Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ దేశ ప్రగతికైనా సమర్ధ మానవ వనరులే కీలకం. మనదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా గల దేశంగా పేరు గాంచింది. మరో రెండు దశాబ్ధాలపాటు యువ జనాభా పరంగా మనదేశాన్ని మరే దేశం అందుకోలేదన్న అంచనాలు ఒకవైపు సంతోషం కల్గిస్తుంటే! మరోవైపు కొన్ని భయాలు వెంటాడు తున్నాయి. శక్తియుక్తులు గల యువతకు వారి సామర్థ్యాల మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే దేశానికి వారు వరమవుతారు. కానీ పని దొరకని, పనిరాని యువత దేశానికి భారమే అవుతుంది.
భారతదేశ జనాభాలో యువకులు (18-35 ఏండ్ల మధ్య వయస్సు గలవారు) 65శాతానికి పైబడి ఉన్నారు. కానీ, వారి చదువుకు, ఉద్యోగానికి, ఉపాధికి లంకెకుదరని విధానాల అమలుతో ఉద్యోగ, ఉపాధి రహిత అభివృద్ధి వైపు ఈ దేశగమనం కొనసాగుతున్నది. ఈ తిరోగమన విధానాల వలన ఎన్నడూ ఊహించని స్థాయికి ఉపాధిలేమి, నిరుద్యోగం పెరిగిపోయింది. యువ జనాభాను విద్యావంతులుగానే కాకుండా, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా వృత్తి గత సాంకేతిక నైపుణ్య శిక్షణలు ఇచ్చి భిన్న రంగాల్లో తిరుగులేని వనరులుగా మలిచి దేశాన్ని నైపుణ్య భారత్‌గా మార్చాలి. యువత ఉద్యోగాలు, ఉపాధులు అర్థించే స్థాయి నుంచి వాటిని కల్పించే దశకు ఎదిగేలా తీర్చి దిద్దాలి. దేశ జనాభాలో మహిళాశక్తి కూడా 48శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, ఉపాధి రంగంలో ఉద్యోగ రంగంలో నిరుద్యోగిత పెరిగిపోతుంది. మహిళా శక్తికి సమాన అవకాశాలు కల్పించకుండా వారి నైపుణ్యాలకు పదును పెట్టకుండా, తోడ్పాటు లేకుండా దేశాభివృద్ధి సాధ్యపడదనే వాస్తవాన్ని పాలకులు గమనించాలి.
ఉపాధి, ఉద్యోగాల కల్పనతో మేలిమి వాతావరణంలో యువత భాగస్వామ్యాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాలు ఎన్నికల వేళ యువతకు ఇచ్చిన హామీల మేరకు ఉపాధి కల్పిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు, యువజనులకు సంపూర్ణ సామర్థ్యాలు తోడైతేనే దేశాభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతుంది. ప్రగతిశీల, సృజనశీల యువత నడుంకడితేనే బూజు పట్టిన మూస విధానాలు కనుమరుగై శక్తివంతమైన మార్పు ఆవిర్భవిస్తుంది. ఇకనైనా మేల్కొని మన పాలకులు నీతి, నిజాయితీలతో కూడిన స్వచ్ఛమైన పాలనతో యువశక్తిని చిత్తశుద్ధితో సద్వినియోగ పరిస్తే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించవచ్చు. అలాగే అన్ని రంగాలతోపాటు రాజకీయాల్లోనూ యువత ప్రాధాన్యత పెరగాలి. విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, ఐటి రంగాలతోపాటు బహుముఖ రంగాల్లో మేధోవలసల మూలంగా దేశం ప్రతి ఏటా భారీగా ఆర్థిక నష్టాన్ని, మేధోనష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఓ అంచనాలో తేలింది. ఇలా సుశిక్షితులైన వారు విదేశాలకు వలసబాటలు పట్టకుండా పాలకులు వారి నైపుణ్యాలు జన్మభూమి ప్రగతికి తోడ్పడేలా విధానాలకు రూపకల్పన చేయాలి. ''ఉప్పొంగుతున్న నదిలాంటిది యువశక్తి వినియోగించకపోతే ఉప్పు సంద్రం పాలేనని'' గమనించాలి.
యువత కర్తవ్యం : స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్ల అమృతోత్సవాల వేళ మాతృభూమి విముక్తికి రక్తతర్పణం చేసిన విప్లవ వీరులు భగత్సింఫ్ు, అల్లూరి, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరినో స్ఫూర్తిగా తీసుకోవాలి నేటి యువత. వారి త్యాగాలకు సార్థకత చేకూర్చేలా యువత స్వామి వివేకానందుడి సందేశాల స్ఫూర్తితో చారిత్రక దేశ ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించాలి. సాహసం, అనురక్తి, సంకల్పం, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసంతో సమాజంలో కీలక మార్పులు సాధించాలి. విద్య, వైద్యం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో యువత వారి కర్తవ్యాలను నిర్వహిస్తేనే దేశం అభివృద్ధి చెంది, చైతన్యవంతంగా ముందుకు వెళుతుంది. నేను నా కుటుంబం అనేది కాకుండా.. నాకు జన్మినిచ్చిన దేశానికి, ప్రజలకు ఉపయోగపడేలా జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ విలువైన పౌరులుగా యువతరం వారి కర్తవ్యాన్ని నిర్వహించడమే నిజమైన లక్ష్యం. విపత్కర పరిస్థితుల్లో దేశభవిష్యత్తు చక్కదిద్ధే శక్తి యుక్తులు యువతలోనే ఉంటాయని గుర్తించాలి.
వివేకానందుడి సందేశం : భారత ప్రభుత్వం 1984 నుండి వివేకానందుని జన్మదినమైన జనవరి 12న ''జాతీయ యువజనదినోత్సవాన్ని'' నిర్వహిస్తుంది. 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడు... భారతదేశ ఔన్యత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటారు. భారతదేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకంటే? మన యువతరానికి సరియైన ఆలోచనా లేమిని పెద్ద సమస్యగా భావించి, తన ప్రసంగాలు, రచనలతో యువతరాన్ని ఉత్తేజపరిచాడు. నిరాశ, నిస్పృహలు వీడి, ధైర్యశాలియై ముందుకు సాగాలన్నారు. కాలాన్ని వృధాచేయడమంటే? నిన్ను నీవు దోపిడీ చేసుకొనడమేనని ప్రభోదించాడు. ''అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి'' ఇదే విజయ సాధనకు మార్గాలు అన్నారు. ప్రపంచమంతా తిరిగి యువతలో స్ఫూర్తి నింపిన వివేకానందుడు పిన్న వయస్సులోనే 1902 జులై 4న మరణించారు. యువత, ప్రభుత్వాలు వారి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే వారికిచ్చే నిజమైన నివాళి.
యువత దుర్వ్యసనాలకు బానిసై నైరాశ్యంలో ఆత్మహత్యలకు పాల్పడకుండా వినూత్న నైపుణ్యాలతో దేశ ప్రగతికి పాటుపడాలి. అద్భుతమైన, వెలకట్టలేని యువశక్తికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించకుండా పాలకులు నిర్వీర్యం చేస్తున్నారు. యువత ఆకాంక్షలను, ఆశయాలను కాలరాస్తూ అణిచివేతకు పాల్పడుతున్నారు. నీ పాలకుల మెడలు వంచి దేశాన్ని ప్రగతి మార్గాన నడిపి నూతన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ముమ్మాటికి యువతరానిదే.
- మెకిరి దామోదర్
సెల్:9573666650