Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ నెల రోజుల క్రితం ఒక కార్యక్రమం కవరేజీ కోసం వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మైకులను చూసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవాక్కయ్యారు. రాష్ట్రంలో ఇన్ని ఛానళ్లు ఉన్నాయా..? అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే తరహాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) వారం క్రితం పాత్రికేయుల తీరును చూసి షాకయ్యారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ సమస్యకు సంబంధించి అసెంబ్లీ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దీని వల్ల పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వారు పడుతున్న బాధలను ఏకరువు పెట్టారు. తినో తినకో పైసా పైసా కూడబెట్టి... కొనుక్కున్న ప్లాట్లు, కట్టుకున్న ఇండ్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పేరిట సర్కారు కొర్రీలు వేస్తున్నదంటూ ఆయన వాపోయారు. తన నియోజకవర్గమైన సంగారెడ్డితోపాటు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందంటూ ఓ అరగంటపాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం ముగియగానే...తమ యక్ష ప్రశ్నలను మొదలుపెట్టిన పాత్రికేయులు... 'సార్, మీ పార్టీలో మీకూ, రేవంత్‌కు పడటం లేదంట గదా..? మీపై కాంగ్రెస్ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నదా..? మీరూ, రేవంత్ మాట్లాడుకుంటున్నారా..? కొందరి మాటలతో సీఎల్పీ నేత భట్టి మనోభావాలు దెబ్బతిన్నాయట గదా..?' అంటూ అసందర్భోచిత ధర్మ సందేహాలను వ్యక్తం చేశారు. ఊహించని ఈ క్వశ్చన్లకు దిమ్మ తిరిగిన జగ్గన్న తలబాదుకుంటూ... 'అరే, పరిస్థితి మరీ ఇలా తయారైందేమిటి..? నేను అభివృద్ధి గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, ఇలా నా సబ్జెక్టుకు పొంతన లేని ప్రశ్నలతో దుంప తెంచుతున్నారు..? ప్రజా సమస్యలు మీడియాకు పట్టవా..?' అంటూ గోస వెళ్లబోసుకున్నారు. ఆయన అవస్థను చూసిన ఓ కొంటె విలేకరి... 'దటీజ్ ఇండియన్ అండ్ తెలుగు మీడియా సార్... అయినా మీ అభివృద్ధి, సమస్యల గురించి జనానికి పట్టటం లేదు, వాటి గురించి మేం రాసినా, చూపించినా వాళ్లు పట్టించుకోవటం లేదు, అదే సంచనాత్మక కథనాలు, సంఘటనలు చూపిస్తే నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. దాంతోపాటు మాకు రేటింగ్సూ పెరుగుతున్నాయి...' అని ముక్తాయింపు నివ్వటంతో మరోసారి తలబాదుకోవటం జగ్గన్న వంతైంది.
-బి.వి.యన్.పద్మరాజు