Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జియా: నరేంద్ర మోడీ ఆరెస్సెస్ ను అంగీకారయోగ్యంగానే కాక గౌరవింపబడే సంస్థగా చేశాడు.ఆ సంస్థ మినహాయింపు జాతీయవాదం వెలుగులో దేశం ఏం మూల్యం చెల్లించింది?
ఆకార్: ఆరెస్సెస్‌కు ఏది సాధిస్తే గౌరవమని కోరుకుంటుందో, దానిని మోడీ చేస్తున్నాడు. వాటిలోనే మొదటిది, ముస్లింలను రాజకీయంగా ప్రాధాన్యతలేని వారిగా పక్కకు నెట్టివేయడం. ఇది పార్టీ లక్ష్యమని 1965లో దీనదయాళ్ ఉపాధ్యాయ పూణేలో చేసిన ప్రసంగంలో చెప్పాడు. రెండోది, మైనారిటీలను భారతీయేతరులుగా పరిగణిస్తూ వారిని నిరంతరం వేదింపులకు గురి చేస్తున్నారు. ఈ వేదింపులకు ప్రభుత్వ ఆమోదం, ప్రోత్సాహం ఉంది కాబట్టి అవి కొనసాగుతాయి. ప్రపంచం కూడా భయపడిపోయే భారతదేశాన్ని అవి సృష్టించాయి. భారతదేశం ఇక ఏ మాత్రం అభివృద్ధి చెందిన, నాగరికత గల దేశాల చెంతన చేరే ఆశలను వదిలేసిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.
జియా:మోడీకి పెరిగిన ప్రాధాన్యత, 'లౌకికతత్వం' అనే పదాన్ని ఒక అసాధారణ స్థాయికి తగ్గించింది. లౌకిక పార్టీలు కూడా ఆ పదాన్ని ఉపయోగించడం లేదు. ఈ పదం నేడున్న భారతదేశంలో మత స్వేచ్ఛ గురించి ఏమి చెపుతుంది?
ఆకార్: నేడు భారతదేశంలో మత స్వేచ్ఛలేదు, మైనారిటీలు చాలా సహనశీలతతో బతుకుతున్నారు. దేశ రాజధాని ప్రాంతంలో ముస్లిం వలస కార్మికులు, వేధింపులు లేకుండా వారికి నిర్దేశించిన నమాజ్ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఆదివారం రోజున ప్రార్థనా స్థలాల్లో భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. భారతదేశంలో ఒక మతాన్ని స్వేచ్ఛగా ప్రచారం చేయడం, దానిని అనుసరించడం ప్రాథమిక హక్కు, నేరం కూడా. ఒక వ్యక్తి యొక్క మత స్వేచ్ఛను అనుభవించడాన్ని సమర్థించడం కంటే కూడా మత ఆచరణను కట్టడి చేస్తూ చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ సమర్థిస్తుంది. మైనారిటీ మతస్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వాస్తవానికి ఉనికిలో లేకుండా పోయాయి. లౌకిక తత్వం అనేది భారతదేశంలోని మెజారిటీ హిందువులకు ఒక వ్యతిరేక అర్థాన్నిచ్చే పదంగా మార్చేశారు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఆ పదాన్ని ఉచ్ఛరించడం లేదు, వారు ఆ పదంలోని నిజమైన అర్థాన్ని వదిలేసారు.
జియా:బహుళ ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పటికీ, 2021లో మొదటిసారిగా భారతదేశం తలసరి జీడీపీ బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకే ఉంది. దీనికి మొత్తం లాక్‌డౌన్‌ను కారణంగా చెప్పవచ్చా? లేక పెద్ద నోట్ల రద్దు లాంటి చర్యలు 2016 లోనే ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని స్థితిలోకి నెట్టాయా?
ఆకార్: ఇక్కడ జాతీయ లాక్‌డౌన్‌ను కారణంగా చెప్పలేం. 2014లో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ భారతదేశం కంటే 50 శాతం వెనుకబడి ఉంది. మోడీ పాలనా కాలంలో బంగ్లాదేశ్ భారత్‌ను చేరుకోగా, భారత దేశం ఆర్థికంగా తన మార్గాన్ని కోల్పోయింది. బంగ్లాదేశ్ సరుకుల ఎగుమతిలో, వస్త్రాల తయారీలో మిలియన్ల సంఖ్యలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రపంచ ఛాంపియన్‌గా ఉంది. ఈ వస్త్ర ఉత్పత్తిపై ఆ ప్రభుత్వం బాగా కేంద్రీకరించింది.
మరోవైపు, అమెరికాలో శ్రామిక శక్తి భాగస్వామ్యం 60శాతం, చైనాలో 70శాతంగా ఉంటే, నేడు భారతదేశంలో కేవలం 40శాతం మాత్రమే ఉంది. ఇది పాకిస్థాన్ శ్రామికశక్తి కంటే తక్కువ. మొదటిసారిగా దక్షిణాసియా లోనే ఇది అత్యంత తక్కువ శ్రామిక శక్తిగా నమోదైంది. మోడీ, భారతదేశ శ్రామిక శక్తిని ఐదవ వంతుకు తగ్గించాడు. ఇవి ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే కాబట్టి వీటిలో ఎటువంటి వివాదానికి తావుండదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్యకు నాలుగింతల సంఖ్య 2013లో ఉండేది. కాబట్టి భారతీయులకు పని కావాలి కానీ పని లేదు. ఫలితంగా అపారమైన నష్టం జరుగుతుంది. ఒక ప్రభుత్వ సర్వే ప్రకారం 2012వ సంవత్సరంలో కంటే 2018లో భారతీయులు తక్కువ ఖర్చు చేస్తూ, తక్కువ తింటున్నారు. పదవీ విరమణ చేయబోతున్న ప్రధాన ఆర్థిక సలహాదారు కష్ణమూర్తి సుబ్రమణియన్ ఆ సర్వే విడుదల చేయాలని కోరారు కానీ భయంతో మన ప్రధాని దానిని దాచి ఉంచారు.
జియా: దశాబ్దాల ప్రగతిని తారుమారు చేస్తూ, 23 కోట్ల మంది ప్రజలు 2020లో పేదలుగా మారారు. 800 మిలియన్ల మంది నేడు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పప్పులు, ధాన్యాలపై ఆధారపడుతున్నారు.
ఆకార్: ఆఖరికి మోడీని ఆరాధించే మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కూడా ఆగిపోయింది. పది సంవత్సరాలుగా, ప్రతీ సంవత్సరం అమ్మకానికి పెట్టిన కార్లు, గృహ ఆస్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. దిగువ మధ్య తరగతి ప్రజల అభివృద్ధి కూడా నిలిచి పోయింది. ఐదు సంవత్సరాల కాలంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల సంఖ్య, 15 సంవత్సరాల కాలంగా త్రిచక్ర వాహనాల అమ్మకాల సంఖ్య పూర్తిగా పడిపోయింది. మనం తిరోగమన దిశలో ఉంటున్నాం. ఒకవేళ మనం అంతా బాగానే ఉందనుకుంటే, సరిచేయడానికి ఏమీ ఉండదు. ప్రధానమంత్రికి వాస్తవాలు తెలుసో లేదో గానీ, అంతా బాగుంది అంటున్నారు. కానీ అది వాస్తవం కాదు.
జియా:ఏ దేశం తన కరెన్సీని రద్దు చేయడం ద్వారా అవినీతిని అరికట్టలేదు. ఆర్బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు గురించి మోడీని హెచ్చరించింది. అయినా ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని అమలు చేశాడు? ఈ స్వయం కృతాపరాధం వల్ల కలిగిన నష్టం నుండి మనం కోలుకున్నామా?
ఆకార్: మోడీ చాలా నిష్కర్షగా ఉంటానని చెపుతాడు, కానీ ఆయనకు వివరాలు తెలియదు. ఆయన తన వద్దకొచ్చిన ఫైళ్ళను చదువడు. మౌఖికంగా చెప్పిన విషయాలను రెండు నిమిషాల్లో విని, చర్యలకు నిర్ణయం తీసుకుంటాడని చెపుతారు. దేశాన్ని పాలించే విధానం ఇది కాదు, కానీ ఇదే ఆయన పద్ధతి. ఇదే ఆయనకు సౌకర్యంగా ఉందని అంటాడు.
ఆయన తప్పు చేస్తున్నాడని చెప్పేవారెవరూ లేరు. అవినీతిని, నల్ల ధనాన్ని, తీవ్రవాదాన్ని అంతమొందించడానికి పెద్ద నోట్ల రద్దే చాలా తేలికైన పరిష్కారమని ఆయన చెప్పాడు. ఆయన ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు దాని వల్ల కలిగే దుష్ఫలితాలను పరిగణలోకి తీసుకొనకపోవడం వలన కల్లోల పరిస్థితులు, దురవస్థలు ఏర్పడి, ఆ నిర్ణయం వైఫల్యం చెందినపుడు భంగపడ్డాడు. నవంబర్ 8 సమావేశానికి మంత్రులందరూ ఫోన్లు లేకుండా హాజరవ్వాలని చెప్పడమంటే దానర్థం, మంత్రులెవ్వరికీ ఏమి జరుగుతుందనే విషయం తెలియదు, నోట్ల రద్దు గురించి కూడా తెలియదు. అంటే ముందస్తు ఏర్పాట్లు లేవు. మనం కోలుకున్నామా లేదా కోలుకుంటామా చెప్పడం కష్టం.
జియా: ''మేకిన్ ఇండియా'', ''డిజిటల్ ఇండియా'', ''ఆత్మ నిర్భార్ భారత్'', ''బేటీ బచావ్ బేటీ పడావ్'' లాంటి రాజకీయ నాయకులు ఉపయోగించే పదాల ఫలితాలు క్షేత్ర స్థాయిలో ఎలా ఉన్నాయి?
ఆకార్: స్థూల దేశీయ ఉత్పత్తిలో వస్తుఉత్పాదక భాగం, ''మేకిన్ ఇండియా'' ప్రారంభించిన తరువాత 16శాతం నుంచి నేడు 13 కంటే తక్కువ శాతానికి పడిపోయింది. 2016 తరువాత వస్తు ఉత్పాదక రంగంలో మొత్తం ఉద్యోగాలు 5.1కోట్ల నుండి సగానికి అంటే 2.7కోట్లకు పడిపోయాయి. ప్రధానమంత్రి పూర్వ సలహాదారు అరవింద్ పనగారియా, ఆత్మ నిర్భార్ భారత్ గందరగోళంగా ఉందని అన్నారు. భారతీయ వినియోగదారునికి వస్తువులను ఎక్కువ ఖరీదుకు అందజేసి, బయటి పోటీ నుంచి ధనిక వ్యాపారస్తులను కాపాడటం దాని ప్రాథమిక కర్తవ్యంగా ఉంది.
జియా: ప్రధానమంత్రి ఆవాజ్ యోజనా (పీఎంఏవై), 2022 నాటికి రెండు కోట్ల ఇళ్ళను నిర్మించాలనే లక్ష్యంతో ఉంది. ఆ లక్ష్యానికి అది చేరువలో ఉందా, లేక పెద్ద నోట్ల రద్దు విషయంలో వలె, ఆ లక్ష్యంలో కూడా ఏవైనా మార్పులు ఉంటాయా?
ఆకార్: వాస్తవానికి ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేయదు. అది నాలుగు భిన్నమైన భాగాల కింద నిధులు ఇస్తుంది. వాటిలో ప్రధానమైనది, ఇళ్ళను నిర్మించుకునే వారికి లేక ఇళ్ళను విస్తరణ చేపట్టిన వారికి ప్రత్యక్షంగా సహాయం చేస్తుంది. దీనికి భూమిపై యాజమాన్య రుజువు ధృవీకరణ అవసరం. ఇతర అన్ని పథకాల వలె పీఎంఏవై కూడా పూర్వం ఉన్న పథకానికే పేరు మార్చుకుంది. ఇతర పథకాల వలె ఈ పథకం కూడా పాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మంజూరు చేసిన దానికంటే కేంద్రం చెల్లించేది చాలా తక్కువగా ఉంటుంది. పీఎంఏవై మొదటి నాలుగేళ్లలో లక్ష కోట్లు మంజూరు చేసి, కేవలం 20వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
జియా: మీ రచనలో మతాధిపత్యం గురించి మాట్లాడారు. 2021లోని మోడీ భారతదేశం, 1986లోని జియా ఉల్ హక్ పాకిస్థాన్‌ను గుర్తు చేస్తుందా?
ఆకార్: మైనారిటీలు, అణగారిన వర్గాలే లక్ష్యంగా దాడులు చేయడంలో రెంటి మధ్య కొన్ని పోలికలున్నాయి. జియా ఉల్ హక్కు మోడీకి ఉన్నంత మతమౌఢ్యం లేదు. మోడీకి ఉన్నంత ప్రజాస్వామిక ఆమోదం జియా ఉల్ హక్ కు లేదు. అందుకనే, అత్యాచారంపై పాకిస్థాన్ చట్టాన్ని, ఎటువంటి వ్యతిరేకత లేకుండా ముస్లిం మత చట్టం నుండి న్యాయ వ్యవస్థకు తిప్పి పంపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీని రద్దు చేసే ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. ఆధునిక పండితులు, న్యాయ కోవిదుల సలహా మేరకు రాళ్ళతో కొట్టడం, కాళ్ళూ చేతులూ నరికేయడం లాంటి (ఇస్లాం మత చట్టం ప్రకారం) శిక్షలు కూడా అమలుకు నోచుకోకుండా కాగితాలకే పరిమితమయ్యాయి.
మరోవైపు భారతదేశంలో, ముస్లిం వ్యతిరేక చట్టాలు మైనారిటీల వ్యక్తిగతమైన స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనలను నిలువరించేందుకు, బతుకుదెరువు కోసం పోరాడుతున్న ముస్లింలను వేధింపులకు గురి చేయడం, ముస్లింలను కొట్టి చంపే చర్యలు నిత్యకృత్యమని ఆమోదించే స్థితికి సమాజాన్ని ప్రోత్సహించారు. రాజకీయాల నుండి ముస్లింలను మొత్తంగా మినహాయించేందుకు కూడా ఇక్కడ ఆమోదం లభించింది. నేడు పాకిస్థాన్ కొన్ని విషయాల్లో లౌకిక తత్వం మార్గంలో పయనిస్తుంటే, భారతదేశం మాత్రం లౌకిక తత్వం మార్గం నుండి దూరంగా జరుగుతుంది.
జియా: స్వతంత్ర భారతదేశంలో 2014 తరువాత జరిగిన హింసలో ఆవుకు సంబంధించిన హింస 97శాతంగా ఉంది. దీనిపై మీ అభిప్రాయం?
ఆకార్: గోవధ అనేది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో భాగం. ట్రాక్టర్ల వాడకం మొదలైన తరువాత కోడె దూడలతో ఉపయోగం లేదు, వాటిని ఉంచుకోవడం ఖర్చుతో కూడుకున్నది. ఇది వ్యవసాయం చేసే వారికి బాగా తెలుసు. గొడ్డు మాంసాన్ని కలిగి ఉండడాన్ని నేరంగా భావిస్తూ చట్టం చేసేందుకు ప్రధాని ప్రయత్నించి, 2015 తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టం చేసిన తర్వాత చట్ట వ్యతిరేకంగా మూక దాడులతో హత్యలు మొదలయ్యాయి.
2018 తరువాత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ''లవ్ జీహాద్'' చట్టం చేసిన తర్వాత మతాంతర వివాహాలు చేసుకున్న వారిపై కూడా ఇదే తరహాలో మూకదాడులు జరుగుతున్నాయి. ఇలాంటి చట్టాలను ప్రయోగించి భారతదేశంలో ప్రభుత్వాలు మైనారిటీలపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో గోవధకు పాల్పడిన వ్యక్తులకు విధించే శిక్ష జీవితఖైదు. ముస్లింలను ప్రమాదకారులుగా చిత్రీకరించడానికి ఈ చట్టాలు ఉద్దేశించబడ్డాయి. అలా చేయడంలో వారు కృతకృత్యులయ్యారు.
జియా: చివరగా, మోడీ పాలనలో భారతదేశం చెల్లిస్తున్న మూల్యం ఏమిటి?
ఆకార్: ఒకటి, ఆర్థికంగా భారతదేశం చైనా తరువాత దేశంగా ఉండే మార్గంలో లేదు. మోడీ పాలనలో, ఆర్థిక వ్యవస్థ భారీగా పేదరికాన్ని కొనసాగించే, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను సృష్టించే మార్గంలో ఉంది. ఇప్పడు ఉన్న విధంగా, కొద్దిమందే మెజారిటీ వనరులు, సంపదను అదుపు చేస్తారు.
రెండోది,సమాజానికి సంబంధించినది.మనం విభజించ బడతాం. మైనారిటీలు బలవంతంగా ప్రత్యేక ప్రాంతాల్లో ఉంటారు. ప్రజల మనసులు మతపరమైన విభేదాలతో, వారి చిహ్నాలతో ఆవహించి ఉంటూ, హింసను కూడా అంగీకరిస్తారు. న్యాయ వ్యవస్థ భయంతో తన బాధ్యతను విస్మరిస్తుంటే, మోడీ హిందూత్వ శక్తులు చట్టబద్ధమైన అధికార బదిలీ కోసం ప్రోత్సహిస్తున్నాయి. నేడు హిందూత్వ అల్లరి మూకలు భారతదేశాన్నేలుతూ, భవిష్యత్తులో వారనుకున్నది జరగాలని కోరుకుంటున్నాయి.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్ సెల్:9848412451
- ఆకార్ పటేల్
- జియా ఉస్సలామ్