Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలసపాలన రోజుల్లో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులనుండి రుణాలు తీసుకోవలసివచ్చేది. ఆ వడ్డీ వ్యాపారులు వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు తీసుకుని దానినే తిరిగి రైతులకు అప్పుగా ఇచ్చేవారు. వాళ్ళు రైతులనుండి చాలా ఎక్కువ రేటులో వడ్డీ గుంజేవారు. అయితే ఏ కారణం వల్లనైనా ఇచ్చిన అప్పు తిరిగి రాకపోతే ఆ రిస్కు ఆ వడ్డీ వ్యాపారే భరించాల్సివుండేది. వడ్డీ వ్యాపారికి అప్పిచ్చిన బ్యాంకుకి ఆ లావాదేవీలతో ఎటువంటి సంబంధమూ ఉండేది కాదు.
కాని, ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అదానీ క్యాపిటల్ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం వేరేగా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం అదానీ క్యాపిటల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉమ్మడిగా రుణాలిస్తాయి. ఆ రుణాల్లో 80శాతం స్టేట్ బ్యాంక్ ఇస్తే, తక్కిన 20శాతం అదానీ క్యాపిటల్ ఇస్తుంది. ఈ అదానీ క్యాపిటల్ ఒక 'నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ''(ఎన్బిఎఫ్సి). రిజర్వు బ్యాంకు ఇచ్చే మార్గదర్శకాలకు లోబడి ఈ రుణాల వ్యవహారం నడుస్తుంది. అయినప్పటికీ, ఎవరికి రుణం ఇవ్వాలి, ఏ షరతులమీద ఇవ్వాలి అన్నది నిర్ణయించేది అదానీ క్యాపిటల్ మాత్రమే. ఒక వేళ ఆ రుణం తీసుకున్న రైతు తిరిగి చెల్లించకపోతే ఆ నష్టాన్ని అదానీ క్యాపిటల్ తోబాటు బ్యాంకు కూడా భరిస్తుంది. ఎవరికి అప్పివ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ షరతులతో ఇవ్వాలి అన్న విషయాలను నిర్ణయించడంలో ఎటువంటి పాత్రా లేకపోయినప్పటికీ రుణం తీసుకున్నవారు ఎగ్గొడితే రిస్కులో ఎక్కువ భాగం భరించాల్సింది మాత్రం స్టేట్‌బ్యాంకే. అంటే రిస్కు స్టేట్ బ్యాంక్ ది, పెత్తనం అదానీ క్యాపిటల్ ది.
బ్రిటిష్ కాలంలో రైతులకు అప్పుటిచ్చిన వడ్డీ వ్యాపారులకన్నా చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఇప్పుడు అదానీ క్యాపిటల్ ఉంది. అప్పటి వడ్డీ వ్యాపారులు రిస్క్ అంతా భరించాల్సివచ్చేది. ఇప్పుడు అదానీ క్యాపిటల్ భరించే రిస్క్ నామమాత్రం. అదే సమయంలో బ్రిటిష్ కాలంనాటి బ్యాంక్‌కి ఎటువంటి రిస్కూ ఉండేది కాదు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ మాత్రం రిస్క్‌లో అత్యధిక శాతం భరించాల్సివస్తుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టు మోడీ ప్రభుత్వం ఏకకాలంలో తన ఆశ్రిత కార్పొరేట్లకు (అదానీ క్యాపిటల్ వంటి ఎన్‌బిఎఫ్‌సిలకు) అనుకూలంగా నిర్ణయం చేసి వారి వ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి తోడ్పడుతోంది. అదే సమయంలో ఆ పెరుగుదల కోసం జాతీయ బ్యాంకులను బలి చేస్తోంది. ఆ జాతీయ బ్యాంకులు కుప్పకూలుతున్నా, మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదు. ఇప్పటికే బ్యాంకులకు వచ్చే నష్టాలకు డిపాజిటర్లనే బాధ్యులుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే ఇకముందు బడ్జెట్లో బ్యాంకుల నష్టాలను భర్తీచేయడానికి వేరే కేటాయింపులు చేయనవసరం ఉండదు. ఒకవేళ నష్టాలు మరీ ఎక్కువైపోతే ఆ బ్యాంకులను చాలా చౌకగా ప్రయివేటు పరం చేసేయవచ్చు కూడా. అలా చేయడానికి ఆ బ్యాంకులకు వచ్చే నష్టాలనే సాకుగా చూపించి సమర్థించుకోవచ్చు.
ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకోసం ఇదంతా చేస్తున్నట్టు? ఈ ఏర్పాటు (ఉమ్మడిగా అప్పులిచ్చే పద్ధతి) వలన రైతులకి గాని, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు గాని కాస్తంతైనా ప్రయోజనం కలుగుతుందా? కనీసం ఆ జాతీయ బ్యాంకులకైనా ప్రయోజనం ఉంటుందా? అదానీ క్యాపిటల్ వంటి ఎన్‌బిఎఫ్‌సిలకు మినహా వేరే ఎవరికైనా ప్రయాజనం ఉందా? అన్ని ప్రశ్నలకూ ఒక్కటే సమాధానం ''లేదు'' అని. ఈ సమాధానం కాకుండా వేరే ఏదైనా సమాధానం చెప్పడానికి ఏ ఒక్క ప్రభుత్వ అధికారీ ఇంతవరకూ ముందుకు రాలేదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా చెప్పినది చూద్దాం... ''వినియోగదారుల పునాదిని విస్తృత పరుచుకోడానికి, దేశంలో ఇంతవరకూ తగినంతగా సేవలు పొందలేకపోతున్న రైతాంగంతో సంబంధాలు పెంచుకోడానికి, వ్యవసాయ ఆర్థికవ్యవస్థ వృద్ధికి మరింతగా తోడ్పడడానికి'' అదానీ క్యాపిటల్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందం దోహదపడుతుందని స్టేట్ బ్యాంక్ చెప్పింది. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఎస్బిఐ చాలా పెద్ద బ్యాంక్. దేశంలోనే అతి పెద్దది. దేశవ్యాప్తంగా 22,000కు పైగా బ్రాంచిలు ఉన్నాయి. అదే అదానీ క్యాపిటల్‌కి కేవలం 60 బ్రాంచిలు ఉన్నాయి. ఎస్బిఐకి 1.4 కోట్ల మంది రైతులతో రుణ ఖాతాలు ఉన్నాయి. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల రుణం రైతులకు ఇచ్చివుంది. అదే అదానీ క్యాపిటల్‌కు కేవలం 28,000 రైతు రుణ ఖాతాలు ఉన్నాయి. ఇచ్చిన అప్పంతా కలిపితే కేవలం రూ.1300 కోట్లు మాత్రమే. ఇంత చిన్న అదానీ క్యాపిటల్ ఎస్బిఐ తాలూకు వినియోగదారుల పునాదిని విస్తృతపరచడానికి తోడ్పడుతుంది అనడం చూస్తే ఇస్రో సంస్థ తన రాకెట్ ప్రయోగాల సామర్థ్యం పెంచుకోడానికి శివకాశి టపాసుల కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలనడంలా ఉంది.
పోనీ, ఇదేదో పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యం వంటిది అని అందామా అంటే అలాగ కూడా లేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఒప్పందాలన్నీ ప్రయివేట్ రంగానికి లాభం చేకూర్చేవే. రిస్క్ అంతా ఎక్కువ ప్రభుత్వ రంగానిదే. కాని అందులో ప్రయివేట్ రంగం తన వాటాగా ఎంతో కొంత తెచ్చిపెడుతుంది. ఎంత తెస్తుంది అన్నది పక్కన పెట్టినా, ఎంతో కొంత తెస్తుంది తప్ప వొట్టి చేతులను ఊపుకుంటూ మాత్రం రాదు. కాని ఇక్కడ అదానీ క్యాపిటల్ మాత్రం ఎస్బిఐతో ఒప్పందానికి వొట్టి చేతులతోటే వస్తోంది. పెట్టుబడి అంతా పెట్టడం, రిస్క్నంతటినీ భరించడం ఎస్బిఐ వంతు. దానికి ప్రతిఫలంగా ఎస్బిఐకి వొరిగేదేమీ లేదు. అదేసమయంలో అదానీ క్యాపిటల్‌కి మాత్రం వ్యాపార విస్తరణ బ్రహ్మాండంగా సాగిపోతుంది.
ఎస్‌బిఐని ఒక ప్రభుత్వ స్వంత జాగీరు లాగా వాడుకుంటూ తన ఆశ్రితులైన కార్పొరేట్లకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నది. ఇటువంటి అవినీతి మయమైన విధానానికి వంతపాడడం ఎస్బిఐ వంటి సంస్థకు సిగ్గుచేటు. దేశ బ్యాంకింగ్ వ్యవస్థనంతటినీ సవ్యంగా నడిపించే బాధ్యత ఉన్న రిజర్వుబ్యాంకు సైతం ఈ వ్యవహారానికి ఆమోదముద్ర వేయడం మరింత సిగ్గుచేటు. కాని తన రిటైర్మెంట్ తర్వాత అంబానీకి చెందిన సంస్థలో ఉద్యోగంకోసం ప్రాకులాడే వారు బోర్డు మెంబర్లుగా ఎస్బిఐలో ఉన్నప్పుడు వారినుంచి ఇంకేం ఆశించగలం? అంబానీ కంపెనీలకు అనుకూలంగా ఒప్పందాలు కుదర్చడానికి ఆమోదముద్ర వేయడం తప్ప వారు ఇంకేం చేస్తారు?
అయితే ఈ తరహా ఒప్పందాల వెనుక కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలను కల్పించడం అనేది ఒక్కటే అసలు విషయం అని అనుకోకూడదు. దేశంలో వ్యవసాయ భూమిని వ్యవసాయం నుండి ఇతర వినియోగాలవైపు మళ్ళించడం అనే ఇంకో కుట్ర కూడా దాగివుంది. ఇటువంటి మళ్ళింపును పశ్చిమ సంపన్న దేశాలో ఎప్పటినుండో కోరుకుంటున్నాయి. ఆ కోరికనే ఇక్కడి కార్పొరేట్లు కూడా తమ నోటంట వెల్లడిస్తున్నారు. వారికి వంతపాడే సామ్రాజ్యవాద తాబేదార్లయిన ఆర్థిక వేత్తలు కూడా ఉన్నారు.
ఆ సంపన్న దేశాలు ఏం కోరుకుంటున్నాయి? ఇక్కడ ప్రస్తుతం ఆహారధాన్యాలను పండించడానికి వినియోగిస్తున్న భూముల్లో ఆహారధాన్యాలకు బదులు ఆ సంపన్న దేశాల్లో పండించడం సాధ్యం కాని పంటలను పండించాలని కోరుకుంటున్నాయి. ఆ దేశాల్లో ఆహారధాన్యాలు పండుతాయి. కాని వాటిని అమ్ముకోవడం సాధ్యం కావడంలేదు. ఇంకోపక్క మనదేశంలో కార్పొరేట్లు కూడా ఇక్కడ అమలులో ఉన్న ప్రజాపంపిణీ వ్యవస్థ వలన ఆహారధాన్యాల వ్యాపారంలో పెద్దగా చొరబడలేకపోతున్నారు. వారు అనుకున్నరీతిలో ఆహారధాన్యాల ధరలను పెంచలేకపోతున్నారు.
ఆ విధంగా అటు సంపన్నదేశాలు, ఇటు స్వదేశీ కార్పొరేట్లు ఉమ్మడిగా మన దేశ ఆహార భద్రతను దెబ్బ తీయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. వారి తరఫున వకాల్తా పుచ్చుకుని కనీసమద్దత్తు ధర విధానాన్నే ఎత్తివేయాలని, ప్రభుత్వం ధాన్నాన్ని సేకరించడం మానుకోవాలని, రైతులు ఆహార పంటలనుండి ఇతర పంటలవైపు మళ్ళడం మంచిదని ప్రచారం చేసే మేధావులు తయారైపోయేరు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఇప్పుడు దేశం సాధించిన ఆహార భద్రతను దెబ్బ తీయడమే లక్ష్యంగా వచ్చినవి. రైతుల శ్లాఘనీయమైన పోరాటంతో ఆ చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు. ఆ తర్వాత అంతర్జాతీయ అగ్రిబిజినెస్ సంస్థలముందు, దేశంలోని బడా కార్పొరేట్లముందు తలెత్తుకుని తిరగలేకపో తున్నాడు మోడీ. అందుకే దేశంలో భూముల వినియోగాన్ని, పంటల విధానాన్ని ఎలాగైనా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే రైతులకు రుణాలిచ్చే రంగంలో స్వదేశీ బడా కార్పొరేట్లకు అవి నడిపే ఎన్‌బిఎఫ్‌సిల ద్వారా అవకాశం కల్పిస్తున్నారు.
ఆ విధంగా మరోసారి వలస కాలంనాటి పాలనను మనం మరోసారి చవిచూడబోతున్నాం. ఆ కాలంలో రైతులు ఒక నిర్థిష్ట సమయంలో భూములపై శిస్తు చెల్లించాల్సివచ్చేది. అప్పటికి చేతుల్లో డబ్బాడని రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సివచ్చేది. ఆ వడ్డీ వ్యాపారుల్లో ఎక్కువమంది ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రోకర్లుగా కూడా ఉండేవారు. ఆ అప్పులివ్వడానికి ముందస్తు షరతుగా వారు తాము చెప్పిన పంటలనే రైతులు పండించాలని వత్తిడి చేసేవారు. ముందుగానే ఆ పంటలకు రేట్లను కూడా నిర్ణయించేవారు. ఆ విధంగా ఆ కాలంలో రైతులు నీలిమందు, నల్లమందు పంటలను పండించేవారు.
దీనిని బట్టి రుణం భూ వినియోగ స్వభావాన్ని మార్చడానికి ఎంత శక్తివంతంగా పని చేస్తుందో మనకు బోధపడుతుంది. ఎస్బిఐ-అదానీ ఒప్పందం ఆ తీరుగానే మన దేశంలో వ్యవసాయ భూమి వినియోగాన్ని మార్చివేసే లక్ష్యంతో రూపొందినటువంటిది. ఈ తరహా ఒప్పందాల ద్వారా ప్రభుత్వం ఆ మూడు నల్ల చట్టాల ద్వారా చేయలేకపోయినది చేయడానికి సిద్ధపడుతోంది. ఆ వ్యవసాయ చట్టాలనెలాగైతే తీవ్రంగా వ్యతిరేకించి ఓడించామో, అదేతీవ్రతతో ఈ తరహా ఒప్పందాలనూ రద్దు చేసేవరకూ పోరాడాలి. ఇదంతా ఒకే పోరాటంలో భాగం. (స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్