Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల ముందుగానీ రాజకీయ నిరనసలు రగిలినప్పుడుగానీ భద్రతా సమస్యలు తెరమీదకు రావడం ఇటీవలి కాలంలో రివాజుగా మారింది. గతఎన్నికల సమయంలో టెర్రరిస్టు దాడులు, సర్జికల్ స్ట్రయిక్స్ దేశరక్షణ పతాక శీర్షికల్లోకి ఎక్కడం ఎవరూ మర్చిపోరు. నోట్లరద్దుపై దేశమంతా హాహాకారాలు వినిపిస్తున్నప్పుడు ప్రధాని మోడీ గోవాలో ఇది గనక విఫలమైతే తనను ఉరితీయండి అంటూ కళ్లనీళ్లు పెట్టుకోవడం పెద్దకథనమైంది. ఇక చిన్నా చితక సెంటిమెంటు స్టేట్మెంట్లు, మతతత్వం దట్టించిన నాటకీయ వ్యాఖ్యానాలు సరేసరి. దేశం, ప్రజలు, ప్రధాని లాంటి అధినేతలు క్షేమంగా ఉండాలని, అందుకు అత్యధిక జాగ్రత్త వహించాలనే ప్రతివారూ కోరుకుంటారు. అయితే అది కూడా వివాదాస్పదంగా విభిన్న కథనాలకు ఆలవాలంగా మార్చివేయబడటమే ఇక్కడ సమస్య. మోడీ మరోసారి అధికారంలోకి రావడానికి కీలకంగా పరిగణించబడే ఉత్తరప్రదేశ్ సహ అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముందుకొచ్చినవేళ... ప్రధాని ప్రాణాలకు భద్రత చర్చనీయాంశం కావడం ఆ కోణంలో ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మోడీ పర్యటన మధ్యలో విరమించుకుని ఢిల్లీ తిరిగివస్తూ తను ప్రాణాలతో బయిటపడ్డానని ట్వీట్ చేయడం సామాన్య విషయం కాదు. ఇందుకు గాను పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌సింగ్ చిన్నుకు కృతజ్ఞతలు అనడంలో వ్యంగ్యం దాగేది కాదు. ఆ క్షణం నుంచే మీడియాలో పంజాబ్ ఘటన ప్రధానాంశమైంది. సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఇవన్నీ ఎలా పరిణమిస్తాయనేది ఒకటైతే ఘటన ముందువెనకలు అర్థం చేసుకోవడం మరింత జటిలంగా మారుతున్నది.
భద్రతా వ్యవస్థ, బాధ్యతలు
ప్రధాని భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పిజి) బాధ్యత వహించాలని 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత నిర్ణయించారు. ఎంపిక చేసిన సమర్థులైన అధికారులను, నిఘానిపుణులను అందులో నియమిస్తుంటారు. పర్యటనల్లో భద్రత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ డీజీపీతో అది సమన్వయం చేసుకుంటుంది. పూర్తి భద్రతా ప్రమాణాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, ప్రయాణించే మార్గ నిర్దేశంతో పాటు అనూహ్యమైన సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటన్నది కూడా ముందే నిర్ణయించుకుంటారు. బ్లూబుక్ అనేది ఇందుకు మార్గదర్శకంగా ఉంటుంది. మోడీ పంజాబ్ పర్యటన సమయంలోనూ ఇలాగే జరిగింది. ఫిరోజ్‌పూర్ సభలో ప్రసంగించడం, అక్కడే ఉన్న హుస్సేనీ ఆలంలో భగత్‌సింగ్ సమాధి సందర్శించడం ఆయన కార్యక్రమంలో ఉన్నాయి. ఇదంతా భటిండా నుంచి అరగంటలోపు హెలికాఫ్టర్ ప్రయాణంగా నిర్ణయించుకున్నారు. ఏదైనా ఆటంకం ఎదురైతే ఫిరోజ్‌పూర్ నుంచి భటిండాకు రోడ్డుమార్గంలో వెళ్లవచ్చని తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. వాతావరణం హెలికాఫ్టర్‌కు అనుగుణం గా లేదని ఈ రోడ్డు మార్గంలోనే మోడీ ప్రయాణించడంతో సమస్య ఉత్పన్న మైంది. ఫిరోజ్‌పూర్ వద్ద రైతాంగ నిరసనకారులు చేరడంతో పరిస్థితి మారింది. దాదాపు ఇరవై నిముషాలు ఆయన వాహనంలో ఉండిపోయారు. అయితే తమకు ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్నట్టు తెలియదనీ, వైమానిక మార్గంలో వెళితే నిరసన చెబుదామని వచ్చామని నిరసనకారులు అంటున్నారు. సంయుక్త మోర్చా ప్రకటన కూడా అదే చెప్పింది. మోడీ రోడ్డు మార్గం ఎంచుకున్నట్టు తమకు సమాచారం లేదనీ, అది ఎస్పీజీ నిర్ణయమని పంజాబ్ పోలీసుల వాదన. ఎందుకంటే రెండుగంటలకు పైగా వందకిలోమీటర్లు రోడ్డుమీద ప్రధాని ప్రయాణించడం అసాధారణం. వంతెనపై ఆయన వాహనంలో అంతసేపు ఉండటం భద్రత రీత్యా మంచిది కాదు.
కేంద్ర, రాష్ట్రాల విరుద్ధ వాదనలు
నిరసనకారులు, అతికొద్దిమంది చాలా దూరంలో ఉన్నారనీ, ఒకరైనా నినాదం ఇచ్చింది లేదని ప్రభుత్వం అంటున్నది. స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు జెండాలతో ప్రధాని కాన్వారుకి చాలా దగ్గరగా ఉన్న దృశ్యాలు కూడా విడుదలైనాయి. ఇవన్నీ పరస్పర విరుద్ధమైన సంకేతాలు ఇస్తున్నాయి. భద్రతా వైఫల్యం ఏ మేరకు ఎక్కడ జరిగిందో తప్పక తేల్చవలసిందే. ఈ లోగానే సాక్షాత్తూ మోడీ ప్రాణాలతో బయిటపడ్డానని చెప్పడం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా రాష్ట్ర ప్రభుత్వంపై దాడి ప్రారంభించడం సమస్యను రాజకీయ వివాదంగా మార్చివేసింది. గతంలో యూపీలోనే బెనారస్ యూనివర్సిటీ వంటి చోట్ల మోడీకి నిరసనలు ఎదురైన ఉదాహరణలున్నాయి. అప్పుడు ఈ విధమైన దాడి చేసింది లేదు. పంజాబ్ ముఖ్యమంత్రి చిన్నును కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ లోతైన విచారణ జరిపించాల్సిందిగా ఆదేశం పంపించారు గాని మరోవైపున చిన్ను తమ తప్పు లేదని అంతా కేంద్ర బలగమే చూసుకుందని సమర్థించుకున్నారు. ఫిరోజ్‌పూర్ సభలో ప్రజల హాజరు చాలా పలచగా ఉందనీ, 70వేలమంది అనుకుంటే వేయిమంది కూడా లేకపోవడంతో ప్రధాని సభను రద్దు చేసుకుని ఈ విధంగా చిత్రిస్తున్నారని ముఖ్యమంత్రి చిన్ను అధికారికంగానే ప్రకటించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఈ అంశంపై వాస్తవాలు తేల్చే బదులు కేంద్ర రాష్ట్రాలు విడివిడిగా దర్యాప్తు బృందాలు నియమించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ రెంటినీ విచారించకుండా నిలవరించి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ సోమవారంలోగా తనకు అప్పగించాలని ఆదేశించింది. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి కూడా ఈ ఘటనపై ప్రధానితో ఆందోళన వెలిబుచ్చారట. అసలు రాష్ట్రపతి పాలనే పెట్టాలనేవరకూ కొందరు మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ప్రధాని భద్రత పేరిట ప్రార్థనలు, యాగాలు చేస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం పెరడగం విస్మరించరాని విషయం.
లఖింపూర్ ఖేరీ రాక్షసానికి పోటీనా?
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలలో బీజేపీకి విజయావకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా ఆత్మసాక్షి గ్రూపు విడుదల చేసిన నాలుగు దఫాల సర్వే కూడా అలాగే ఉంది. యూపీలో ఎస్పి, పంజాబ్‌లో కాంగ్రెస్ ఆప్‌లు, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ స్వల్ప ముందంజలో ఉన్నాయని సర్వేల సారాంశం. ఓట్ల చీలికతో బీజేపీకి మేలుచేస్తుందనుకున్న బిఎస్పి బాగా వెనకబడిన సూచనలున్నాయి. మోడీమళ్లీ ప్రధాని కావడం యూపీలో యోగి మరోసారి ముఖ్యమంత్రి కావడంపై ఆధారపడి ఉన్నదని అమిత్‌షానే సెలవిచ్చారు. అందుకే మోడీ షాలు ఇద్దరూ యూపీలో పదేపదే పర్యటనలు చేస్తున్నారు. యోగిని పొగిడి పారేస్తున్నారు. ఆయన కూడా వాగ్దానాలు గుప్పిస్తున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం, కాశీ ఆలయ మహా విస్తరణ, మధురలో కృష్ణ మందిర వివాద పునరుద్దరణ ఒకటేమిటి మత సమస్యలన్నీ మండిస్తున్నారు. ఆ మేరకు మైనారీటీలలో అభద్రతా పెరుగుతున్నది. ఎన్ని చేసినా రైతాంగ ఆందోళన ప్రభావం, మరీముఖ్యంగా లఖింపూర్‌లో నిరసనకారులపై కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు వాహనం నడిపి ప్రాణాలు తీసిన ఘటన బీజేపీని వెన్నాడుతున్నాయి. యూపీ ఎన్నికలలోనే గాక పంజాబ్‌లోనూ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రైతాంగ ఆందోళన పంజాబ్‌కే పరిమితమని కేంద్రం చాలాసార్లు ప్రకటించింది. ఈ పూర్వరంగంలో యూపీలో లఖింపూర్ ఘటనకు పోటీగానూ, పంజాబ్‌లో రైతాంగ నిరసనను మరపించే సాధనంగానూ ప్రధాని భద్రత సమస్యను ప్రధానంగా ముందుకు తేవాలన్నది బీజేపీ వ్యూహంగా మారవచ్చు. రైతాంగ ఆందోళన వెనక ఖలీస్తానీలున్నారని మొదట చేసిన ప్రచారం ఇప్పుడు పున:ప్రారంభంకావడం యాదృచ్చికం కాదు. ఉంటే పట్టుకోవలసింది దర్యాప్తు సంస్థలే!
ప్రధాని భద్రత రాజకీయ వివాదంగా మారితే నష్టం తప్ప లాభం ఉండదు. గతంలో ఇద్దరు ప్రధానులను పోగొట్టుకున్నామని ఈ సమయంలో బీజేపీ చెప్పడం బాగానేవుంది గానీ, పదవిలో ఉండి హత్యకు గురైన ఇందిరాగాంధీ సంస్మరణను కూడా మోడీ ప్రభుత్వం దాదాపు రద్దు చేసిందని గమనించాలి. ఆమె కుటుంబ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తప్ప కేంద్రం నుంచి కీలక నేతలెవ్వరూ పాల్గొనడంలేదు. ఆ రోజున పోటీగా సర్దార్ పటేల్ వర్థంతిని మొదలుపెట్టారు. మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురికావడం నిజమే. పంజాబ్ ముఖ్యమంత్రి బియంత్సింగ్ను సచివాలయంలోనే ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇందిర హత్య సమయంలో సిక్కులపై సాగిన ఊచకోత ఇప్పటికీ మర్చిపోలేము. ఇవన్నీ తెలిసీ దీన్ని రాజకీయ వివాదంగా మార్చడం బీజేపీకే చెల్లింది. కాంగ్రెస్ నాయకులు కూడా తలోవిధంగా మాట్లాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలలోనూ..!
ఎన్నికలు జరిగే రాష్ట్రాలు మాత్రమే గాక ఏపీ, తెలంగాణలలోనూ ఉద్రిక్తతలు పెంచడం, మతపాచికలతో దాడి బీజేపీ దేశవ్యాపిత వ్యూహంలో భాగమే. దీన్నే కొందరు 'దూకుడు' అని ముద్దుపేరుతో పిలుస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, లోటుభర్తీ, రాజధాని వంటి విషయాలలో ఏపీకి శూన్యహస్తం చూపిన బీజేపీ... జగన్ సర్కారు తమతో మంచిగా ఉండటానికే పాకులాడుతున్నా ఎదురుదాడి చేయడం, ఆలయాలు, టీటీడీ వివాదాలు, జిన్నా టవర్ పేరు మార్చాలని చిచ్చు పెట్టడం చూస్తున్నాం. టీడీపీ కూడా ఓడిపోయాక బీజేపీని కేంద్రాన్ని మంచి చేసుకోవాలనే చూస్తున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ గతంలో బీజేపీకి మద్దతునిచ్చినా ప్రస్తుతం వడ్ల కొనుగోలుతో కేంద్రంపై విమర్శలు మొదలు పెట్టింది. ఈ మధ్య ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అరెస్టుతో బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడమేగాక తీవ్ర దూషణలకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారానికి వస్తామని హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ పేరుమార్చి భాగ్యనగర్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఆరెస్సెస్ జాతీయ సమావేశాలు హైదరాబాద్ శివార్లలో జరిపితే బీజేపీ ప్రముఖులు అనుసంధానం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు రెంటికీ సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ సహాయంలోనూ విపరీతమైన వివక్ష చూపుతున్న కేంద్ర బీజేపీ తమ పథకాలను రాష్ట్రాలు దారితప్పిస్తున్నట్టు కట్టుకథలు ప్రచారం చేసుకుంటున్నది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీని టీఆర్ఎస్ను ఒకటిగానే చిత్రిస్తూ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతుంటే ఏపీలో టీడీపీ ఏకంగా రాష్ట్రపతిపాలనే అడుగుతున్నది. జనసేన బీజేపీతో స్నేహం సాగిస్తున్నది. యూపీ నుంచి ఏపీ వరకూ ప్రతిచోటా బీజేపీ సాగిస్తున్న కుటిల రాజకీయా లను, స్వప్రయోజన మతతత్వ వ్యూహాలను ఎదుర్కోవలసిన తరుణంలో ఈ వైఖరి ఎంత నష్టదాయకమో చెప్పనవసరం లేదు. ఉత్తరాదిలో బలహీనపడిన మేరకు దక్షిణాదిలో కాస్తయినా పుంజుకోవాలనే ఆశ కూడా దీని వెనక ఉంది. ఆ జయాపజయాలు ఏమైనప్పటికీ దేశభద్రత, సమస్యలు సమైక్యత మతసామరస్యం రాష్ట్రాల హక్కులు లౌకిక ప్రజాస్వామ్యం కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంటుంది.
- తెలకపల్లి రవి