Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సభీకా ఖూన్ హై షామిల్ యహాం కి మిట్టీ మే కిసీకె బాప్‌కా హిందుస్తాన్ థోఢ హై..!'' అనగా, అనేకుల రక్తంతో ఈ నేల తడిసి ఉంది, ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు.. అంటారు రాహత్ ఇందోరీ. కానీ, డిసెంబర్ 17-19 తేదీల మధ్య హరిద్వార్‌లో జరిగిన ''ధర్మ సంసద్'' (మత గురువుల సమావేశం) సభలో హిందూ మతానికి సంబంధించిన సాధువులు సంతులు చేసిన ప్రసంగాల అనంతరం ఈ దేశంలో హిందువేతరులంతా శరణార్థులా? అన్న భయాందోళన కలుగు తోంది. ఇప్పటి వరకూ ఏ దేశ పార్లమెంటులోనూ లేదా ఏ మతపు పార్లమెంటులోనూ (సంసద్) ఇలా ఒక మతస్తులను చంపి అంతమొం దించండీ అంటూ తీర్మానాలు చేయలేదు. నేడు భారత్‌లో ధర్మ సంసద్ ద్వారా పిలుపివ్వబడిన ఈ ''జెనోసైడ్'' జరగనీ అన్నట్టు ప్రభుత్వం కూడా ఏ మాత్రం దృష్టి పెట్టకుండా ఉన్నదంటే ఇది పరోక్ష ప్రోత్సాహమే. ఇది ఖండనీయమైన చర్య. ఇంతటి బహిరంగ మారణకాండకు కాలు దువ్విన వారందరూ శిక్షార్హులే. ఇంతటి ద్వేష పూరిత ప్రసంగాలపై వెంటనే స్పంధించి దోషులను అరెస్టు చేయాల్సిన పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించడం ప్రజాస్వామ్య పరిహాసమే. మత పరమైన పాలనకు పెద్ద పీట వేసే ప్రభుత్వం కేంద్రంలో స్థిరపడ్డాక ఒక క్రమానుసారం పరమత అసహనం స్పష్టమవుతోంది. మొదట్లో బీఫ్ పేరుమీద దాడులు జరిపి చంపారు. ప్రభుత్వ రంగాల నిర్వీర్యంతో పర్మనెంట్ ఉద్యోగాలకు ఎసరు పెట్టి కార్మికులు సంఘటితమయ్యే అవకాశం లేకుండా చేశారు. మత పరమైన విభజన కోసం సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ పరస్పర ద్వేషాగ్నిని రగిల్చి, ఒక సంస్థలోని ఉద్యోగులే జాతీయ వాదం పేరుమీద స్వీయ సంస్థల ప్రయివేటీకరణకు వంత పాడేలా చేశారు. ఆ తరువాత వస్త్ర ధారణపై, సంస్కృతులపై ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఏకంగా నరికి చంపే ప్రత్యక్ష మారణకాండకు సిద్ధమవుతున్నారు.
ఈరోజు ఇలా వ్యతిరేకించ బడిన వారి కన్నా దానిని తప్పు అని చెప్పడంలో విఫలమవుతున్న వాళ్ళూ శరణార్థులే! ఈ రోజు దేశంలో అస్థిత్వం కోల్పోతున్నది మైనారిటీ మతస్తులే కాదు, చంపడానికీ లేదా చావడానికీ సిద్ధంగా ఉండాలని శతృత్వం నూరి పోస్తూ ఘోర పాతుకానికి ఆజ్యం పోస్తుంటే... దానిని తప్పు అని ఎత్తి చూపడానికి కూడా మాట పడిపోయిన ప్రతిపక్షమంతా శరణార్థులే. ఇలా ఎత్తి చూపకపోవడానికి శక్తిలేక కాదు, అలా చేస్తే తామెక్కడ మెజారిటీ వాదపు ఆగ్రహావేశాలకు బలవుతామేమో అన్న భయం. ఈరోజు హరిద్వార్‌లో సవాల్ విసిరింది ఒక మైనారిటీ మతానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు. ఎంతమంది దానిపై స్పందిస్తారో చూడ్దా మన్నట్టుగా జరిగిన సవాలు అది. దేశంలోని మేధావుల్లో హరిద్వార్‌లో ప్రకటించబడిన విద్వేషాన్ని అంగీకరించని వారే అధికంగా ఉంటారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కచ్చితంగా అంగీకరించవు. అయినా అక్కడక్కడా చిన్న వ్యతిరేక ర్యాలీలు తప్ప దేశమంతా వ్యతిరేకత ఎందుకు పుట్టడం లేదు? హరిద్వార్ సాధువులు సంతులు కూడా ఆశించినది ఇదే! చూద్దాం ఎంత మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారోనని మీసాలు మెలేశారు. ఆశించినట్లుగానే ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించలేదు. వారు ఊహించినట్టుగానే మెజారిటీ మతానికి మెజారిటీ వాదానికి అనవసరంగా మేము ఎందుకు దూరం అవ్వాలి అనుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ తలుపు చాటున దాక్కున్నాయి. ఇక ఏ మతాన్ని అయితే ఉద్దేశించి సదరు వ్యాఖ్యలు చేయబడ్డాయో వారి లోపల ఆగ్రహావేశాలు లేవని కాదు, అంతర్గతంగా ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంటుంది. ఇలాంటి హెచ్చరికలు, ఇలాంటి రెచ్చగొట్టడాలూ మరింత పెరిగిపోతే అగ్నిపర్వతం బద్దలవకమానదు. అయితే దానికి బలి అయ్యేది మాత్రం ఈ సన్యాసులూ వారిని ప్రోత్సహిస్తున్న మార్బలం కాదు, కేవలం సామాన్య ప్రజానీకమే.
సన్యాసం పుచ్చుకున్న వాడు కన్న తల్లి మరణానికి కూడా చలించకుండా స్థితప్రజ్ఞుడై ఉంటాడని వేదాలు వల్లిస్తున్నాయి. మరి ఇలాంటి మారణకాండకు, హత్యా - ప్రతి హత్యలకు మేమే సిద్ధంగా ఉన్నామని సన్యాసులు ప్రకటిస్తూ ఘీంకరిస్తుంటే వేదాలు విలపించవా! సర్వేజనా సుఖినోభవంతు అని పలకాల్సిన నాలుకలు నేడు సాటి మనుషులైన ఒక వర్గాన్ని అంతం చేయండి అని శాసిస్తున్నాయి. మతాల మధ్య దేశాల మధ్య విద్వేషాలూ విబేధాలూ ఉండవచ్చు, కానీ వాటికి హత్యలతో అంతమొందించడమే సమాధానమా?
ఈ దేశం అంతా హిందువులది.. ఈ దేశంలోకి వలస వచ్చిన వాళ్ళు ముస్లింలు క్రైస్తవులు..., ఈ దేశంలోని హిందువు లను మతమార్పిడుల ద్వారా ముస్లింలు, క్రైస్తవులుగా మార్చారు... అంటూ విపరీత ధోరణులు తీస్తున్నారు. ఈ దేశంలో హిందువు లేదా హిందూత్వం అనే పదము 1800 శతాబ్దం వరకు లేనేలేదని చరిత్రకారులు ఒకవైపు చెపుతున్నారు. మరోవైపు ఈ దేశంలో ఎప్పుడూ కూడా హిందూ మతం అని పాటించ బడినట్లు 18వ శతాబ్దానికి పూర్వం ఎక్కడ కనపడదని కూడా చరిత్రకారులు నమోదు చేశారు. మొఘల్ సామ్రాజ్య స్థాపన తోటి భారతదేశంలో ఇస్లాం వేళ్ళూనుకున్నదని వాదించేవారు మరి మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించబడినది కూడా ఇబ్రహీం లోది అనబడే ముస్లిం పాలకుడే అన్న సంగతి మరిస్తే ఎలా? ప్రాచీన చరిత్రలో ప్రాచుర్యం పొందిన జైనిజం బుద్ధిజం కూడా మతాలుగా ఏనాడు చిత్రీకరించబడ లేదు. కాలక్రమేణా ఇప్పటి కాలంలో వాటిని జైన మతము బౌద్ధ మతముగా పిలుస్తున్నారు. ఇదిలా ఉండగా, అవును హిందూ మతం నుండి లేదా ఫలానా వాళ్ళు హిందువులు అని భావింపబడుతున్న దళిత కుటుంబాల నుండి అనేక మతమార్పిడులు జరిగినట్లు మనకు కనిపిస్తున్నది. కానీ సదరు దళితులు తమ మతాన్ని మార్చుకోవడానికి కారణం ఎవరు? ఎందుకు మత మార్పిడులు జరిగాయి? తినే తిండి నుండి కట్టే బట్ట, ఉండే ఇల్లూ, చేసే పని, నేర్చుకోవాల్సిన భాషతో సహా కనిపించని దేవుడికి కూడా అంటరాని వివక్షను చూపడం వల్ల కాదా తమ గౌరవాన్ని తాము వెతుక్కున్నది? గుడిలోకి అడుగుపెట్టా రాదని, అంటరాని వాడివని, పంచముడివని నానా విధాలుగా పుట్టిన బిడ్డకు అంటరానితనాన్ని అంటగట్టిన ఈ దౌర్భాగ్యం నాకెందుకు అని కదా గుడిలోకి ఆహ్వానాన్ని ఇచ్చి తనతో సహా భోజనానికి కూర్చుండబెట్టుకొని, ప్రార్థనల్లో తమలో విలీనం చేసుకున్న ఇతర మతస్తుల మతాలను ఆచరించింది. ఇది కాదా వాస్తవం? అష్టైశ్వర్యాలు ఉన్న ఎవరూ మతమార్పిడులు చేసుకోలేదు. పేదలు మాత్రమే తమను ఇబ్బంది పెట్టి తమ జాతిని ఇబ్బందిపెట్టే ఆచారాలను మతాలను త్యజించి స్వేచ్ఛ సమానత్వానికి అవకాశమున్న ఆచారాలను స్వీకరించారు. ఇది కాదా నిజం? ఈ తప్పిదాలను సరిదిద్దుకోకుండా అన్య మతస్తులను చంపేస్తే మత ఉద్ధరణ జరుగుతుందా..?
సన్యాసమంటేనే సకలమూ ఒక్కటని స్వీకరించేది అని మరిస్తే ఎలా? ఈరోజు ఏదైనా మతం ప్రమాదంలో పడింది అంటే ఆ మతం ప్రజలను ఏదో ఇబ్బంది పెడుతున్నది అని అర్థం - ఆ మతం ప్రజలను కట్టుబానిసలా చూస్తున్నది అని అర్థం- కఠినమైన ఆంక్షలు పెడుతున్నది అని అర్థం - మత ఆచారాల్లో ఎక్కడో లోపం ఉందని అర్థం- మత పెద్దల వ్యవహారాల్లో తప్పులు ఉన్నాయని అర్థం. వీటిని సరి చేసుకోకుండా ఇతర మతస్తులను ఇతర మతాలను అంత మొందించాలనే ఆలోచన అవివేకం, అరిష్టం కూడా.
బెంగళూరుకు సంబంధించిన పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య ఉడిపిలో ఒక మీటింగ్‌లో ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి మఠమూ ఒక టార్గెట్ పెట్టుకొని హిందువేతరులను హిందువులుగా మార్చే ప్రక్రియను మొదలు పెట్టాలని, ప్రతియేటా లక్షల కొద్దీ జనాలను హిందూ మతంలోకి మతమార్పిడులు చేయించాలని బహిరంగ పిలుపునిచ్చాడు. కానీ ముస్లింలు క్రైస్తవులు హిందువులుగా మారితే వారిని ఏ కులంలో చేర్చుకుంటారు? వారి తాతముత్తాతలు ఎప్పుడో మత మార్పిడి చేసుకున్నందువల్ల వారు ఏ కులానికి చెందిన వారో తెలియదనుకుందాం. మరి ఇప్పుడు తిరిగి హిందువులుగా మారితే ఒక అగ్రవర్ణం వాడిగా ఈ సమాజం అంగీకరిస్తుందా? సమాధానం ఏంటి? 70ఏండ్ల స్వతంత్ర భారతంలో వెనుక బాటుతనం, అంటరానితనం, స్త్రీలపై వివక్ష, పిల్లలపై అత్యాచారాలు, మర్డర్లు మానభంగాలు, రాజకీయ అవినీతి, ఆర్థిక దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నాయి. అందరూ ఒకే మతాన్ని స్వీకరిస్తే ఇవన్నీ రూపుమాపబడతాయా?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016