Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నే ను భూమిని
ఇంత మన్ను కాసిన్ని నీళ్లుగా పిల్లలకోసం
నిలబడివున్న కాలవాహికను-
నేను భూమిని
కొన్ని చెట్లు కొన్ని గుట్టలు బీళ్లుగా జీవకారుణ్యం కోసం
కపిలవస్తు మీదుగా ప్రవహించుకుంటూ వచ్చిన
పచ్చిక బయలును-
నేను భూమిని
అప్పుడప్పుడు వాగులుగా ఇసుక గుసగుసలకోసం
చక్రవర్తుల సౌధాలను దాటుకొని
చెరువొడ్డుకొచ్చే పుత్తడివర్షాన్ని-
నేను భూమిని
కొంచెం కలగా కొద్దిల కథగా
దున్నేవాడి బువ్వకోసం బట్టకోసం
కొత్త జమీందారీ కుట్రలపై
షహీద్ భగత్ సింగ్ మేనకోడలు నినాదం సాక్షిగా గెలుపొందిన పోరాటాన్ని-
నేను భూమిని
ఋతువుల ఘనత కోసం ఇతిహాసాల హితం కోసం
మేదిని వైదేహి వసుమతి
హరిప్రియ సురభి గంధవతి అని ఇంకేవోవో
నామవాచకాలతో
కీర్తించారు
ఇప్పటిదాకా-
సంతోషం
ఇప్పడు మరి నన్ను
సింఘు టిక్రీ సరిహద్దు ఘజియాబాదు
అనండి చాలు-
-డా.బెల్లి యాదయ్య,
9848392690