Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎద్దుబండితో కొలవకు కాలాన్ని ఎగరవోరు ఎదచీలుస్తూ'' అంటాడు శ్రీశ్రీ ఒకచోట. పదండిముందుకు పదండితోసుకు అన్న మహాకవి కలం నుంచి వచ్చిన ఈ మాటల్లో చాలా అర్థం ఉంది. ''మందగించక ముందుకడుగెరు వెనకబడితే వెనకేనోరు'' అన్న గురజాడ మాటలకు గొప్ప కొనసాగింపు ఈ పిలుపు. కాలాన్ని మాయాజాలం అంటుంటారు, కాలగతి గురించి తత్వాలు పాడూతుంటారు. వాస్తవానికి కాలం ఒక ప్రమాణం. ప్రయాణం. కార్యాచరణే దానికి కొలమానం. అనంత ప్రకృతిలో జీవరాశిలో బ్రహ్మాండమైన పరిణామాలు కాలగతిలోనే కలిగాయి. అప్పుడు చైతన్యవంతంగా జోక్యం చేసుకోగల మానవ మేధస్సు శక్తియుక్తులు లేవు. ముందుకు సాగేకొద్ది చారిత్రిక పరిణామాలూ, సామాజిక రాజకీయ మలుపులలో సమిష్టి మానవ ప్రయత్నం కీలకపాత్రవహిస్తున్నది. ఉద్యమాల నుంచి విప్లవాలవరకూ ఇందుకు ప్రతిబింబాలే. ఈ క్రమంలోనే కాలానికి ఒక గణన పరిగణన ఏర్పడ్డాయి. సంవత్సరాలు, దశాబ్దాలు అందులో కొండగుర్తులు. కాలం వెనక్కు నడవదు. తాత్కాలికమైన పరిణామాలు కష్టనష్టాలు ఎలా ఉన్నా మానవ గమనం కూడా దీర్ఘకాల దృష్టిలో వెనక్కు పోదు.
విఘాతాల మధ్యనే విజయాలు!
2020 తీవ్రమైన కరోనా, 2021లో రెండవ విడత చూసిన మానవాళి ఇప్పుడు అప్రమత్తత ఆశ మేళవించి ఒమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నది. అలాగే రైతాంగ వ్యతిరేక శాసనాలను వెనక్కు కొట్టిన ప్రజా ఉద్యమం మిగిలిన సవాళ్లను కూడా ఢకొీనడానికి సమాయత్తమవుతున్నది. ఏపీలో రాజధానికి సంబంధించిన వివాదాస్పద వికేంద్రీకరణ చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. తెలంగాణలో వరికొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమం చేపట్టవలసిన స్థితి ఏర్పడింది. కేరళలో గత నాలుగున్నర దశాబ్దాల వరవడిని తిరగరాసి సీపీఐ(ఎం) నాయకత్వంలోని ఎల్డీఎఫ్ వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కోవిడ్‌పై పోరాటంలో దేశానికి ఆదర్శం చూపింది. చిలీ వంటి చోట ఒకప్పుడు అమెరికా ఆ దేశ అధ్యక్షుడు అలెండీని బలితీసుకుని ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇప్పుడు తిరిగి అదేచోట అనేక ప్రతికూలతల మధ్య ప్రగతిశీల శక్తులు విజయం సాధించాయి. గతంలో ప్రతీపశక్తుల తాకిడికి గురైన లాటిన్ అమెరికా దేశాలలోనూ ఈ పరిణామం చూశాం. కోవిడ్ సాకుతో నిందా ప్రచారాలకు గురైన చైనా అనూహ్యమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచాన్ని అబ్బురపర్చడమే గాక ఆలోచనలోకి నెట్టింది. ఏ విధంగా చూసినా 2021 విశ్వాసాన్ని పెంచి భవిష్యత్తుపై ఆశ కలిగించి నిష్క్రమించింది ఆత్మవిశ్వాసంతో 2022 మొదలైంది.
కోవిడ్‌కు వాక్సిన్ వైజ్ఞానిక విజయమైతే దానివల్ల దేశంలో ఉత్పన్నమైన విపత్కర పరిస్థితులకు తగిన చర్యలను కొంతైనా సాధించడం పోరాటం వల్లనే సాధ్యమైంది. బీజేపీ మతరాజకీయాలు, కార్పొరేటీకరణ ముప్పు గురించి వామపక్షాల హెచ్చరికలు నిజమని నిరూపిస్తూ గుంటూరులో జిన్నా టవర్, హైదరాబాద్పేరు భాగ్యనగర్‌గా మార్పు వంటి కృత్రిమ కుటిల సమస్యలు రగిలించడం చాలామంది కళ్లు తెరిపించింది. విశాఖ ఉక్కు అమ్మకం పాటతో సహా అన్నిటినీ ప్రయివేటీకరించే పథకాలు వివరణ అవసరం లేని ఉదాహరణలుగా ముందుకొచ్చాయి. ఇతర రంగాలను చూస్తే జైభీమ్లాంటి చిత్రం న్యాయం సామాజిక న్యాయం కోసం పోరాడేవారికి ఉత్సాహమిచ్చింది. ఏడాది చివరలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రజాస్వామిక భావాలుగల గోరటివెంకన్నకు లభించడం గమనించదగ్గది. కులతత్వాల కుళ్లు రాజకీయాలపై సాధారణ ప్రజానీకానికి కూడా ఏవగింపు కలిగిందిగానీ ఆ శక్తుల కుయుక్తులను ఇంకా ఓడించవలసే ఉంది. మీడియా స్వేచ్చ,Û భావప్రకటనా స్వాతంత్రం కోసం ఉద్యమాలు పెరిగాయి. న్యాయవ్యవస్థ కూడా ఒక మేరకు వీటిని గుర్తించకతప్పలేదు గాని జరగాల్సింది చాలా మిగిలే ఉంది. రైతుల పోరాట విజయంతో కార్మికులు మరోసారి జాతీయ సమ్మెకు సిద్ధమవుతున్నారు. మూడు దశాబ్దాల సరళీకరణ విషమఫలితాలు కండ్లముందు కనిపిస్తున్నా మానిటైజేషన్ పేరిట అన్నిటినీ తెగనమ్మే విధానాలపై వారు సమరశంఖం పూరిస్తున్నారు. ఈ ఉద్యమ పథంలో మహిళాచైతన్యం ఒక ముఖ్యపాత్రవహించిన సంగతి అంతాగుర్తిస్తున్నారు.
కీలక ఎన్నికల వరస
2017లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన సమయంలో కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తమాషా అయిన వ్యాఖ్యానం చేశారు. మనం 2019ని మర్చిపోయి 2024కు సిద్ధం కావడం మెరుగు అని. అంటే ఆ విజయం మోడీని మరోసారి గెలిపిస్తుంది గనక ఆ తర్వాత ఘట్టానికి సిద్ధం కావాలన్నది ఆయన ఉద్దేశం. అంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గడ్ ఎన్నికలలో బీజేపీ దెబ్బతిన్నప్పటికీ వాటిని అధిగమించి యూపీలో 403 స్థానాలకు 312 సీట్లు పొందడం బీజేపీ తిరిగిరావడానికి ప్రధానంగా దోహదం చేసింది. వాస్తవానికి రెండవసారి గెలిచిన బీజేపీ నేరుగా కాశ్మీర్ 370 పైనే దాడి చేయడం, ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని బట్టి చూస్తే ఫరూక్ అన్నదానికంటే కూడా వేగంగానూ తీవ్రంగానూ 2019 ప్రభావం పడింది. 2020, 2021 ముగిసి మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో యూపీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికలు కూడా వాయిదా వేయబోవడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. హైకోర్టులో ఒక న్యాయమూర్తి ఎన్నికల వాయిదా గురించి సూచనగా అన్నమాటల ఆధారంగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. గత రెండు సార్లు యూపీలో సాధించిన సీట్లే బీజేపీని గద్దెక్కించాయని గుర్తు చేసుకుంటే, ఇప్పుడు కూడా ఆ ఫలితాలపై దృష్టి కేంద్రీకరించబడటాన్ని అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఎన్నికల యంత్రాంగం, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా నాయకత్వం అందుకు సదా సిద్ధంగా ఉంటాయి. ఇప్పటికే మోడీ అరడజను పైగా సభల్లో పాల్గొని ప్రచారం మొదలుపెట్టేశారు. 2013లో యూపీలోనే మకాం వేసి కులమత స్థానిక రాజకీయాంశాలను లోతుగా మధించిన అమిత్‌షా ఎలాగైనా మరోసారి గెలవాలని ఎత్తులు జిత్తులు వేస్తూనే ఉన్నారు. ఇక్కడ గెలిస్తేనే అక్కడ(ఢిల్లీ) పల్లవి మొదలుపెట్టారు.
జమిలి కథలు వెనక్కు
ఒక విధంగా 2022 దేశరాజకీయాల గమనం కీలకమైన యూపీ ఎన్నికలతో మొదలవుతుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం నుంచి హరిద్వార్‌లో మతవిద్వేష ప్రసంగాల వరకూ ఈ కోణంలోనే చూడవలసి ఉంటుంది. అమరీందర్ సింగ్ రాజీనామా, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్ బలహీనతలు, ఆమాద్మీ పార్టీ ఆశల మధ్య జరిగే పంజాబ్ ఎన్నికలు కూడా కొంత ప్రభావం చూపిస్తాయి. మొదటి నుంచి తమతో ఉన్న అకాలీదళ్‌ను రైతు ఉద్యమం కారణంగా కోల్పోయిన బీజేపీ మారిన పరిస్థితుల్లో అమరీందర్ సాయంతో గట్టెక్కితే ఎలాగైనా గెలవగలమని ప్రచారం మొదలెడుతుంది. కీలకమైన గుజరాత్, హిమాచల్ 2022 చివరలో ఎన్నికలకు వెళ్లవలసివుంది. కాంగ్రెస్ కోలుకుంటున్న సూచనలు కనిపించని నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తానే ప్రత్యామ్నాయం కావాలని పడుతున్న హడావుడి పరిమితులేమిటో ఫలితాలు చెబుతాయి. మోడీ జమిలి ఎన్నికలకు వెళతారనీ, 2019లో ఏర్పడిన ప్రభుత్వాలకు రెండేండ్ల గడువు మాత్రమే ఉందని పెద్ద ప్రచారమే నడిచింది. బీజేపీ అంతటి దుస్సాహసాలు చేసే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టమై పోయింది. తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు నడుస్తున్నా అధికార టీఆర్ఎస్ కొట్టిపారేస్తున్నది. ఏపీలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళతారనీ, ముఖ్యమంత్రి మారతారనీ నడిచిన కథనాలు నిజంకాలేదుగానీ ఇప్పటికీ ఆ కథలు ఆగడంలేదు. జగన్ కేసుల విచారణ తీరు గమనిస్తే 2022లో వాటి విచారణ పూర్తయ్యే అవకాశం దాదాపు కనిపించదు. కాకుంటే నాయకులు జైలుకు పోతారని బెదిరిస్తున్న బీజేపీ పాచికలేమిటో తెలియదు.
సమగ్ర విధానంతో ముందుకు!
భాగ్యనగర్‌గా హైదరాబాద్ పేరు, కలాంపేరుతో గుంటూరు జిన్నాటవర్ వివాదాలుగా తేవడం తెలుగునాట బీజేపీ అనర్థకవ్యూహాలకు అద్దం పడుతుంది. స్వార్థంతోనే ఇరు రాష్ట్రాల న్యాయమైన కోర్కెలను కూడా తొక్కిపడుతున్నది. మరీ ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, లోటుభర్తి వంటివాటి ఊసే పెట్టుకోవడం లేదు. పైగా ఆలయాలపేరిట మతాల మాటున చిచ్చు రగిలించేందుకు విషపూరిత పథకాలు సిద్ధం చేస్తున్నది. టీడీపీ, జనసేన కూడా బీజేపీతో పోటీ పడినట్టు అదే భాషలో మాట్లాడటం ఆందోళనకరం. అధికార వైసీపీ కూడా తనకూ హిందూత్వ అంటే అనుకూలమని చూపించుకోవడానికి తంటాలు పడుతున్నదే గానీ బీజేపీని సూటిగా ఎదుర్కోవడం లేదు. కేసీఆర్ వరి కొనుగోలు నిరసనలు అంటూనే యాదాద్రికి మోడీ తదితరులను రావించడంలో రాజకీయ యుక్తి చూపిస్తున్నారు. మతసామరస్యానికి లౌకిక వాదానికి పెట్టింది పేరైన తెలుగు ప్రజలు వీటిని ఆమోదించే ప్రసక్తివుండదు. కాకపోతే ప్రాంతీయ పాలకపార్టీలు ఈ ప్రమాదం ప్రత్యక్షంగా ఎదుర్కొనడానికి సిద్ధం కాకపోవడం, పరోక్ష ప్రత్యక్ష పొత్తులకు ఎత్తులకు సిద్ధం కావడం నష్టదాయకంగా మారుతున్నది. రాష్ట్రాల హక్కులపై వనరులపై సాగే దాడిని ఎదుర్కోకపోగా ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేయించాలన్నట్టు మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడవలసిందే గానీ ఆ పేరుతో కేంద్రం పెత్తనాన్ని ఆహ్వానించడం అనుమతించరానిది. సమస్యలపై సముచిత అవగాహనతో, సమగ్ర సమతుల్య విధానాలతో, సమరశీల సంకల్పంతో సాగిపోవడమే ఈ కాలసంధిలో కర్తవ్యం. నిరర్థక వివాదాలతో నిందా ప్రచారాలతో బూతు తగాదాలలో ముంచితేల్చే అవాంఛనీయ ధోరణులకూ అదే సమాధానం. 2022 అలాంటి అర్థవంతమైన కార్యాచరణకూ ఐక్యపోరాటాలకూ దారిచూపాలని ఆశిద్దాం. వివిధ లోపాలను అధిగమించి చైతన్య దీపాలను వెలిగిద్దాం.
- తెలకపల్లి రవి