Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాఖీ వచ్చిందంటే చాలు అన్నయ్యా, చెల్లెమ్మా అంటూ పాటలు, వాళ్ళ ప్రేమని చూపించే సినిమాలు టీవీల్లో, రేడియోలో రావడం మనకు మామూలు విషయమే. కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు బాగా చూపెడతారు, సెంటిమెంటు పండిస్తారు. చేసేవాళ్ళు కళ్ళలో గ్లిసరిన్ వేసుకున్నా చూసేవాళ్లకు మాత్రం దాని అవసరం లేకుండానే కుండలు కొద్దీ నీళ్లు... అదే కన్నీళ్లు వచ్చే విధంగా తీయడం మనవాళ్ళ ప్రత్యేకత. ఇక ఆ ఊరిలో ఉండే రాజకీయాలు, పెళ్ళైన చెల్లెలికి లేదా అక్కకు తమ్ముడు లేదా అన్నకు మధ్య ఒక బావ వచ్చి ఉంటాడు, ఆయనకూ ఓ కుటుంబం ఉంటుంది కాబట్టి అందులోనూ రాజకీయాలు ఉండడం చాలా మామూలు విషయాలు. ఇక వాటి మధ్య సినిమానూ సీరియల్నీ తీయడం కథ రాసే వారికీ, దర్శకుడికీ వదిలేసి, కాలు మీద కాలు వేసుకొని మన కళ్ళను, చెవులను, చివరాఖరికి మెదడును కూడా స్క్రీనుకు అప్పగించడం చేస్తే చాలు. మిగతావన్నీ సమయంతో పాటు కరిగి పోతాయి మనకు తెలియకుండానే. ఎవరికి వాళ్ళు ఏ పాప్ కార్నో, చిప్సో లేదా ఇంకోటో తింటూ చూడొచ్చు. భోజనం టయమై వంట ఇంకా మొదలు పెట్టలేదన్న విషయం గుర్తొచ్చి ఇక లాభంలేదని తిండి పార్శిళ్ళు తెచ్చే టొమాజోకో, గిస్వీకో ఆర్డరు పెట్టవచ్చు. ఆ వచ్చిన పార్సిల్లోని పదార్థాలు అందరితో పాటు అన్నా చెల్లీ ఒకరికొకరు కొసరి కొసరి వడ్డించుకోని తినవచ్చు కూడా. ఇవన్నీ ప్రపంచీకరణ ప్రేమలని కొందరు మనసులో అనుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు.
ఎదో టైటిల్ కోసమని అన్న చెల్లెలు అని పెట్టాల్సి వచ్చింది కానీ, అన్నా తమ్ముడు అని కూడా ఉండొచ్చు. అంతెందుకు అన్న ఒక పార్టీలో ఎంపీగా ఉంటే తమ్ముడు ఇంకో పార్టీలో ఎమ్మెల్యేగానో లేదా పెద్ద కార్పొరేషన్ చైర్మన్ గానో ఉండడం మనం చూసాం. అలాగే నాన్న, కూతురు లేదా కొడుకు ఇలా వేరు వేరు పార్టీల్లో ఉండి ఒకే ఇంట్లో ఉన్నవాళ్లను మస్తు మస్తుగా చూశాం, చూస్తున్నాం. తమ్ముడు ఎప్పుడూ అన్నను విమర్శించినట్టు కనిపిస్తుంటాడు. అన్న మౌనంగా ఉంటాడు. ఎప్పుడో పిలిపించి మాట్లాడతాడు. ఇలా రాజకీయాల్లో రకరకాల సీన్లు చూడొచ్చు మనం.
రాజకీయాల్లో విచిత్రమైన బంధుత్వాలు పనిచేస్తుంటాయి. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, తోడల్లుడు, తోడికోడలు ఇలాంటివాటికంటే బావా బావమరుదుల రాజకీయ బంధాలు చాలా బలంగా ఉంటాయని మనకు చాలా ఉదాహరణలు దొరుకుతాయి. మహాభారతమంతా రాజకీయమే కాబట్టి వాటిలో కొన్ని గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. కృష్ణుడు, అర్జునుడు ఎంత జిగిరీ దోస్తులో అందరికీ తెలుసు. అదే కృష్ణుడికి ధర్మరాజు, భీముడు ఎంత క్లోజయినా అర్జునుడే ఎక్కువ. బలరాముడికి దుర్యోధనుడు మంచి దోస్తు. ఆ బావమరిది కోసం కురుక్షేత్రమంత మహా యుద్ధం జరుగుతుంటే తమ్ముడి సెంటిమెంటేమో కానీ దుర్యోధనుడి కోసం ఏ వైపు పాల్గొనకుండా ఉన్నాడన్న విషయం గ్రహించాలి. అలా పైన చెప్పుకున్న బంధాలకంటే బావా బావమరిది అనుబంధం ఎప్పుడూ స్పెషలే.
అన్న, చెల్లి, తమ్ముడు వీళ్ళవే కాదు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పిన మార్క్సు మహనీయుని మాటలు బాగా గుర్తు పెట్టుకోవాలి మనం. అన్నా చెల్లెలు కానీ, అన్నా తమ్ముడు కానీ, లేదా దాయాదుల విషయంలో కానీ ఎందుకు బంధాలు గట్టిగా ఉండవు. అదే బావ బావమరిది లేదా మామ అల్లుడు బంధాలు ఎందుకు బాగుంటాయి అంటే మళ్ళీ ఆయన చెప్పిన ఆర్థిక సూత్రమేనన్న విషయం మనసులో ఉంచుకోవాలి. బావకు బావ మరిదికి ఎటువంటి ఆర్థిక సంబంధాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ అవి తాతలు తండ్రులనాటి ఆస్తులకు సంబంధించి ఉండవు. కాబట్టి వైరం తక్కువ. అది రాజకీయాలకూ పాకుతుంది. అందుకే ఒకరి పట్ల ఒకరు కాస్త సాప్టుగా ఉంటారనిపిస్తుంది. ఇక తోడల్లుళ్లు కూడా రాజకీయాల్లో కలిసి పని చేయవలసి వస్తుంది కానీ అవి మామ ఉన్నన్నిరోజులు లేదా మామ వీళ్ళతో సఖ్యతగా ఉన్న రోజుల్లో ఉన్నట్టు మామతో విభేదించాక ఉండవని తెలుసుకోవాలి.
నాన్న మొదలు పెట్టిన పార్టీలో ఉన్న బంధాలు నాన్న పేరు మీద పెట్టిన పార్టీలోనూ ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ఎవరి ఇష్టం వారిది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు లేనట్టే బంధాలు కూడా పెద్దగా శాశ్వతమైనవని అనుకోరాదు. ఈ ఊరినుండి ఆ ఊరికి ఎంత దూరమో, ఆ ఊరినుండి ఈ ఊరికి అంతే దూరమని తెలుసుకోవాలి. ఇవన్నీ ఏ ఐన్ట్సీన్ సాపేక్ష సిద్ధాంతంలోనో, న్యూటన్ చలన సిద్ధాంతాల్లోనో ఉంటాయి మనం నేర్చుకోవచ్చును అనుకుంటే పొరబాటే. అలాగని చాణక్యుడి రాజనీతి సూత్రాలలో ఉండొచ్చునేమో అని చూసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మారుతున్న జనం నాడి ముఖ్యంగా రాజకీయుల ఆర్థికనాడి కరోనా వైరస్ రూపాలకంటే త్వరితంగా మారిపోతోంది. ఎంత పెద్ద రాజకీయ నాడీ వైద్యుడైనా కనుక్కోలేని విధంగా అది లబ్బు డబ్బు లబ్బు డబ్బు డబ్బు అంటూ ఇంకా కొన్ని కొత్త శబ్దాలను కలుపుకొని సాగిపోతోంది.
రాష్ట్రాల్లో ఉండే అన్న చెల్లి బంధాలు కేంద్రంలోనూ అచ్చు గుద్దినట్టు ఉంటాయా లేదంటే ఎలా ఉంటాయి అన్న విషయం తెలుసుకోదలిస్తే అక్కడ ఉన్న పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, మళ్ళీ తమ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుంది మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. తల్లి చాటు బిడ్డలుండవచ్చు. అన్నా చెల్లి ఉండొచ్చు కాని పంచుకోడానికి రాజ్యం ఉండకపోవచ్చు. ఇలా రకరకాలుగా ఉంది మాస్టారూ అనేలా కూడ ఉండొచ్చు.
ఇక కొన్ని చోట్ల దీదీ అని పిలువబడే అక్కలుంటారు. ఇంకొన్ని చోట్ల అమ్మ అని గౌరవంగా పిలుచుకునే వారూ ఉంటారు. ఎలా పిలుచుకున్నా, ఎంత అరచుకున్నా అన్ని చోట్లా రాజకీయ బంధాలే ముఖ్యం అదే రాజకీయం. కుర్చీలోకి ఎక్కడమే ముఖ్యం కాని ఎలా ఎక్కావన్నది అవసరం లేని వ్యవహారం. ఎక్కి కూచున్న తరువాత దిగకుండా, ఎవరూ దింపకుండా చూసుకోవడం అన్నకైనా, అక్కకైనా, అమ్మకైనా, చెల్లికైనా, తమ్ముడికైనా ముఖ్యం. రాజకీయ జీవితంలో నిజమైన బంధమదే.
ప్రజలు, మేమూ ఓ రాజకీయ పార్టీ అని అనుకోవడానికి అందరూ అరుణసోదరుల లాగ ఎప్పుడూ సమాజం గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి ఆలోచించేవాళ్ళన్న భ్రమలో ఎవరూ ఉండనక్కరలేదు. నూతన సంవత్సరంలో ఎవర్ని నమ్మాలి అన్న విషయంలో నూతనంగా నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298