే. అటు అదనంగా వడ్డీలు చెల్లించినప్పుడూ ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఇటు ప్రభుత్వ రంగ ఆస్తుల్ని అమ్మినప్పుడూ వాటిపై వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నది. ఇలా ఆదాయాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఆదాయాల మీద, సంపద మీద అదనపు పన్నులను విధించాలి. అంతే కాని ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం కాదు మార్గం.
ఆ విధంగా ఒక తప్పుడు ఆర్థిక అవగాహనతో మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలో నిబిడీకృతమైవున్న మౌలిక సామాజిక తాత్వికతను పూర్తిగా విడిచిపెడుతున్నది. తన ఆశ్రితులైన కొద్దిమంది పెట్టుబడిదారులకు దేశ సంపదను కట్టబెడుతున్నది. తన ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం అంటూ తరచూ మోడీ వాగుతూంటాడు. ఇలా గుండుగుత్తగా ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు కార్పొరేట్లకు కట్టబెట్టడం కన్నా పెద్ద అవినీతి ఇంకోటి ఉంటుందా?
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్‌పట్నాయక్