Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాఢనిద్రలో నుండి దిగ్గున లేచాడు మహారాజు. మళ్ళీ నిద్ర పోవటానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని నిద్రరావటం లేదు. విదేశాల నుండి తెప్పించుకున్న హంసతూలికా తల్పం మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. అలా దొర్లటంలో పట్టుతప్పి ఒకటి రెండుసార్లు కిందకూడా పడ్డాడు. అయినా ఫలితం లేదు. నిద్రరాలేదు.
ఆ మహారాజు మరెవరో కాదు. భారత ఖండాన్ని ఏలుతున్నవాడే. తిరుగులేని అధికారాన్ని అనుభవిస్తున్నవాడే. పండు ముసలి తల్లిని కూడా అధికార నివాసంలో తన వద్ద ఉండనియ్యని నిఖార్సైన త్యాగధనుడు! ఛప్పన్నారు అంగుళాల ఛాతీ గల వీరయోధుడుగా అభిమానులు ఆయనకు నీరాజనాలు పడుతుంటారు. పొరుగుదేశాలకు సింహస్వప్నమని కీర్తనలు పాడుతుంటారు. అంతటి వాడికి నిద్రెందుకు పట్టడం లేదని ఖంగారు పడకండి! గత కొద్దికాలంగా రాజుకు రోజులు బాగాలేవు. పాతరాజులు ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేస్తే, ఈ రాజు అధికారంలోకి వచ్చాక పాత చట్టాలు మార్చి కొత్త చట్టాలు చేస్తున్నాడు. కొత్త చట్టాలు రాజుగారి మిత్రులైన వర్తక శ్రేష్టులకు లాభసాటిగా ఉంటున్నాయని, విమర్శలు వచ్చినా సహించాడు. ప్రాణ మిత్రులకు సహాయపడని అధికారం ఎందుకని రాజుగారి బలమైన విశ్వాసం! అయితే అట్లా మార్చిన చట్టాలలో వ్యవసాయ చట్టాలు కూడా ఉన్నాయి. అసలే వ్యవసాయక రాజ్యమైనందున, రైతులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఏడాదికాలం కొనసాగింది. రాజుగారికి తత్వం బోధపడింది. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలు రద్దు చేశాడు. ''హమ్మయ్య'' అనుకున్నాడు. ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకున్నాడు.
రాజుగారి కోరిక మేరకు కోట్లాది వరహాలు వెచ్చించి, విదేశీ రథాన్ని కొనుగోలు చేశారు. స్వదేశంలో చక్కటి ఉత్పత్తులుండగా, విదేశీ రథమెందుకని అడిగిన వారిని దేశద్రోహుల కింద ప్రకటించారు!
రాజుగారి అభిమానులంతా కలసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి, ఆహ్వానించారు. ఇకనేం రాజుగారు ఆర్భాటంగా బయలుదేరారు. అలా కొద్దిదూరం ప్రయాణించారో లేదో, రాజుగారి వాహనశ్రేణి నిలిచిపోయింది.
''ఏమైంది!'' అన్నారు రాజుగారు విసుగ్గా.
''కొందరు ప్రజలు వాహనశ్రేణికి అడ్డుగా ఉన్నారు ప్రభూ!'' వినయంగా బదులిచ్చాడు ఒక రక్షణాధికారి.
''ఓహౌ! నాన అభిమానులు ఎదు రొచ్చారన్న మాట!'' అంటూ రథం దిగ బోయాడు రాజుగారు.
''ఆగండి ప్రభూ!'' అంటూ మరో రక్షణాధికారి వచ్చి రాజుగారి చెవిలో ఏదో ఊదాడు. అది విని రాజుగారు కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించారు. తర్వాత రథాన్ని వెనక్కి తిప్పమని సారథిని ఆదేశించారు. రాజుగృహానికి చేరుకుని, , నిద్రకు ఉపక్రమించారు. ఎప్పటికో నిద్రపట్టింది! ఆ తర్వాత దిగ్గున లేచారు! అదీ కథ!
''ఎవరక్కడ!'' అన్నాడు రాజుగారు. భటుడు వచ్చాడు.
''ఆంతరంగిక మంత్రిని ప్రవేశపెట్టండి!'' అన్నాడు రాజు. వారిద్దరిదీ అన్యోన్యబంధం. ఒకరు లేకుండా మరొకరు లేరని ప్రతీతి!
ఆంతరంగిక మంత్రి వచ్చాడు. వస్తూ ఒక గ్రంథం కూడా పట్టుకొచ్చాడు.
''ఎందుకు ఇలా జరిగింది!'' ప్రశ్నించాడు రాజు.
నిన్నటి ప్రయాణం అర్థాంతరంగా నిలిచిపోవటమే కాని, వెనక్కి మళ్ళిన విషయమే అడుగుతున్నాడని మంత్రికి తెలుసు.
''నా రక్షణ బాధ్యత నీదే కదా!'' నా ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి కదా!'' అన్నాడు రాజు విసుగ్గా.
''చిత్తం ప్రభూ! నిజం మీకు మనవి చేస్తాను. మీ ప్రయాణానికి అడ్డువచ్చిన వారు చాలా స్వల్పమే! అయితే మీరు హాజరు కావల్సిన సభకు సుమారు లక్ష మంది రావల్సి ఉండగా, వేయి మందికూడా హాజరుకాలేదని, వచ్చినవారు కూడా ఎంతో బలవంతంగా వచ్చారని వేగులు సమాచారమిచ్చారు! అందుకని నిరసనకారులు ఎదురొచ్చారని నెపం పెట్టి, మీ ప్రయాణాన్ని వెనక్కి తిప్పవలసి వచ్చింది!'' అని మంత్రి చెబుతుండగానే రాజుగారు కళ్ళు తిరిగి పడిపోయారు!
వెంటనే పక్కనున్న భటుడు నీళ్ళు తెచ్చి రాజుగారి మొహాన చల్లాడు. కాసేపటికి రాజు తేరుకున్నాడు. కాని మొహంలో జీవకళ పోయింది.
భటుడికి రాజుగారి అవస్థను చూసి జాలేసింది! ఛప్పన్నారు అంగుళాల ఛాతి విరుచుకుని తిరిగే రాజుగారు సభకు వేయిమంది కూడా లేకపోవటమా? అయ్యో పాపం అనుకున్నాడు. రాజ్యమంతా రాజుగారి పరిస్థితి గురించి, పరిపరి విధాలుగా చర్చించు కుంటున్నారు! రాజుగారికెంత అవమానం! ఇన్నాళ్ళు ఛాతి విరుచుకుని తిరిగిన ప్రజల ముందే తలదించుకుని తిరగాలి! ఇలాంటి దీనస్థితి పక్కదేశం రాజులక్కూడా రాకూడదని అనుకున్నాడు!
రాజు కూడా అచ్చం ఇదే ఆలోచిస్తున్నాడు. మంత్రి రాజుగారి బాధను పసిగట్టాడు.
''చింతించకండి! మహారాజా! ఈ సమస్యకు పరిష్కారం ఉంది! ఇదిగో ఈ పురాతన రాజనీతి గ్రంథాలలో మన సమస్యకు పరిష్కారం దొరికింది!'' అన్నాడు మంత్రి.
''అలాగా! ఏమిటో చెప్పు!'' అన్నాడు రాజు ఆత్రంగా!
పురాతన గ్రంథాలలో పాలకుల సమస్యలు వాటి పరిష్కారాలు మాత్రమే ఉంటాయి కాబోలు! సామాన్య ప్రజల కష్టాలు పరిష్కారాలు అందులో దొరకవేమో అనుకున్నాడు భటుడు.
''రాజు బలహీనపడ్డప్పుడు, ప్రతిష్ట దిగజారిపోయినప్పుడు తన ప్రాణానికి ప్రమాదమున్నట్లు పుకార్లు పుట్టించి ప్రజలను నమ్మించాలి. రాజ్యభద్రతకు దేశద్రోహులు ప్రమాదం తలపెట్టినట్టు ప్రచారం చేయాలని కౌటిల్యుడు చెప్పాడు. అదే ఇప్పుడు మనకు ఆచరణీయం!'' అన్నాడు మంత్రి.
''అద్భుతం! చాలా బాగుంది! తక్షణం నాపేరిట ఒక లేఖ రాయించండి! స్థానిక సంస్థానాధీశుడే అక్కడి ప్రజలను రెచ్చగొట్టి, నా ప్రయాణాన్ని అడ్డుకున్నారని, వారి దాడిని నేను నిబ్బరంగా ఎదుర్కొని నిలిచానని, నా యుద్ధ విద్యలన్నీ ఉపయోగించి, ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నానని ఆ బహిరంగ లేఖలో పేర్కొనండి! ఆఁ అంతే కాదు, ఇదే విషయాన్ని ఊరూరా దండోరా వేయించండి! మన వంధిమాగదులకు ముందుగానే భారీ నజరానాలు ఇచ్చి ప్రచారం చేయించండి! నా శౌర్యప్రతాపాలతో ప్రాణాపాయస్థితి నుండి బయటపడ్డానన్న ఘనకీర్తి ఏకకాలంగా రావాలి సుమా!'' అన్నాడు రాజు.
చిత్తం మహారాజా అంటూ వెళ్ళిపోయాడు ఆంతరంగిక మంత్రి.
- ఉషాకిరణ్, సెల్: 9490403545