Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తెలంగాణ రాష్ట్రంలో ఇకపై జోనల్ వ్యవస్థ ఉండదు, రాష్ట్రమంతా ఒకే జోన్'' అంటూ నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం జోన్ల పునర్వవ్యస్థీకరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎవరైనా, ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగం చేసుకోవచ్చు. తారతమ్యాలులేని సమానావకాశాల విధానం అంటూ చేసిన ప్రకటన 610జీవో స్ఫూర్తికి విరుద్ధమైనది. వెనుకబడిన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేయబడిన జోనల్ వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సిందేనని చాలా మంది మేధావులు, ప్రజాస్వామ్య కాముకులు సూచన చేశారు ఆనాడు. నీళ్లు, నిధులు, నియామకాలలో వెనుకబాటుకు గురైందనే ప్రధాన కారణంగానే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఉద్భవించింది. అయితే... ఏర్పడిన కొత్త రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చెందలేదు. వెనుకబడిన ప్రాంతాలను, అభివృద్ధి చెందిన జిల్లాలను ఒకే గాటన కట్టడం వలన అసమానతలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు హితబోధ చేశారు. ఏది ఎమైనా కాలక్రమంలో.. మరో మూడు సంవత్సరాల అనంతరం ప్రభుత్వం జోనల్ వ్యవస్థ పట్ల తన అభిప్రాయాన్ని సమీక్షించుకుని, జోన్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా ఉండాలని ప్రతిపాదించింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 33జిల్లాలను ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా జోన్లు, మల్టీ జోన్లుగా వర్గీకరిస్తూ ఆమోదముద్ర లభించింది.
నూతన జోనల్ విధానం ద్వారా 95శాతం స్థానికులకు, 5శాతం ఓపెన్ కేటగిరీ కింద ఉద్యోగ నియామకాలు కల్పించే అవకాశం ఉంది. గతంలో ఉన్న 80:20 నిష్పత్తిని సవరిస్తూ స్థానికతకు ప్రోత్సహం, అవకాశాలు మరింత పెంచడం హర్షణీయం. రాష్టపతి ఉత్తర్వుల అమలుకోసం మొదట జిల్లాల వారిగా ఉద్యోగుల విభజన జరగాలి. జనాభా ప్రాతిపదికన పోస్టుల నిర్థారణ జరగాలి. స్థానికత, సీనియారిటీ ఆధారంగా ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు పంపి, ఏర్పడిన మొత్తం ఖాళీల వివరాలను లెక్కించాలి. ఖాళీల భర్తీ కోసం ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇది ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం. దీనికోసం జిల్లాల వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. ఉద్యోగులను జిల్లాల వారీగా సర్దుబాటు చేయడం కోసం మార్గదర్శకాలను రూపొందిస్తూ 317జీవోను విడుదల చేసింది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడిందో.. ఆ లక్ష్యానికి 317జీఓ తూట్లు పొడిచింది. స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సీనియార్టీని మాత్రమే ఆధారంగా చేసుకుని నూతన జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు జరగాలని నిర్దేశించింది. జూనియర్లు, సీనియర్లకు మధ్య పంచాయతీ పెట్టింది. జూనియర్లను బలవంతంగా, నిరంకుశంగా ఇతర జిల్లాలకు కేటాయించే ప్రక్రియకు తెరలేపింది. తాను పుట్టి పెరిగిన సొంత జిల్లాను వదిలి, కుటుంబం, బంధుత్వానికి దూరమై శాశ్వత ప్రాతిపదికన ఇతర జిల్లాలకు కేటాయించడం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన రేగింది. తమ జిల్లాకు తిరిగి ఎప్పుడొస్తామో? ఎలా రాగలమో? వివరణ ఇవ్వకుండా గందరగోళ పరిచే ప్రభుత్వ చర్యల పట్ల ఉద్యోగుల్లో ఉద్రేకం తారాస్థాయికి చేరింది. మరోపక్క ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను పనిచేస్తున్న వారి సంఖ్య ఆధారంగా పాత పది జిల్లాలలోని కొత్త జిల్లాలకు దామాషా పద్ధతిలో పంచాలన్న నిబంధన ఏజెన్సీ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉన్న జిల్లాలపై మరింత ప్రభావాన్ని చూపింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు అధికంగా నియమించబడిన జిల్లాల నుండి ఇతర జిల్లాల్లో కోటాను భర్తీ చేసే లక్ష్యంతో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను కదిలించడం వల్ల స్థానికతతో పాటు సీనియారిటీ అంశం కూడా పక్కదారి పట్టినట్లైంది. 317జీవోలోని సీనియారిటీ అనే మౌలికాంశం నీరుగారిపోయింది. కోటా భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కొత్త జిల్లాలకు పంపడం వల్ల వారు తమ సొంత జిల్లాలకు దూరమయ్యారు. దీంతోపాటు వారి స్థానాలను భర్తీ చేసే ఉద్దేశంతో ఇతర జిల్లాల నుండి సమాన సంఖ్యలో జనరల్ కేటగిరీ ఉద్యోగులకు స్థాన చలనం కలిగించడం వల్ల వారు కూడా తమ సొంత ప్రాంతాన్ని వదులుకోవాల్సిన దుర్గతి, సీనియారిటీకి అర్థంలేని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగులు ఆందోళనకు, అభద్రతకు గురై పోరాట బాట పట్టారు.
సుదీర్ఘమైన ప్రక్రియను సానుకూల దృక్పథంతో, సజావుగా నిర్వహించాల్సిన ప్రభుత్వం హడావుడిగా షెడ్యూల్ ప్రకటించి, అమలుకు పూనుకోవడంతో జిల్లా అధికారులపై ఒత్తిడి తీవ్రమైంది. జాబితాలను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరించి, లోపాలను సరిచేసి, ఖచ్చితమైన కేటాయింపులు చేయాల్సిన అధికారులు క్రమాన్ని, శాస్త్రీయతను, నిబంధనలను పాటించలేదు. జాబితాలు తప్పుల తడకగా తయారయ్యాయి. కేటాయింపులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. సీనియర్ ఉద్యోగులు కూడా నష్టపోయిన వారి జాబితాలో చేరిపోయారు. కేటాయింపు ప్రక్రియపై పూర్తి స్థాయి అవగాహనలేని జిల్లా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగుల పాలిట మరణశాసనం లిఖించారు.
ఉద్యోగుల సర్దుబాటు కోసం సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన ఉత్తర్వులనే విద్యాశాఖకు కూడా వర్తింపచేయడం వల్ల ఉపాధ్యాయులకు తీరని నష్టం ఏర్పడింది. పరిమితమైన ప్రభావం పడే ఉద్యోగులను, వేల సంఖ్యలో జిల్లాలు మారే అవకాశం ఉన్న ఉపాధ్యాయులను ఒకే గాటన కట్టి కేటాయింపులు జరపడం సరైనది కాదు. సీనియారిటీలో, కేటాయింపుల్లో నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభ్యంతరాలకు, ఫిర్యాదులకు అవకాశం కల్పించినా.. వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తారనే క్లారిటీ లేదు. ఎవరు పరిష్కరిస్తారనే గ్యారెంటీ లేదు. పైగా స్వీకరించిన ఫిర్యాదులపై మొదట నిర్ణయం తీసుకోకుండా, వాటిని తొలుత పరిష్కరించకుండా నూతన జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టింగుల షెడ్యూల్ ప్రకటించడమంటే ఫిర్యాదులను గాలికొది లేసినట్లేగా..! అధికారుల ఏమరుపాటుతోనో, సాంకేతిక కారణాల వల్లనో, అనుయాయుల ప్రయోజనాల కారణంగానో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా..? నూతన స్థానంలో జాయిన్ అవ్వమని ఒత్తిడి చేయడమంటే నష్టపోయిన ఉద్యోగులు పెట్టుకున్న ఫిర్యాదులను పెంటకుప్పలో విసిరేసినట్లేగా..! కన్నబిడ్డలవలె కంటికి రెప్పలా కాచుకోవాల్సిన ప్రభుత్వం.. కక్ష కట్టి కత్తులు దూసేలా వ్యవహరించడం భావ్యమా..? అర్హత కలిగి ఉండి అంధకారంలోకి నెట్టివేయబడిన అమాయకుల గోడును పట్టించుకోకపోవడం ఆమోదయోగ్యమా? ఆలోచించాల్సిన విషయం.
ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఉద్యోగులు, భావిభారత పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులు సంతృప్తిగా ఉండేలా చూసుకోవడం ప్రభుత్వం మౌలిక బాధ్యత. 317 జీవోను సవరించి ఉద్యోగుల సీనియారిటీతో పాటు స్థానికతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యక్తుల వల్లనో, వ్యవస్థ వల్లనో నష్టపోయిన ఉద్యోగుల ఫిర్యాదులను స్వీకరించడానికి సమయం ఇవ్వాలి. అంశాల వారీగా వాటిని క్రోడీకరించి, పరిష్కరించాలి. నూతనంగా జిల్లాలకు కేటాయించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భౌతికంగా, కౌన్సిలింగ్ విధానం ద్వారా స్థానాలను కేటాయించాలి. భార్యాభర్తలు ఒకే జిల్లాలో ఉండే విధంగా అవకాశం కల్పించాలి. వివిధ జిల్లాల నుండి మ్యూచువల్ సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలి. జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు వల్ల ఏర్పడిన ఖాళీల భర్తీ కోసం నియామక నోటిఫికేషన్లు ఇవ్వాలి. నూతన నియామకాలు భర్తీ చేసే ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలి. నష్టపోయిన ఉద్యోగుల కన్నీళ్లు తుడిచి, న్యాయం చేసి, వారికి స్వాంతన చేకూర్చాలి. జిల్లాలు మారిన జూనియర్ ఉద్యోగులను భవిష్యత్తులోనైనా తమ జిల్లాకు తిరిగి రప్పిస్తామనే భరోసానివ్వాలి. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని పలుమార్లు బాహాటంగా ప్రకటించుకున్నట్లుగా చేతల్లో కూడా నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే...
- వి. అశోక్
సెల్:9493001171