Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనా కేసులు లక్షల మైలురాయి దాటాయి. ఆ విషయాన్ని మీడియా కోడై కూస్తున్నది. ఆయా ప్రభుత్వాలు ఆరోగ్య బులిటెన్లు విడుదల చేస్తున్నాయి. పెద్దల వ్యాక్సినేషన్తోపాటు మరోవైపు చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా పెడుతున్నారు. అయినా కరోనా పరంపర ఆగడంలేదు. మరణాలు సైతం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అవి ఓమిక్రాన్ మరణాలో, కరోనా మరణాలో ఇప్పటికీ ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడం లేదు. కానీ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలను అనేక ప్రశ్నలు తొలచివేస్తున్నాయి. పాలకులు ప్రజలకు నీతులు చెప్పేందుకేనా ఉన్నది. లేకపోతే ఓమిక్రాన్ ఉత్తదేనా అని అడుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని అంటున్నారు. ఇంత కరోనాలోనూ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక అంతర్యమేమిటి? ఎలాగూ ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, కాలం గడిచే కొద్దీ అవి మరింత తీవ్రమై బీజేపీకి ప్రమాదం తప్పదని వెంటనే ఎన్నికలు పెడుతున్నారా? లేకపోతే ఓమిక్రాన్ ఉత్తుత్తిదేనా? ఈ రెండింటిలో ఏదీ వాస్తవమో బీజేపీ నేతలు ప్రజలకు చెప్పాల్సి ఉన్నది. ఓమిక్రాన్ ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి విమానాల్లో ఆయా రాష్ట్రాల్లో వాలిపోతున్నారు. అంతర్గత సభలు, బహిరంగ సభలు, సమావేశాలు వేటినీ వదలడం లేదు. పైకి మాత్రం కరోనా అంటూ జాగ్రత్తగా ఉండాలంటూ నీతులు చెబుతున్నారు. వారు మాత్రం వాటిని పాటించడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
- కొత్తూరు ప్రియకుమార్