Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రైతుతో పాటు నేతన్న అప్పుల్లో... ఆత్మహత్యల్లో''
మినీ కవితలా అనిపించినా, సామెతలా స్థిరపడిపోతున్నది. పెంచిన జీఎస్టీ (వస్తుసేవల పన్ను) చేనేత మెడపై కత్తిలా వేలాడుతూనే ఉన్నది. ఐదుశాతం నుండి పన్నెండు శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని కేంద్రం ఆఖరి నిముషంలో విరమించుకున్నది. ఫిబ్రవరిలోజరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు అర్థమవుతున్నది. వారణాసితోసహా అనేక పట్టణాల్లో గ్రామాల్లో చేనేత పరిశ్రమ అక్కడ ఇంకా ఉన్నది. ముస్లింలు కూడా పెద్ద ఎత్తున ఈ పరిశ్రమలో జీవిస్తున్నారు.
తర్వాత జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేతపై పన్ను విషయాన్ని సమీక్షిస్తామని ఆర్థికమంత్రి చెప్పడంలోనే ప్రభుత్వ ఆంతర్యం బయటపడుతున్నది. జీఎస్టీ పెంపు అనేది చేనేతకు చావుదెబ్బ అన్న సంగతి వేరుగా చెప్పక్కర్లేదు.
భారతదేశ గ్రామీణార్థిక అభివృద్ధికి వ్యవసాయం - చేనేత ఈ రెండూ కవల పిల్లల వంటివని స్వాతంత్య్రోద్యమంలో చాలామంది నేతలు భావించారు. భారత సాంస్కృతిక ఆత్మకు ప్రతీకగా చేనేత రాటాన్ని కాంగ్రెస్ మువ్వున్నెల జెండాపై ఎక్కించింది.
ఒకనాడు వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం చేనేత కాబట్టి దీనిని ఉపాధి రంగంగా చూడాలనే భావనకు నాటి కాంగ్రెస్ పాలకులు వచ్చేలా చేనేత ఉద్యమాలు నడిచాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలోనే ఇచ్ఛాపురం నుండి మద్రాసు వరకు చేనేత కార్మికుల ఆకలి యాత్ర నడిచింది. తత్ఫలితంగా అప్పుడు ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్, గవర్నర్ జనరల్ రాజాజీ ఒక ప్రత్యేక కమిషన్‌గా ఏర్పడి చేనేతకు చీరలు - ధోవతలు ఉత్పత్తిని కేటాయించే రిజర్వేషన్ చేయక తప్పలేదు. అలాగే చేనేతకు అవసరమయ్యే ముడిసరుకు చిలపలనూలు 50శాతం ఉత్పత్తిని చేసి సక్రమధరకు నూలు మిల్లులు అందించాలనే నిర్ణయం గైకొన్నారు. ప్రయివేటు నూలుమిల్లులు ఈ నిర్ణయాన్ని తమ లాభాల కోసం తుంగలో తొక్కుతున్నారని భావించి సహకార నూలుమిల్లులకు నెహ్రూ ఆధ్వర్యంలోనే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నిర్ణయాలు అమలు, సహకార వ్యవస్థల ఫలితంగా చేనేత పరిశ్రమకు కొంతలో కొంత ఊరట లభించింది. తొలినుండి పాలకుల విధానాలు చేనేతను అంపశయ్యపైనే పడుకునేటట్లు చేసాయి. చేనేత కార్మికుడు వృత్తితో పాటు నిరంతరం జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉన్నాడు.
1985లో రాజీవ్‌గాంధీ ప్రవేశపెట్టిన నూతన జౌళివిధానం, 1998 సత్యం కమిటి సిఫార్సులు, చేనేతకు గొడ్డలిపెట్టులా పరిణమించాయి. వాటికి వ్యతిరేకంగా దేశవ్యప్తంగా చేనేత ఉద్యమాలు పెల్లుబికాయి. కొన్ని రాయితీలు పొందాయి. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ నాయకత్వాన జీఎస్టీ చావుదెబ్బ.
స్వాతంత్య్రం వచ్చేనాటికి దాదాపు ఐదు కోట్ల కుటుంబాలకు చేనేత జీవనాధారం. ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై లక్షలకు పడిపోయిందని ఒక సర్వే తెలుపుతున్నది.2011 లెక్కల ప్రకారం దేశంలో 43లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. అంటే ఈ పదేండ్లలో 13లక్షల కుటుంబాలు చేనేత వృత్తినుండి గల్లంతయ్యాయి. అంటే ఈ వృత్తి కుటుంబాన్ని బతికించలేకపోతున్నదని చెప్పకనే చెపుతున్నది.
విశేషమేమంటే.. ఒడిలో చేనేత అంటే ఇంటెల్లపాది పనిచేసే వృత్తి బిడ్డకు పాలిస్తూ, ఇటు రాట్నం తిప్పుతూ, అటు వంట పనిచేస్తూ ఏకకాలంలో మూడు పనులు చేసే ఏకైక మహిళ చేనేత మహిళే. అందుకే ఏ వృత్తిలో లేనివిధంగా 42శాతం మంది స్త్రీలు ఈ వృత్తిలో ఉంటున్నారు. చేనేత పనిలోనే ఉంటూ కుటుంబం అంతా పనిచేసినా పట్టుమని నెలకు పదివేలు రాని కుటుంబాలు నూటికి తొంభైకి పైగా ఉన్నాయి. అంటే రోజుకు ఉమ్మడి కూలి రూ.350లు మించడం లేదు. అందుకే నిష్టదరిద్రం తాండవిస్తున్నది. అందుకే అభివృద్ధి అని గొంతుచించుకునే పాలకులు ఒకసారి చేనేత వాడలను దర్శిస్తే వాస్తవం తెలుస్తుంది.
కరోనా మహమ్మారి కూడా చేనేతను దారుణంగా దెబ్బతీసింది. పౌష్టికాహారలోపంతో, అనారోగ్యంతో కునారిల్లేవారిని త్వరగానే బలితీసుకున్నది. ఎక్కడికక్కడ వస్త్ర నిల్వలుపేరుకుపోయాయి. కొనే దిక్కేలేదు. అమ్మకాలు పడిపోయాయి. మగ్గాలకు, కార్మికులకు పనిలేకుండా పోయింది. నిశ్శబ్ద శ్మశాన వాతావరణం తాండవించింది. ఇలాంటి నేపథ్యంలో జీవితం పట్ల, భవితపట్ల ఆశలు చిగురింప చేయవలసిన పాలకులు, శవాలుపై బొగ్గులు ఏరుకునే చందంలా వ్యవహరించడం క్రూర పరిహాసమే అవుతుంది.
పైకి ఎంతో నంగనాచి మాటలు.. చేనేత వృత్తి భారతదేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతుంది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనాయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులకు సంపూర్ణంగా మద్దతు నిద్దాం. చేనేతకు చేయూతనిస్తూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ప్రయత్నాలను బలోపేతం చేద్దాం.. అంటూ గత ఏడాది ఆగస్టు7 చేనేత దినోత్సవంనాడు ప్రధాని మోడీ చేసిన ప్రసంగానికి విరుద్దంగా చేతలు ఉన్నాయి కదూ..
అందుకనే ఉద్యమకారులు పాలకులపైపై మాటలకు పొంగిపోక చేతలకే ప్రాధాన్యత ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎవరికైనా ఆచరణే గీటురాయి. వాస్తవంగా చూసినప్పుడు గత ఏడాది కంటే నూలు, రంగులు, రసాయినాల ధరలు 30-40శాతం పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ఇంధన ఖర్చులు వలన రవాణా చార్జీలు తడిసి మోపెడు అవుతున్నాయి. ఇటు ముడి సరుకులు కొనలేక, అటు వస్త్ర నిల్వలు అమ్ముడుపోక అడకత్తెరలో పోకచక్కలా తయారైంది చేనేత కార్మికుని పరిస్థితి. ఆదుకునే చర్యలు కనుచూపులో కానరావడం లేదు. అసలే నామమాత్రంగా ఉండే చేనేత బడ్జెట్ కూడా రానురాను కుచించుకుపోతున్నది. 2014-15లో 621.57కోట్లు ఉన్న బడ్జెట్ 2020-21కి 344.87కోట్లకు పడిపోయింది.
కాగా, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణలో భాగంగా గత ఏడాది అఖిల భారత చేనేత బోర్డును రద్దుచేసింది. అంటే చేనేత వాణిని వినడానికి సైతం కేంద్రానికి ఇష్టం లేనట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో చేనేతను ప్రభుత్వ విధానాల నుండి కాపాడుకునే బాధ్యత విధిగా మరల కార్మికుల నెత్తిన పడింది. బలమైన సమరశీల ఉద్యమాల ద్వారానే ఇది సాధ్యం అని కండ్ల ముందున్న రైతు ఉద్యమం ద్వారా మనకు తెలుస్తున్నది.
- కె. శాంతారావు
సెల్:9959745723