Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలకు చదువు నిరాకరించిన సనాతన మనుస్మృతి దుర్మార్గపు కట్టుబాట్లను ప్రతిఘటించి, అందరి చదువుకు ఆద్యురాలుగా నిలిచిన సావిత్రిభాయి మన దేశపు చదువులతల్లి. అనాగరిక సమాజాన్ని ఆధునిక సమాజం వైపు నడిపించడానికి సరైన ఆయుధం విద్య అని గుర్తించిన పూలే దంపతులు తమ మొత్తం జీవితాన్ని శూద్రులు, మహిళల్లో విద్యావ్యాప్తి కోసం ధారపోశారు. సావిత్రి భాయి పూలే అంటే చాలా మంది మేధావులకు ఆమె కేవలం జోతిబాపూలే భార్యగానే తెలుసు. కానీ ఆమె సామాజిక అభ్యున్నతి కోసం చేసిన సాహాసాలు త్యాగాలు ఆమె జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికే తెలుస్తాయి. సావిత్రి గొప్ప ఉద్యమ కారిణి, గొప్ప రచయిత్రి, మంచి వక్త. కులం - పితృస్వామ్య వ్యవస్థపై కలం యుద్ధం నడిపిన కవయిత్రి. యుక్త వయసులోనే తన సౌఖ్యాలను వదులుకొని అతిశూద్రులకూ, అగ్రకులాల్లోని మహిళలకూ అక్షరజ్ఞానం నేర్పిన గొప్ప మానవతా వాది. చదువు నేర్చుకోవడం సహజ హక్కు అని, దానిని నిషేధించడం ఆధునిక సమాజానికి అడ్డుకట్ట వేయడమేనని, ఆ మానసిక చట్టాల ఆంక్షలను ప్రతిఘటించి అందరికీ చదువుకోసం అనునిత్యం పోరాడిన వీరనారి సావిత్రి.
మహారాష్ట్రలోని సతార జిల్లా నయగావ్ అనే గ్రామంలో 1831జనవరి 3న సాధారణ రైతు కుటుంబంలో ఆమె జన్మించింది. తొమ్మిదేండ్ల వయస్సులోనే జోతిబాపూలేను వివాహమాడింది. నిరక్షరాస్యురాలైన సావిత్రి తన భర్తను మొదటి గురువుగా స్వీకరించి విద్యా జ్ఞానం నేర్చుకొని ఈ దేశానికి మొదటి పంతులమ్మగా మారింది. 1847లోనే మొట్టమొదటి సారిగా శూద్ర బాలికల కోసం పూణేలో పాఠశాలను తన భర్తతో కలిసి ప్రారంభించారు. న్యాయం ప్రజాస్వామ్యం, స్త్రీ పురుష సమానత్వం అనే ఆదర్శాలు సావిత్రి జీవితంలో సహజ లక్షణాలుగా నిలిచాయి. ఆ రోజుల్లో స్త్రీ పురుష సమానత్వంపై అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు ఆమె నిర్వహించింది. 19వ శతాబ్దంలో కుల వ్యతిరేక ఉద్యమాల్లో, పురుషాధిక్య వ్యవస్థపై జరిగిన అనేక పోరాటాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 1852లో మహిళా సేవా మండల్ పేరిట ఆమె సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్షకూ అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకూ వ్యతిరేకంగా ఆమె పోరాడారు. 1874లో ఓ బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకొని పెంచి పోషించారు. బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టింది. పూలే దంపతులు ఆమెను కాపాడి ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి పుట్టిన ఆ బిడ్డకు యశ్వంత్ అని పేరు పెట్టి పోషించి డాక్టర్‌గా తీర్చిదిద్దారు. 1873లో సత్య శోధక్ సమాజ్ మహిళా విభాగం వేదికగా కులాంతర వివాహాలు జరిపించారు. సావిత్రి భాయి తన భర్తకు తొడునీడగానేకాక, స్వయంగా తానే సామాజిక ఉద్యమాలకు సారథ్యం వహించే విప్లవ కారిణిగా ఎదిగారు. 1896లో సంభవించిన తీవ్ర కరువుకు తోడు ప్లేగు వ్యాధి మహారాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ఆ సమయంలో దళితులు పేదల ఆకలి తీర్చడానికి జోలె పట్టి విరాళాలు సేకరించి అనేక మంది ఆకలి తీర్చింది. ప్లేగు వ్యాధి బాధితులందరికి దగ్గరుండి ప్రత్యేక సేవలందించింది. 1848లో మొట్టమొదట తన ఇంట్లో ప్రారంభించిన పాఠశాలలో కేవలం 9మంది మాత్రమే హాజరయ్యారు. సావిత్రి తన ప్రాణ స్నేహితురాలు ఫాతిమా షేక్‌తో కలిసి ఆ పాఠశాలను సమర్థవంతంగా నడిపారు. ఆనాటి ఆధిపత్య శక్తులు శూద్రులు, అందులోనూ మహిళలు చదువుకుంటే వేదాలు ఘోషిస్తాయి చదవవద్దు అంటూ అనేక ఆటంకాలు సృష్టించారు. ఆమె పాఠశాలకు వెళ్ళే దారికాచి ఆవుపేడ, రాళ్లు, మట్టి విసిరేవారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో సంచిలో ఒక పాత చీర పెట్టుకొని వెళ్ళి అందరికి చదువు నేర్పిన గొప్పతల్లి సావిత్రి.
1854లో ఆమె కావ్య ఫూలే అనే ఒక కవితా సంపుటిని రచించారు. నాటి పీష్వాల నిరంకుశత్వంపై యుద్ధం ప్రకటిస్తూ అభంగ్ రాసారు. 1891లో ప్యాన్ కాశీ సుబోధ రత్నాకర్ పేరిట ఆమె 11సంపుటాలను రచించింది. పండుగలు, ఉత్సవాలు, జాతరల పేరుతో అనవసరపు ఖర్చులు పెట్టొద్దని, అప్పుల పాలు కావొద్దని ఖర్జ్ అనే వ్యాసం రాసి ఆమె ప్రజలకు హితబోధ చేసింది. పేదలు మూఢ విశ్వాసాలు నమ్మినంతకాలం వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగవని ఆమె చెప్పారు. ప్రతి దానిని శాస్త్రీయంగా హేతుబద్ధంగా పరిశీలించాలన్నది.
తన భర్తతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాలు సాగిస్తున్న క్రమంలో ఆధిపత్య శక్తులు చివరికి హత్యాయత్నానికి కూడా కుట్ర చేసి వారి ఇంటిమీదికి గుండాలను పంపారు. పొట్టకూటి కోసం హత్య చేయడానికి వచ్చిన వారిని ఉద్దేశించి ''మమ్ముల్ని చంపినందుకు మీకు వాళ్ళు వంద రూపాయలు ఇస్తే చంపండి. అంతకంటే మాకు ఏమి కావాలని'' కోరగా వారు తెచ్చుక్ను గొడ్డళ్ళను కత్తులను కిందపడేసి పూలే దంపతులకు సలాం కొట్టారు. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి పంపించారు. 1870లో దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అనాధ బాలికలు, కరువు పీడిత పేద పిల్లల కోసం ఒక వసతి గృహం నడిపారు. 1890 నవంబర్ 28న తన భర్త జోతిబాపూలే మరణించగా ఆమె ఆయన చితికి నిప్పటించారు. అనంతరం సత్యశోధక్ సమాజ్ మొత్తం బాధ్యతలన్నింటిని ఆమె స్వయంగా నిర్వహించారు. 1896లో మరోసారి కరువు సంభవించినప్పుడు ప్రభుత్వంతో పోరాడి బాధిత పేదలకు నిధులు మంజూరు చేయించారు. ప్లేగు వ్యాధి సోకిన బాధితులకు ప్రత్యక్ష సేవలందిస్తున్న సమయంలో ఆమె కూడా ప్లేగు వ్యాధికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 1897 మార్చి 10న ఆమె కన్నుమూశారు.
అందరికీ విద్య, వైద్యం సమాన అవకాశాలు, ప్రకృతి వనరులు అందాలని సావిత్రిభారు జీవితాంతం కృషి చేసింది. కానీ సావిత్రి భాయి ఏ సామాజిక విప్లవాత్మక మార్పుల కోసం పరితపించారో ఆ లక్ష్యం నెరవేర్చ బడలేదు. నేటికీ ఆమె ఆశయాలు సాధించవలసిన కర్తవ్యాలుగానే మిగిలి ఉన్నాయి. ఈ సమాజం మేడి పండు చందంగా ఉన్నది. ఎంతగానో మారినట్లు కన్పించే ఈ దేశంలో నూటికి 40శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అంబానీ ఆదానీ ఆస్తులు పెరగడం, దేశ జీడీపీ తగ్గడం చూస్తే కేంద్రలో బీజేపీ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో విధితమవుతుంది. నేటికీ దళితులు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీ అనుభవిస్తున్నారు. ఏ అభివృద్ధికీ నోచుకోవడం లేదు. ఉపాధి కోసం నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తూ నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యల పాలవుతున్నారు.
తెలంగాణలో 18శాతం ఉన్న దళితుల్లో 60శాతమే అక్షరాస్యత ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. నూటికి 75శాతం మంది దళితులకు సెంటు భూమి లేదు. సుమారు 7లక్షల కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో వ్యవసాయ కూలీలుగా దుర్భర జీవితం గడుపు తున్నాయి. గ్రామ పంచాయతీ, మున్సిపాలలిటీ, గ్రామ సేవకులు, ఆశ, అంగన్వాడీ, భవన నిర్మాన కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి కనీస వేతనం దక్కడం లేదు. వెట్టి చాకిరీ చేస్తున్నారు. కులవివక్ష అంటరానితనం 128రూపాల్లో కొనసాగుతున్నది. రాష్ట్రంలో 69కుల దురహంకార హత్యలు జరిగాయి. సాంఘిక బహిష్కరణలు, అత్యాచారాలు, జోగిని వ్యవస్థ ఇంకా ఇతర అనేక అమానుషాలు జరుగుతున్నాయి.
ఇలాంటి అమానుషాలపై అలుపెరుగక పోరాడింది సావిత్రీభాయి ఫూలే. తన ఆశయాలను ఆచరణలో రుజువు చేసింది. నేటి తరం ఆమె చిత్రపటానికి దండలు వేసి దండం పెట్టి మన పనైపోయిందని భావించకుండా విద్యా, వైద్యం, భూమి ఉపాధి బడ్జెట్ ప్రకృతి వనరుల్లో ప్రజలందరికీ అందాలంటూ సాగే ఉద్యమాల్లో పాల్గొనాలి. ఆ వెలుగులో సమాజమంత స్మరించుకోవల్సిన మహనీయురాలు సావిత్రిభాయి.
జనవరి 3న సావిత్రి భాయి పూలే జయంతి
- టి. స్కైలాబ్ బాబు
సెల్:9177549646