Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మందిర్ మజ్జిద్ ఉన్నంత కాలం
మనిషికి ఉన్నది తీవ్ర ప్రమాదం
జబ్ తక్ మందిర్ ఔర్ మజ్జిద్ హై
ముష్కిల్ మె ఇన్సాన్ రహేగ
అని నిర్మొహమాటంగా ప్రకటించిన కవి నీరజ్.
ఆద్మీ హూ ఆద్ మీసే ప్యార్ కర్తా హూ..
మనిషిని గనకనే - మనిషిని ప్రేమిస్తాను - అని చాటి చెప్పిన కవి నీరజ్. పూర్తి పేరు గోపాల్ దాస్ సక్సెనా (4 జనవరి 1925-19 జులై 2018). హిందీ, ఉరుదూ సాహిత్యరంగాలలో కవి నీరజ్‌గా ప్రసిద్ధులు. పేదరికంలో పుట్టి పెరిగిన వీరు, ఎంతో సంఘర్షిస్తూ కవిగా, ఉద్యోగిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇటావా దగ్గర్లో పురవలి గ్రామంలో పుట్టారు.
తల్లిదండ్రులిద్దరూ నిర క్షరాస్యులు. అతి పేదవారు. పైగా గోపాల్ దాస్ నాలుగేండ్ల వయస్సులోనే తండ్రి చనిపోయాడు. ఏ ఆధారమూలేని ఒంటరి తల్లి పిల్లల్ని పెంచలేకపోయింది. గోపాల్‌దాస్‌ను తన సోదరి ఇంటికి పంపించింది. ఆ రకంగా ఆయన పెద్దమ్మ సంరక్షణలో ఉంటూ మెట్రిక్ పాసయ్యాడు. అప్పటి నుండి ట్యూషన్లు చెప్పడం, షాపుల్లో పనిచేయడం, రిక్షా తొక్కడం వంటి అన్ని రకాల పనులుచేస్తూ తల్లికి సహాయం చేస్తూ ఉండేవాడు. తను చదువు మానేసి తమ్ముళ్ళకు చదువు చెప్పించాడు. 'పిల్లల్ని గాలికి వదిలేశావేమిటని' - ఊళ్ళోవాళ్ళు అంటుంటే ఆ తల్లి మాత్రం నవ్వుతూ తన పిల్లల పట్ల ఎంతో ఆశాభావం వ్యక్తం చేసేవారు. ''నలుగురిలో ఒక్కడైనా పైకి రాడా? తమ కుటుంబాన్ని పైకి తేడా?'' అని. గోపాల్ దాస్ తమ్ముడు కసరత్తులు చేసి, పహిల్వాన్ కావాలని కలలు గనేవాడు. 'అలా అయితే ఎవరూ తమ జోలికి రారు' - అని అతని అభిప్రాయం. అంతేగాని, చదువుకోవడం, జ్ఞానవంతులవడం అనేది ఆ కుటుంబంలో లేదు. అసలు చట్టుపక్కల ఆ వాతావరణమే లేదు. అలాంటి పరిస్థితుల్లోంచి ఒక బాలుడు విద్యావంతుడవుతాడని గానీ, పైగా కవియై సాహిత్య రంగాన ప్రముఖ స్థానం సంపాదిస్తాడని గానీ ఎవరూ ఊహించలేదు.
తొలి కౌమార దశలో అంటే 1940లలో గోపాల్ దాస్‌కు టైపిస్ట్ ఉద్యోగం దొరికింది. నెల జీతం రూ.67లో తన ఖర్చులకు ఐదు రూపాయలుంచుకుని, మిగతాదంతా తల్లికి ఇచ్చేవాడు. ఆ దశలో ఒక కవి సమ్మేళనంలో పాల్గొనే అవకాశం దొరికింది. అక్కడ లభించిన అపూర్వ స్పందన గోపాల్‌దాస్‌తో పాటు ఎందరికో ఆశ్చర్యం కలిగించింది. ఆ నవయువకుడి అద్భుత ప్రతిభను మెచ్చుకుని, హఫీజ్ జలంధరి అనే అతను హిందీ విభాగంలో మంచి ఉద్యోగం ఇప్పించాడు. అక్కడ నెల జీతం రూ.120. అది ఆయనకు గొప్ప ఆసరా! ఆ విభాగం ప్రభుత్వ పథకాల్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జనంలోకి తీసుకుపోయేది. అది, కవి సమ్మేళనాలు, ముషాయిరాలు కూడా నిర్వహిస్తూ ఉండేది. అందులో గోపాల్‌దాస్ నీరజ్ కూడా పాల్గొంటూ ఉండేవారు. అయితే ఆయన అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కవితలు చదివేవారు. అది చూసి ఒక అధికారి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు కూడా!
అతి కష్టం మీద ఉన్నత విద్య నార్జించిన గోపాల్‌దాస్, ప్రతిచోట ప్రతిసారి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేవారు. దాంతో జీవితం కొంత స్థిమితపడింది. అక్కడ చాలా కాలం పనిచేశారు. మరో వైపు సాహిత్యరంగంలో హిందీ కవిగా ఉన్నత స్థాయినందుకున్నారు. ఇంకోవైపు హిందీ చలన చిత్రాలకు పాటలు రాయాల్సిందిగా ఎంతోమంది ఆహ్వానించారు. కాని, ఆయన చాలా కాలం దాటవేస్తూ వచ్చారు. చివరకు హిందీ నటుడు దేవానంద్ ప్రోద్బలంతో ఆయన సినిమాలకు పాటలు రాశారు. ఆ తర్వాత చాలా చిత్రాలకు రాస్తూ వచ్చారు. దాదాపు అవన్నీ మంచి ప్రజాదరణ పొందాయి. మళ్ళీ తనకు తానే సినీరంగాన్ని వదిలేశారు. తన ఆలోచనా ధోరణిలో తను రాయదలుచుకున్న కవిత్వం రాసుకోవడానికి ఆ రంగం అనుమతించదు. దానికి కావల్సినట్టుగా కవి తనను తాను మార్చుకుని, మలుచుకుని పాటలు రాయాల్సి ఉంటుంది. ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో దేవానంద్ సినిమాలకు ఎక్కువగా పాటలు రాసిన నీరజ్, రాజ్‌కపూర్ - 'మేరా నామ్ జోకర్'కు కూడా రాశారు. 'ఏ భారు జరదేఖె చలో' అనేది అంతకు ముందే నీరజ్ రాసుకున్న కవిత. దాన్ని తన సినిమాలో పెట్టుకుందామని, శంకర్ - జయకిషన్ను బాణీ కట్టమన్నారు రాజ్‌కపూర్! పాటంతా చదివిన శంకర్, ''ఇది పాటా?'' - అని ఛీదరించుకున్నారు. ''ఇది గీత్, గజల్, టుమ్రీ, భాజన్ ఏదీ కాదు - దీనికి బాణీ కూర్చడమెలాగా?'' అని అన్నారు. అప్పుడు నీరజ్ తన శైలిలో పాడి వినిపించారు. అది రాజ్‌కపూర్‌కు నచ్చింది. అదే బాణీని యధాతథంగా రాజ్‌కపూర్, మన్నాడేతో పాడించి రికార్డు చేశారు. 'మేరా నామ్ జోకర్' సినిమాలో - సర్కస్‌లో - జోకర్ వేషంలో రాజ్‌కపూర్ పాడే ఆ పాటలో గొప్పతాత్త్వికత ఉంది. కఠినమైన జీవిత వాస్తవాలున్నాయి. కవి నీరజ్ తన జీవిత సారాంశమంతా ఆ పాటలో పొదిగాడా - అని అనిపిస్తుంది.
''ఓ అన్నా కొంచెం చూసుకుంటూ నడువు. కుడివైపు, ఎడంవైపూ మాత్రమే కాదు పైనా కిందా కూడా చూసుకుని నడువు. ఇక్కడ నీదంటూ ఏదీ లేదు. జీవితం, బాల్యం, యవ్వనం, వృద్థాప్యం - అనే మూడు భాగాలుగా విభజింపబడి ఉంది. అదయిపోగానే నీ కెవరూ ఉండరు. మనమంతా జోకర్లమే. హీరోలంతా జోకర్లు కావల్సి ఉంటుంది. డబ్బు అనేది ఒక గుర్రం. అది నువ్వెక్కేది కాదు, అదే నిన్నెక్కుతుంది. అంతా అయిపోయాక ఏముంటుంది? ఒక మహా శూన్యం'' పాట అలా సాగుతుంది. ఏ తాత్త్విక దృక్పథంతో గ్రేటెస్ట్ షోమ్యాన్ రాజ్‌కపూర్ తన 'మేరా నామ్ జోకర్' సినిమా తీశాడో, దానికి కవి నీరజ్ పాట పూర్తిగా సరిపోయింది. అలాగే 'ఖిల్ తే హై గుల్ యహౌఁ / ఖిల్ కె భిఖర్నెకో' 'రంగీలా - రే / తెరె రంగ్మె' లాంటి ప్రజాదరణ పొందిన అద్భుత గీతాలెన్నో ఆయన కలం నుండి వెలువడ్డాయి. నీరజ్ క్షణక్షణం కవి. అనుక్షణం కవి. అలాకాకపోతే ''హృదయమే కవి అయ్యింది / దుఃఖమే పాట అయ్యింది'' అని రాయలేరు. దిల్ ఆజ్ షాయర్ హై / గం ఆజ్ నగ్మా హై - అంటూ కిశోర్ కుమార్ పాడిన పాట చాలా పాపులర్ అయ్యింది. కవి హృదయంలోంచి కవి వేదన జలపాతంలా జాలు వారింది.
మానవ విజయానికి ప్రాధాన్యమిస్తూ కవిత్వం రాసిన నీరజ్ చాలా చోట్ల మనిషి మూఢత్వాన్ని దుయ్యబడుతూ వచ్చారు. భారత ప్రభుత్వ నుండి పద్మశ్రీ (1991) పద్మభూషణ్ (2007) స్వీకరించిన గోపాల్ దాస్ నీరజ్, చివరి దశలో అతీఘర్లోని మంగళయాతన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. బెంగాల్ కరువు రోజుల్లో ఒకసారి ఆయన బెంగాల్ వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి ఆహారం కోసం కుక్కలతో పోట్లాడటం చూశారు. అంతే... ఒక వ్యక్తిగా, కవిగా తన మార్గమేదో ఆయనకు అక్కడే అప్పుడే బోధపడింది. ''నాది తిరుగుబాటు / తిరుగుబాటు చేయడానికే వచ్చాను'' (మె ౖద్రోహీ హూఁ - విద్రోV్‌ా కర్నే ఆయా హూఁ) అని ధైర్యంగా ప్రకటించారు.
అద్బుత మైనది మన గణతంత్రం
అద్భుతమైనది ఈ షడ యంత్రం
మూర్ఖ శిఖామణులధికారంలో
సజ్జనులంతా ఊచల వెనుకా?
వంటి చరణాలు ఆయన కవిత్వంలో లెక్కలేనన్ని కనిపిస్తాయి. ధనికులకు, అధికార బలమున్న దుర్మార్గ నాయకులకు తగినంత దూరంలో ఉండటం మంచిదన్న సూచన చేశారు నీరజ్.
జ్ఞానం ఉంటె వేగమె మానుకో స్నేహం దుర్మార్గుడితో,
సర్పం సర్పమే మణి ఉన్నా ఉండకపోయినా -
జ్ఞానీ హౌ ఫిర్ భి నకర్ దుర్జన్ సింగ్ నివాస్
సర్ప్ సర్ప్ హై భలేహి మణిహౌ ఉస్కె పాస్
(సర్పం తలమీద మణి ఉంటుందన్న ఒక మూఢ నమ్మకం జనంలో ఉంది. దాని ఆధారంగా కవి ఈ కవిత రాశారు. నిజానికి పాము పడగపై ఎలాంటి మణీ ఉండదు.) ఒక చోట ఆయన తన గురించి తానే ఇలా చెప్పుకున్నారు.
ఎంత అభాసు పాలయినానో ఈ జగాన
శతాబ్దాలు పట్టునేమో నను మరువ జనానికి
ఇత్నె బద్ నామ్ హుయే హం జో ఇస్ జమానె మె
సదియా లగ్ జాయెంగె హంకో భులానె మె
మనిషి బరువు కన్నా ఊపిరి బరువే ఎక్కువ అంటూ ఒక మంచి లాజిక్‌ను ముందుకు తెచ్చారు ఈ కవి - ''కాయం కన్నా ఊపిరి - బరువు /
తేలియాడేది మృతదేహం
మునిగి పోయేది జీవి శరీరం
తన్సె భారీ సాంస్ హై! ముర్దా జల్మె తైర్తా
జిందా జాతా డూచ్''
ప్రభుత్వాల రాజకీయాలు ఏ స్థాయికైనా దిగజారతాయని చెప్పడానికి కవి నీరజ్ జీవితంలోని ఒక సంఘటన చెప్పుకుని తీరాలి. ఆయనకు చివరిసారి పెన్షన్ మార్చి 2017న అందింది. ఆ తర్వాత ఎంక్వయిరీ పేరుతో ఆ తొంభయి మూడేండ్ల వృద్ధుణ్ణి చివరిదాకా సుమారు ఒకటిన్నర సంవత్సరం వేధించారు. ఇది మన ప్రభుత్వ పెద్దల మానవతా దృక్పథం! వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన వ్యక్తికి, పద్మశ్రీ, పద్మ భూషణ్‌లు స్వీకరించిన ఒక కవికి ఆ వయసులో ఇంకా ఏం దర్యాప్తు చేస్తారూ? మళ్ళీ 19 జూలై 2018న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన కన్ను మూయగానే జాతీయ జెండా కప్పి, అధికార లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు?
పెన్షన్ అందకుండా ఉన్న చివరి దశలో ఆయన ఇలా చెప్పుకున్నారు. అదీ కవితా మాధ్యమంలోనే ''సన్మానితుల గొప్పలు అన్నీ / రాజ్ భవన్లో రాయరు కొన్ని / నేనైతే పుట్టుకతోనే ప్రేమికుడను / అంతరంగ సౌందర్యాల ఆరాధకుడను / ఈ మాత్రం తప్పిదానికే నాకీ / జీవిత కాలం శాపమెందుకూ? / ... ఫరవాలేదు విచారపడను / అశ్రువు పొందే సన్మానంలో / జనం నన్ను స్మరిస్తారు / ఎక్కడ ఉంటే ప్రేమ చర్చలు / అక్కడనే నే నుంటాను!'' అని మనిషి కోసం తపించిన ఆ మహాకవికి నివాళులర్పిస్తూ....
(జనవరి 4న నీరజ్ జయంతి సందర్భంగా)
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
- డాక్టర్ దేవరాజు మహారాజు