Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృజనాత్మక కళానైపుణ్యానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యా నికి ప్రతీక చేనేతరంగం. వస్త్ర పరిశ్రమకు చేనేత రంగమే మూలం. అది భారతీయ ఆత్మకు ప్రతీక. అలాంటి చేనేత రంగం నేడు మనుగడ కోసం జీవన పోరాటం చేస్తున్నది. లక్షల సంఖ్యలో కార్మికులు పొట్ట చేత పట్టుకుని ఇతర వృత్తుల బాట పడుతుండటం ఇలాగే కొనసాగితే ఇంకోన్నేళ్లలో అద్భుత కళ అంతర్థానమవుతుందని జాతీయ చేనేత జనగణన అధ్యయనం చెబుతోంది. పుండు మీద కారం చల్లినట్టుగా అంతంతమాత్రాన నడుస్తున్న ఈ రంగానికి జీఎస్టీ పిడుగు పెనుప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఇప్పటికి ఐదుశాతం ఉన్న జీఎస్టీని మరో 7 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచడం రాష్ట్రంలోని చేనేత రంగంపై పెనుప్రభావం చూపనుంది.
చేయూతలేని చేనేత రంగం
ప్రస్తుతం భారతదేశంలో 38లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 40,533 మంది చేనేత కార్మికులు, 35,588 పవర్ లూమ్స్ కార్మికులు, 615 వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి. ఒకప్పుడు దేశంలో 290 పైగా జిల్లాల్లో విలసిల్లిన చేనేత రంగం నేడు 80జిల్లాలకు కుదించుకుపోయింది. దేశంలో గడిచిన మూడేండ్లలో చేనేత పథకాల కింద లబ్ధి పొందిన కార్మికుల సంఖ్య కూడా తక్కువే. ఆకలిచావులు బలవన్మరణాలు వలసలకు చిరునామాగా మారిన ఈ చేనేత రంగం అభివృద్ధికి జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం, నూలు సరఫరా పథకం, చేనేత నేత సమగ్ర సంక్షేమ పథకం వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన కూడా మౌలిక వసతుల పరికల్పన, సాంకేతిక శిక్షణ, చేనేత కార్మికులకు తగిన ఉపాధి మొదలైనవి అందని ద్రాక్షగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో చేయూత చేనేత మిత్ర లాంటి పథకాలున్నా అమలులో నిధుల కొరత కారణంగా చేనేత రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కార్మికుల కష్టాన్ని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే విధానాలు ఏవీ చేనేత రంగంలో రాకపోవడం, వారు నేసే వస్త్రాల విక్రయాలకు అనుగుణమైన మార్కెట్ లేకపోవడం వలన చేనేత రంగం నష్టాల బాటలో పయనిస్తోంది. ఇప్పటికీ పాతకాలపు మగ్గాలు రట్నాలు కనిపిస్తాయి. రంగులు రసాయనాలు కలిపే పద్ధతిలో మార్పు రాలేదు. మాస్టర్ వివర్స్ వాళ్ళు సూచించిన ప్రకారమే వారు వస్త్రాలు నేయాలి. ఈ మేరకు వచ్చే ప్రతిఫలాన్ని తీసుకోవాలి. సొంతంగా వస్త్రాలను నేసినా వాటిని వ్యాపారులు నిర్ణయించిన ధరలకే దుకాణాలలో విక్రయించాలి. తెలంగాణ నేలపై పోచంపల్లి వరంగల్ గద్వాల్ నారాయణపేట వంటి పట్టణాలు పట్టుచీరలు గొల్లభామ చీరలకు ప్రసిద్ధి. చేనేత కార్మికులకు సరైన సహకారం లేక పెట్టుబడి వ్యయం అందక ఇతర రంగాలకు వలస పోతున్నారు. వరంగల్లో మెగా జౌళి పార్క్ సిరిసిల్లలో మరమగ్గాల పార్క్ ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి.
జిఎస్టి పిడుగుపాటు...
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేనేత జౌళి ఉత్పత్తులపై జిఎస్టిని ఐదు శాతం నుండి 12శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఈ పెంపు నిర్ణయం చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయనుంది. ఒక చేనేత కార్మికుడు నెల కష్టపడితే దానికి వచ్చేది కేవలం మూడువేల రూపాయలు మాత్రమే అని జాతీయ చేనేత గణాంకాలు చెబుతున్నాయి. ఈ జీఎస్టీ భారంతో కార్మికులకు ఆ జీవనభత్యం కూడా రాకుండా పోతుంది. రాష్ట్రంలో చేనేత కార్మికులకు పెద్ద దిక్కుగా మారిన ప్రభుత్వ సహకార సంస్థ (టెస్కో) ప్రస్తుతం రాష్ట్రంలో 250కోట్ల వరకు క్రయ విక్రయాలు జరుపుతుంది. జీఎస్టీ భారంతో కొనుగోలు అమ్మకాలు లేక నష్టాల బాట పట్టనుంది. జీఎస్టీ పెరుగుదల వల్ల వినియోగదారుల పైన కూడా భారం పడుతుంది. ధర తక్కువగా ఉన్నప్పుడే వినియోగదారులు అవసరమైతేనే కొంటారు. ఇకపై అవసరమైనా కొనుగోలుకు ముందుకు రాని పరిస్థితి దాపురిస్తుంది. వస్త్రాల ధరలు పెరగడం వల్ల ఆ భారం వినియోగదారులపై పడుతుంది.
- అంకం నరేష్
సెల్:6301650324