Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యుని ప్రసరించడమే
మార్పు తల్లి నేరమా...?
వెన్నెల వర్షించడమే
జాబిల్లి పాపమా...?
చెలరేగిన భావాలకు
కళారూపమిస్తే...
నడిరోడ్డున ప్రజాకవిని
నరికి పారేయడమా..?
ప్రజాకళా సైనికుడు కామ్రేడ్ సఫ్థర్ హష్మి హత్యానంతరం నల్లి ధర్మారావు కలంలో పెల్లుబికిన ఆక్రోశం ఇది. ప్రజా కళాకారులకే కాక ప్రగతిశీలులందరికీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆగ్రహం తెప్పించిన సందర్భం అది.
ముప్ఫైమూడేండ్ల క్రితం 1989 జనవరి 1న దేశరాజధాని ఢిల్లీ నగరం సమీపాన ఘజయాబాద్‌లో 'హల్లాబోల్' వీధినాటిక ప్రదర్శిస్తుండగా పట్టపగలు కిరాయి గూండాలు, హంతకులు మారణాయుధాలతో ఆ 'జనమ్' కళాబృందంపై ఘాతుక దాడి చేయడం, ఆ దాడిలో నేలకొరిగిన హష్మి మరుసటి దినం రెండవ తేదీన ప్రాణాలు విడవడం, ఆ మరుసటి దినం మూడవ తేదీన అంత్యక్రియల అనంతరం అదే ప్రాంతంలో అదే 'హల్లాబోల్' నాటికను హష్మీ సతీమణి మలయశ్రీ హష్మీ సారథ్యాన వేలాదిమంది ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించడం... ఖబడ్దార్! అంటూ కళాహంతక నైజాన్ని సవాలు చేసి మా నాటకం ఎప్పటికీ ఆగదనీ, సాగుతూనే ఉంటుందని ప్రకటించడం... యావత్ ప్రపంచ కళా చరిత్రలోనే ప్రజాకళాకారులకు కనీ, వినీ ఎరుగని అపూర్వ దిశానిర్దేశం అని చెప్పుకోవచ్చు.
కనుకనే నూతన సంవత్సరం వస్తుందంటే ప్రజాకళాకారులకు హష్మీ స్ఫూర్తితో నూతనోత్తేజం ఆవహిస్తుంది. నిరాశా నిస్సత్తువలను పోగొట్టుకుని కొత్తగా ప్రణాళికలు రచించుకుంటారు. ప్రజల మధ్య కళారూపాలు ప్రదర్శిస్తూ... ఆ ప్రజాశక్తితో ఎప్పటి కప్పుడు పునరుత్తేజం పొందాలని ఉత్సాహపడతారు. హష్మి అందించిన ఆధునిక వీధి నాటకం నాలుగుగోడలు బద్దలు కొట్టుకుని నడివీధికి రావడమే కాదు, దోపిడీ కోటలతో పాటు అజ్ఞానపు మతమౌఢ్యపు గోడలను సైతం బద్దలు కొడుతుందనే విషయం జగద్విదితం.
ఫ్యూడల్ మౌఢ్యం - పెట్టుబడిదారీ (కార్పొరేట్) దోపిడీ ఈ రెండూ మిలాఖత్ అయి మున్నెన్నడూ లేని విధంగా ఇప్పుడు బీజేపీ నాయకత్వాన జడలు విప్పుకుని వికృత విలయతాండవం చేస్తున్న వేళ ''హష్మీ'' స్ఫూర్తి ఎంతో అవసరం.
దేశమాత స్వేచ్ఛకోరి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవవీరులు భగత్‌సింగ్ వంటి వారంటే కొందరు పాలకులకు నేడు లెక్కేలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఆర్.ఎస్.ఎస్. బ్రిటిష్‌కు అనుకూలంగా నిలిచిన విషయం తెలిసిందే. మహాత్మాగాంధీ హత్యకేసులో వారి పాత్రను ఇప్పటికీ వారు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆ జాతిపిత హత్యా ఉదంతాన్ని వీరోచిత ఘటనగా ప్రవర్శిస్తు వీడియోలు పెడుతున్నా పాలకులు ఖండించరు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వాన రూపొందిన మన భారత రాజ్యాంగం పట్ల సముచిత గౌరవం చూపరు సరికదా.. అసలు సమ్మతించకుండా వర్ణవివక్ష, లింగవివక్షతో కూడిన అసమాన ఆధిపత్య మనుధర్మ రాజ్యాంగాన్నే (మనుస్మృతి) ఇప్పటికీ అమలు పరచాలని బలంగా కోరుకుంటున్నారు. 'మానవు లందరూ సమానమే' అన్న భావానే వారికి రుచించడం లేదు.
చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ వారికి ఎంత విశ్వాసంగా లొంగి పనిచేశారో ఇప్పుడు అంతే విశ్వాసంగా కార్పొరేట్లకు లొంగి పనిచేయడం గమనార్హం.
తత్ఫలితంగా ప్రజలకు సంబంధించిన అన్ని జీవనరంగాలు సంక్షోభాలకు నెలవు అవడమే కాక, దేశ సార్వభౌమాధికారానికే ప్రమాదం గోచరిస్తున్నది. పాలకులే పనిగట్టుకుని రాజ్యాంగ విలువలను ధ్వంసం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పరోక్షంగా మూకదాడులను పెంచుతూ మైనార్టీలను, పేదలను, బడుగు జీవులను భయభ్రాంతులను గావిస్తున్నారు. హరిద్వార్ సాధుసంత్ సమావేశంలో అన్యమతస్థులపై సాయుధ దాడులు జరపమని బహిరంగంగానే పిలుపునిచ్చారు. బరితెగింపు, విచ్చలవిడితనం పాలకుల్లో సర్వసాధారణమై పోయింది. ప్రజాస్వామ్యంలో ఉండవలసిన జవాబుదారీ తనం, పారదర్శకత కనీసం మచ్చుకైనా కానరావడంలేదు.
సైన్యాలకు, పోలీసులకు విశేషాధికారాలు కల్పించి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. కాగా, కరోనా భయం కొనసాగుతూనే ఉన్నది. నిత్యావసర వస్తువుల ధరలు తారాజువ్వల్లా ఎగిసిపడుతున్నాయి. తిండి, బట్ట, ఇల్లు వంటి కనీస వసతులు అందుబాటులోకి రావడం లేదు. ఆకలి దప్పులు తీరడం లేదు. యువతకు ఉపాధి లభించడం లేదు. జీఎస్టీ భారంతో చేనేత, చేతివృత్తులు కునారిల్లుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ విధానాల ఫలితమే. గిట్టుబాటు ధరలు, మార్కెట్ యార్డులు, గిడ్డంగులు లేకుండా వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేస్తే, రైతులు ఎలా రోడ్డున పడ్డారో ప్రభుత్వ సంస్థల అమ్మకంతో కార్మికులు, ఉద్యోగులు అలా రోడ్డున పడే స్థితి వచ్చేసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతంలో నేడు ప్రజల సర్వహక్కులు హరించుకుపోతున్నాయి. తలొగ్గి మౌనంగా జీవశ్చవంలా బ్రతకడమా..? లేక తలెత్తి ఉద్యమాల బాట పట్టడమా..? ఏదో ఒకదారే మిగిలింది ప్రజలకు. ఈ సంధి దశలో ప్రజలను భవిష్యత్ పట్ల, పోరాటాల పట్ల అచంచల విశ్వాసంతో ముందుకు ఉరికేటట్లు చేయడం ప్రజా కళాకారుల బాధ్యత. సప్దర్ హష్మీ అదే చేశాడు. తన కాలంలో ఎన్నో వీధినాటికలకు, కళారూపాలకు రూపకల్పన చేశాడు. వర్క్‌షాప్‌లు నిర్వహించాడు. తన కళామిత్ర బృందం 'జనమ్'తో కలిసి ఢిల్లీ నగరవీధుల్లో, పార్కుల్లో, కార్మికవాడల్లో నిత్యం వీధినాటికలు ప్రదర్శించాడు. సమకాలీన సమస్యలను కళారూపాల్లో ఎత్తిచూపడమే గాక రాజకీయ పరిశీలకులు మెచ్చే విధంగా న్యూస్ థియేటర్ (వార్తా రంగస్థల) ప్రక్రియను కూడా చేపట్టాడు. కళాకారులకు సరైన ప్రాపంచిక దృక్పథంతో పాటు కళా నిర్మాణ రహస్యం తెలిసి ఉండాలని అన్నాడు.
అయితే ఇప్పుడు మనది ఉద్యమాల కాలం. ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకునే రాజకీయ పార్టీల వైపుకంటే, ప్రజా ఉద్యమాల వైపే ప్రజలు దృష్టి సారిస్తున్నారనే విషయం మరువరాదు. రాజధాని ఢిల్లీ చుట్టూ ఏడాదిపాటు సాగిన రైతాంగ ఉద్యమం మొత్తం ప్రపంచాన్నే ఆకర్షించింది. ఎందుకంటే ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా తీసుకువచ్చిన నల్లచట్టాలను తానే చివరకు క్షమాపణలతో వెనక్కి తీసుకునే విధంగా ఆ ఉద్యమం చేయగలిగింది. స్వాతంత్య్రోద్యమం తర్వాత సాగిన అతి గొప్ప ఉద్యమంగా విజయం సాధించింది. దాదాపు ఏడువందల మందికి పైగా రైతులు బలైపోయినా, ప్రజల మనుగడకు, దేశ ప్రగతికి ఇక ఉద్యమాలే రహదారి అని రుజువైంది.
మరో పక్క ప్రపంచం డిజిటల్ యుగంలోకి వచ్చింది. సాంకేతిక సమాచార విప్లవంలో సంచరిస్తున్నది. మనదేశంలో కూడా దాదాపు సగం మందికిపైగా అంటే డైభ్భైకోట్ల ప్రజానీకం సెల్‌ఫోన్, నెట్వర్క్ సేవలు పొందుతున్నారు. ఆన్లైన్క్లాసులు, ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నీ అనివార్యమవుతున్నాయి. స్మార్ట్ఫోన్లు పేదలు కూడా వాడవలసిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద పెద్ద థియేటర్లు మూతబడి హౌంథియేటర్లు వెలుస్తున్నాయి.
అయినా తిరునాళ్ళు, తీర్థయాత్రలు, జాతరలు, పెద్ద పెద్ద ఎన్నికల మీటింగ్‌లు యధేచ్ఛగా సాగిపోతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా కనెక్ట్ కావాలో అలా కనెక్ట్ అవుతున్నారు.
ఎన్ని ఉన్నా ఎన్ని వచ్చినా సజీవ మాధ్యమం (లైవ్మీడియా) సాటిలేనిది. మన కళలు - కథలు అన్ని మౌఖిక సాహిత్యం ద్వారానే ఆవిర్భవించాయి. చెప్పేవారికి (ప్రదర్శించేవారికి) చూస్తూ వినేవారికి (ప్రేక్షకులకు) ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఒకరి నుండి ఒకరు గొప్ప ప్రేరణ పొందుతారు. తద్వారా నూతన శక్తి అప్పటికప్పుడే ఇరువురిలో పుట్టుకువస్తుంది. ఇది మరో మీడియాకు సాధ్యం కాదు. రైతాంగ ఉద్యమంలో వేలాది మంది కళాకారులు వందలాదిగా రకరకాల ప్రదర్శనలిచ్చారు. కళాకారులు, రైతులు పరస్పర ఉత్తేజం పొందారు. వీరందరూ హష్మీ వారసులే.
ప్రజల మధ్య చిచ్చులుపెట్టే ఆర్ఎస్ఎస్ తిరోగమన భావజాలాన్ని తిరుగులేని విధంగా ఎదుర్కొనేశక్తి ఒక్క వామపక్ష శక్తులకే ఉంటుంది. 'మార్క్సిజం - లెనినిజం' అనే శాస్త్రీయ సిద్ధాంతం పునాదిపైనే అవి పనిచేస్తాయి. ప్రజా ఉద్యమాలను నిర్మిస్తాయి. సాంస్కృతిక ఉద్యమం కూడా అందులో భాగమే. హష్మీ అదే చేశాడు. దేశం నుండి అరాచకాన్ని, వ్యక్తి ఆరాధనను, హింసను, వివక్షను మౌఢ్యాన్ని, దోపిడీని సమూలంగా తొలగించాలంటే హష్మీవంటి సమరశీల ప్రజాకళాకారులు నేడు అవసరం.
చివరిగా ''కళ ప్రజలది. ప్రజల నుండి ప్రజలకు'' అన్నాడు కామ్రేడ్ లెనిన్. దీనిని త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టినవాడు హష్మీ. ప్రజలను రంజింప చేసే, ఆలోచింపచేసే, చైతన్యపరిచే జానపద, సాంప్రదాయ, ఆధునిక కళారూపాలను అన్నింటిని నేర్చుకుంటూ, తన సృజనశీలతతో రంగరించి తన వీధి నాటిక ప్రక్రియలో చొప్పించాడు. సాధనలో ప్రజాస్వామ్య విలువలు పాటించాడు. వస్తువు సారాన్ని, రూపాన్ని నిత్యం తోటి కళాకారులకు విశదపరుస్తూ, వారిని వారినే ఆశ్చర్యపరిచే రీతిలో అద్భుత పాత్రధారులుగా మలిచాడు. ఉద్యమ వీధినాటికను సృష్టించాడు. అందుకే ఆ ప్రక్రియకు నవ్యతతో పాటు నాణ్యత సమకూరింది. ప్రజల నుండి, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం అన్న రీతిలో బాధితుల నుంచి, బాధితుల చేత, బాధితుల కొరకు వీధినాటిక అన్నట్టు తీర్చిదిద్దాడు. అందుకే హష్మీ వీధినాటిక ఆధునిక జానపదంగా వర్థిల్లుతున్నది. పోరాటాయుథంగా పదునెక్కుతున్నది. ఇది ఢిల్లీలో రైతుల వీరోచిత పోరాటం మరోసారి రుజువు చేసింది.
(హష్మీ స్మృతిలో...)
- కె. శాంతారావు
సెల్: 9959745723