Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యతో వివేకం పొందెను
వివేకంతో విచక్షణ కలిగెను
విచక్షణతో ఉద్యమించెను
ఉద్యమంతో బడుగులకు బాట చూపెను
ఆధునిక భారత సామాజిక ఉద్యమ పితామహుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే సతీమణి, ఉద్యమ సహచరిణి సావిత్రిభాయి ఫూలే 191వ పుట్టిన రోజు వేడుకలను దేశం ఘనంగా జరుపుకున్నది. త్యాగధనుల జీవితాలను, నాటి సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితులను ఎల్లకాలం దాచలేమని, చరిత్రను ఎవరూ చెరపలేరనే దానికి జ్యోతిరావు, సావిత్రిభాయి ఫూలేల జీవితమే నిదర్శనం.
ఈ దేశంలో సామాజిక పొందికను వర్ణవ్యవస్థలో భాగం చేస్తూ కులాల పేరున ప్రజలను విడగొట్టారు మనువాదులు. మనిషిని మనిషిగా, జాతిని జాతిగా చూడని, గౌరవించని అసంబద్ధమైన, అనాగరికమైన వర్ణాశ్రమ, అగ్రవర్ణాల ఆధిపత్య భావాజాలాన్ని ఆత్యంత కఠినంగా అమలు చేశారు. అంటరానితనం కులవివక్షత మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, చదువు, సంపద హక్కులు లేకుండా శూద్రులను, ఆతిశూద్రులను, మహిళలను అణచివేశారు.
ఏ వ్యవస్థలోనైనా ఆ వ్యవస్థలో బలంగా అమలవుతున్న సంస్కృతి, సాంప్రదాయం, కట్టుబాట్లు, పీడన, అణచివేత, ఆధిపత్యం, ఆర్థిక వ్యత్యాసాలకు వ్యతిరేకంగా నిలబడటం, ఎదురీదడం అంతసులభమైనది కాదు. అందులో మరీ భారతదేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ పడగనీడలో సమాజాన్ని ఎదురించడమంటే జీవితాన్ని ఫణంగా పెట్టడమే. అయినా ఫూలే దంపతులు ఆధిపత్యం, అసమానతలు, బ్రాహ్మణీయ విషపూరిత భావజాలంపై జీవితమంతా పోరాడారు. సమాజం ఈసడించినా, ఎక్కిరించినా, అవమానాలు చేసినా బెదిరించి, దాడులు చేసినా భయపడక, తలొగ్గక బాలికలకు విద్యనందించి, అనేక పాఠశాలలను స్థాపించి దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గడించింది సావిత్రిబాయి.
మనదేశంలో మనువాదం ప్రకారం స్త్రీ చదువుకు, సంపదకు అనర్హురాలు. అసలు స్త్రీని ఒక మనిషిగా కూడా మనువాదం గుర్తించదు. కానీ పైకి మాత్రం స్త్రీలను ఆరాధిస్తున్నట్లు, కొలుస్తున్నట్లు ప్రచారం చేసుకుంటారు. భారతమాత, చదువులతల్లి సరస్వతి, భూదేవి, గోమాత, ఇలా తామే స్త్రీని గౌరవిస్తున్నట్లు నటిస్తారు. నిజంగానే స్త్రీకి ఇంత ప్రాధాన్యత నిచ్చినట్లయితే చదువుకు, సంపదకు ఎందుకు దూరముంచినట్లు? ఒక వర్గానికి చదువును నిరాకరించిన సరస్వతి చదువుల తల్లి ఎలా అవుతుంది? అందుకే చదువును స్త్రీలకు శూద్రులకు, అతిశూద్రులకు నిరాకరించిన మనువాద సమాజాన్ని ధిక్కరించి, ఎదిరించి బాలికలకు శూద్ర, అతిశూద్రులకు స్త్రీలకు విద్యనందించి, వారి జీవితాలలో వెలుగునింపిన సావిత్రిభాయి ఫూలేనే నిజమైన చదువులతల్లిగా గుర్తించాలి.
మహిళలు ముందుండి ప్రశ్నించడమే పాపంగా భావించే నాటి సమాజంలో స్త్రీల హక్కులకై గళమెత్తింది. ''మహిళ హక్కులే మానవహక్కులు'' అని నినదించి 1852లో మహిళా సేవా మండల్‌ను ఏర్పాటు చేసింది. వారికి అండగా అనేక ఉద్యమాలు నడిపి వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. నాటి ఆమె స్ఫూర్తిదాయకమైన వీరోచిత పోరాటం నేటి మహిళలకు, ఎన్నటికీ ఆచరణీయమైనది. అనుసరించదగినది. ఇంటగెలిచి రచ్చ గెలవాలని సామెత. రెండింటిలో గెలవడం, రానించడం అంటే చాలా కష్టం. ముందే పురుషాదిక్యత, బ్రాహ్మణీయ బావజాల సమాజం. విరుద్ధ భావాలు, ఆలోచనలు గలవారు భార్యా భర్తలుగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, సహకరించుకోకుండా ఉండివుంటే ఈ సమాజం త్యాగధనులను, మహాత్ములను, వీరులను చూసేది కాదు.
ప్రేమ ఒక్కటే ఆదర్శవంతమైన జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని నిలబెట్టజాలదు. ప్రేమతో పాటు ఒకరినొకరు గౌరవించుకోవడం, మనోభావాలను అర్థం చేసుకోవడం అంతకుమించి అభిప్రాయాల్లో, ఆలోచనలో, భావాలలో, భావనలో ఏకీకృతంగా ఉన్నప్పుడు ఆ దాంపత్య జీవితం ఎన్నికష్టాలైనా ఒడిదుడుకులున్నా అవమానా లెదురైనా లక్ష్యం కోసం మరింత ఔన్నత్యంగా ఉండటానికి, ఆదర్శంగా జీవించడానికి ఉపకరిస్తుందనడానికి ఉదాహరణ మన ఫూలే దంపతులు. కరుడుగట్టిన బ్రాహ్మణీయ, భూస్వామ్య సమాజంలో మనువాదానికి ఎదురొడ్డి జీవించడం సాధారణ విషయం కాదు. అదే కాలంలో మార్క్సు, జెన్నీల దాంపత్య జీవితం కూడా పెట్టుబడిదారులకు సవాలుగా నిలిచి ఒకరికొకరు తోడుగా నిలబడి తుదకంటూ ఆశయపథంలోనే సాగింది. ఫూలే మరణంతో కూడా సావిత్రిభాయి తన మనోధైర్యాన్ని కోల్పోలేదు. అత్యంత దైర్యసాహసాలను ప్రదర్శించింది. పెంపుడు కొడుకు యశ్వంత్‌ను ఫూలే చితికి నిప్పంటించకుండా బ్రాహ్మణ సమాజం నిలువరించింది. చివరికి తానే తన భర్త చితికి నిప్పంటించి మనువాదులకు సవాలు విసిరింది. అంతేకాదు వితంతువుల శిరోముండనాలకు వ్యతిరేకంగా క్షౌరయుకు లను ఏకం చేసి ఉద్యమం నడిపింది. బాల్య వివాహాలను అడ్డుకున్నది. నిత్యం సమాజంలో ఘర్షణ వైఖరితో, ప్రతిఘటిస్తూనే సహాయ, సేవా కార్యక్రమాలు చేపట్టింది. తనలోని భావాలను ఆలోచనలను కవితల, కథల రూపంలో వెల్లడించింది. ప్లేగు వ్యాధిగ్రస్తుల సేవలో, అది అంటువ్యాధి అని తెలిసినా వెరవక వారికి సహాయ కార్యక్రమాలు చేస్తూ తాను కూడా ఆ వ్యాధి బారినపడి ఆ సేవలోనే తుదిశ్వాస విడిచింది.
సావిత్రిభాయి ఫూలే ఉద్యమకారిణిగా, మంచి గృహిణిగా, సేవకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, రచయితగా శూద్రులకు, అతిశూద్రులకు, స్త్రీలకు సమాజానికి సేవలందించిన గొప్ప విప్లవకారిణి. వారి త్యాగాల వల్ల, కృషివల్ల స్త్రీలకు నేడు అనేక హక్కులు అవకాశాలు లభించాయి. అందరితో సమానంగా అన్ని రంగాలలో రానిస్తున్నారు. అయినా నేటికీ మహిళలపై ఏదో రూపంలో పురుషాధిక్య భావజాలం దాడి చేస్తూనే ఉన్నది. కుట్టబాట్లు, సాంప్రదాయాల పేరిట వివక్షత, అంటరానితనం కొనసాగుతూనే ఉన్నది. భక్తి మూఢనమ్మకాలు బడుగు- బలహీన వర్గాల మహిళల్లో అధికంగా ఉన్నాయి. ఆర్థిక, సామాజిక అంతరాల ప్రభావం మహిళల్లోనే ఎక్కువగా కొనసాగుతున్నది. అందుకే నేటి మహిళ సనాతన ఆచారాలను, ధర్మాలను వదిలి శాస్త్రీయ భావాలను అలవర్చుకోవాలి. సావిత్రిబాయిఫూలే జీవితాన్ని ఆధర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడలో నడవాలి.
-దయ్యపు రాధాకృష్ణ,
సెల్:7730877841