Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మగౌరవం కోసం తాపత్రయం, పూర్వీకుల శౌర్యాన్ని కీర్తించుకునే ఆరాటం, తమకోసం పోరాడిన వాళ్ళను గౌరవించుకోవాలనే తపనకు కూడా అవకాశంలేని స్థితిలో నేటి దళిత సమాజం ఉనికి కోసం పోరాటం చేస్తున్నది. స్వాతంత్రం సిద్దించి 75ఏండ్లు దాటినా నేటికి వేల ఏండ్ల క్రితం మనువు గీసిన తలరాత ఆధునిక పాలకుల రూపంలో కొనసాగుతున్నది. ఇప్పటికీ దళితులపై జరుగుతున్న హత్యాచారాలు, అఘాయిత్యాలు అణగారిన బతుకుల దారుణ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీమా కోరెగావ్ విజయగాథ మనకు గొప్ప స్ఫూర్తినిస్తుంది.
మూతికి ముంత ముడ్డికి తాటాకు చీపురు కట్టి పశువులకన్నా హీనంగా బతకాలని ప్రజలను నీచమైన బానిసత్వానికి గురిచేసిన పీష్వా బ్రాహ్మణులపై మహార్ పోరాట యోధులు చేసిన యుద్ధ విజయానికి చిహ్నమే బీమా కోరేగావ్. 500 మంది మహర్ పోరాటాయోధులు బానిస సంకెళ్లను తెంచుకోవడానికి 28వేల మంది పీష్వాల సైన్యంతో మహారాష్ట్ర కోరేగావ్‌లోని బీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారు. అపార సైనిక బలగం కలిగిన పీష్వా రాజ్యంతో యుద్ధం చేయలేని బ్రిటిష్ వాళ్లు వారితో కలిసి పీష్వా సైన్యంతో యుద్ధం చేయాలని కోరగా, యుద్ధం చేసే ముందు అప్పటి మహార్ నాయకుడు సుబేధార్ శిక్ నాక్ పీష్వా సైన్యాధికారి బాపు గోఖులే వద్దకు వెళ్లి పశువులకన్నా హీనంగా చూడబడుతున్న మాకు గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని కోరారు. యుద్ధం చేసినా, చేయకపోయినా మీ బతుకులకు మేము ఇచ్చే స్థానం ఇంతేనని గోఖులే ఖరాకండిగా చెప్పారు.
ఇక తప్పని పరిస్థితిలో వేల సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకోవడానికి ప్రతినబూనిన 500మంది మహార్ సైన్యం 200మంది బ్రిటిష్ సైన్యంతో కలిసి రెండు వందల కిలోమీటర్లు నడిచి బీమా నది ఒడ్డుకు చేరుకున్నారు. 20 వేల మంది పధాతిదళం, 8 వేల మంది అశ్విక దళంతో కనుచూపుమేరలో కనిపిస్తున్న పీష్వా సైన్యాన్ని చూసిన బ్రిటిష్ సైన్యం అక్కడి నుండి జారుకుంది. బతికితే పోరాట వీరులుగా బతకాలని నిర్ణయించుకున్న మహార్ సైన్యం పీష్వా సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. తిండిలేక కాలినడకన వచ్చిన మహార్ సైన్యం సింహాల్లాగా పీష్వా సైన్యాన్ని ఉరికించడాన్ని దూరంగా నిలబడి చూసిన బ్రిటిష్ అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ ఆశ్చర్యపోయారు. విరామం లేకుండా జరిగిన భీకర యుద్ధంతో భీమా నది పీష్వా సైనికుల రక్తంతో ఎర్రబడింది. పీష్వా సైన్యాధ్యక్షుడి కొడుకైన గోవింద్ బాబా తలను తెగనరికితే ఆ తలలేని కొడుకు మొండాన్ని చూసి ఏడుస్తూ భయంతో అందరూ పారిపోండంటూ పూల్లావ్ లోని బాజీరావ్ శిబిరం వైపు పీష్వా సైన్యం పారిపోయారు. ఆ యుద్ధంలో అమరులైన 12మంది మహార్ సైనుకుల స్మృతి చిహ్నంగా బ్రిటిష్ వారు స్మారక స్థూపం కట్టించడమే కాకుండా మహర్ సైనికులతో మహర్ రెజ్మెంట్ ఏర్పాటు చేశారు. 1927 జనవరి 1న ఈ స్మారక స్థూపాన్ని మొట్టమొదటిసారి సందర్శించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్థూపాన్ని దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా, ఆత్మగౌరవ ప్రతీకగా పేర్కొన్నారు. అంబేద్కర్ సందర్శించిన నాటి నుండి ప్రతి సంవత్సరం లక్షాలది దళితులు జనవరి ఒకటిన బీమా కోరేగావ్ సందర్శనకు వెళుతారు. దేశ వ్యాప్తంగా దళిత గౌరవం నిలిచి గెలిచిన రోజుగా శౌర్య దివస్‌గా జరుపుకొని కోరేగావ్ వీరులను స్మరించుకుంటారు.
కానీ, 204 సంవత్సరాల క్రితం జరిగిన బీమా కోరేగావ్ యుద్ధ గాయం ఇంకా మానడంలేదు. ఇప్పటికీ దళితులు అగ్రవర్ణాల మధ్య తారతమ్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నేటి పాలకులు దళిత ఉద్యమాలను జాతీయ వ్యతిరేక ఉద్యమాలుగా ప్రచారం చేస్తూ ఉద్యమకారులను దేశ ద్రోహులుగా చిత్రిస్తున్నారు. దళితులు మాట్లాడితే పాపం, పోరాడితే కోపం, మౌనంగా ఉంటే శాపం అనే స్థితిలో ఉన్న ఈ దేశంలో దళిత గౌరవం నిలిచి గెలిచిన బీమా కోరేగావ్ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆనాడు ప్రత్యక్ష యుద్ధం చేసిన అణగారిన వర్గాలు నేడు ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా ముందుకు సాగాలి. వేల సంవత్సరాలుగా విద్య, ఆస్తి, అధికారం దక్కకుండా బతికిన బడుగు బలహీన వర్గాలు... మహాత్మ జ్యోతిరావు పూలే, పెరియార్, సాహుమహారాజ్, నారాయణ గురు, అంబేద్కర్ లాంటి మహానుభావుల పోరాటాల వల్ల ఆనాటి మనువాద దాస్యశృంఖలాల నుండి బయటపడే ప్రయత్నం జరిగింది. కానీ నేటి మనువాదుల పాలనలో ఆ దోపిడీ, అణచివేత, దాడులు మళ్ళీ పునరావృతమవుతున్నాయి.
ప్రపంచ దేశాలన్నిటిలో వర్గ అసమానతలు కొనసాగుతుంటే ఇండియాలో వర్గ అసమానతలతో పాటు కుల అసమానతలూ కొనసాగుతున్నాయి. ఇండియా కన్నా ఎక్కువ వర్గ అసమానతలు, బానిసత్వం కొనసాగిన దేశాలు కూడా అసమానతలు తగ్గి బానిసత్వం నుండి విముక్తి చెంది అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. స్వాతంత్రం సిద్ధించి 75ఏండ్లు దాటినా ఈ దేశంలోని ప్రజల మధ్య అసమానతలు మాత్రం తగ్గకపోగా మరింత పెరిగిపోతున్నాయి.
పేదలు మరింత పేదలుగా, సంపన్నులు మరింత సంపన్నులుగా కావడానికి కారణమవుతున్న కులం, ఆ కుల స్థిరీకరణకు నాటి పాలకులకు మనుధర్మ శాస్త్రం అండగా నిలిస్తే నేడు ఆనాటి పాలకుల వారసులు అదే మనుధర్మ శాస్త్రాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. తమ అసమాన త్యాగాలతో స్వాతంత్ర ఉద్యమానికి ముందు నుండే ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించిన యోధులెందరో... స్వాతంత్రాణంతరం రాజ్యాంగం లిఖించుకొని రాజ్యాంగ రక్షణలో దేశం అభివృద్ధి చెందాలని కలలు కన్నారు. ఆ కలలను కల్లలు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనుధర్మాన్నే అమలు చేయజూస్తున్న నేతల పాలనలో మనమున్నాం. ఈ సంగతి గుర్తెరిగి నడుచుకోవాలి. బీమా కోరెగావ్ వెలుగులో ముందుకు సాగాలి.
- సాయిని నరేందర్
సెల్:9701916091