Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఒకే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు సొంత ఇల్లు కూడా లేకుండా బతికాడు. ప్రజాభీష్టం మేరకు తన సొంత గ్రామానికి సర్పంచిగా కూడా పని చేశాడు. అయినా చివరిదాకా తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూ బతికాడు. ఆయనెవరో కాదు ప్రస్తుత సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పుల మల్సూర్.
వీర తెలంగాణ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బిఎన్)తో కలిసి అనేక ఘట్టాలలో ముందున్నాడు. అశ్వదళ సభ్యుడిగా పని చేస్తూ పోరాటం కొనసాగించాడు. కోటపాడు ఊదర బాంబు దాడిలో కీలకంగా పని చేశాడు. తన 16ఏండ్ల వయస్సులోనే ఉద్యమంలోకి ఉరికిన ధీరుడు ఉప్పల మల్సూర్. నైజాం చెర నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి చెందిన తర్వాత సాయుధ పోరాట విరమణ జరిగింది. సాయుధ పోరాటం ముగిసిన తరువాత దేశవ్యాప్తంగా జరిగిన సాధారణ ఎన్నికలలో సూర్యాపేట నియోజకవర్గం నుండి మల్సూర్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడీఎఫ్ నుంచి బరిలోకి దింపారు. అలా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్సూర్ దేశంలో కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ(ఎం) తరపున నిలిచి మరోమారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో ఆయనకు మంచి పేరు, పలుకుబడి ఉండేది. ప్రజా నాయకుడిగా ప్రజా సమస్యలను వాయిదా లేకుండా పరిష్కరించేవాడు. తాను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎవరైనా సమస్యతో తన వద్ద కొస్తే అక్కడికక్కడే సంతకం చేసి స్టాంప్ ముద్ర వేసి పంపించే వాడు. ఎల్లప్పుడూ ఆయన జేబులో స్టాంప్, ఇంకు ప్యాడ్ ఉండేది. అందుకే ఆయన్ను అందరూ ప్రేమగా ఇంకు ప్యాడ్ ఎమ్మెల్యే అని అంటుండేవారు.
ఆయనెప్పుటూ ప్రజల మనిషిగానే బతికాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఆయనకు ఈసమంత కూడా అవినీతి మరక అంటలేదు. అందుకేనేమో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా తమ సొంత గ్రామానికి సర్పంచిగా పని చేయమని కోరినప్పుడు బేషజాలకు పోకుండా, చిన్నతనంగా భావించ కుండా సరేనంటూ సర్పంచిగా పని చేశాడు. సర్పంచిగా పని చేస్తూ కూడా కుల వృత్తి అయిన చెప్పులు కుట్టే పని చేసేవాడు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి సర్పంచిగా పని చేసినా తలదాచుకోవడానికీ సొంత గూడు లేదంటే ఆయన ఎంత నిజాయితీపరుడో అర్థం చేసుకోవచ్చు. తనకంటూ పెద్దగా ఆస్తిపాస్తులేమో లేకపోయినా, ఉన్నదాంట్లో గ్రామంలో పాఠశాల నిర్వహణకు పిల్లలకోసం 2గుంటల స్థలాన్ని ఉచితంగా ఆయన త్యాగనిరతికి నిదర్శనం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఆయనకు కనీసం పింఛన్ కూడా ఇవ్వలేదంటే నాటి ప్రభుత్వాలు ఎంత కర్కశంగా వ్యవహరించాయో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆ పింఛన్ కోసం కూడా ఆశ పడకుండా చివరివరకూ చెప్పులు కుడుతూనే కుటుంబాన్ని పోషించు కున్నాడు. చెప్పులు కుడుతూనే పార్టీని నడిపించాడు.
అలాంటి ఆదర్శ నాయకుడిని కలవడానికి వచ్చే చోటామోటా నాయకులు 'ప్రస్తుతం కుల రాజకీయాలు పెరిగి పోయాయి. మీరూ పాల్గొనవచ్చు కదా?' అంటే కుల రాజకీయాలు శాశ్వతం కాదు, కమ్యూనిజమే శాశ్వతం అనే వాడు. ఇలా జీవితమంతా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం పని చేసిన మల్సూర్ 13 జనవరి 1999న కన్నుమూశాడు. నేడు ఆయన వర్థంతి. ఆయన ఆదర్శాలను కొనసాగించడం, ఆయన ఆశయాల కోసం నిలబడటమే ఆయనకు నిజమైన నివాళి.
- ఓగోటి కిరణ్కుమార్
సెల్: 9666011107