Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాకు ముందు కాలంతో పోల్చితే అమెరికాలో ఇప్పుడు 40లక్షల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఉద్దీపన కోసం బైడెన్ ప్రవేశపెట్టిన ప్యాకేజీలు ఇప్పుడు సంక్షోభంలో పడ్డాయి. అమెరికాలోనేగాక ఇతర పెట్టుబడిదారీ దేశాలలో కూడా ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు కారణం. అమెరికాలో ప్రస్తుతం బ్యాంకు వడ్డీ రేట్లు దాదాపు సున్నా స్థాయిలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు పెంచాలని అమెరికన్ ఫెడరల్ రిజర్వు బోర్డు (మన రిజర్వు బ్యాంకు వంటిది) నిర్ణయించింది. దాంతో ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఉద్దీపన పథకాల అమలు ఇంకా కష్టం అవుతుంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కుంటుబడుతుంది. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకే మొనగాడు అమెరికా. ఆ దేశపు కరెన్సీ 'డాలర్' అంటే బంగారంతో సమానంగా ప్రపంచమంతటా పరిగణించ బడుతోంది. అందువల్లనే అక్కడినుండి పెట్టుబడి బైటదేశాలకు ఉడాయించే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను కోలుకునేలా చేయగల శక్తి అక్కడి ప్రభుత్వానికి ఎంతగా పరిమితం అయిపోయిందో ఈ పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఇది ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో కొత్తగా ముందుకొచ్చిన మరో మౌలిక వైరుధ్యం. దీనిని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి.
20వ శతాబ్దపు బూర్జువా ఆర్థికవేత్తలందరిలోనూ అత్యంత ముఖ్యుడు జాన్ మేనార్డ్ కీన్స్. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న సద్యోజనిత స్వభావం వల్లనే నిరుద్యోగం ప్రబలుతుందని, ఇదే దానిలోపమని ఆయన విశ్లేషించాడు. దానికి పరిష్కారం రాజ్యం జోక్యం చేసుకోవడమేనని ఆయన చెప్పాడు. ఆ జోక్యం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ లోపాన్ని సరిచేయవచ్చునని కీన్స్ జోస్యం చెప్పాడు. అయితే, పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని సంతరించుకున్నాక ప్రభుత్వ జోక్యం అన్నది సాధ్యం కాదని తేలిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆ యా దేశాల ప్రభుత్వాలను బలహీనపరచడంతో ఆ ప్రభుత్వాలు తమ తమ దేశాలలో స్థూల డిమాండ్‌ను పెంచడానికి అవసరమైన జోక్యం చేసుకోలేనంతగా చతికిలబడ్డాయి. కాని ఒకే ఒక్క దేశం ఇంకా అటువంటి సామర్థ్యం కలిగివుందని ఇంతవరకూ భావిస్తూవచ్చారు, అదే అమెరికా. ఆ దేశపు కరెన్సీ డాలరు దాదాపు బంగారంతో సమానం అని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సైతం భావించింది. అందుచేత ఆ దేశంలో గనుక ప్రభుత్వం జోక్యం చేసుకుంటే అక్కడినుంచి పెట్టుబడులు బైట దేశాలకు ఉడాయించలేవు అని అందరూ అనుకున్నారు. కాని, ఇప్పుడు ఆ దేశంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోగల శక్తిని కోల్పోయిందని బోధపడుతోంది. ఎందుకో చూద్దాం.
తతిమ్మా దేశాలలోని ప్రభుత్వాలు ద్రవ్య పెట్టుబడి విధించిన షరతుల కారణంగా తమ జీడీపీలో ఒకానొక శాతానికి మించి ద్రవ్యలోటును అనుమతించలేవు. ఆ యా దేశాల ద్రవ్య విధానాలు అమెరికన్ ద్రవ్య విధానంతో ముడిపడివున్నాయి. ఆ దేశాలలో వడ్డీ రేట్లు అమెరికాలోని వడ్డీ రేట్లకన్నా తప్పనిసరిగా ఎక్కువగా ఉండాల్సిందే. అలా గనుక లేకపోతే ఆ దేశాలనుండి పెట్టుబడి ఉడాయిస్తుంది. ఈ పరిస్థితి తక్కిన సంపన్న దేశాలలోనూ ఉంది. కాని అమెరికా చాలావరకూ తన అభీష్టం ప్రకారం వ్యవహరించ గలుగుతోంది. తక్కిన దేశాలకన్నా అమెరికాలో ద్రవ్యలోటు అధికంగా ఉన్నా, తక్కిన దేశాలతో పోల్చితే బ్యాంకు వడ్డీరేట్లు తక్కువగా, దాదాపు సున్నా స్థాయిలో ఉన్నా, దానివలన అక్కడినుంచి పెట్టుబడులు ఉడాయించవు అన్న ధీమాతోటే బైడెన్ ప్రభుత్వం ఇంతవరకూ వ్యవహరించింది. కాని ఇప్పుడు మరో సమస్య ఆ దేశాన్ని దొల్చేస్తోంది.
వడ్డీరేట్లు గనుక తక్కువగా ఉంటే ప్రయివేటు పెట్టుబడులు పెరుగుతాయని ఆర్థిక శాస్త్ర పాఠ్య గ్రంథాలు రాసినవారు మనకు బోధించారు. తక్కువ వడ్డీకి రుణం లభిస్తుంది కనుక దానిని తీసుకుని పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువమంది ముందుకొస్తారనివారు చెప్పారు. స్థూలంగా చూస్తే ఇది సరైనదే. కాని ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలో ఆస్తుల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం ఈ రియల్ ఎస్టేట్ బుడగ పెరగడానికి దోహదం చేసింది. అంతవరకూ తక్కువ వడ్డీకి రుణం తీసుకుని పరిశ్రమ స్థాపించి తద్వారా ఉపాధి కల్పనజరగడానికి దోహదపడేది కాస్తా ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్ బుడగ పెరగడానికి మళ్ళింది. అంతకు మునుపు డాట్‌కామ్ బుడగ ఏర్పడింది. అది కాస్తా పేలిపోవడంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వు చైర్మన్‌గా అప్పుడు వ్యవహరించిన అలెక్స్ గ్రీన్‌స్పాన్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించాడు. దానివలన ఈ రియల్ ఎస్టేట్ బుడగ ఏర్పడింది. భూముల, ఇళ్ళ మార్కెట్ విలువలు పెరిగిపోసాగాయి. వాటి యజమానులు ఆ పెరిగిన విలువల ఆధారంగా తమ వినిమయాన్ని పెంచారు. మరోవైపు ఆ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. వినిమయం పెరగడం వలన మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఆర్ధిక వ్యవస్థకు కొత్త ఊపు వచ్చింది.
ఇలా వడ్డీ రేట్లు తగ్గి చవకగా రుణాలు లభించడం వలన భూముల, ఇళ్ళ విలువలు వాటి ''అసలైన విలువ'' కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. అయినా ఎక్కువ ఖరీదుకే వాటిని కొంటూవుంటారు. వాటిపై వచ్చే అద్దెలు తక్కువగా ఉండవచ్చు కాని వాటి మార్కెట్ విలువ అలా అలా పెరుగుతూనే ఉంటుంది కదా అనే ఎక్కువమంది భావిస్తూంటారు. ఒకవేళ మార్కెట్ విలువ గనుక పడిపోవడం ప్రారంభిస్తే అప్పుడే అమ్మేయవచ్చునని అనుకుంటారు. వడ్డీ రేట్లు తగ్గుతూన్న కొద్దీ ఈ విధమైన స్పెక్యులేషన్ ధోరణి పెరుగుతుంది.
అయితే తక్కువ వడ్డీరేట్లు కేవలం రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాత్రమే స్పెక్యులేషన్‌ను పెంచుతాయని అనుకోకూడదు. వినిమయ మార్కెట్లోనూ స్పెక్యులేషన్ పెరుగుతుంది. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్నది సరిగ్గా ఇదే. అక్కడ రియల్ ఎస్టేట్ బుడగ పేలిపోయాక ఆ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఇక ఆ యా సరుకులకు కొరత ఏర్పడినప్పుడో, లేదా వాటి సరఫరాకు తాత్కాలిక ఆటంకాలు ఏర్పడినప్పుడో వినిమయ మార్కెట్లో స్పెక్యులేషన్‌కు అవకాశం వస్తుంది. అయితే అది తాత్కాలికం. కాని కొన్ని రకాల సరుకుల ధరలు ఎంత పెరిగినా, వాటి వాడకం తగ్గిపోదు. కొన్ని రకాల సరుకుల సరఫరాకు ఆటంకం కలగకుండా నిరంతరాయంగా సాగుతూ వుంటుంది. (పెట్రోలు, వాహనాలు, ఔషధాలు, స్కూలు ఫీజులు, విద్యుత్తు వగైనా) మార్కెట్లో రుణాలు తేలికగా దొరుకుతున్నంతకాలం ఈ సరుకుల డిమాండ్ కొనసాగు తూనేవుంటుంది. (వాటి ధరలు ఎంత పెరిగినా సరే.)
ఒకసారి ఆ విధంగా ధరలు పెరగడం మొదలైతే, ఇక అప్పుడు తమ వేతనాలను పెంచాలన్న డిమాండ్‌ను కార్మికులు ముందుకు తెస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వారి వేతనాలను ఎంతో కొంత పెంచాల్సిందే. అలా ముందు ధరల పెరుగుదల, దానివెంట వేతనాల పెరుగుదల - ఇలా ఒక వలయం ఏర్పడుతుంది. ఆ విధంగా సరుకుల కొరత లేకపోయినా, వాటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడకున్నా, వాటి ధరలు పెరిగిపోతాయి. అది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. ఒకసారి ద్రవ్యోల్బణం మొదలైతే ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకోసం ప్రభుత్వం తలపెట్టిన పథకాలను ఆపివేయాల్సివస్తుంది. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి అదే.
ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ చమురు. చమురు ధరలు స్పెక్యులేషన్ కారణంగా అమెరికాలో ఒక ఏడాది కాలంలో 58శాతం పెరిగిపోయాయి. 1980 తర్వాత ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదక్కడ. 1980లో గల్ఫ్ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరిగితే, ఇప్పుడు చమురు ఉత్పత్తి దేశాలు ధరలను పెంచకపోయినా, దాని ధర మాత్రం పెరిగిపోతోంది. దీంతో తనవద్ద దాచిపెట్టిన చమురు నిల్వలను మార్కెట్లోకి పంపి తద్వారా చమురు ధరను నియంత్రించాలని అమెరికా ప్రయత్నిస్తోంది.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో ఆర్థిక విధానాలను రూపొందించేవారు సాధారణంగా వినిమయ సరుకులలో స్పెక్యులేషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహ రించారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే పెట్టుబడులు పెరుగుతాయనో, లేక రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెరుగుతాయనో, మహా అయితే రియల్ ఎస్టేట్‌లో బుడగలు ఏర్పడతాయనో భావించారే తప్ప వినిమయమార్కెట్లోనూ స్పెక్యులేషన్ వస్తుందని వారు ఊహించలేదు. వడ్డీ రేట్లు తగ్గించినందు వలన వినిమయ సరుకుల ధరలు పెరిగి స్థూల డిమాండ్ తగ్గిపోవచ్చునని వారెన్నడూ అనుకోలేదు. కాని ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు రాజ్యం ఏ విధంగా జోక్యం చేసుకుంటే స్థూల డిమాండ్‌ను పెంచగలుగుతుంది? ఇది మరింత క్లిష్ట సమస్య అయిపోయింది.
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంద్వారా డిమాండ్‌ను పెంచితే అందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకం. అయితే డిమాండ్ పెంచడం కోసం ద్రవ్య విధానాన్ని మార్చడానికి మాత్రం వ్యతిరేకం కాదు. ఆ ద్రవ్య విధానం పెట్టుబడిదారుల అభీష్టాలకులోబడి అమలు జరుగుతుంది. కనుక పెట్టుబడిదారీ వ్యవస్థ ఉనికిని, మనుగడను అది ప్రశ్నించదు. మరి ఆ ద్రవ్య విధానాన్ని మార్చినా ప్రయోజనం లేకపోతే ఇక జోక్యానికి మార్గం ఏముంది? ఏవిధంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోగలుగుతాయి? ఏ విధంగా భారీ నిరుద్యోగాన్ని తగ్గించడం సాధ్యమౌతుంది?
వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తెచ్చినా ప్రయోజనం లేనప్పుడు మైనస్ వడ్డీ రేట్లకు ఎందుకు పోకూడదు? అని వాదించేవారున్నారు. వాదనకు అది బాగున్నట్టు అనిపిస్తుంది. కాని బ్యాంకులు తమవద్ద డిపాజిట్లు దాచినవారికి వడ్డీలను ఎక్కడినుంచి తెచ్చిస్తాయి? అప్పుడిక డబ్బు దాచినందుకు వారివద్దనుండి చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇక బ్యాంకుల్లో డబ్బులెవరు దాచుకుంటారు?
ఇప్పుడు ఏ విధంగానూ ఆర్ధిక వ్యవస్థలో జోక్యం చేసుకోగలిగే శక్తి అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారీ దేశానికే లేకుండా పోయింది. ఇక తక్కిన ప్రభుత్వాలకు ఎక్కడ ఉంటుంది? అప్పుడు మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా ద్రవ్యపెట్టుబడి పెత్తనం కిందే నడుస్తున్నట్టు అవుతుంది.
నిరుద్యోగం నిరంతరం కొనసాగుతూన్నప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజవేతనాల వాటా ఎదుగూ బొదుగూ లేకుండా స్తంభించిపోతుంది. మరోపక్కన కార్మికుల ఉత్పాదకత మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అందువలన ఉత్పత్తి అయే ప్రపంచ సంపదలోని మిగులులో ఎక్కువ వాటా పెట్టుబడిదారులకే పోతుంది. ఇంకోపక్క అధికోత్పత్తి వలన ఏర్పడే సంక్షోభం నానాటికీ తీవ్రమౌతూనే ఉంటుంది. అప్పుడు కూడా స్థూల డిమాండ్‌ను పెంచడానికి, నిరుద్యోగాన్ని తగ్గించడానికి తోడ్పడే సాధనమేదీ ప్రభుత్వాల దగ్గర లేకపోతే పెట్టుబడిదారీ వ్యవస్థ శాశ్వతంగా భారీ నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతూనేవుంటుంది. ఆ పరిస్థితి దాని రాజకీయ స్థిరత్వాన్నే దెబ్బ తీస్తుంది. అటువంటి పరిస్థితుల పర్యవసానాలు భారతదేశం వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలమీద చాలా ప్రగాఢంగా ఉండబోతున్నాయి.
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్‌పట్నాయక్