Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ వ్యవసాయ సీజన్లో మిర్చి పంటకు తామర పురుగు నల్లి సోకి లక్షలాది ఎకరాల్లో పంట పూర్తిగా నాశనం అయింది. తెలుగు రాష్ట్రాల్లో రైతులకు పది వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ప్రకతి విపత్తుగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలి. తామర పురుగులు వేరు కుళ్ళుడు వైరస్, తెగుళ్లు వచ్చిన మిర్చి పంటను రైతులు తొలిగిస్తున్నారు. వారిని ఆదుకోవాలి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలలో డిసెంబర్ మూడో వారంలో, జనవరి మొదటి వారంలో పర్యటించి మిర్చి పంటను పరీశీలించి తామరపురుగు ఇండోనేషియా నుంచి వచ్చిన త్రిప్స్ పార్విన్ పైనస్ రకం (విదేశీ కిటాకం)గా నిర్థారించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్), కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఆర్ఏఆర్ఎస్) శాస్త్రవేత్తల బృందం తెలంగాణ రాష్ట్రంలో మిర్చి తోటలపై పురుగు సేకరించి వాటిపై పరిశోధనలు చేసి ఇది ఇండోనేషియాకు చెందిన త్రిప్స్ పార్విన్ పైనస్ రకం పురుగేననితేల్చారు. వాతావారణ పరిస్థితులు ఈ పురుగు ఉదతికి అనుకూలించడంతో విదేశీ తామర పురుగు ప్రభావం వల్ల పంట దెబ్బ తిన్నది అని నిర్థారణ చేశారు. అప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది, ఆంధ్రప్రదేశ్లోను దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
వాణిజ్య పంటలలో అధిక సాగు విస్తీర్ణం ఉన్న పంట పత్తి తర్వాత మిర్చి, తెలంగాణ రాష్ట్రంలో 21-22 సీజన్లో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4,60,000 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగు అయింది. దీనికి తోడు ప్రభుత్వం గుర్తింపు పత్రాలు ఇవ్వని పోడు భూములలో మిర్చి సాగు ఉంది. ఐదు లక్షల ఎకరాలపైగా విస్తీర్ణంలో మిర్చి పంట సాగు ఉంది. ఆంద్రప్రదేశ్లోను ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగు అయింది. మిర్చి ధర 2020-21 సీజన్లో ఆశాజనకంగా ఉండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు విస్తీర్ణం గననీయంగా పెరిగింది. అధిక విస్తీర్ణంలో మిర్చి పంట నష్టం తీవ్రంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట తామర పురగులతో నాశనం అయిందని ప్రాథమిక అంచనా ఉంది. తెలంగాణ రాష్ట్రం తోపాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, కర్నాటక, తమిళనాడు మిర్చి సాగు చేసిన దేశంలోని అన్ని ప్రాంతాల్లో మిర్చి పంట నాశనం అయింది. మిర్చి పది నెలల పంట నారు పోసిన దగ్గర నుంచి రైతు ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మిర్చి పంట సాగుకు ఎకరాకు లక్ష రూపాయలు నుంచి లక్ష ఏభై వేల రూపాయలు ఖర్చు ఉండేది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు లక్షల రూపాయలు పైగా పెట్టుబడి ఖర్చు పెట్టిఉన్నారు. ఇది కాక అదనంగా కౌలు రైతులు ముందస్తుగా ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు చెల్లించి ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో సాగు నీటికి ఎకరాకు పది వేల రూపాయలు వెచ్చించి నీరు కొనుగోలు చేయడం జరిగింది.
జనవరి మొదటి వారంలో సైతం మిర్చి తోటలు రైతులు తొలిగించడం జరుగుతున్నది. ఈ రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలకు కనీస స్పందన లేదు ఎందుకో అర్థం కావడం లేదు. మిర్చి పంట నాశనానికి విత్తన లోపమా? ఎరువులు, పురుగుమందులు వినియోగం లోపమా? కానేకాదు సకాలంలో వైరస్ గుర్తించకపోవడం, రైతు అనుభవానికి అంతుచిక్కని విదేశీ కీటకాలు, ఈ తామర పురుగులను గుర్తించి రైతులను జాగృతం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసమే పని చేస్తున్నట్లు ప్రకటనలు ఉంటాయి. కానీ విదేశీ కీటకాల ప్రభావాన్ని అంచనా వేయడంలో, వాటి నిరోధక మందులు సిఫార్సు చేయడంలో వ్యవస్ధ లోపం కాదా? ఇండోనేషియా నుంచి 2015-16 వ్యవసాయ సీజన్లో వచ్చిన వైరస్ కరోనా వైరస్లాగా రూపాంతరం చెందుతూ ఈ వ్యవసాయ సీజన్లో మిర్చి పంట ను దేశ వ్యాప్తంగా నాశనం చేయగలిగింది.
రైతులకు జరిగిన వేలాది కోట్ల రూపాయల నష్టం బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ అందుకు ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. తామర పురుగుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన మిర్చి రైతులు పంట కాపాడుకునేందుకు పలు విధాలా శొంఠి, వస వెల్లుల్లి, మిరియాలు, బెల్లం రసాలతో పాటు చిప్ లిక్కర్ కూడా ప్రయోగించారు. వరంగల్ జిల్లాలో హౌమి యోపతి మందులు కూడా ప్రయోగించారు. రైతు తనకు తోచిన పద్ధతిలో తన పంట కాపాడు కునేందుకు చేయని ప్రయోగం, శ్రమ లేదు. ఫలితం కన్పించడం లేదు.
మిర్చి పంట సాగు చేసిన రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడం హార్టీకల్చర్ శాఖ బాధ్యత, హార్టీకల్చర్ అధికారులు రైతులకు అందుబాటు లో లేరు శాసన సభ నియోజకవర్గానికి ఒక అధికారి ఉన్నారు. వీరు రైతులకు సలహాలు సూచనలు అందించడం కంటే జిల్లా, రాష్ట్ర అధికారులకు రోజు వారీ నివేదికలు అందించే పనిలో నిమ్మగం అయి ఉంటారు, రైతులు టార్చి లైటు వేసి చూసినా కన్పించరు. 2018 వరుకు కాంట్రాక్టు పద్ధతిలో పని చేసిన క్రింది సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం విధులు నుంచి తొలిగించింది. మిర్చి పంటకు వచ్చిన విపత్తు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించిన రైతులకు ఇది మా పరిధిలో అంశం కాదు. ఇది ఉద్యానవన శాఖ చూడాల్సిన అంశం అన్నారు, ఉద్యానవన శాఖ ఆఫీసులు లేవు.
తెగుళ్లు వైరస్, సోకిన మిర్చి తోటలను ఇప్పటివరకు శాస్తవ్రేత్తలు, వ్యవసాయ అధికారులు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి, యంపీ, శాసనసభ్యులు తమ,తమ నియోజకవర్గాల్లో దెబ్బ తిన్న మిర్చి పంటను ఇప్పటి వరకు పరిశీలించలేదు, రైతులు వారి దృష్టికి తీసుకుపోలేదా? లేక ప్రధాన మీడియాలో మిర్చి పంట నష్టం వార్తలు రావడం లేదా? పత్రికలలో పతాక శీర్షిక వార్తలు వస్తున్నాయి అయినా అధికారపక్షానికి స్పందన లేదు. ఇటీవల రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆన్లైన్ సమావేశం శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు రైతు బంధు కన్వీనర్లుతో నిర్వహించి జనవరి 2 నుంచి 10 తేదీ వరకు గ్రామాల్లో, మండల కేంద్రాలలో రైతు బంధు పధకంపై రైతు ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నైనా మిర్చి రైతులకు జరిగిన నష్టం పై రైతు బంధు కన్వీనర్లు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రస్తవించాలి కదా? అదేమీ లేదు. అంటే సమస్య వీరి దృష్టిలో లేదు అనుకోవాలా? లేక ప్రభుత్వ సూచనతో మౌనంగా ఉంటున్నారా? తక్షణమే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించి మిర్చి పంట నష్టం ప్రకృతి విపత్తుగా తీర్మానం చేసి కేంద్ర సహాయం కోరుతూ పంపాలి. తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా మిర్చి రైతులను ఆదుకోవాలి కానీ, తాను పై భారం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమస్యను గుర్తించ కుండా మౌనం వహించడం తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం. మిర్చి రైతులకు జరిగిన నష్టం జాతీయ విపత్తుగా ప్రకటించాలి అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత ఉంది అని గుర్తించి, మిర్చి రైతులకు జరిగిన నష్టం ప్రకృతి విపత్తు, జాతీయ విపత్తుగా నిర్ణయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది
మిర్చి రైతులకు ఎకరాకు కనీసం లక్ష రూపాయలు పరిహారం, కౌలు రైతులకు లక్ష రూపాయలు తోపాటు అదనంగా కౌలు కూడా కలిపి నేరుగా రైతు బ్యాంకు ఎకౌంటుకు జమ చేయాలి, మిర్చి రైతులకు ఉన్న, ప్రభుత్వ బ్యాంకుల, ప్రయివేటు అప్పుల చెల్లింపులను నిరవధికంగా వాయిదా వేయాలి, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయిన మిర్చి రైతుల ఆత్మహత్యలు భవిష్యత్తులో సాముహిక ఆత్మహత్యలుగా మారే ప్రమాదం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టాలి.
- బొంతు రాంబాబు
సెల్: 9490098205