Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదలతో పేదల కొనుగోలు శక్తి రోజురోజుకూ క్షీణిస్తున్నది. అధిక ధరలకు అడ్డుకట్ట వేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో చోద్యం చూస్తున్నాయి. గత మూడేండ్లుగా పాలకులు ఇష్టానుసారంగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం మూలంగా పేద, మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతున్నది. పెరిగే ధరలతో పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రత్యేకించి కరోనా మొదటి వేవ్ నుంచి నేటి వరకు ధరలు హద్దు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. మరోపక్క పేదలు, వ్యవసాయ కార్మికులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పనులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనాకు ముందు ఉన్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొచ్చిన ప్రజలు, కరోనా తరువాత ఉన్నఫలంగా అవికూడా పోవడంతో అప్పులు తెచ్చుకొని జీవనం కొనసాగించే పరిస్థితి నెలకొంది. తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తట్టుకోలేక అనేక కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో పేదల పరిస్థితి చావో రేవో అన్న చందంగా మారింది.
మూడేండ్లలో 234సార్లు పెరిగిన పెట్రోల్,
218 సార్లు పెరిగిన డీజిల్ ధరలు
కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్పై కొత్త పద్ధతిలో రోజుకు 10, 20 పైసలు పెంచుతూ దొంగచాటుగా ప్రజలపై భారాలు మోపుతూ పీల్చి పిప్పి చేస్తున్నది. మూడేండ్లలో 234 సార్లు పెట్రోల్, 218సార్లు డీజిల్, 21 సార్లు వంట గ్యాస్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచింది. చమురు ధరలు పెరిగినప్పుడల్లా రవాణా ఖర్చులు పెరిగి అన్ని సరుకుల ధరలు అనివార్యంగా పెరుగుతాయి. అలాంటి ఇలా వరుసగా ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచడంతో ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నాయి. దీంతో నేలపై ప్రజల జీవితం పెను భారంగా మారింది.
ఆకాశాన్నంటిన గృహ వినియోగ వస్తువుల ధరలు
గృహ వినియోగ వస్తువుల ధరలు పెరిగి ప్రజలు లబోదిబోమంటున్నారు. మరోపక్క అప్పులు తెచ్చి ఇండ్లు నిర్మించుకోవాలని అనుకున్న మధ్యతరగతి ప్రజలపైనా ధరల భారం పడుతున్నది. ప్రధానంగా సిమెంటు, ఐరన్ ధరలు, ఇసుక, కంకర వంటి బిల్డింగ్ మెటీరియల్ ధరలు మూడు రెట్లు పెరగడంతో గృహ నిర్మాణం చేసుకునే వారు మధ్యలోనే ఇంటి నిర్మాణాన్ని ఆపి వేయవలసిన దుస్థితి నెలకొంది. ఇంటి నిర్మాణం కోసం హౌస్లోన్ తెచ్చుకున్న వారు లోను కట్టలేక బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. గత్యంతరం లేక నిర్మాణాన్ని మధ్యలోనే ఆపి వేయాల్సిన దుస్థితి నెలకొంది.
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల..
కట్టడికి పాలకులు తీసుకోవాల్సిన చర్యలు
గృహ వినియోగదారులు ఉపయోగించే సబ్సిడీ సిలిండర్ ధరలు కూడా అంతకంతకూ పెంచుకుంటూ పోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కూరగాయలు, పండ్లు, ఉల్లిగడ్డ, కోడి గుడ్లు, చికెన్, మటన్, చేపల ధరలు కొండెక్కాయి. ఒకప్పుడు బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరిగితే వెంటనే పౌరసరఫరాల అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే వారు. పెరిగిన ధరల నుండి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలందరికీ నిత్యవసర వస్తువులను సబ్సిడీ ద్వారా అందించి ఆదుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, అధికారులు ధరల పెరుగుదలపై దృష్టి పెట్టకపోవడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టానుసారంగా పెరుగుతున్నాయి. ప్రజలకు కావాల్సిన నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించి వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలపై ధరల భారాన్ని మోపుతూ యథేచ్ఛగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు బియ్యం, పప్పులు, చింతపండు, కిరోసిన్, పామాయిల్ వంటి నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ ధరకు అందించేవారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. అసలే కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు దొరకక ఇబ్బంది పడుతున్న పేదలు, కార్మికులు, వ్యవసాయ కూలీలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ధరల భారం పడుతున్నది. పాలకులకు ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం మాదిరిగా 17రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీ ద్వారా అందించాలి. ధరల అదుపునకు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
- మట్టిపల్లి సైదులు
సెల్:8106778287