Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఉద్యమం ముల్కీ నిబంధనలతో మొదలై 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సుఖాంతం అయిందని అనుకున్నాం. కానీ 317జీ.ఓతో సమస్య మళ్లీ మొదటికి వస్తుందని అనుకోలేదు. ఈ విధమైన పరిస్థితి దాపురించడం శోచనీయం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త రాష్ట్ర ఫలాలు చివరి వ్యక్తికి చేరాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతించాం. ఆ నేపథ్యంలోనే 2018 రాష్ట్రపతి ఉత్తర్వులు దానికి అనుగుణంగా 124 జీ.ఓ, తదుపరి 128 జీ.ఓ., వాటికి కొనసాగింపుగానే 317జీ.ఓ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కానీ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం అనాలో లేదా, ప్రభుత్వం అవగాహానా లేమి అనాలో కానీ 317 జీ.ఓ అమలు అనంతరం వచ్చే సమస్యలను అంచనా వేయలేకపోయారు. ఉన్నత అధికారులతో సమావేశమైన ఉద్యోగ సంఘాలు 317 జీ.ఓ అమలు వల్ల వచ్చే సమస్యలు తెలిసి ఒప్పుకొన్నారో లేదా తెలువక ఒప్పుకున్నారో లేదా అంచనా వేయలేకపోయారో మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.
అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 317 జీ.ఓను రూపొందించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 371డి అధికరణ అవసరం లేదని కొందరు, భౌగోళిక తెలంగాణలో కూడ చాలా అంతరాలు ఉన్నాయని 371డి అధికరణ కొత్త రాష్ట్రంలో కూడా అవసరమని మెజార్టీ సమాజం అభిప్రాయ పడింది. దానికి అనుగుణంగానే కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వెలుబడ్డాయి. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమయ్యింది. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95:5 ప్రకారం కొత్త నియమాకాలు చేపట్టనున్నందువల్ల స్థానికతకు పెద్దపీట వేస్తున్నట్లు అర్థమయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కూడా అదే. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 124 తేదీ 30.8.2018 ప్రకారం 31 జిల్లాలను 7 జోన్లుగా, 2 మల్టి జోన్లుగా ఏర్పరచడం, తదుపరి 128 జీ.ఓ ప్రకారం ముప్పై మూడు జిల్లాలకు అనుమతి పొందడం జరిగింది. అయితే 10జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులను 33జిల్లాలకు కేటాయించుటకు కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికత అనే పదం లేకపోవడం సీనియార్టీ అనే పదం మాత్రమే ఉండటంతో ఏ స్థానికత కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందో, ఏ స్థానికులకు ప్రయోజనం కల్పించాలని కొత్తజిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయో ఆ స్థానికులే ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపుల్లో స్థానికేతరులు అవుతున్నారు. స్థానికతను వదిలిపెట్టి సీనియారిటీని కొలమానంగా తీసుకోవడం వల్ల సీనియర్లు రంగారెడ్డి లాంటి నగర జిల్లాలకు, ఉమ్మడి జిల్లా కేంద్ర పట్టణాలకు పరిమితమై జూనియర్లు గ్రామీణ ప్రాంతాలకే కాకుండా ఏకంగా సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాలకు కేటాయించబడ్డారు. సర్వీస్‌లో సీనియర్ క్యాడర్లో జూనియర్ అయిన ఉపాధ్యాయులు కూడా వేరే జిల్లాలకు కేటాయించబడరు. వీరందరూ పదవి విరమణ పొందేవరకు అదే జిల్లాలో పని చేయాల్సి వస్తుంది. వారే కాక వారి పిల్లలు కూడా వేరే జిల్లాలకు స్థానికులుగా మారి సొంత జిల్లాలో స్థానికేతరులు కాబోతున్నారు. మల్టీజోన్ పోస్టుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వారు ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను వదిలి వందల కిలోమీటర్ల దూరంలో ఉద్యోగాలు చేయబోతున్నారు. జిల్లా పోస్టులు,జోనల్ పోస్టులు, మల్టీ జోనల్ పోస్టులు నిర్ణయించేటప్పుడు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాన్ని తీసుకుని స్కూల్ అసిస్టెంట్ పోస్టు జోనల్ పోస్టులుగా పేర్కొని ఉంటే ఇంత పెద్ద ఆందోళన వచ్చి ఉండేది కాదు. ఏఎన్ఎం, హెడ్ కానిస్టేబుల్, సీనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు జోనల్ పోస్టులు చేసి ఆయా పోస్టులతో సమానమైన, అంతకంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టు జిల్లా పోస్ట్ చేయడం వల్ల ఆందోళన ఇంత తీవ్ర స్థాయిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం మరో ప్రధాన సమస్య స్పాజ్ కేటగిరి. సుమారు 70శాతం ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ కేటగిరిలో ఉన్నారు. సీనియర్ అయిన ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఈ కేటగిరి ద్వారా జీవిత భాగస్వాములను తామున్న ప్రాంతానికి తెచ్చుకునే అవకాశం ఉంది. అదే సమంజసం కూడా. కానీ ఆ పేరుతో కొన్ని జిల్లాలో అక్కడ ఉన్న పోస్టుల కంటే ఎక్కువగా కేటాయించబడే అవకాశం ఉంది. అంతే కాకుండా కేటాయింపులు ఎక్కువగా ఉంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా సరే వారికి న్యాయం చేయాల్సిందే. దీనివల్ల కొన్ని జిల్లాలో మొత్తం సీనియర్లు, మరికొన్ని జిల్లాలో మొత్తం జూనియర్లు కేటాయించబడుతారు. ఈ విధంగా రాబోయే కాలంలో కొన్ని జిల్లాల్లో ఉద్యోగ ప్రకటన ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో పెద్ద మొత్తంలో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉండొచ్చు. ఈ విధానం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా జూనియర్లు కేటాయించబడిన జిల్లాలో పరిపాలన సమర్థత లోపించే అవకాశం లేకపోలేదు.
- జుర్రు నారాయణ
సెల్:9494019270