Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో నిర్వహించిన రోదసి విహార యాత్రలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ కుబేరులైన జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ తాము రూపొందించిన స్ప్రేస్ క్రాఫ్ట్ ద్వారా రోదసి విహార పర్యటనకు వెళ్లివచ్చారు. మరో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా తన స్పేస్ ఎక్స్ సంస్థ ద్వారా రోదసి విహార యాత్ర నిర్వహించాడు. చూడటానికి సైంటిఫిక్ అద్భుతంగా కనిపిస్తున్నప్పటికీ రోదసి విహార యాత్రలు అనే కాన్సెప్ట్ పెరిగితే పర్యావరణానికి పెద్ద హాని జరగనుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ధనవంతులు గా ఉన్న ఒక్క శాతం ప్రజలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నారు. ప్రపంచ జనాభాలో సగం మంది విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా ఈ ఒక్క శాతం ధనవంతులు విడుదల చేసే కర్బన ఉద్గారాలు రెండింతలు అధికంగా ఉన్నాయి. తాజా రోదసి విహార యాత్రలు కూడా అత్యంత ధనవంతులు మాత్రమే చేయగలరు. వీరి వినోదం, ఉల్లాసం కోసం జరపబోయే పర్యాటక యాత్రలు ప్రపంచ మానవాళికి ప్రళయంలా మారనున్నాయి.
ఒక రోదసి ప్రయాణీకుడు వంద కోట్ల జనాభా కన్నా ఎక్కువ నష్టకారి. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం రోదసిలో ఒక స్పేస్ క్రాఫ్ట్ 11 నిమిషాలు పాటు ప్రయాణించడానికి ఒక ప్రయాణీకుడికి 75మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను వదులుతుంది. వాస్తవానికి ఇది కూడా చాలా తక్కువగా వేసిన లెక్క. ఒక అంచనా ప్రకారం ఒక ప్రయాణీకుడికి దాదాపు 200 మెట్రిక్ టన్నుల నుండి వెయ్యి మెట్రిక్ టన్నుల వరకు కర్బన ఉద్గారాలు విడుదల అవుతాయి. అంటే అత్యంత ధనవంతుడు రోదసిలో తన విహార యాత్ర కోసం దాదాపు 200 మెట్రిక్ టన్నుల కార్బన్ను విడుదల చేసి భూ ఆవరణాన్ని విషతుల్యం చేస్తున్నాడు. అదే ప్రపంచ జనాభాలో వంద కోట్ల మంది జనాభా విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఏడాదికి కేవలం ఒక కోటి మెట్రిక్ టన్నుల కన్నా తక్కువగానే ఉంటున్నాయి. ఒక ధనవంతుడి రోదసి విహార యాత్ర ప్రపంచ జనాభా మొత్తం ఏడాది పాటు విడుదల చేసే కర్బన ఉద్గారాల కన్నా దాదాపు వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. మొదటి రోదసి విహార యాత్రలను విజయవంతంగా పూర్తి చేసిన పై ముగ్గురు అపర కుబేరులు దీన్నొక పర్యాటక వ్యాపారంగా మార్చే పనిలో ఉన్నారు. అందులో ఒక సంస్థ రోదసిలో ఒక హౌటల్నే నిర్మించాలని ఆలోచిస్తున్నది. ఈ రోదసి హౌటల్లో మూడు వందల మంది పర్యాటకులు, వంద మంది సిబ్బంది ఉంటారు. ఇక ఇటువంటి ప్రయోగాల ద్వారా పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో ఊహకే అందని విషయంగా ఉంది.
విలాసాల కోసం విషాన్ని కక్కుతున్నారు
ప్రపంచ జనాభాలో ఒక్కశాతం అత్యంత ధనవంతులు తమ విలాసవంతమైన జీవితంతో ప్రకృతితో చెలగాటమాడు తున్నారు. వీరు ఉన్నది ఒక్క శాతమే అయినా వీరి దర్జాతో కూడిన జీవన విధానం మొత్తం కర్బన ఉద్గారాల్లో 15శాతం మేరకు కారణమవుతున్నారు. గత 25ఏండ్ల కాలంలో వీరి ద్వారా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు 60శాతం మేరకు పెరిగాయి. ప్రపంచ జనాభాలో అత్యంత ధనవంతులైన 10శాతం జనాభా అయితే మొత్తం ఉద్గారాల్లో 52శాతం విడుదల చేస్తున్నారు. ఈ ధనవంతులు తమ ఖరీదైన, విలాసవంతమైన జీవితం ద్వారా పర్యావరణంలోకి విషాన్ని కక్కుతున్నారు. ఒక్కొక్కరికి నాలుగైదు కార్లు, బంగళాలు, ప్రయివేట్ హెలికాఫ్టర్లు, విమానాలు, క్రూయిజ్ షిప్లు.. ఇలా విలాసవంతమైన జీవితం వారికి సుఖాన్ని ఇస్తుందేమో కానీ భూమాతకు విషాన్ని పంచుతోంది. ధనవంతులు ఎక్కువగా కొనే ఎస్యువి కార్లు ప్రపంచం మొత్తంలో 2010లో 3.5కోట్లు ఉండగా ప్రస్తుతం అవి 20 కోట్లకు పెరిగాయి. మామూలు కార్ల కన్నా ఎస్యువి కార్లు ఎక్కువ కార్బన్ను విడుదల చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 22వేల ప్రయివేట్ విమానాలు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 12 వేల విమానాలున్నాయి. వీటి ద్వారా వచ్చే కర్బన ఉద్గారాల కారణంగా ఒక్క శాతం అత్యంత ధనవంతులు 15శాతం మేర కాలుష్యానికి కారణమవుతున్నారు. ఒక పక్క తాగడానికి రక్షిత మంచి నీరు లేక ఎంతోమంది చనిపోతుంటే ఈ ధనవంతులు తమకున్న ప్రతి ఇంట్లోనూ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించుకొని నీటిని వృధా చేస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి సురక్షిత మంచినీరు దొరకడం లేదు. కానీ మరోవైపు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్వహణ ద్వారా 60 వేల గ్యాలన్ల (4 లీటర్లు ఒక గ్యాలన్) నీరు వృధా అవుతోంది. అదే ఒక సాధారణ కుటుంబం రోజుకు 152 లీటర్ల నీటిని మాత్రమే వాడుకుంటోంది. ధనవంతుల విలాసవంత మైన జీవితం పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోంది. అదే విధంగా భూమండలం పైన సాధారణ ప్రజానీకానికి మృత్యు ఘంటికలను మోగిస్తోంది.
పర్యావరణ కాలుష్యం కూడా ఒక వర్గ సమస్యే
వర్గ పోరాటం ద్వారా సమసమాజ స్థాపనకు పాటుపడే వామపక్ష శక్తులన్నీ పర్యావరణ కాలుష్యాన్ని కూడా ఒక వర్గ సమస్యగా చూడాలి. ఎందుకంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల నష్టపోతున్న వారిలో అత్యధికులు శ్రామికులు, కర్షకులు, కార్మికులే. అత్యంత ధనవంతుల ధన దాహం ఒకవైపు, విలాసవంతమైన జీవన విధానం మరోవైపు పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కర్బన ఉద్గారాల కారణంగా భూతాపం పెరగడం, సముద్ర మట్టాలు పెరగడం, ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి రావడం, భూకంపాలు, సునామీలు రావడం వీటిన్నింటి వల్లా ఎక్కువ నష్టపోయింది శ్రామికులు, కార్మికులే. 2019 వేసవి కాలంలో వీచిన వడగాల్పుల కారణంగా బీహార్లో ఒక్క రోజులోనే 40మంది చనిపోయారు. వీరంతా కర్షకులు, కార్మికులే. రానున్న దశాబ్ద కాలంలో దక్షిణాసియా, ఆఫ్రికాలలో వాతావరణ మార్పు లవల్ల 17కోట్ల మంది పిల్లలు ప్రమాదంలో పడనున్నారు. వీరంతా కార్మికులు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలే. చాలా ఏండ్ల తర్వాత 2019లో ఆకలి సూచి పెరిగింది. రానున్న ఏండ్లలో ఆహారోత్పత్తి 30శాతం మేరకు పడిపో నుంది. ఆహారానికి 98శాతం డిమాండ్ పెరగ నుంది. 2050 నాటికి 50శాతం మంది ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కో నున్నారు. ఈ సమస్యల న్నింటికి మొదట ప్రభావితమయ్యేది కార్మిక, కర్షకులే. కాబట్టి ఇప్పటి నుండే మేల్కొనాలి.
-గమిడి శ్రీనివాస్, సెల్:9701330013