Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దక్షిణాఫ్రికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్19 కేసుల్లో, డెల్టా తరహా వైరస్‌ను వేగంగా దాటేసి ఒమిక్రాన్ తరహా వైరస్ ముందుకొచ్చేసింది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ కాస్త సంతోషించదగ్గ విషయం ఏమంటే (సంతోషిద్దామా?), వ్యాక్సిన్ రెండు డోసులూ వేయించుకున్నవారికి ఒమిక్రాన్ సోకినా వారి ఆరోగ్యం సంక్లిష్టం కావడం లేదు. అంటే మన శరీరాలు తమ రోగ నిరోధక శక్తిని కరోనాను తట్టుకునేటట్టు పెంపొందించుకోవడం, దానికి వ్యాక్సినేషన్ దోహదపడడం జరిగిందన్నమాట.
మన శరీరాలకు ఇప్పుడు ఈ కరోనా వైరస్ గురించి తెలుసు. కరోనా సోకినందువలన గాని, వ్యాక్సిన్ వేయించుకున్నందువలన గాని, మన శరీరాలలో స్వతహాగా ఉండే రోగ నిరోధక వ్యవస్థకు ఇప్పుడు కరోనా గురించిన సమాచారం తెలుసు. ఈ రోగనిరోధక వ్యవస్థలోని మొదటివరుస ఆత్మరక్షణ వ్యవస్థ (దీనినే యాంటీబాడీస్ అంటారు) ప్రసుత్తం ఈ ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నది. అయితే ఇంకా అనేక దశల రక్షణ వ్యవస్థ మన దేహంలో ఉంది. అటువంటి దశల్లో టి-సెల్స్ అనేవి ఒకటి. మామూలుగా వైరస్ మన దేహంలోకి ప్రవేశించాక అది మన జీవ కణాల వ్యవస్థను తన స్వాధీనం చేసుకుని తనవంటి వైరస్‌లనే అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. దాంతో మన దేహంలో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. ఈ టి-సెల్స్ అలా ఇన్ఫెక్ట్ అయిన జీవకణాలని చంపేస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్ దేహంలో వ్యాపించకుండా నిరోధిస్తాయి. మనం తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్ ఒమిక్రాన్‌ను నిరోధించేవిధంగా మన ఇమ్యూనిటీని (రోగనిరోధక శక్తిని) పెంచలేకపోవచ్చు గాని అది మన దేహాన్ని ఇన్ఫెక్ట్ చేసి ఆరోగ్యాన్ని ఆందోళనకర దశకు తీసుకుపోయే వీలు లేకుండా వైరస్‌ను అడ్డుకునే శక్తిని పెంచింది. వ్యాక్సిన్లు వ్యాధిని నిరోధించలేవని, వ్యాధిని తట్టుకునే శక్తిని మాత్రం పెంచుతాయని నిపుణులు ఇదివరకే చెప్పారని మనం గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు లండన్‌లోని ఆస్పత్రుల నుండి వస్తున్న సమాచారాన్ని బట్టి అక్కడ సీరియస్ అవుతున్న కేసులన్నీ ఇంతవరకూ వ్యాక్సినేషన్ వేయించుకోనివారివే. దీనిని బట్టి ఒమిక్రాన్ తక్కువ ప్రమాదకారి అని నిర్థారించుకోవడం కన్నా వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఒమిక్రాన్ వ్యాధిని తీవ్ర దశ వరకూ తీసుకుపోలేకపోతోందని నిర్థారించడం సరైనది. వ్యాధి ఎక్కువమంది జనాభాకు విస్తరించినప్పుడు మన ఆస్పత్రుల వ్యవస్థ ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఏ విధంగా కుప్పకూలిందో మనం చూశాం. కాబట్టి ఇప్పుడు ఒమిక్రాన్‌ను కాసుకోడానికి వ్యాక్సిన్ మీద ఆధారపడడమే మేలు.
ఒమిక్రాన్ విస్తరించకుండా, సోకినా, ముదిరిపోకుండా కాసుకోడానికి, జనం ఆస్పత్రుల పాలవకుండా నిరోధించడానికి వ్యాక్సిన్ వేయించుకోవడం కీలకం. అయితే కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఇన్ఫెక్షన్ను అదుపు చేయడానికి ఉపయోగించే ఔషధాల సంగతేమిటి? ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ప్లాస్మా కణాల మార్పిడి వంటివి కోవిడ్-19 ట్రీట్మెంట్లో నిరుపయోగం అయ్యాయని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. ఊపిరితిత్తుల వాపును నిరోధించే కార్టికోస్టిరాయిడ్స్, రెమ్‌డెసివిర్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కోవిడ్ దేహంలో వేగంగా విస్తరించకుండా అడ్డుకోడానికి తోడ్పడ్డాయి. అయితే తాజా సమాచారం (ఇది దుర్వార్తే) ప్రకారం కొత్తగా పెంపొందించిన మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ (ఇది అచ్చంగా కోవిడ్-19 కోసమే పెంపొందించారు) పని చేయడం లేదు.
ఇంకోవైపు మంచివార్త ఏమంటే మాల్యుపిరావిర్, పాక్స్లోవిడ్ వంటి ఔషధాలు, నిర్మాట్రెల్విర్, ఇటోనావిర్ వంటి యాంటీ వైరల్స్ కాంబినేషన్ ఔషధం-ఇవి కూడా రెమ్‌డెసివిర్ మాదిరిగానే దేహంలో వైరస్ పునరుత్పత్తి కాకుండా నిరోధించడంలో తోడ్పడుతున్నాయి. దానివలన మన దేహపు ఇమ్యూనిటీ వ్యవస్థకు ఈ పోరాటంలో ఊపిరి పీల్చుకోడానికి తగిన వ్యవధి లభిస్తుంది. పైగా వీటిలో కొన్ని రెమ్‌డెసివిర్ కన్నా శక్తివంతంగా పని చేస్తున్నాయి.
ఈ యాంటీ వైరల్స్ అన్నీ చిన్న చిన్న కణాలతో (మాలిక్యూల్స్) నిర్మితం అయివుంటాయి. కనుక వీటిని ఏ ఔషధ కంపెనీ అయినా తేలికగా ఉత్పత్తి చేయగలుగుతుంది. పైగా భారీ మోతాదుల్లో ఉత్పత్తి చేయగలుగుతుంది. వీటి ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మూడవ ప్రపంచ దేశాలకు వెంటవెంటనే అందించి కావలసిన మోతాదుల్లో ఉత్పత్తి చేసుకునేటట్టు చేయడం తేలిక.
ప్రపంచంలో శాస్త్రవేత్తలు శరవేగంగా కోవిడ్‌ను నియంత్రించే వ్యాక్సిన్లను, ఔషధాలను కనుగొన్నారు. అయినా, ఇప్పటికీ మనం ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ ఎందుకు అందించలేకపోయాం? అన్నదే కీలక ప్రశ్న. ఎందుకు ఔషధాలను తగినంతగా ఉత్పత్తి చేయలేకపోయాం? ఎందుకు అవసరమైన దానికన్నా అధిక సంఖ్యలో సంపన్న దేశాలలో వ్యాక్సిన్ల నిల్వలు పేరుకుపోగా, పేద దేశాలలో చాలా తక్కువ మోతాదులో మాత్రమే వ్యాక్సిన్ వేయించడం జరిగింది? వ్యాక్సిన్లపై, యాంటీ వైరల్స్‌పై పేటెంట్లను రద్దు చేసి ఆ పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటు లోకి తేవాలని అందరమూ కలిసి గట్టిగా ఆ సంపన్న దేశాలపై ఒత్తిడి తేలేకపోతున్నాం? ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటువంటి అసాధారణ పరిస్థితుల్లో పేటెంటు చట్టాలను పక్కన పెట్టవచ్చునని చెప్పినా, ఎందుకు ఆ విధంగా జరగడం లేదు? సంపన్న దేశాల ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్త మహమ్మారిని అరికట్టాలని ప్రయత్నించే బదులు కేవలం తమ దేశాల జనాభాని కాపాడుకోడానికే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి? తక్కిన ప్రపంచం కరోనాతో కునారిల్లుతున్నా ఎందుకు పట్టించుకోడం లేదు?
సమాధానం స్పష్టమే. తమ ఫార్మా కంపెనీలకు వచ్చే భారీ లాభాలపైన మాత్రమే ఆ సంపన్న దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఆ లాభాలు కొనసాగాలంటే కరోనా మహమ్మారి కొనసాగుతూనే ఉండాలి. ఈ మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ, మరోవైపు సంపన్న దేశాల ప్రజలు నిరంతరం వ్యాక్సిన్లపై, ఔషధాలపై ఆధారపడుతూ ఉండాలి. ఇక పేద దేశాలు సామూహిక నిరోధక శక్తి పెంపొందేవరకూ పదే పదే ఈ కరోనా బారిన పడుతూనే ఉండాలి. ఇక పేద దేశాలలోని సంపన్నుల పరిస్థితి అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. అత్యధిక ధరలకు మాత్రమే వారు వ్యాక్సిన్‌ను గాని, ఔషధాలను గాని పొందగలిగే స్థితి ఉంటుంది.
అయితే ఇప్పుడు ఒమిక్రాన్ ఆ విధమైన స్థితిని యూథాతథంగా ఉంచేట్టు లేదు. ప్రపంచమంతటా అందరికీ కరోనా రాకుండా ఆపనైనా ఆపాలి, లేదా అందరూ ప్రమాదానికైనా సిద్ధపడాలి. అదీ ఒమిక్రాన్ విస్తరిస్తున్న తీరు సూచిస్తున్న పర్యవసానం. ఇంకా ఇంకా కొత్త కొత్త తరహాల వైరస్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒక శతాబ్దం వెనక ప్రజావైద్య రంగంలోని నిపుణులు ఆనాటి అనుభవాల నుండి నేర్చుకున్న విషయం ఇదే. ఇప్పటికీ అదే సత్యం. మహా కోటీశ్వరుల లాభాల కోసం మాత్రమే పని చేసే నయా ఉదారవాద విధానాలు ప్రజా వైద్య వ్యవస్థను కుప్పకూల్చాయి. దాని స్థానంలో కొత్తగా పేటెంట్ వ్యవస్థను తెచ్చాయి. ఇప్పుడు మనం ఎదిరించి పోరాడాల్సినది దీనినే. ప్రపంచానికే ఔషధ ప్రదాత అని మన దేశం గురించి ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నాం. కాని ఇప్పుడు చూస్తే మన దేశ ప్రజలకే ఇప్పటిదాకా అందరికీ వ్యాక్సిన్లను అందించలేకపోతున్నాం. ఎందుకు ఈ విధంగా జరిగింది? ప్రభుత్వాన్ని నిగ్గదీయాలి. పశ్చిమ దేశాలలో ఉన్నంత తీవ్రంగా మన దేశ ప్రజలలో వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల విముఖత ఏమీ లేదు. కనుక ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇంకా అందలేదంటే దానికి ప్రజలు బాధ్యులు కారు. మనకు శాస్త్రీయ పరిజ్ఞానం కానీ, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం కానీ పుష్కలంగా ఉన్నాయి. కేవలం మన దేశానికేగాక ప్రపంచానికే వ్యాక్సిన్లను అందించే స్థాయికి మన ఉత్పత్తి సామర్థ్యాన్ని గతంలోనే పెంచుకున్నాం. అయినా భారత ప్రభుత్వం ఎందుకు విఫలం అయింది? పెట్టుబడిదారులు, స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ అన్ని సమస్యలకూ పరిష్కారం అని మోడీ ప్రభుత్వం బలంగా నమ్మింది కాబట్టే ఇప్పుడు విఫలమైంది. బడా ఫార్మా కంపెనీలకు ఒనగూడే లాభాలు ఎంత భారీగా ఉన్నా, అవి ఏనాటికీ ప్రజలందరికీ ఆరోగ్యం కల్పించడంతో సమానం కాజాలవు. కోవిడ్-19 మహమ్మారి మరోసారి ఈ విషయం స్పష్టం చేసింది. అయినప్పటికీ మన ప్రభుత్వం ఇంకా మార్కెట్ల దయామయ స్వభావాన్నే నమ్ముకుని ఉన్నది.
- ప్రబీర్ పురకాయస్థ