Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాదేదీ కవితకనర్హం అన్నట్టు... ఏ అంశాన్నైనా రాజకీయాలకూ అవలీలగా వాడుకోవచ్చు. ఉల్లిగడ్డ, పాలు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అంశాలు రాజకీయాలను షేక్ చేసిన సందర్భలూ మనకు తెలుసు. ఉల్లగడ్డ కొరత ఏర్పడినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలే దిగిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఢిల్లీలో విపరీతమైన పొంగ మంచు, కాలుష్యం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎన్నికలులేని సమయాల్లోనూ ప్రజలకు ఇబ్బంది కలిగే అంశం ముందుకొస్తే, అది కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది. కరోనా కాలంలో పేదలు పడిన కష్టం, బాధలు అంతా ఇంతా కాదు. అయినా ఆ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. చివరకు కరోనా చావులను సర్కారు దాస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వీటన్నింటికి మించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ముసుగు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అంతకు మించి ఆ ఎన్నికల్లో ఒక అంశం అత్యంత ఆసక్తిగా మారింది. ఓమిక్రాన్, కరోనా విజృంభించడంతో మూతికి మాస్కు, చేతులకు శానిటైజర్, భౌతిక దూరం పాటించాలనే జాగ్రత్తలు తరచుగా వింటూనే ఉన్నాము. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అమిత్షా మూతులకు మాస్కులు లేకుండానే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు...! ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చాకచాక్యంగా ఉపయోగించుకుంటున్నారు. మోడీ మూతికి మాస్కు ఎందుకు పెట్టుకోలేదంటూ కేజ్రివాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్వీట్టర్ వేదికంగా మోడీ ఫోటోను ప్రజలకు విడుదల చేశారు. దీంతో మోడీ కౌంటర్ కూడా ఇవ్వలేని దుస్థితి వచ్చింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలు ఓటర్లకు మాస్కులు పంచడంతోపాటు నాయకులు విధిగా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. దట్ ఈజ్ మాస్కు రాజకీయం.
- గుడిగ రఘు