Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలుతున్నారు. కల్లాం కుప్పల పైనే తనువు చాలిస్తున్నారు. రోజూ ఏ పేపర్ చూసినా రైతు ఆత్మహత్య వార్తలే దర్శనమిస్తున్నాయి. పంట దిగుబడి రాక, పండించిన పంటకు గిట్టుబాటు లేక.. అప్పుల ఊబిలో కురుకుపోయిన రైతన్న మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో రైతులు ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఇవేమీ పట్టని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రంలో ఘనంగా రైతుబంధు సంబురాలు నిర్వహిస్తోంది. ఈ సంబురాలు ఎవరి కోసం నిర్వహిస్తోందో రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. మొదట ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం.. తరువాత ఎకరాకు రూ.5వేలు ఇస్తోంది. ఇప్పటి వరకు రైతుబంధు కోసం సుమారు రూ.500 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతోంది. దీని పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబురాలు నిర్వహిస్తోంది. గ్రామ గ్రామాన విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటున్నాయి. అయితే వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు రైతుబం ధుకు వ్యతిరేకంగా రాయడం కొసమెరుపు. రైతుబంధు కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.500 వేల కోట్లు అసలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి అన్నది అసలు ప్రశ్న. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరికి ఎకరం, రెండు ఎకరాలకు మించి భూమి ఉండదు. అంటే ప్రభుత్వం ఇచ్చిన నగదులో వీరికి సుమారు 30శాతం నిధులు కూడా ముట్టి ఉండవు. మిగిలిన 70శాతం నిధులు వందల, వేల ఎకరాలు ఉన్న బడాబాబుల ఖాతాల్లోకే వెళ్లాయని స్పష్టం అవుతోంది. వీరు అసలు వ్యవసాయం చేసిన దాఖలాలు ఉండవు. 'పేదోడి పొట్టగొట్టి.. పెద్దొడు కడుపు నింపుకున్న' చందంగా రైతుబంధు పథకం ఉంది. ఇవ్వన్నీ ప్రజలకు తెలియదు అన్నట్టు, తామే రైతుల కోసం అన్నీ చేశామని ప్రభుత్వం రైతుబంధు సంబురాలు నిర్వహించడం సిగ్గుచేటు. అయితే ఇప్పుడే ఈ వేడుకలు నిర్వహించడానికి కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు వానాకాలానికి సబంధించిన పూర్తి వడ్లను కొనుగోలు చేసింది లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో జమా కాలేదు. ధాన్యం డబ్బులను బ్యాంక్ అధికారులు రుణమాఫీ కిందికి జమ చేసుకున్నారు. దీంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతున్న ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి రైతుబంధు సంబురాలు అంటూ కొత్త నాటకానికి తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఎన్నికల్లో చెప్పినట్టు రూ.లక్ష రుణమాఫీ చేయాలి, విత్తనాలు, ఎరువులు ఉచితంగా పంపిణీ చేయాలి. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి. వీటన్నిటికీమించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలి. అసలు రైతు ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించి, రైతు చావులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అవేమీ చేయకుండా భూస్వాములకు, బడాబాబులకు మేలు చేసే పథకానికి సంబురాలు నిర్వహించడం వలన ప్రయోజనమేమిటి? రైతు కష్టానికి సరైన ప్రతిఫలం దక్కినప్పుడే రైతుకు నిజమైన సంబురం కదా...
- అజయ్ కుమార్
సెల్: 297630110