Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలు కోరని చట్టాలను చేయడం ఎన్డీయే ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. రైతులు కోరుకోకుండా వ్యవసాయ చట్టాలను, ముస్లిం మహిళలు కోరుకోని ట్రిపుల్ తలాక్ చట్టాలను తెచ్చింది. తరువాత డిసెంబర్ 16న, నిటి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సుల ఆధారంగా, మహిళల వివాహ వయస్సును 18సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్ 20న ''ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్లు 2021'' (పీసీఎంఏ)ను లోక్‌సభలో ప్రవేశపెట్టి, స్టాండింగ్ కమిటీకి పంపారు. ఆ బిల్లు ప్రకారం, 21సంవత్సరాలు నిండని బాలబాలికలను కౌమారదశలో ఉన్న వారిగా పరిగణిస్తారు.
ఆ చట్టం తెచ్చేందుకు కారణాలను, దాని లక్ష్యాలను ప్రకటిస్తూ, పీసీఎంఏ, 2006 చట్టం అమల్లో ఉన్నప్పటికీ హానికరమైన బాల్యవివాహాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయనీ, అందువల్ల ''ఈ సామాజిక సమస్యను సంస్కరణల ద్వారా పరిష్కరిం చాల్సిన అవసరం ఉందని'' అంటున్నారు. వివిధ వివాహ చట్టాలేవీ ఒకేవిధమైన (స్త్రీ పురుషులకు) వివాహ వయస్సును సూచించలేదని ఆ ప్రకటనలో తెలిపారు. అంటే ఇప్పుడు ఉనికిలో ఉన్న చట్టాలు స్త్రీ పురుషుల వివాహ వయస్సుకు సంబంధించిన లింగ సమానత్వాన్ని రాజ్యాంగపరమైన ఆజ్ఞగా సాధించలేక పోయాయనీ, అందువల్ల విద్య, వృత్తివిద్య, మానసిక భద్రతను సాధించడంలో మహిళలు ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టబడ్డారనీ, వివాహానికి ముందే ఉద్యోగం సాధించి, శ్రామికశక్తిలో భాగస్వామ్యం కావడమనేది క్లిష్టమైన విషయమని ఆ ప్రకటన తెలియజేస్తుంది. టీనేజ్లోనే గర్భధారణలు, జీవంలేని పుట్టుకలు, సమయానికి ముందే ప్రసవాలను తగ్గించడం, పిల్లలను జాగ్రత్తగా పెంచే బాధ్యతాయుతమైన చర్యల లాంటివి అత్యావశ్యకమైన అంశాలుగా చెపుతున్నారు.
అందువల్లనే, మహిళల సాధికారత, లింగ సమానత్వం, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంపు, మహిళలను స్వయం సమృద్ధిగా తయారు చేయడం, వారంతట వారే నిర్ణయాలను తీసుకోగలిగేట్లు చేయడం లాంటి అంశాల కోసం ఈ బిల్లును ముందుకు తెచ్చారని అంటున్నారు. పీసీఎంఏ 2006ను సవరించడం ద్వారా, ఈ బిల్లు వివాహ వయస్సుకు సంబంధించి, ఉనికిలో ఉన్న చట్టాలన్నింటినీ కొట్టిపారేస్తూ, మహిళలను పురుషులతో సమానంగా వయస్సును పెంచే లక్ష్యంతో ఉందంటున్నారు.
పెరిగిన స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్)
వివాహ వయస్సుకు సంబంధించిన చర్చ ద్వారా రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, చట్టబద్ధంగా వివాహ వయస్సును 18 నుండి 21 పెంచడం ద్వారా ''తగిన వయసులో'' వివాహం చేసుకునే బాధ్యతతో పాటు ప్రతీ విషయాన్ని మహిళలపై మోపుతున్నారు. రెండు, ఇది ప్రభుత్వ వైఫల్యాలకు ప్రతిస్పందించకుండా ప్రజల దృష్టిని మళ్ళిస్తుంది. వివాహవయసు పెంపు వల్ల మహిళలు ఉన్నత విద్యావంతులుగా మారడం లేక పెద్ద సంఖ్యలో మహిళలు శ్రామిక శక్తిలో చేరిపోవడం జరగదు. ఉన్నత విద్యలో మహిళల స్థూల నమోదు నిష్పత్తిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2001-2002 నుండి 18-23సంవత్సరాల మధ్య ఉన్న మహిళల స్థూల నమోదు నిష్పత్తి (చట్టబద్ధంగా వివాహ వయస్సు 18 ఉన్నప్పుడు) పెరుగుతూ ఉంటుంది.
మొన్న డిసెంబర్లో ప్రయాగ్ రాజ్‌లో స్వయం సహాయక బృందాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, మహిళల వివాహ వయస్సును 18 నుండి 21కి పెంచడాన్ని ఆక్షేపించిన ప్రతిపక్షాలను ఎగతాళి చేశాడు. మహిళలు చదువుకొని, ప్రగతి సాధించడానికే వివాహ వయస్సును పెంచామని ప్రధాని అన్నాడు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం, 2001-02లో ఉన్నత విద్యలో (18-23సంవత్సరాల మధ్య వయస్కులు) మొత్తం మహిళల జీఈఆర్ 6.71శాతంగా ఉంటే,2005 -06 నాటికి అది 9.35శాతానికి పెరిగింది. 2010-11లో మహిళల నమోదు 17.9శాతం, 2014-15 నాటికి అది 23.2శాతం, 2019-20లో మహిళల జీఈఆర్ 27.3 శాతంగా నమోదైంది. అందువల్ల, వివాహ వయస్సు 18 ఉన్నప్పటికీ, ఉన్నత విద్యలో మహిళల నమోదు శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది.
గత కొన్ని సంవత్సరాలుగా మొత్తం విద్యా వ్యవస్థలో, చదువుకోవాలనే కోరికతో నమోదు శాతం పెరుగుతూ వస్తోంది గానీ, కేంద్రంలో వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల వల్ల పెరగలేదు. అదే నిజమైతే విద్యా రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగి ఉండేవి. ఇది జరగలేదని జాతీయ విద్యా విధాన పత్రాలు రూఢ చేస్తున్నాయి. విద్యలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడానికి బదులుగా, ప్రయివేటు విద్యా రంగాన్ని విస్తరించడం లేదా రెగ్యులర్ విద్యా వ్యవస్థ కంటే కూడా దూర విద్యా వ్యవస్థను విస్తరిస్తున్నారు.
ఉన్నత విద్యలో రెండు దశాబ్దాల పైగా నమోదు పెరుగుదల ముఖ్యంగా మహిళల నమోదు పెరుగుదలను ప్రత్యేకంగా చెప్పవచ్చు. కాబట్టి, మహిళల వివాహ వయస్సును 18గా ఉంచడం అనేది దుర్భలపరిచే చర్య కాదు. ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలులేని కారణంగానే ఉన్నత విద్యలో ఎక్కువ మంది మహిళలు చేరలేక పోతున్నారు గానీ, వివాహ వయస్సు 18సంవత్సరాలు ఉండడంవల్ల కాదు.
కొన్ని సంవత్సరాలుగా ఉన్నత విద్యలో మహిళల నమోదు పెరుగుతున్నప్పటికీ, నైపుణ్యంతో కూడిన శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడం లేదు. దీనికి పరిష్కారంగా వివాహ వయస్సును పెంచడం సరియైనది కాదు. ఇప్పటికే మహిళలకు శ్రామికశక్తిలో భాగస్వామ్యం ఉంది, కానీ తక్కువ వేతనాలు ఇచ్చి, ఎక్కువ పని చేయించుకునే అసంఘటిత రంగంలో శ్రామికశక్తిగా ఉన్నారు. ఐ.సి.డి.ఎస్ లేక 'ఆషా' లాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేసే శ్రామికశక్తిలో మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. కానీ వారికి పెన్షన్ లేదు, అతి తక్కువ గౌరవ వేతనాలతో ఎటువంటి కనీస సామాజిక భద్రత కల్పించడం లేదు. ఆల్ ఇండియా డెమొక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) లాంటి మహిళా సంఘాలు, ఇతర సంస్థలు, వివాహ వయస్సును పెంచడం ద్వారా మహిళల జీవితాలను అదుపు చేయడం కన్నా, మహిళా సాధికారతకు అడ్డుగా ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాయి. అనేక మహిళా సంఘాలు 'మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్'ను ఉదహరిస్తూ వివాహ సగటు వయసు 22.1కి పెరిగిందని చెప్పాయి. ప్రభుత్వం, వివాహ కనీస వయసును అందరికీ 18సంవత్సరాలుగా స్థిరీకరించి, బిల్లును వెనక్కు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నాయి.
2008లో 'లా కమిషన్' బాలబాలికలకు ఉమ్మడిగా వివాహ వయస్సును 18సంవత్సరాలని సిఫార్సు చేసింది. పాఠశాల మధ్యలోనే చదువు మానేసే బాలికల సంఖ్యను తగ్గించేందుకు, బాలికలకు విద్యా హక్కు చట్టాన్ని 18సంవత్సరాల వరకు పొడిగించాలనీ, ప్రభుత్వం, మహిళలకు 'కేజీ నుంచి పీజీ' వరకు ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, 18-21సంవత్సరాల మధ్య వయసులో ఉండి, వివాహం చేసుకోవాలనుకునే వారిపై ఈ బిల్లు పితృస్వామిక హింసను పెంచుతుంది. ఈ బిల్లు, ఇలాంటి వారు చేసుకునే వివాహాలను ''బాల్య వివాహాలుగా'' నేరారోపణలు చేస్తూ, ఆ వివాహాల వల్ల కలిగే పిల్లలకు, వారి తల్లులకు ఆరోగ్య పరిరక్షణ హక్కులు లేకుండా చేస్తుంది. పేదరికానికి, బాల్య వివాహాలకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంటుందని బాల్య వివాహాలపై ప్లానింగ్ కమిషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. రహస్యంగా జరిగే బాల్య వివాహాలలో కఠినమైన చట్టం యొక్క జోక్యం, అప్పటికే ఆర్థికంగా, సామాజికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలను బాధితులుగా మార్చుతుంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్నెఫ్ హెచ్చెస్)
ఇటీవల కాలంలో చేసిన ఎన్నెఫ్ హెచ్చెస్-5(2019-2021) సర్వే ప్రకారం, 18సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న మహిళలు 26.8 నుండి 23.3శాతానికి తగ్గారు. మహిళలు వివాహం చేసుకున్న వయసులు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. బీహార్‌లో 18సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న మహిళలు 40.8శాతంగా ఉంటే. లక్ష్యద్వీప్‌లో 1.3, కేరళలో 6.3శాతంగా ఉన్నారు. బీహార్ మహిళల్లో 55శాతం అక్షరాస్యత ఉంటే, లక్ష్యద్వీప్‌లో 95.2, కేరళలో 97శాతంగా ఉంది.విద్యా స్థాయికి, వివాహ వయస్సుకు మధ్య అత్యంత దగ్గర సంబంధం ఉండేది. అయినా, 18సంవత్సరాల లోపు వివాహం చేసుకున్న మహిళల సంఖ్యలో తగ్గుదల కనిపించింది.
''ప్రేమలో పడిన వారి సంగతేంటి? వారెక్కడికెళ్ళాలి? వారు 21సంవత్సరాలు నిండేదాకా ఎదురు చూడకుండా, లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. 21సంవత్సరాలు నిండే వరకు వారు పెళ్లి చేసుకోకూడదని ప్రభుత్వం వారికి చెప్పే పరిస్థితి ఉండదని'' ఇండ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్న సుశీల అంటుంది. ఒకవేళ ప్రభుత్వం నిజంగా మహిళల సమస్యలు పరిష్కారించాలని అనుకుంటే, వయసొచ్చిన ఆడపిల్లల కోసం పరిసరాలను మరింత సురక్షితంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అంటుంది. ''నగరాలలో, గ్రామాల్లో మా ఆడపిల్లలను ఒంటరిగా బయటికి పంపడం లేదు. వారి రక్షణ పట్ల భయపడుతున్నాం. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది? మా మగవాళ్ళు సంపాదించే కొద్దిపాటి ఆదాయం (అది కూడా గ్యారెంటీలేని) మాకేమాత్రం సరిపోదు. లాక్డౌన్ కాలంలో పనిలేదు, కేవలం ఇండ్లలో పని చేస్తూ బతుకుతున్నాం. మా ఆడపిల్లలకు పని చేయగలిగే వయసొస్తే ఇండ్లలో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని'' ఆమె ఫ్రంట్ లైన్‌తో చెప్పింది.
యుక్తవయసొచ్చిన సంవత్సరం, రెండేండ్లలోపే ఆమె తన కూతుళ్ళకు, మనవరాళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది, వారంతా ఇండ్లలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బీహార్‌కు చెందిన సుశీల గత 20ఏండ్లుగా ఖాళీగా ఉన్న ఒక వ్యవసాయ భూమిలో నివాసం ఉంటూ, ఇండ్లలో పని చేస్తూ బతుకుతుంది. మహిళల సమస్యలకు పరిష్కారం కోసం మాట్లాడిన సుశీల మాటలు చాలా విలువైనవి.
పీసీఎంఏ చట్టాన్ని ఉల్లంఘిస్తే పురుషులకు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు. సమస్య సుశీలతో లేక ఇతర కార్మికవర్గ మహిళలతో లేదు. చట్ట ఉల్లంఘనకు తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పే చట్టాన్ని వారు చాలా తేలికగా అర్థం చేసుకోగలరు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
అనువాదం:బోడపట్ల రవీందర్, 9848412451
- టి.జె. రాజ్యలక్ష్మి