Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆదివారం అధ్యయనం'' పేరుతో 2010 జనవరి మూడో తేదీన ప్రారంభమైన వైరా స్టడీ సర్కిల్ 2022 జనవరి 2వ తేదీతో పుష్కర కాలం (12సంవత్సరాలు) పూర్తి చేసుకుని పదమూడోవ సంవత్సరంలో అడుగు పెడుతోంది. ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఒక్క వారం కూడా వైరా స్టడీ సర్కిల్ నడవకుండా ఆగలేదంటే కొందరికి నమ్మకం కుదరక పోవచ్చు. కానీ పన్నేండేండ్లుగా ఆగకుండా సాగిన స్ఫూర్తిదాయకమైన సందర్భమిది. సహజంగా ఆదివారం శెలవు దినంగా భావించి రెగ్యులర్‌గా చేసే పనులు కూడా ఆదివారం చేయకుండా విశ్రాంతి తీసుకుంటాం. కానీ సభ్యులు ఆదివారం కంటే ముందు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉంటే శనివారం రాత్రికే వైరాకు చెరుకోవడం ద్వారా స్టడీ సర్కిల్‌కు గైర్హాజరు కాకుండా చిత్తశుద్దితో ప్రయత్నం చేయడం వల్లనే స్టడీ సర్కిల్ విజయవంతంగా కొనసాగుతోంది.
ఈ ఆదివారం అధ్యయనం మార్కులు, ర్యాంకులు కోసమో, లేదా నలుగురిలో నాలుగు విషయాలు తెలుసు అనిపించుకోవడం కోసమో జరిగే అధ్యయన పక్రియ కాదు. సమాజ మార్పు కోసం జరిగే కృషికి వెలుగు దారి చూపెట్టే అవగాహన, నైపుణ్యాల కోసం సాగే కర్తవ్యం. కార్యకర్తలకు సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని అందించే సాధనం. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై 9.30 గంటల వరకూ ప్రతి ఆదివారం నిరంతరాయంగా కొనసాగుతూ ముందుకు సాగుతోంది. 12 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, ప్రజాతంత్ర ఉద్యమ మహాసభలు, ప్రజా సంఘాల మహాసభలు, మెగా క్యాంపెయిన్లు ఎన్ని జరిగినా... తీవ్ర వర్షాలు, కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎన్నొచ్చినా నిరంతరాయంగా సాగిన (భౌతిక దూరంతో) వైరా స్టడీ సర్కిల్ నేడు ఓ మైలురాయి దాటింది.
వైరా స్టడీ సర్కిల్‌కు వివిధ రంగాలలో పనిచేస్తున్న, అధ్యయన పట్ల ఆసక్తి కలిగివున్న 20ఏండ్ల విద్యార్థుల నుంచి 70 సంవత్సరాల అనుభవజ్ఞుల వరకూ హాజరవుతారు. వృత్తి రీత్యా అధ్యాపకులు, పూర్తి కాలం కార్యకర్తలు, విద్యార్థులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఈ స్టడీ సర్కిల్ సభ్యులుగా ఉన్నారు. వివిధ యూన్సివర్శటీలలో ఉన్నత విద్యనభ్యసించిన వారు, ప్రజాక్షేత్రంలో అనుభవం పొందిన కామ్రేడ్లు, నవ యువకులు, విద్యార్థుల సమ్మిళితం వైరా స్టడీ సర్కిల్.
ఈ స్టడీ సర్కిల్ సభ్యులు వివిధ యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం వెళ్ళారు. కొందరు వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో పూర్తి కాలం కార్యకర్తలుగా ఉన్నారు. వారంతా అక్కడ తమకు ప్రత్యేక గౌరవం లబిస్తోందంటే అది వైరా స్టడీ సర్కిల్లో సమాజం పట్ల కలిగించిన అవగాహన, శ్రామిక వర్గం పట్ల ప్రేమ, సానుభూతి వల్లనే అని పేర్కొటుండటం గమనార్హం.
స్టడీ సర్కిల్ సభ్యులు వివిధ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మేథావులు ప్రముఖ పత్రికలలో ప్రచురించిన ఇంగ్లీష్ వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేస్తూ తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అలాంటి ముఖ్యమైన వ్యాసాలతో వైరా స్టడీ సర్కిల్ ప్రచురించిన ''తిరోగమన భారతం'', ''కల్లోల భారతం'' పుస్తకాలు కూడా పాఠకుల ఆదరణ పొందాయి. ఈ స్టడీ సర్కిల్లోని అరడజను మంది సభ్యులు ఖమ్మం జిల్లాలో రాజకీయ శిక్షణా తరగతులకు రిసోర్స్ పర్సన్స్‌గా ఉపయోగపడుతున్నారు.
వైరా స్టడీ సర్కిల్‌కు హాజరయ్యే సభ్యుల కుటుంబాల సహకారాన్ని కూడా విస్మరించలేం. కుటుంబాల సభ్యులు స్టడీ సర్కిల్‌కు హాజరు కాకపోయినా స్టడీ సర్కిల్లో చర్చ చేసే అంశాలు తెలుసుకోవడం, శనివారమే ఆదివారం స్టడీ సర్కిల్‌ను గుర్తు చేయడం, ఉదయం 5గంటలకు నిద్రలేచే విధంగా చూడటం వల్ల నిర్దిష్ట సమయానికి సభ్యుల హాజరు కాగలుగుతున్నారు. 100వ, 150వ, 200వ వారం ఇలా ప్రత్యేక సందర్భాలలో కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఆట, పాట, అతిథులతో రోజంతా స్టడీ సర్కిల్ నిర్వహించిన సందర్భాలు ఉత్సాహాన్ని రెట్టింపు చేసాయి.
స్టడీ సర్కిల్లో రోజువారీ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ఆ వారంలో ప్రధాన రాజకీయ సంఘటనల గురించి ముప్పై నిముషాల పాటు చర్చ జరిపి, ఆ తర్వాత ముందస్తుగా ఎంపిక చేసిన పుస్తకంలో నుంచి నిర్దేశిత భాగంపై సభ్యులు అందరూ మాట్లాడతారు. అలా జరగడం వల్ల తాజా ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు ఎరుకలోకి రావడంతో పాటు, మూల గ్రంథాలు, పుస్తకాలు చదివి సమిష్టిగా చర్చించడం ద్వారా లోతైన అవగాహన ఏర్పడుతున్నది.
కాషాయ ఫాసిజం, హిందూత్వ తీవ్ర జాతీయ వాదం, మైనారిటీ ఛాందసవాదం నుంచి నయా ఉదారవాద వనరుల దోపిడీ, అనేక ప్రజా విప్లవాల చరిత్రలు, సైన్స్, భారతదేశ చరిత్ర, పురాణాలు, పెట్టుబడి పరిచయ గ్రంథాలు, గతితార్కిక చారిత్రక భౌతికవాదం, ప్రపంచ మహానీయుల జీవిత చరిత్రలు, కళలు, సాహిత్యం అనేకానేక అంశాలూ గ్రంథాలపై పన్నెండు సంవత్సరాల కాలంలో స్టడీ సర్కిల్ అధ్యయనం చేసింది. అప్పుడప్పుడు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటి గ్రంథాలు వాటి సారాంశాలు కూడా స్టడీ సర్కిల్లో చర్చకు వచ్చినప్పుడు మరింత వైవిధ్యభరితంగా నడుస్తుంది.
ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం తోపాటు వివిధ సందర్భాలలో ప్రత్యేక స్టడీ సర్కిల్స్, సెమినార్లు నిర్వహించి ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడం జరుగుతున్నది. కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి సందర్భంగా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా సెమినార్ నిర్వహించి ప్రముఖుల సందేశం అందించడం జరిగింది.
అధ్యయనం ప్రజల నుంచి చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది. వైరా మున్సిపాలిటీ పరిధిలో లాలాపురం గ్రామంలో డెంగ్యూ జ్వరంపై ప్రజలు చేసిన ఖర్చుపై సర్వే చేయగా అనేక ఆసక్తి కరమైన విషయాలు బయటకు వచ్చాయి. 425 కుటుంబాలకు చెందిన 964మంది రెండు సీజన్లలో జ్వరాలు వచ్చి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తంగా ప్రభుత్వ వైద్యం పొందిన వారు ఒకశాతం లోపు కాగా, 70శాతం మంది ఆర్‌యంపి పైనే ఆధారపడి వైద్యం చేయించుకున్నారు. మిగతా ప్రజలు జిల్లా కేంద్రంలో ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందారు. వైరా కేంద్రంగా అనేక రైతాంగ ఉద్యమాలు జరగటానికీ, ప్రత్యేకించి చెరుకు గిట్టుబాటు ధర, వైరా రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి పై వేలాది మంది రైతులతో రైతు హారం, కల్తీ విత్తనాలు, కొనుగోలు కేంద్రాల సమస్యలపై కృషికీ వైరా స్టడీ సర్కిల్ ప్రేరణగా నిలిచింది.
స్టడీ సర్కిల్ స్పూర్తితో వైరాలో ''బోడేపూడి కళానిలయం'' అనే సంస్థ ఏర్పాటు చేసి ప్రతీ ఆదివారం అధ్యయన కృషిలాగే ప్రతి నెలా మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో గత ఎనిమిదేండ్లుగా వైద్య శిబిరం నిర్వహిస్తూ వేలాది మంది ప్రజలకు ప్రముఖ వైద్యుల చేత ఉచిత వైద్య సేవలు అందించటం జరుగుతుంది. ''ఆచరణ కోసం అధ్యయనం''అనే లక్ష్యంతో సాగుతున్న వైరా స్టడీసర్కిల్ పుష్కరకాలం పూర్తి చేసుకోవడం స్పూర్తిదాయకం.
- బొంతు రాంబాబు
సెల్:9490098205