Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసలే మనది ఆకలి దేశం... ఆపై అలవిగాని నిరుద్యోగం. వీటికి తోడు ఇప్పుడు కోట్లాది ఉపాధి అవకాశాలను తుడచిపెట్టేస్తోన్న కరోనా సునామీ. మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టు కాదు, వెన్ను విరిగిన చీమపై మిన్ను విరిగి పడ్డట్టు తయారయ్యింది పరిస్థితి. 2016 పెద్దనోట్ల రద్దు తర్వాత వేగంగా పరుగుతీసిన ఆర్థిక పతనం కారణంగా దేశంలో నిరుద్యోగం 45సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఈ కరోనా కాటుతో ఉద్యోగ కల్పన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. శృతి మించుతోన్న నిరుద్యోగం కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తీవ్ర సామాజిక సమస్యగా పరిణమిస్తూ పోతోంది. ఇప్పటి వరకూ ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కరోనా సంక్షోభం ముగిసిన అనంతరం కూడా తిరిగి కాపాడుకోవడం, పెరుగుతున్న శ్రామికశక్తికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఇవీ ఇప్పుడు మనం దేశం ముందున్న పెను సవాళ్ళు. అయితే కేంద్రంలోని కాషాయ పాలకులకు ఆ ధ్యాసే లేకుండా పోయింది. వాస్తవాలను వక్రీకరించి, ప్రజలను భ్రమల్లో ముంచి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, ప్రజల యెడల కనీస చిత్తశుద్ధినీ, బాధ్యతనూ ప్రదర్శించడం లేదు. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. వీటిలో పట్టణ నిరుద్యోగం 8శాతం దాటడమనేది ఒక ప్రమాద హెచ్చరిక. మొదటి లాక్డౌన్ ఏప్రిల్-మే 2020 సమయంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 25శాతానికి చేరుకుంది. కరోనా ప్రభావం తగ్గిందనుకునే సమయంలో మళ్లీ రెండో వేవ్ వచ్చింది. మే 2021లో నిరుద్యోగ రేటు దాదాపు 15శాతం నమోదైంది. కరోనా నియంత్రణలు, ఆంక్షలు తొలగించాక నిరుద్యోగం తగ్గుతుందనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సిఎంఐ ఈ తాజా గణాంకాల ప్రకారం పట్టణాల్లో నిరుద్యోగరేటు డిసెంబర్ 5 నాటికి 8.7శాతం వద్దకు చేరుకుంది. దేశ ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి. జనవరి 2019లో పట్టణాల్లో ఉపాధి పొందినవారి సంఖ్య 12.84కోట్లు. డిసెంబర్, 2021వచ్చే సరికి ఆ సంఖ్య 12.47 కోట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా గ్రామాల్లోనూ ఉపాధి కలిగినవారి సంఖ్య గత మూడేండ్లలో తగ్గింది. 27.77 కోట్ల నుంచి 27.68కోట్లకు పడిపోయింది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలో 'నిరుద్యోగ రేటు' 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో నిరుద్యోగ రేటు 9.1శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8శాతం, స్త్రీలలో 21.2 శాతం పెరిగింది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా నియమిత కాలిక శ్రామికశక్తి సర్వే (పిఎల్ఎఫ్ఎస్) చెప్పిన లెక్కలే. 2020 జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (30.5శాతం), శ్రీలంక (33.7శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళుగానే ఉపాధి పొందుతున్నారు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి, ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటి దోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలేమీ ఆశ్చర్యం కలిగించవు. ఎంచుకున్న శాంప్లింగ్ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్ని సార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలు అవుతాయి. ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31 శాతమే అని లెక్క. అదునుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండొచ్చు గానీ దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్రైమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయిందని ఆర్థికవేత్తలే తేల్చారు. 15ఏండ్లు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి 29ఏండ్ల లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్, ఆఫీసులు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదనేది నిష్టురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55లక్షల ఉద్యోగాలు పోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సియంఐఈ) సైతం అంచనా వేయడం గమనార్హం. నిజానికి, ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో భారత ఆర్థిక వ్యవస్థ 7.3శాతం మేర కుంచించుకు పోయింది. ఇది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు 2022 మార్చి వరకైతే లేనే లేవని తేటతెల్లమవుతూనే ఉంది. నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి.
భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. తీవ్రమైన ఉపాధిలేమి సమస్యకు ఇప్పడు అగ్నికి ఆజ్యంలా కరోనా మహమ్మారి తోడయ్యింది. ఈ క్లిష్ట సమయంలో కమలనాథుల చేతిలోని కేంద్ర సర్కారు నుంచి మనం మానవీయ స్పందనను ఆశించడం ఎండమావిలో నీళ్ళ కోసం దేవులాడడమే అవుతుంది. పేదల ఆకలి, అజ్ఞానం, అనైక్యతలే తమ ఆధిపత్యానికి పునాదులగా భావించే పాలకులు ప్రజలు తిరగబడి తమ పునాదులు పెకలిస్తారని భయపడితే తప్ప తమ తీరు మార్చుకోవడం అసంభవం. కాబట్టి, ఇప్పుడు కావల్సింది పాలకులను వేడుకోవడం కాదు. ప్రజలను మేల్కొల్పడం. మేల్కొన్న ప్రజలు మాత్రమే ప్రజల సమ్యలపై దృష్టి సారించడాన్ని పాలకులకు తప్పనిసరి చేయగలరు. నేటి కరోనా పూరిత నిరుద్యోగ భారతావనిలో అందరూ ఎదురుచూస్తున్నది ఆ శుభఘడియల కోసమే! మరి, తెల్లవారేదెప్పుడు? ఈ చీకటి విడివడేదెప్పుడు?
- నాదెండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140