Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానానికి ఉద్దేశించిన ఎన్నికల చట్టాల సవరణ బిల్లు-2021ని లోక్‌సభ డిసెంబర్ 20, సోమవారం 25 నిమిషాల్లోనే ఆమోదించింది. ఇది ప్రజల వ్యక్తిగత గోప్యతకు వ్యతిరేకమని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సభలో జరిగిన పలు గందరగోళాల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బిల్లుపై ప్రసంగిస్తూ ఇప్పటివరకూ ఉన్న చట్టంలో కొన్ని లోపాలు, తేడాలున్నాయని వాటిని సరిదిద్దడానికే సవరణలు ప్రతిపాదిస్తునట్లు చెప్పారు. ఆధార్ కార్డును ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే నిబంధన స్వచ్ఛందమే అని చెబుతూనే, ఇప్పటికే ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారు కూడా ఆధార్ నెంబర్లను సమర్పించాల్సిందే అన్నారు. వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం లేకుండా ఈ బిల్లును తీసుకురావడమేమిటి? అంత అత్యవసరంగా నిమిషాల వ్యవధిలో ఆమోదించాల్సిన అవసరం ఏముంది? ఓటు హక్కు అనేది పౌరులకు చట్టపరంగా లభించిన అధికారమయితే దానికి ఆధార్‌తో లంకె పెట్టడం ఏమిటి? ఇది పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే చర్య. రాజ్యాంగ విరుద్ధం. అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవేవీ లక్ష్యపెట్టకుండా ఈ బిల్లులో అనేక ఎన్నికల సంస్కరణలను పొందుపరిచినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఎలక్టోరల్ రోల్స్‌తో ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఒకే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో ఓటు వేయడం కుదరదని, ఈ బిల్లుతో దొంగ ఓట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది ప్రభుత్వ వాదన.
న్యాయశాఖ మంత్రి రిజిజు ప్రస్తుత చట్టపరమైన నిబంధనలలో కొన్ని అసమానతలు, లోపాలను సరి చేసేందుకే కొత్త బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్- 1951లోని వివిధ సెక్షన్లకు ప్రతిపాదించిన సవరణలను ఆయన వివరించారు. ఆధార్‌ను ఓటర్ల జాబితాతో లింక్ చేయడం వల్ల ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడంతోపాటు ఎన్నికల అక్రమాలు తగ్గుతాయని చెప్పారు. అయినా ఇది ప్రజల ఐచ్ఛికమే తప్ప, తప్పనిసరి కాదన్నారు. మరి తప్పనిసరి కానప్పుడు బిల్లు అవసరమేముంది? ఇక్కడ ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం ఏమంటే కొన్ని ఎన్నికల సంస్కరణలను అమలు చేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లను ఈ బిల్లు ద్వారా కేంద్రం సవరించింది. ఈ బిల్లు ప్రకారం ఏ ఓటరు తన ఆధార్ కార్డు చూపనంత మాత్రాన లేదా అనుసంధానం చేసుకోకపోయినా అతను ఓటు హక్కును కోల్పోవడం జరగదు. ఆధార్ కాకుండా మరే ఇతర ధవీకరణ పత్రం అయినా చూపి తన ఓటు హక్కును పొందవచ్చు లేదా కొనసాగించవచ్చు. ఆధార్ కార్డును ఓటు హక్కు పొందడానికి ధవీకరణగా చూపడం ఓటరు ఐచ్చికం అన్నప్పటికీ, ఆధార్ కార్డు ఎందుకు చూపడం లేదు అనే దానికి సహేతుక కారణం చూపనట్లయితే అతని ఓటు హక్కు నిరాకరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నట్లు ఈ బిల్లులో ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనైనా ఆధార్ కార్డును ఆధారంగా చూపనట్లయితే ఓటును నిరాకరించవచ్చు అనే మార్గదర్శకాలను ఇస్తుంది. అంటే అనుసంధానం అనేది వ్యక్తి ఇష్టానికి కాకుండా, ప్రభుత్వ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా ఓటు నిరాకరిస్తే వ్యక్తి పోరాటం చేయడానికి చట్టపరమైన రక్షణలు కూడా ఏవీ ఈ చట్టంలో లేవు. సాధారణంగా ఓటరు నమోదు ప్రక్రియ అనేది ప్రభుత్వ బాధ్యత. ఇంటింటికీ తిరిగి సర్వే చేసి నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇప్పడీ చట్టం ఆ బాధ్యతను ఓటరుకి బదిలీ చేస్తుంది. అది ఎలాగంటే ఓటరు తన ఓటును ఆధార్‌తో లింక్ చేసుకొని లేదా ఆధార్ చూపించి నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు చూపకపోతే ఓటు రద్దు కాదు, ఆధార్ అనుసంధానం ఐచ్చికమేనని చెబుతున్నా, ఒక వేల ఆధార్ చూపని కారణంగా ఓటు నమోదు చేయకపోయినా, లేదా అనుసంధానం చేయకపోయినా లేదా తొలిగించినా కూడా సదరు వ్యక్తి ఎటువంటి అప్పీలు చేయడానికి, న్యాయ పోరాటానికి ఈ చట్టంలో ఎలాంటి క్లాజులూ లేవు. అంటే ఆధార్ చూపడం, చూపకపోవడం ప్రజల ఇష్టం, ఆధార్ లేకుండా ఓటు హక్కు నివారించడం లేదా కొనసాగించడం ప్రభుత్వ ఇష్టమన్నమాట!
గతంలో 2015లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోవడం వల్లే అనేక లక్షల ఓట్లు తొలిగించినట్లు మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. సమాచార హక్కు చట్టం క్రింద ఈ విషయం పై సమాధానం కోరితే, ఎటువంటి ఇంటింటి సర్వే చేయకుండానే ఓట్ల తొలగింపు ఏకపక్షంగా జరిగినట్లు ఎన్నికల సంఘం చెప్పింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో సదరు ఓట్ల తొలగింపు ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది. ఆధార్ కార్డు ఓటరు కార్డుతో అనుసంధానం జరిగితే వచ్చే మరొక అనర్ధం ఏంటంటే రాజకీయ పార్టీలు ఒక్కొక్క ఓటరు ఏమేమి సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారనే అంశాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఆ ప్రాంత లేదా తరగతి ఓట్ల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించి లబ్ది పొందే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. అంతేకాదు, దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించ వచ్చు. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత గోప్యతకే ముప్పు తెస్తోందీ ప్రభుత్వం. పార్లమెంట్ సభ్యులు, పౌర సంఘాలు, ప్రజలకు ఈ బిల్లుపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, చర్చకు అవకాశమివ్వకుండా చట్టం చేయడమనేది అప్రజాస్వామికం. ఎవరైతే ఓట్ల ప్రక్రియ ద్వారా ఎన్నికయ్యారో, ఏ చట్టం ద్వారా తమ ప్రాతినిధ్యం ప్రభావితం అవుతుందో వారికి ఆ ఎన్నికల ప్రక్రియ గురించి ప్రవేశపెడుతున్న బిల్లుపై కనీస అధ్యయనం చేసే సమయం, చర్చలు జరిపే అవకాశం లేకుండా చేయడం ఏమి ప్రజాస్వామిక విలువ అనేది మౌలిక ప్రశ్న. ఇక్కడ మరొక తంటా ఏంటంటే అసలు ఈ ఆధార్ కార్డుల జారీలోనే ఎన్నో లోపాలున్నాయి. మరి వాటన్నింటినీ సరి చేయకపోతే తదుపరి జారీలో అక్రమాలకు తావు ఉండదా? అసలు మన దేశం మొత్తం మీద ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయనే మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాచారం గానీ సమాధానం గానీ లేవు. ఈ ఆధార్ కార్డులను విశ్వసనీయ గుర్తింపు కార్డులుగా గుర్తించడానికే కలకత్తా, అలహాబాద్ హైకోర్టులు నిరాకరించాయి. గత పార్లమెంటులో ఆధార్ బిల్లును ఆర్ధిక బిల్లుగా ప్రవేశపెట్టి, ఈ కార్డు కేవలం సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయడానికే అని ప్రభుత్వం చెబితే అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. మరి అటువంటి ఆధార్ కార్డులను ఇతర అవసరాలకు, ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఓటు హక్కు కోసం వినియోగించడం సమర్థనీయం కాదు.
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140