Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి పండగ వేళ నిత్యావసర ధరలు చుక్కలను అంటడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పు, పప్పులతోపాటు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, వస్త్రాల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. చేతిలో చిల్లిగవ్వ లేక రెండు పూటలా తిండి దొరకడం కూడా కొందరికి కష్టంగా మారింది. ఇప్పుడీ ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి కూడా మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారయ్యింది.
ఇంట్లో రెండు, మూడు కూరలు చేసేవారు ప్రస్తుతం ఒక్కదానితో సరిపెట్టుకుంటున్నారు. వేడి నీళ్లతో స్నానం చేసేవారు చన్నీళ్లతో సరి పెట్టుకుంటున్నారు. సంక్రాంతి పండగకు నాలుగు పిండి వంటలు చేద్దామంటే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఓ వైపు కరోనా ఇంకా ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా మందికి ఉపాధి లేక అప్పులు చేసి పండగలు చేసుకునే దుస్థితి నెలకొంది. లీటరు పెట్రోల్ ధర రూ.108, డీజిల్ ధర రూ.101లకు చేరింది. ప్రస్తుతం ప్రజలు వాహనాన్ని ఇంటి నుంచి బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. నిత్యవసరాలకు.. పెరిగిన ఇంధన ధరలు తోడవడంతో చిన్నపాటి వేతన జీవులు వాహనాలకు గుడ్‌బై చెబుతున్నారు. గతంలో రేషన్ దుకాణాల్లో చింతపండు, పసుపు, పప్పులు, పామాయిల్ నూనె తదితర సరకులు ఇచ్చేవారు. కొంత కాలంగా 14రకాల సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ధరలు పెరుగుతున్న వేళ పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి .పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. కూరగాయల మార్కెట్‌కు రూ.500 పట్టుకెళ్తే వెనక్కి ఒక్క పైసా తిరిగి రావడం లేదు. పండగ పూట మరింతగా ధరలు పెరగడంతో ఏం కొనేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో దిక్కుతోచని స్థితిలో సంపాదన మొత్తం ఖర్చులకే చాలడం లేదు. కరోనా విపత్కర పరిస్థితి తర్వాత పేదల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి.
- కె. సతీష్‌కుమార్
సెల్:9848445134