Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదరపోషణార్ధం బహుకృత వేషం అన్నట్లుగా ఉత్తరప్రదేశ్ విధాన సభ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ నేతలు చేయని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, చెప్పని మాటలు లేవు. పగలంతా భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్న సభల్లో మాట్లాడుతూ సాయంత్రానికి కరోనా నిరోధ చర్యల గురించి బోధలు చేస్తున్నారనే విమర్శను ప్రధాని నరేంద్రమోడీ మూటగట్టుకున్నారు. ప్రయాగసభలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో యోగిసర్కార్ సాధించిన విజయాల్లో మహిళా సాధికారత ఒకటని చెప్పారు. జర్మన్ నాజీ మంత్రిగా పని చేసిన గోబెల్స్ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తెలియదు గానీ ఈ వార్తను చూసి ఎలా స్పందించి ఉంటాడో తెలియదు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే అదే నిజం అవుతుందన్న తన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకపోతున్నవారు తామర తంపరగా పెరుగుతున్నందుకు కచ్చితంగా సంతోషపడి ఉంటాడు. ప్రపంచ బాంకు సమాచారం ప్రకారం 2005లో మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 26శాతంగా ఉందని, 2019నాటికి అది 20.3శాతంగా ఉంది. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో 30.5, శ్రీలంకలో 33.7శాతం మంది ఉన్నారు. కరోనా కారణంగా మనదేశంలో 2020 ఏప్రిల్- జూన్లో 15.5శాతానికి తగ్గింది. ఇక యోగి ఆదిత్యనాధ్ ఏలుబడిలో తొమ్మిదిశాతం, బీహార్లో ఐదుశాతం మాత్రమే అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
దేశం సంపద్వంతం కావటానికి ఇప్పుడు అమలు చేస్తున్న సంస్కరణలు ఏమాత్రం చాలవని కార్పొరేట్ శక్తులు వత్తిడి చేస్తున్నాయి. దానికి అనుగుణంగానే రద్దు చేసిన సాగు చట్టాలను తిరిగి పునరుద్దరిస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఇటీవలనే చెప్పారు. దేశమంతటి నుంచి నిరసన తలెత్తటంతో అబ్బే అలాంటిదేమీ లేదంటూ ప్రకటించిన అంశం తెలిసిందే. ఏటా రెండు కోట్ల మంది యువతీ, యువకులు మాకు పని కావాలంటూ రోడ్లమీదకు వస్తున్నారు. వారికి పని దొరకటం లేదు. కేంద్రంలో మెజారిటీ రాష్ట్రాల్లో ఏలుబడిలో ఉన్నది బీజేపీ, అచ్చేదిన్ అని చెప్పినప్పటికీ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుగుతున్నాయి. అచ్చేదిన్ పేరుతో నరేంద్రమోడీ 2014లో అధికారానికి వచ్చినప్పుడు ఎనిమిది శాతంపైగా వృద్ధి రేటు ఉంది. కరోనాకు ముందు నాలుగు శాతానికి పడిపోయింది. వృద్ధి రేటు ఎంత ఉన్నప్పటికీ అది ఉపాధి రహితంగా ఉండటమే అసలు సమస్య. కార్పొరేట్ల లాభదాహం నానాటికీ పెరుగుతోంది. కరోనాలో జనాల పరిస్థితి దిగజారితే వారి లాభాలు ఏమాత్రం తగ్గలేదు. అయినా అసంతృప్తి.
కెనడాలోని ఫ్రాసర్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచికలో 165దేశాలకు గాను మనదేశం ఇంతకు ముందున్న 103వ స్ధానం నుంచి 2021లో 108వ స్ధానానికి దిగజారింది.దీనికిగాను పరిగణనలోకి తీసుకొనే అంశాలన్నింటా పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున ప్రయివేటు రంగం వృద్ది చెందటం లేదట.సంస్కరణల గురించి కబుర్లు చెబుతున్నా పరిస్థితి ఇలా ఉంది. కీలకమైన సేవారంగాలను సరళతరం చేయటాన్ని నిలిపివేసినట్లు నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్కువ ధరలకు సరకులను అందచేసేందుకు బహుళజాతి రిటైల్ కంపెనీలను అనుమతించటం లేదన్నది ఒకటి. సోషలిస్టు విధానాలను అనుసరిస్తున్నందున మరింతగా పరిస్థితి దిగజారుతుందని కెనడా సంస్థ చెప్పిందంటే ఇప్పుడున్న వాటి నుంచి కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గి మొత్తంగా కార్పొరేట్లకు అప్పగించాలని కోరుతున్నారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్వీస్(ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్ బేస్డ్ ఎంప్లాయిమెంట్ సర్వే) తొలి నివేదిక ప్రకారం 2021 ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉపాధి తొమ్మిది రంగాలలో 3.08 కోట్లకు పెరిగినట్లు పార్లమెంటుకు తెలిపారు. 2013-14లో 2.37 కోట్లతో పోల్చుకుంటే వృద్ది రేటు 29శాతం అని చెప్పారు. వాస్తవం ఏమిటి? 2021 అక్టోబరులో కార్మికశక్తి భాగస్వామ్య రేటు 40.41(ఎల్పిఆర్) శాతం ఉండగా నవంబరు నాటికి 40.15కు పడిపోయింది. కరోనాకు ముందు 43శాతం ఉంది, రెండు సంవత్సరాలు రెండు తరంగాల కారణంగా కనిష్టంగా 36శాతానికి పడిపోయి తిరిగి కోలుకున్నప్పటికీ కరోనా ముందు స్థితికి చేరుకోలేదు. ప్రపంచబాంకు, ఐఎల్ఓ గణాంకపద్ధతి ప్రకారం 2020లో ప్రపంచ సగటు ఎల్పీఆర్ 58.6 కాగా మనది 46శాతం మాత్రమే. మనకంటే అధ్వాన్నంగా ఉన్న దేశాలు మరొక 17 మాత్రమే అని ఐఎల్ఓ చెప్పింది. చిత్రం ఏమిటంటే వాటిలో చమురు సంపదలున్న ఇరాన్, ఇరాక్ వంటి దేశాలతో పాటు అంతర్యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న సిరియా, లెెబనాన్, ఎమెన్ వంటివి ఉన్నాయి. అత్యంతవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా పేర్కొంటున్న మనం ఈ రెండు తరగతులకూ చెందం అన్నది స్పష్టం. సీఎంఐఈ అంచనాల ప్రకారం 40శాతానికి అటూ ఇటూ అంటే ఐఎల్ఓ కాస్త ఉదారం గా లెక్కించింది తప్ప పరిస్థితి దారుణంగా ఉందన్నది స్పష్టం.
కరోనాకు ముందు దేశం మొత్తం మీద ఉపాధిలో పట్టణ వాటా 32శాతం కాగా 2021అక్టోబరులో 31.5శాతం ఉండగా నవంబరులో 31.2శాతానికి తగ్గింది. గ్రామాలతో పోల్చుకుంటే పట్టణాలలో సంఘటిత రంగం ఉంటుంది కనుక కాస్త మెరుగైన వేతనాలుంటాయి. అవే తగ్గాయంటే దాని ప్రభావం మొత్తం మీద ఉంటుంది. మొత్తంగా నవంబరు నెలలో అదనంగా వచ్చిన ఉపాధి 14లక్షలు, పట్టణాల్లో 9లక్షలు తగ్గినా గ్రామాల్లో 23లక్షలు పెరిగినందున ఈ పెరుగుదల ఉంది. నెలవారీ వేతనాలు పొందే వారి సంఖ్య తగ్గుతుండటం ఆందోళనకరం. 2019 నవంబరులో నెలవారీ వేతన జీవుల సంఖ్యతో పోలిస్తే 2021లో 9.7శాతం తగ్గారు.ప్రస్తుతం ఒమైక్రాన్ కరోనా వైరస్ తరంగం ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా భయపెడుతున్నది. ఆర్ధికంగా కోలుకోవటం కష్టమనే అంచనాలు వెలువడతున్నాయి.
గత మూడు దశాబ్దాల సంస్కరణల ఫలితాలు, పర్యవసానాలను చూస్తే జీడీపీ వృద్ది కనిపిస్తుంది, జనాభావృద్ధి రేటు తగ్గుతోంది. కానీ ఉపాధి వృద్ధి రేటు జనాభాకు అనుగుణంగా లేదు. ముఖ్యంగా గత దశాబ్దికాలంలో ఉపాధి రహిత వృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయం గిట్టుబాటు కాని స్ధితిలో ఆ రంగంలో యంత్రాల వాడకం గణనీయంగా పెరిగి ఉపాధి తగ్గింది. ఆ మేరకు పట్టణాలలో పెరగలేదు. పెరిగింది కూడా అసంఘటిత రంగంలో ఉంది.ప్రపంచీకరణ కారణంగా ఐటి, అనుబంధ రంగాలలో కొత్త ఉపాధి అవకాశాలు వచ్చిన్పటికీ అవి నైపుణ్యం ఉన్నవారికే పరిమితం అన్నది తెలిసిందే. 2005-10 మధ్య సంఘటిత రంగంలో నిఖరంగా పెరిగిన ఉద్యోగాలు పదిలక్షల మాత్రమే కాగా 60లక్షల మంది ఉద్యోగార్ధులు మార్కెట్లో చేరారు. తామర తంపరగా వెలసిన ప్రయివేటు విద్యా సంస్థల నుంచి ఇంజనీర్లు, ఎంబిఏ, ఎంఎ పట్టాల వారు లక్షల సంఖ్యలో తయారయ్యారు. మన అవసరాలకు మించి వారిని ఉత్పత్తి చేస్తున్నాము. వారిలో కొందరి నైపుణ్యం ప్రశ్నార్థకం, అంతకంటే తక్కువ విద్య, నైపుణ్యం ఉన్నవారికి తగిన ఉపాధి అవకాశాలు పెరగలేదు.
ఇతర అనేక దేశాలతో పోల్చితే మన దేశంలో యువజనం ఎక్కువగా ఉన్నమాట నిజం. వీరికి కావాల్సింది ఉపాధి తప్ప మాటలు కాదు. సమగ్రమైన సమాచారం అందుబాటులో లేదు. వివిధ సంస్థల అంచనాల ప్రకారం 2004-12 సంవత్సరాలలో ఏటా 25లక్షల ఉద్యోగ అవకాశాలు పెరిగితే 2012-16 మధ్య 15లక్షలకు తగ్గాయి. ఏదో ఒక సామాజిక భద్రత ఉన్న రెగ్యులర్ కార్మికులు 2011-16 కాలంలో 45 నుంచి 38శాతానికి తగ్గారు. సంస్కరణల కాలంలో మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు ఎక్కువ భాగం సేవా రంగానికే వచ్చాయి. మిగిలినవి కార్మికులు తక్కువగా ఉండే పరిశ్రమలకు వెళ్లాయి. జీడీపీలో సేవారంగం వాటా గణనీయంగా పెరిగింది కానీ ఆ మేరకు ఉపాధి పెరగలేదు. విధానపరమైన లోపాలు, మన పరిస్థితులకు అనుగుణంగా పథకాలను రూపొందించలేదనే లోపాన్ని అంగీకరించేందుకు ఎవరూ సిద్దం కావటం లేదు. అధికారంలో ఎవరున్నా బడా పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు జరిపారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ రాయితీలు, సదుపాయాలు కల్పించారు తప్ప ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే వైపు దృష్టి పెట్టలేదు. అందుకు అవకాశం ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను ఉపేక్షించారు. చివరకు వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు ఇవ్వాల్సిన సొమ్మును కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. సంఘటిత వస్తూత్పత్తి రంగంలో 25శాతం ఉపాధి తగ్గటానికి పారిశ్రామిక వివాదాల చట్టమే కారణమని ప్రపంచబాంకు మేథావులు సూత్రీకరించారు. కార్మికుల ఉపాధి రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్న కారణంగా యజమానులు కార్మికుల ఖర్చు తగ్గించుకొనేందుకు ఎక్కువ పెట్టుబడి అవసరమైన పద్ధతులను ఎంచుకున్నారట. పోనీ అలా ఖర్చు తగ్గించుకొని ఎగుమతులు చేశారా అంటే అదీ లేదు కదా! ఈ పేరుతో కార్మిక చట్టాలకే ఎసరు పెట్టి బానిసలుగా మార్చేందుకు పూనుకున్నారు.
2017-18లో నాలుగున్నర దశాబ్దాల రికార్డు స్ధాయికి 6.1శాతం నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సర్వే వివరాన్ని 2019 ఎన్నికల ముందు తొక్కిపెట్టారు, అది తప్పుల తడక, ఉపాధి గురించి లెక్కలు సరిగా వేయలేదన్నారు. ఎన్నికలు ముగిశాక గుట్టుచప్పుడు కాకుండా అదే నివేదికను ఆమోదించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ నిరుద్యోగం ఉంది. 2019-20లో 8.6 కోట్ల మంది నెలసరి వేతన జీవులుండగా 2021 ఆగస్టు నాటికి 6.5కోట్లకు తగ్గారు. వీరికి అదనంగా నిరుద్యోగులు తోడవుతారు. మనకున్న యువ శ్రమశక్తితో ప్రపంచాన్నే మన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలమని చెప్పేవారున్నారు. అది ఒక కోణంలో చూస్తే నిజమే. చైనా అలాంటి ఫలితాన్ని సాధించింది. మంచి ఉద్దేశ్యాలే కాదు, అందుకు తగిన విధానాలు కూడా ఉండాలి. లేనట్లయితే అదే అవకాశం ప్రతికూలంగా కూడా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో 54శాతం మంది పాతికేండ్ల లోపువారే, మరోవిధంగా చూస్తే 62శాతం మంది 15-59 ఏండ్ల మధ్య ఉంటారు. వీరికి తగిన నైపుణ్యాలను సమకూర్చి ఉపాధి చూపకపోతే పక్కదారులు పట్టే అవకాశం ఉంది. సిఎంఐసి సమాచారం ప్రకారం 2016లో ఉపాధిలో ఉన్నవారి సంఖ్య 40.73 కోట్ల మంది, 2018 -19నాటికి 40.09 కోట్ల మందికి తగ్గారు. ఆర్థికవ్యవస్థ పెరిగితే ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి జీడీపీని తీసుకుపోతామని చెప్పినా, నిజంగా తీసుకుపోయినా యువతీ, యువకులకు ఒరిగేదేమిటి? 2030 నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి 44 నుంచి 30శాతానికి తగ్గుతుందని అంచనా, ప్రస్తుత అంచనా ప్రకారం 2030నాటికి 14.5 కోట్ల మందికి వ్యవసాయేతర రంగాల్లో పని కల్పించాల్సి ఉంటుంది. వారందరికీ ఉపాధి కల్పించే విధానాలను అవలంభించకపోతే తలెత్తే పర్యవసానాలకు బాధ్యులెవరు? అందుకు గాను ఏటా 8-9శాతం చొప్పున వృద్ధి రేటు ఉండాలి. అదీ ఉపాధి సహితమైనది, అది జరగాలంటే విధానాలను అందు కనుగుణంగా మార్చాలి, అదే ఎలా?
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288