Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామ్రేడ్ దర్గ్యా నాయక్... నాటి వీరతెలంగాణా సాయుధ పోరాటంలో ధర్మానికి ప్రాణమిచ్చిన ధర్మపురం ముద్దుబిడ్డ. నూట ఆరేండ్ల ఆ నవయువకుడు నేటికీ ఆ వీరగడ్డపై ఎర్రజెండాగా రెపరెపలాడుతూనే ఉన్నాడు. గెరిల్లా యుద్ధంలో కాకలు తీరిన యోధుడతడు. వీరోచిత కడవెండి, పాలకుర్తి ఘటనలలో ప్రత్యక్ష పాత్రధారి. నియంత విస్నూరు దేశముఖ్ కుమారుడూ, మహా క్రూరుడూ అయిన బాబుదొరపై తొలివేటు వేసిన ధీరుడు. నాటి వీరయోధుల్లో సజీవంగా మిగిలివున్న అతికొద్దిమందిలో ఒకడు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆ వీరయోధునితో సాంబరాజు యాదగిరి ముఖాముఖి..
ముందుగా మీ ఊరి భూ పోరాటం గురించి చెప్పండి?
- సాయుధ పోరాటానికి 15సంవత్సరాల ముందే మా ధర్మపురంలో సాగుభూముల కోసం పుస్కూరు రాఘవరావు దొర (మఖ్తేదారు)పై పడమర తండా గిరిజనులం పోరాటం చేసినం. వాళ్ళ నాగండ్లను తగులబెట్టి, గుండాలను తరిమికొట్టినం. భూమి మా ఆధీనం చేసుకున్నం. కానీ తరువాత పోలీసులతో ఏగలేక, కోర్టుల సుట్టూ తిరుగలేక భూములు వదులుకున్నం. దొడ్డి కొమరయ్య మరణం సాయుధ పోరాటంలో అదే భూముల మీద ఎర్రజెండాలు పాతి నిలబడ్డం. మక్తేదారు ఫిర్యాదుతో వందమంది పోలీసు దిగింది. మేం ఆదరలే బెదరలే, మాకు మద్దతుగా ఎర్రంరెడ్డి మోహన్‌రెడ్డి, నల్ల నర్సంహులు కడవెండి నుండి యాభై మంది కమ్యూనిస్టు కార్యకర్తలతో వచ్చి పోలీసులకు సవాల్ చేసిండ్రు. ఎర్రం రెడ్డి మోహన్‌రెడ్డి మా అందరితోని భూమ్మీద కవాతు చేయించిండు. వచ్చిన పోలీసు పొద్దుగూకే ముందు ఏం చేయలేక ఎల్లిపోయింది.
మీ వదిన పుల్లమ్మ వీరనారి పుల్లమ్మగా పేరుగాంచింది గదా.. ఆమెకు ఆ పేరెలా వచ్చింది?
- మా వదినె పుల్లమ్మ నా అన్న జోద్యా భార్య. ముట్టుకుంటే మాసిపోయేటట్లు ఉండేది. మా భూపోరాటంతో ధర్మపురంల క్యాంపు పెట్టిన పోలీసులకు అదనంగా మరింత మంది పోలీసులతో ఓ అమీన్ సాబ్ కూడా వచ్చిండు. పటమటి తండామీద దాడి చేసిండు. నేను, మా అన్న జోద్యా, సాంక్రూ అజ్ఞాతంలో ఉన్నం. దాడిచేసిన పోలీసులు ఆడోళ్ళ మీద అత్యాచారాలకు తెగవడ్డరు. మా వదిన పుల్లమ్మ ఆడోళ్ళందర్ని కూడగట్టింది. అందరు కలిసి పోలీసుల కండ్లల్ల కారం చల్లిండ్రు. గుత్పలతోటి పొర్లిచ్చి గొట్టిండ్రు. అప్పటి నుండి పుల్లమ్మ పేరు వింటేనే పోలీసులు భయపడేవారు.
ఠానూ నాయక్‌పై మిస్‌ఫైర్ గురించి చెప్పండి?
- నేను, నల్ల నర్సింహులు, చకిలం యాదగిరిరావు చెన్నూరు శివారు బావివద్ద మకాం వేసినం. బాబు దొరను (విసునూర్ దేశ్‌ముఖ్ కుమారుడు) మేం చంపాలని ప్లానేసినం. మైలారం తండా మీదుగా వాడు విస్నూరుకు పోయేటప్పుడు చంపాలని మా ప్లాన్. తుపాకితో ఎట్ల కాల్చాల్నో తన దగ్గరున్న తపంచా పట్టుకొని చూపెడుతున్నడు నర్సింహులు. అది పొరపాటున పేలి చెర్రాలు దూరంగా ఉన్న ఠానూ న్యాయక్ చాతిల పడ్డరు. మా అన్న ఠానూ నాయక్కింద పడిపోయిండు. నెత్తురు పారుతోంది. సవారు కచ్చరం చెన్నూరు నుంచి దెచ్చి రఘునాథపల్లిల రైలెక్కించి బెజవాడకు పంపినం. బెజవాడ నుంచి పార్టీ మద్రాసుకు పంపించింది. రెండు నెలలకు బాగుపడ్డాక మా అన్న మాతోటి గల్సిండు. గట్ల గండం గడిచింది.
పడమటి తండాలో ఆరుగురు వీరులను సజీవ దహనం చేసిన సంఘటన వివరించండి?
- మేం ఆరుగురు అన్నదమ్ములం. మా తండ్రి హాముతో సహా మేం అందరం పోరాటంలో ఉన్నాం. ఠాను, జోద్యా, దర్గ్యా మేం ముగ్గురం దళంలో ఉన్నాం. పడమటి తండా పేరు వింటేనే బాబు దొరకు నిదురపట్టదు. ఒక రోజు రాత్రి నైజాం పోలీసు, రజాకార్లు రెండు లారీలతో వచ్చి, దేవరుప్పుల నుండి ధర్మపురం కాలినడకతో పడమటి తండా మీద దాడి చేసిండ్రు. మా అన్న సాంక్రూ దగ్గర తుపాకున్నది. ఒక్క తుపాకితోనే యుద్ధం చేసిండు. కానీ వశంగాలె... తప్పుకున్నం. అర్థరాత్రి చిమ్మున చీకటి. జనాన్ని దొరికినోల్లను దొరికినట్టే మందబెట్టిండ్రు. తెల్లారంగనే మోపుల కొద్ది చింతబరిగెలు దెచ్చి వీరుల జాడలు చెప్పాలని కారంపొడి చల్లుకుంట దెబ్బలు కొట్టిండ్రు. వీపులు పగిలి నెత్తుర్లు గారినా ఎవరు చెప్పలేదు. ఆ హింస చూడలేక మా అన్న సాంక్రూ నేనే అంటూ ముందుకొచ్చిండు. సాంక్రూతో పాటు అనుమానం ఉన్న మరో నలుగురితో ఎవరి చితివారితోటే పేర్చిపిచ్చిండ్రు. అయిదు చితులల్లో అయిదుగురిని పండుకోబెట్టి, సంఘపోళ్ల జాడలు చెప్తరా? మీ చితులు మీరే అంటించుకుంటారా? అని బాబుదొర అనంగానే ఎర్రజెండాకు జై అని నినాదాలిస్తూ ఎవరి చితి వారే అంటించుకొని ప్రాణాలు త్యాగాలు చేసిండ్రు. అంతకు ముందే చంపిన పేరు తెలువని మరో వీరున్ని మండుతున్న చితి మంటల్లో పడేసిండ్రు. వారు దహనమైన ఆ భూమిని ఇప్పటికీ దున్నకుండా పవిత్రంగా చూసుకుంటున్నం. (ఈ సంఘటన చెప్తూ ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతరమయ్యాడు దర్గ్యా)
కిరాతకుడు బాబుదొర మీ చేతికి ఎట్లా చిక్కిండు?
- బాబుదొర అర్థరాత్రి పారిపోతుండు, జనగాం పోలీసుస్టేషన్లో ఉన్నాడని తెల్వంగానే తెల్లారేటొరకే గెరిల్లా దళాలు జనగాం చేరినరు. అప్పుడు నేను గబ్బెట తిర్మల్‌రెడ్డి దళంలో ఉన్న. అమ్మటాల్లొరకు జనగాం మొత్తం జనంతోని నిండింది. జనగాం పోలీసులకు భయంపుట్టింది. టేశను అవతల ఉన్న రెండో తల్లి తండ్రి కోడూరు దొర బంగ్లకు పోవాలని పోలీసు రక్షణతో బయలుదేరిండు బాబుదొర. స్టేషన్ నిండా జనమే. చేతిలో ఉన్న పిస్తోలు తిప్పుకుంటూ రైల్వేటేషన్ల ఉన్న జనాన్ని బెదిరించిండు. అంతకు ముందే రైలుబండి మాలుగాడి వచ్చి ఆగి ఉన్నది. రైలు పట్టాలు దాటి వెళ్ళకుండా చుట్టూ జనం ఉండటంతో ఆగి ఉన్న మాల్గాడి యీవలి పక్కనున్న గబ్బెట తిరుమల్‌రెడ్డి నేను దెబ్బమీద దెబ్బ వేయటంతో పైకి లేవకుండనే కింద కరుసుకు పోయిండు. వాని చేతిలో ఉన్న పిస్తోలు నేనందుకున్న. ఇగ జనం దెబ్బమీద దెబ్బ ఏస్తనే ఉన్నరు. జొన్న కుప్పమీద పడ్డట్టు పడ్తన్నరు దెబ్బలు. వాడు దూప దూప అంటూంటే ఒక లంబాడి తల్లి అందరికి దండంపెట్టి వాని నోట్లో ఉచ్చపోసింది. గట్ల సచ్చిండు కొడుకు.
బాబు దొర తండ్రి విస్నూరు రామచంద్రారెడ్డి చివరిరోజులు ఎలా ముగిశాయి?
- వాడు చెరిసగం రాత్రి గడ్డిబండ్లె దాక్కొని గడివెనక దిడ్డి దర్వాజగుంట వరంగల్‌కు పారిపోయిండు. ముసలి తనంల వాడూ కుక్కచావే సచ్చిండు. రెండో భార్య బిడ్డతోని బెంగుళూరుల ఉన్నది. వాడు చస్తే చావుకే రాలేదు. కొడుకు కూడ తలకొర్వి పెట్టలేదు. అదో బతుకా? ఎమ్మెల్యేగ పోటీ చేస్తనంటే కాంగ్రెసు టికెట్ ఇయ్యలేదు.
గబ్బెట తిర్మల్‌రెడ్డి అమరత్వం గురించి చెప్పండి?
- నల్లనర్సింహులుతో పాటు నన్ను ఇద్దరిని జనగామ పోలీసుస్టేషన్లో లాకప్‌లో పెట్టిండ్రు. లాకప్‌లో ఉన్నన్ని రోజులు చిత్రహింసలే. ఈ టైముల్నే గబ్బెట తిరుమల్‌రెడ్డిని సముద్రాలలో పట్టుకున్నారు. సముద్రాల, ఇప్పగూడెం, గబ్బెట, కంచనపల్లి గ్రామాలలో వీరున్ని నీచాతి నీచంగా ఊరేగించింది నెహ్రూ సైన్యం. కంచనపల్లిలో ప్రజలందరూ చూస్తుండగా పట్టపగలు చెట్టుకు కట్టేసి కాల్చి చంపింది. తుపాకీ పేల్చినప్పుడల్లా కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్ అని నినదించిన వీరుడతడు. ఇంగ్లీషు చదివేవాడు. ఇంగ్లీషులో మాట్లాడేటోడు. నేను ఎక్కువ కాలం తిరుమల్‌రెడ్డి దళంలోనే ఉన్నా.
మీరు ఉరిశిక్ష నుండి ఎట్లా బయటపడ్డారు..?
- నల్ల నర్సింహులును నన్ను జాల్నా జైలు మొదలుకొని అనేక జైల్ల చుట్టూ తిప్పిండ్రు. మా ఇద్దరికి గొలుసులేసి తిప్పెటోళ్లు పోలీసులు. మేం ఇద్దరం గతంలో జైలు నుండి తప్పించు కున్నందుకు పారిపోకుండా వేస్తున్నామని చెప్పేటోళ్లు. జనగాం తాలూకా నల్లగొండ తాలూకాలకు చెందిన యాభైమందికి జైలుశిక్ష వేసిండ్రు. మేం యాభైమందిమి జైళ్ళలో ఉండంగనే చైనాల కమ్యూనిస్టుపార్టీ గెలిచి గవర్నమెంటు అయ్యింది. గా సంతోషంల తెల్లగుడ్డను ఎర్రమన్ను నీళ్ళల్ల ముంచి సున్నంతోటి సుత్తి కొడవలి గీసి జైల్ల జెండా ఎగిరేసినం. చైనాకు జై అని జైకొట్టినం. జైలు ఆపీసర్లు అల్లకల్లోలమైండ్రు.. వారం రోజుల తర్వాత ఉరిశిక్ష పడిన మమ్మల్ని అప్పుడు కొందర్ని, అప్పుడు కొందర్ని హైదరాబాదు సెంట్రల్ జైలుకు పంపిండ్రు. ఈ జైలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేశాము. సొరంగం తవ్వాము. పునాదిరాళ్ళు తొలగిస్తున్నప్పుడు శబ్దం విన్న సెంట్రీ లైటు వెలుగులో కన్నం స్పష్టంగా చూసి చెప్పడంతో మా బారక్ చుట్టు మరింత మంది పోలీసులనుపెట్టి పొద్దున్నే మమ్మల్నందర్నీ లెక్కించి, అందరికి నిలువు గొలుసులు వేశారు. చేతులకు బేడీలు వేసి పకడ్బంది లాకప్‌లో పెట్టారు. 1950 జనవరిలో ఎవరెవర్ని ఏఏ తారీఖుల్లో ఉరి తీస్తారో మాకు తేదీలతో సహా చెప్పిండ్రు. అంతర్జాతీయంగా కమ్యూనిస్టుపార్టీలు చేసిన ఆందోళనలతో ఉరి తీయటానికి పన్నెండు గంటల ముందు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాత్రి పన్నెండు గంటలకు ఉరితీతలను ఆపాలని జైలు అధికారులకు ఆజ్ఞలొచ్చాయి. రాత్రి నాలుగు గంటలకే ఉరితీస్తారని ఎదురు చూస్తున్న మాకు ఉదయం 8 గంటలకు అధికారులు వచ్చి మీ ఉరి శిక్షలు రద్దయినయని చెప్పిండ్రు. మొదట మమ్మల్ని మోసగిస్తున్నారని అందరం అనుకున్నం. కానీ ఆ తర్వాత పరిణామాలతో నిజమే అని నమ్మినం. ఎనిమిది సంవత్సరాల జైలుశిక్షతో 1957 నవంబర్ 1వ తేదీన విడుదలయ్యాము.
తొలి సాయుధ సైన్యం ఏర్పడినప్పుడు సారథ్యం ఎవరు?
- దొడ్డి కొమరయ్య మరణంతో 70మందితోటి గుతుపల సంఘం ఏర్పడింది. కాసాని నారాయణ, నల్ల నర్సింహులు ఈ దళానికి నాయకులు. ఈ దళంలో నేను కూడా ఉన్నా. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. అప్పుడు ఆ గుతుపల సంఘమే తొలి సాయుధ దళమైంది.
ఊరు దొరపై సర్పంచ్‌గా గెలిచిన మీ అనుభవం చెప్పండి?
- 1964లో భూస్వామి అమృతరావుపై సర్పంచ్‌గా జనరల్ సీటులో ప్రజలు గెలిపించిండ్రు 1964 నుండి 1980 వరకు 16సంవత్సరాలు సర్పంచ్‌గా చేసిన. ఓ కమ్యూనిస్టుగా ప్రజలతో కలిసి చేయగలిగినంత చేసిన.
మీ కుటుంబం..
- జాటోతు హాము, మంగమ్మ నా తల్లిదండ్రులు. జోద్యా, సోమ్లా, సాంక్రూ, ఠానూ, దర్గ్యా, కిషన్ మేము ఆరుగురు అన్నదమ్ములం. సోమ్లా, ఠాను ఇద్దరు పోరాటంలో వీరమరణం పొందిండ్రు. నా అన్న ఠాను నాయక్‌ను 1950 ఏప్రిల్ 18న నెహ్రూ సైన్యం చంపింది. బండి గిర్రకు కట్టేసి మొండ్రాయి క్యాంపుల కిరాతకంగా హింసించి కాల్చి చంపిండ్రు. అప్పుడు నేను జైలులో ఉన్న.
మీకు ఉరిశిక్ష విధించామని చెప్పినప్పుడు భయపడ్డారా..?
- భువనగిరి కోర్టులో మా కేసులను విచారించే ట్రిబ్యునల్ ఏర్పాటయ్యింది. కేవలం కమ్యూనిస్టులను విచారించేందుకే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిండ్రు. మా తరపున వకీళ్ళు లేకుండనే విచారణ జరిగేది. బోగస్ సాక్షులతోటి సాక్ష్యం చెప్పించేటోల్లు. మాకు ఉరిశిక్ష విధించినామని 12 పేజీలు జడ్జి చదివి వినిపించిండు. మేం భయపడలే, మేం కమ్యూనిస్టులం, ఈ దునియాను మార్చటానికి పోరాడుతున్న దేశభక్తులం. మేం ఉరికి సిద్ధం, క్షమాపణ కోరం అని అన్నాం. జడ్జికి చెమటలు పట్టినరు, నోట మాటరాలేదు. దెబ్బకే దూపగొని చెంబెడు నీళ్ళు తాగిండు. మాకు ఉరి శిక్ష రద్దయ్యిందని తెలిసినప్పుడు కూడా మేం నమ్మలే. ఎన్నడైనా ఉరితీస్తరని ధైర్యంగానే ఉన్నం. ఉరిశిక్షరద్దైనా ఎనిమిదేండ్లు జైళ్ళ పెట్టిండ్రు గదా! దేశభక్తులకు జైలా అని పార్లమెంటుల సుందరయ్య కొట్లాడిండు. గట్ల బైటికొచ్చినం.