Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంచెల్ని తుంచేస్తానని
హామీ ఇస్తుందా? ఈ వసంతం.
మతమో, ప్రాంతమో పేరేదేమైనా
నిట్ట నిలువునా చీలిపోయిన మనల్ని
అంటుకట్టి అతికిస్తానని
హామీ ఇస్తుందా? నూతన వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వానం.
గోడల్ని బద్దలు గొడతానని
హామీ ఇస్తుందా? ఈ వసంతం.
గిరి గీసుకొని కులం కొయ్యకు
ఉరి పోసుకుంటున్న మనల్ని
ఒక్కటి జేసి మనుషుల్ని జేస్తానని
హామీ ఇస్తుందా? నూతన వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వనం.
పంజరాల నడుము విరిచేస్తానని
హామీ ఇస్తుందా? ఈ వసంతం.
మూలన కూర్చొని మూతి మీద
వేలు వేసుకుంటున్న మనల్ని
స్వేచ్ఛా పావురాలుగా ఎగరేస్తానని
హామీ ఇస్తుందా? నూతన వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వనం.
నిశ్శబ్దంపై యుద్ధభేరి మోగిస్తానని
హామీ ఇస్తుందా? ఈ వసంతం.
మాటలను దాచుకొని మౌనపు కోటలను
నిస్సిగ్గుగా ఏలుతున్న మనల్ని
శబ్ద ఫిరంగులుగా మారుస్తానని
హామీ ఇస్తుందా? నూతన వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వనం.
నిర్లక్షంపై నికరంగా కత్తి దూస్తానని
హామీ ఇస్తుందా? ఈ వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వనం.
పోరాటాలకు దారులు తెరిచి
వీరులుగా తీర్చిదిద్దుతానని
హామీ ఇస్తుందా? నూతన వసంతం.
అయితే తప్పక పలుకుతా ఆహ్వనం.
నిరాశ నన్ను నడిపిస్తూ
రాయిస్తున్న అక్షరాలు కానేకావు ఇవి.
ఇవి... నా దేహం నిండా
ప్రవహిస్తున్న సందేహాలు !
సమాధాన తీరాల కోసం
నిత్యం జరుగుతున్న మేధో ప్రయాణాలు!!
- బండారు రమేష్
సెల్:9490098251